బాబు ప్రమాణ స్వీకారానికి చురుకుగా ఏర్పాట్లు
posted on May 29, 2014 6:58AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన వచ్చేనెల 8న ఉదయం 11.40 గ.లకు విజయవాడ-గుంటూరు మధ్యగల నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రమాణస్వీకారం చేయనున్నటు నిన్న మహానాడులో స్వయంగా ప్రకటించారు. అందుకోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చంద్రబాబు ఇకపై అక్కడి నుండే హైదరాబాదుకు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు గనుక, స్థానిక నాగార్జున నగర్ లో కొత్తగా రెండు హెలీప్యాడ్ లు నిర్మిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంతంలో ఇప్పటికే రెండు కంపెనీల రిజర్వు పోలీసు దళాలు చేరుకొని భద్రతా ఏర్పాట్లు నిమగ్నమయ్యాయి. వాటికి అదనంగా త్వరలో హైదరాబాదు నుండి మరో నాలుగు కంపెనీల రిజర్వు పోలీసు దళాలు చేరుకోబోతున్నాయి.
గండిపేటలో తెదేపా నిర్వహించిన మహానాడు సమావేశాలకే రాష్ట్రం నలుమూలల నుండి నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిబొడ్డున జరుగబోయే చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి అన్ని జిల్లాల నుండి చాలా ప్రజలు, కార్యకర్తలు చాలా భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. ప్రమాణస్వీకారం చేస్తున్న ప్రాంతం విజయవాడ-గుంటూరు హైవేకు చాలా దగ్గరలో ఉన్నందున అక్కడికి చేరుకోవడం చాలా సులువు గనుక ఊహించిన దానికంటే చాలా భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. అందువలన తెదేపా నేతలు, పోలీసులు కూడా అందుకు తగ్గటే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు విజయవాడ-గుంటూరు ప్రాంతాల తెదేపా నేతలతో ఈవిషయమై చర్చించనున్నారు. ఆ తరువాత ఆయన ఒకటి రెండు రోజుల్లో డిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనలో సంక్లిష్టంగా మారనున్న పలు అంశాలను మోడీకి వివరించి, ఇరుప్రాంతలకు నష్టం జరగకుండా పరిష్కరించేందుకు మోడీ సహకారం కోరేందుకు ఆయన వెళుతున్నట్లు తాజా సమాచారం.