జూన్ 8న బాబు ప్రమాణం

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారరైంది. జూన్ 8న బాబు సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు జన్మ నక్షత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపాయింటెడ్ తేదీని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ సిద్ధాంతి ఈ ముహూర్తాన్ని పెట్టారు. గత సంప్రదాయానికి భిన్నంగా చంద్రబాబు ఈసారి ప్రజల మధ్యన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికిముందు జూన్ మొదటి వారంలో తిరుపతిలో జరిగే టీడీఎల్పీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేతగా బాబును ఎన్నుకుంటారు. బాబు ప్రమాణ స్వీకార సభకు బీజేపీ అగ్రనేతలతోపాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరవుతారని తెలుస్తోంది.

మోడీ క్యాబినెట్ లో నలబై మంది మంత్రులు?

  రేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయనతో బాటు కేవలం ఇరవై మంది మంత్రులు మాత్రమే పదవీ ప్రమాణం చేస్తారని మొదట వార్తలు వచ్చినా, తాజా సమాచారం ప్రకారం ఆ సంఖ్య రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. వారిలో 24మంది క్యాబినెట్ హోదా మంత్రులు, మిగిలిన 16మంది సహాయ మంత్రులు ఉండవచ్చని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత యం. వెంకయ్యనాయుడు, తెదేపా నుండి అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రులుగా పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉంది.   ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాల ప్రభుత్వ ప్రతినిధులతో బాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, లతా మంగేష్కర్, రజనీకాంత్ తదితరులు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడు, తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ తదితరులు కూడా హాజరవుతున్నారు.

వైకాపా యంపీలు జంప్

  నంద్యాల వైకాపా యంపీ యస్.పీ.వై. రెడ్డి, కర్నూలు వైకాపా యంపీ బుట్టా రేణుక భర్త నీలకంటం ఇరువురూ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఈరోజు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. నీలకంటంతో బాటు ఆయన బార్య రేణుక కూడా తెదేపాలో చేరిపోవడం దాదాపు ఖాయమయిపోయింది. వైకాపా యంపీలు, యం.యల్యేలు. తమతో టచ్చులో ఉన్నారని తెదేపా నేతలు గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారాన్నిఆ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ గా కొట్టిపడేసిన వైకాపా నిజంగానే ఇద్దరు పార్టీ యంపీలు గోడ దూకేయడం చూసి షాక్కు గురయ్యారు.   ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్ధ పార్టీల యంపీలను, యం.యల్యేలను తెదేపాలోకి ఆహ్వానించడం చాలా అనైతికమని ఖండించారు. అధికారం కోసం అర్రులు చాస్తూ కొందరు స్వార్ధపరులు పార్టీని వీడినంత మాత్రాన్న తమపార్టీకి వచ్చే నష్టం ఏమీలేదని అన్నారు. ఇకపై ఒక్కరు కూడా పార్టీ వీడబోరని భరోసా వ్యక్తం చేసారు. అటువంటి నేతలకు, పార్టీలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారని అన్నారు. తెదేపా ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైకాపా ఆవేదన అర్ధం చేసుకోవచ్చును. కానీ అదే వైకాపా పార్టీ గతేడాది కాంగ్రెస్, తెదేపాలకు చెందిన 29మంది యం.యల్యే.లను గంపగుత్తగా పార్టీలో చేర్చుకొన్నపుడు తమ ప్రతాపం చూడమని జబ్బలు చరుచుకొన్న సంగతి ఇప్పుడు మరిచిపోయారు. అప్పటి నుండి ఎన్నికల వరకు ఎంతమంది ఇతర పార్టీనేతలను వైకాపాలో చేర్చుకొన్నారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి చెందిన యస్.పీ.వై.రెడ్డి సరిగ్గా ఎన్నికలకు ముందు గోడదూకి తమ పార్టీలోకి చేరినప్పుడు ఆయనకు ఎర్ర తివాచి పరిచి నంద్యాల టికెట్ ఇచ్చిన సంగతి మరిచిపోయి, ఇప్పుడు ఆయన తెదేపాలోకి చేరడం అనైతికమని గగ్గోలు పెడుతుండటం హాస్యాస్పదం. తమ పార్టీకి వర్తించని, పాటించని నీతి, నియమాలు ఇతర పార్టీలు పాటించాలని వైకాపా అనుకోవడం విచిత్రం.

బిజెపి అధ్యక్షునిగా జగత్ ప్రకాశ్ నడ్డా..!

      రాజ్‌నాథ్ సింగ్ మోడీ ప్రభుత్వంలో చేరినట్లయితే ఆ పార్టీ అధ్యక్ష పదవిని పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న జగత్ ప్రకాశ్ నడ్డాకి అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌కు జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు నడ్డా ఆయన దగ్గర పనిచేసారని, ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఆయనకు ఉందని తెలుస్తోంది. రాజకీయాలలో పూర్వానుభవం ఉన్న నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో 1998 నుంచి 2003 వరకు క్యాబినెట్ లో ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ గా పనిచేసారు. గుజరాత్ భవన్‌లో అమిత్ షాతో కలిసి ఆయన కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవడం బిజెపి అధ్యక్షునిగా నడ్డాను ఎన్నుకుంటారనే వాదనకు మరింత బలం చేకూరుస్తోంది.

మోడీ ప్రమాణానికి రజనీ,అమితాబ్,సల్మాన్

      బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్, దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్, కండలవీరుడు సల్మాన్ ఖాన్, సీనియర్ గాయని లతా మంగేష్కర్.. వీళ్లంతా ఈనెల 26వ తేదీన జరిగే నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. ఈ సంవత్సరం జనవరిలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీని లతామంగేష్కర్ ఆశీర్వదించి.. విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక సల్మాన్ ఖాన్ అహ్మదాబాద్లో గాలిపటాల ఉత్సవం సందర్భంగా మోడీని కలిశారు. సల్మాన్ తండ్రి, బాలీవుడ్ కథారచయిత సలీంఖాన్ ఎప్పటినుంచో మోడీ అభిమాని. ఇక ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ కూడా మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 2500 మంది అతిథులు పాల్గొనే ఈ కార్యక్రమం ఎప్పటిలా అశోకా హాల్లో కాకుండా.. రాష్ట్రపతి భవన్ ముందున్న మైదానంలో జరగబోతోంది. ఉభయ సభలకు చెందిన మొత్తం 777 మంది ఎంపీలను రాష్ట్రపతి భవన్ ఆహ్వానించింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ఏపీజే అబ్దుల్ కలాంలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. మోడీ తల్లి హీరాబెన్, ఆయన ముగ్గురు సోదరులు కూడా వస్తారని అనుకుంటున్నా, ఇంకా నిర్ధారణ కాలేదు. కొత్త ప్రధాని 20 మంది అతిథులను, కొత్త మంత్రులు ఒక్కొక్కరు నలుగురి చొప్పున అతిథులను పిలవచ్చు.

మోడీ క్యాబినెట్‌లో ప్రధానశాఖలపై బాబు దృష్టి..!

      మోడీ క్యాబినెట్‌లో ప్రాధాన్యమున్న శాఖలను సంపాదించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు బాబు శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ టూర్‌ను సద్వినియోగం చేసుకుని మంచి మంత్రిత్వ శాఖలను దక్కించుకోవాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారు. ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు ఇస్తామని టీడీపీ అధినేతకు బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే తెలియజేసింది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా ఎక్కువగా ఉండడంతో కనీసం రెండు క్యాబినెట్ మూడు సహాయ మంత్రి పదవులు తీసుకోవాలన్న ఆలోచనలో బాబు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం మోడీతో టీడీపీ అధినేత చర్చలు జరుపనున్నారు. సీమాంధ్రలో టీడీపీ 15 ఎంపీ సీట్లు, తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలుచుకున్నది. అలాగే పార్టీకి ఆరుగురు రాజ్యసభ సభ్యులున్నారు. మంత్రి పదవుల కోసం సీనియర్లంతా ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రమాణానికి కుదరని ముహూర్తం

      సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ రెండో తేదీన ఆవిర్భవిస్తోంది. ఆ వెంటనే మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో..బాబు కొన్ని రోజులు ఆగాలని భావిస్తున్నట్లు తేలుస్తోంది. జూన్ ఎనిమిది లేదా తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండవచ్చని చెబుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం వాయిదా పడటంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఆ తేదీ వరకూ పొడిగిస్తారని అధికార వర్గాలు అంటున్నాయి. ఎన్నికల్లో కోస్తా ప్రాంతంలో టీడీపీ భారీ విజయాలు సాధించడంతో ఆ ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం ఉండాలని ఆ ప్రాంత నేతలు పట్టుబడుతున్నారు. దీనితో విజయవాడ గుంటూరు నగరాల మధ్య చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపాకు కీలక శాఖలు

  ఎన్డీయే కూటమిల భాగస్వామి అయిన తెదేపా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చేరబోతున్నట్లు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించినందున, అదే విషయమై బీజేపీ అగ్రనేతలతో మాట్లాడేందుకు ఆయన ఈరోజు సాయంత్రం డిల్లీ వెళ్లబోతున్నారు. ఏవో అప్రదాన్యమయిన శాఖలు కాక కీలకమయిన ఒకటి రెండు కేంద్రమంత్రి పదవులయినా తమకు ఇమ్మని చంద్రబాబు కోరాలని ఆ పార్టీ నేతలు ఆయనపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. కానీ బీజేపీలో ఉన్న అనేక మంది సీనియర్ నేతలకి ఇప్పటికే కీలక శాఖలన్నీ కేటాయించబడినట్లు తెలుస్తోంది గనుక తెదేపాకు కీలక శాఖలలో క్యాబినెట్ మంత్రి హోదా దక్కకపోయినప్పటికీ సహాయమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.   తెదేపా నుండి కేంద్రమంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో సుజనా చౌదరి, సీయం. రమేష్, రాయపాటి సాంభశివరావు తదితరులు చాలా మంది పోటీలో ఉన్నారు. అందువల్ల ముఖ్యమయిన శాఖలను దక్కించుకోవడం ఒక ఎత్తయితే, వాటి కోసం పోటీలో ఉన్నవారి నుండి ఒత్తిళ్ళు తట్టుకోవడం చంద్రబాబుకి మరో ఎత్తవుతుంది. నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో సమర్ధులు, నిజాయితీపరులు, తన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా చురుకుగా పనిచేయగలవారినే తీసుకోవాలని భావిస్తున్నందున, చంద్రబాబు అందుకు తగిన వ్యక్తులనే ఎంపికచేసుకోవలసి ఉంటుంది. ఈరోజు సాయంత్రం చంద్రబాబు బీజేపీ నేతలతో మాట్లాడిన తరువాత ఈవిషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కెసిఆర్ క్యాబినెట్ 15 మంది.. 2న ప్రమాణం

      తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం రోజే జూన్ 2వ తేదీన మధ్యాహ్నం 12.57 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజున 15 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ లకీ నెంబర్ ఆరు కనుక మొదటి విడత పదిహేను మంది మంత్రులను తీసుకుంటున్నారని సమాచారం. మిగిలిన ఇద్దరిని ఆ తర్వాత తీసుకుంటారని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఈటెల రాజేందర్‌తో పాటు సిరిసిల్ల స్థానం నుంచి విజయం సాధించిన తన కుమారుడు కెటి రామారావుకు కూడా తొలి విడత మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు.

నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్ లిస్ట్ ఇదేనా..!

      ఈ నెల 26న భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్ ఇదేనని మీడియాలో ఓ లిస్టు హల్ చల్ చేస్తుంది. ఫైనల్ గా పదవులు పొందబోయే మంత్రుల జాబితా ఇదేనా, కాదా అన్నది ఈ నెల 26న తేలనుంది. అయితే ప్రస్తుత లిస్ట్ లో మోడీ క్యాబినెట్ అభ్యర్థులు, వారికి కేటాయించిన పోర్టుఫోలియోలు వివరాలు ఇలా వున్నాయి.   నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్: హోమ్ శాఖ : రాజ్నాథ్ సింగ్ ఆర్థిక శాఖ : సుబ్రహ్మణ్య స్వామి విదేశీ వ్యవహారాలు : అరుణ్ జైట్లీ రక్షణ శాఖ : సుష్మా స్వరాజ్ రైల్వే శాఖ : వెంకయ్య నాయుడు ప్ట్టణాభివృద్ధి శాఖ : నితిన్ గడ్కరీ వ్యవసాయశాఖ : గోపీనాథ్ ముండే గ్రామీణాభివృద్ధి శాఖ : అనంత్ గీటే ఆరోగ్యం : హర్షవర్ధన్ న్యాయశాఖ : రవిశంకర్ ప్రసాద్ వాణిజ్యం : ఎస్.ఎస్.అహ్లువాలియా టెలికామ్ : అనంత్ కుమార్ బొగ్గుశాఖ : హన్స్రాజ్ అహిర్ పెట్రోలియం : రామ్ విలాస్ పాశ్వాన్ భారీపరిశ్రమలు : ఆనంద్ రావ్ అద్సుల్ విమానయాన శాఖ : షానవాజ్ హుస్సేన్ మైనారిటీ శాఖ : ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పార్లమెంటరీ వ్యవహారాలు : సుమిత్రా మహాజన్  స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి : అనుప్రియా పటేల్ మానవ వనరులు : బియస్ యడ్యూరప్ప జలవనరులు : పురుషోత్తం రూపాల క్రీడలు : కీర్తీ ఆజాద్ టూరిజం : శ్రీపాద్ నాయక్ సాంస్కృతిక శాఖ : మీనాక్షి లేఖి ఐటి శాఖ : జగదాంబికా పాల్ కార్పొరేట్ వ్యవహారాలు : అనురాగ్ ఠాకూర్ కన్వేన్షనల్ ఎనర్జీ : బిసి ఖండూరి ఎన్ ఆర్ ఐ శాఖ : రాజీవ్ ప్రతాప్ రుధి సోషియల్ జస్టిస్ : బండారు దత్తాత్రేయ సహాయ హోమ్ : సత్యపాల్ సింగ్ సహాయ రక్షణ : వీకే సింగ్ సహాయ వ్యవసాయ శాఖ : రాజు షెట్టి సహాయ సోషియల్ జస్టిస్ : రాందాస్ ఆత్వాలే సహాయ న్యాయశాఖ : కిరీట్ సోమయ్య సహాయ క్రీడాశాఖ : రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

వైకాపాకి మరీ అంత ఆత్రం పనికి రాదు

  ఇటీవల జరిగిన ఎన్నికలలో అవలీలగా గెలిచి ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కంగుతిన్నారు. దుమ్ము దులపండి...ఐదు సంతకాలు పెట్టేస్తాను...అంటూ ఎంత ఊదరగొట్టినా జనం మాత్రం ఆయన మాటలు నమ్మలేదు. చివరికిక చేసేదేమీలేక ప్రజల తరపున పోరాడుతానని హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికలలో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారం చెప్పట్టక మునుపే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసినట్లు వెంటనే రైతుల రుణమాఫీ చేయాలని మిగిలిన హామీలని కూడా తక్షణమే అమలుచేయాలని వైకాపా నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. నిజానికి వారి ఆరాటమంతా రైతుల కోసం కాదు. చంద్రబాబు రుణాలు మాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తే, మళ్ళీ ప్రజలలోకి వెళ్లేందుకు ఒక మంచి బలమయిన కారణం దొరుకుతుందని ఆరాటపడుతున్నారు.   ఇటువంటి కపట ఆలోచనలు చేసినందుకే వైకాపా ఎన్నికలలో ఓడిపోయింది. అయినా ఆ సంగతి మరిచిపోయి, మళ్ళీ తెదేపాను ఏవిధంగా అప్రదిష్టపాలు చేయాలా అని అవకాశం కోసం ఎదురు చూస్తోంది. గత ఐదేళ్ళుగా జగన్, విజయమ్మ,షర్మిల ముగ్గురూ కూడా జనాల సానుభూతి కోసం ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అందువల్ల మళ్ళీ మరో ఐదేళ్ళ పాటు ఆ సానుభూతి కోసం తిరగడం వృధా ప్రయాసేనని జగన్మోహన్ రెడ్డి కూడా అర్ధమయ్యే ఉండాలి. అందుకని ఇక వచ్చే ఐదేళ్ళు కూడా తెదేపా ప్రభుత్వం తప్పులను వెతికి పట్టుకొని ప్రజలలోకి వెళ్ళవలసి ఉంటుంది. అందుకే వెంటనే రుణమాఫీ ఫైలుపై చంద్రబాబు తోలి సంతకం చేయాలని వైకాపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ తప్పులు చేస్తే ప్రతిపక్షం వాటిని ఎత్తి చూపవలసిందే. కానీ తెదేపా ఇంకా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టక ముందే, దాని కంటే ముందు వైకాపా నేతలు మరీ ఇంత ఆత్ర పడిపోవడం వల్ల వారే అభాసుపాలవుతారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన రోజు నుండి వైకాపా నేతలు ఇక నిరభ్యంతరంగా ఆ పనిమీదే ఉండవచ్చును.

వైకాపా నేత వడ్డేపల్లి కన్నుమూత

      హైదరాబాద్ కూకట్ పల్లి వైకాపా సీనియర్ వడ్డేపల్లి నర్సింహ రావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో రాష్ట్ర ష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేసారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో పనిచేశారు. ఏడాది క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్డేపల్లి మృతి పట్ల మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, కూకట్‌పల్లి టిడిపి ఎమ్మెల్యే కృష్ణా రావు, వైకాపా అధ్యక్షుడు జగన్, తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, కెటి రామారావు సంతాపం ప్రకటించారు.

కేజ్రీవాల్ ముచ్చట తీరుతోంది

  బీజేపీ నేత నితిన్ గడ్కారీ పై అవినీతి ఆరోపణలు చేసినందుకు జైలుపాలయిన మాజీ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి డిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మరో 14రోజులు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించింది. మొన్న కోర్టులో ఆయనను హాజరు పరిచినప్పుడు కోర్టు ఆయనకు రూ.10,000 పూచీకత్తుపై బెయిలు మంజూరు చేస్తానని చెప్పినప్పుడు కేజ్రీవాల్ పూచికత్తుపై బెయిలు పొందేందుకు నిరాకరించడంతో ఆయనకు కోర్టు మూడు రోజులు రిమాండ్ విదించింది. మళ్ళీ ఈరోజు కోర్టులో ఆయనను ప్రవేశపెట్టినప్పుడు స్వయంగా ఆయనే తన కేసుని వాదించుకొన్నారు. అయితే ఈసారి కూడా ఆయన బెయిలు కోరకపోవడంతో కోర్టు ఆయనకు మరో 14రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విదించి, కేసును వచ్చేనెల 6కి వాయిదా వేసింది. పోలీసులు మళ్ళీ ఆయనను తీహార్ జైలుకి తరలించారు. ప్రజలు ఆయనను డిల్లీకి ముఖ్యమంత్రిని చేసి పాలించమని కోరితే, దానిని తృణీకరించిన ఆయన తీహార్ జైలులో ఉండేందుకే ఇష్టపడుతున్నట్లున్నారు. కోర్టు కూడా ఆయన ముచ్చటను కాదనడం దేనికని రిమాండ్ పొడిగించింది. బహుశః మళ్ళీసారి కోర్టుకి హాజరయినప్పుడు బెయిలు కోసం అర్దిస్తారేమో.

చిరు బిజెపిలోకా...రఘువీరా అసంతృప్తి

      కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిరంజీవి బీజేపిలోకి చేరుతున్నారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చిరు పార్టీ మారటంలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చిరుకు ఎంతో గౌరవం ఇచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిందని అన్నారు. అలాంటిది ఆయనకు ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ప్రజలు తీర్పును నేతలను అగీకరించి సీమాంధ్ర అభివృద్దికి పాటు పడాలని అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బలోపేతంపై చిరు దృష్టి సారిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉపముఖ్యమంత్రిగా యనమల..!

      తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు సమయం దగ్గర పడుతున్నడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన కేబినెట్ పైన కసరత్తు ప్రారంభించారు. దీంతో ముఖ్యమైన పదవులను ఎవరికి దక్కనున్నాయో అన్న చర్చ టిడిపి నేతలలో జోరుగా సాగుతుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఉపముఖ్యమంత్రి పదివి కోసం టిడిపిలో ఇద్దరూ ప్రముఖ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో మండలి ప్రతిపక్ష నేత యనమల, సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తిలు వున్నారు. అయితే చంద్రబాబు యనమల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన బాబు ముఖ్యమంత్రి పదవిలో వుండగా అదే ప్రాంతానికి చెందిన మరో నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీలో విభేదాలు వస్తాయని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీకి చెందిన యనమలకే ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

బిజెపిలోకి చిరంజీవి..!

      సీమాంధ్రలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అవడానికి మెగాస్టార్ చిరంజీవి రంగం సిద్దం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం వచ్చే అవకాశాలు కనబడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుంటే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి పార్టీ మారితే మంచిదని చిరు భావిస్తున్నారట. దీనిపై సన్నిహితులతో ఆయన చర్చించగా తమ్ముడు పవన్ కి సన్నిహితంగా వున్న బీజేపీలోకి వెళ్ళాలని వారు సూచించారట. దీంతో బిజెపి అగ్రనేతతో చిరు రహస్య మంతనాలు కూడా జరపగా ఆయన కూడా సుముఖం వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం.   మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆయన సోదరుడిని బిజెపిలోకి తీసుకురావడానికి రాయబారం వహించినట్లు తెలుస్తోంది. ఎలాగో పవన్ కళ్యాణ్ మద్దతు బిజెపికి వుంది కాబట్టి ఆయన సోదరుడు చిరు కూడా వస్తే సీమాంధ్రలో బిజెపి మరింత బలపడుతుందని ఆ పార్టీ అగ్రనేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నింటికి మించి ఇప్పుడు చిరుకి బిజెపి అవసరం ఎక్కువగా వుందని లేకపోతే అతని రాజకీయ భవిష్యత్ కు త్వరలోనే ముగింపు చెప్పాల్సి వస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో చిరు ఎలాంటి ప్రకటన చేస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.  

కేసీఆర్‌కు అసదుద్దీన్ సూచనలు

      టీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ ఎల్పీ నేత కేసీఆర్‌ను అసదుద్దీన్, మజ్లిస్ ఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్‌జాఫ్రిలు కలిసి గంటపాటు చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఏర్పడనున్న తొలి ప్రభుత్వానికి తాము బయటనుంచే సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసిఆర్ కు పలు సూచనలు చేసినట్లు ఒవైసీ తెలిపారు. ప్రభుత్వ లోగోలో చార్మినార్‌ను చేర్చాలని.. ఉర్దూను అధికార భాషగా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరెంట్, నీటి సమస్యలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా... కృష్ణా మూడో దశను పూర్తిచేసి, గోదావరి జలాలను నగరానికి తరలించాలన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం ప్రత్యేకంగా పవర్ ప్లాంట్‌ను నెలకొల్పాలని సూచించినట్లు తెలిపారు.

అన్నయ్య తప్పు చేశాడు..తమ్ముడు సరిదిద్దాడు

      సాధారణంగా తమ్ముడు తప్పు చేస్తే అన్నయ్య సరిదిద్దుతూ వుంటాడు. కొణిదెల ఫ్యామిలీ విషయంలో మాత్రం అన్నయ్య చిరంజీవి తప్పుచేస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ సరిదిద్దాడు. ఇంతకీ చిరంజీవి చేసిన తప్పేంటి.. పవన్ కళ్యాణ్ దాన్ని ఎలా సరిదిద్దాడు? 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ.   అప్పట్లో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు పుష్కలంగా వున్నాయి.  మధ్యలో పానకంలో పుడకలా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఓట్లు చీలేలా చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయేలా చేసింది. ఇంతా చేసి ప్రజారాజ్యం పార్టీ ఆ ఎన్నికలలో సాధించింది బోడి 18 అసెంబ్లీ సీట్లు అయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. రాజశేఖరరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి తనవంతు పాత్రని పోషించింది. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించకుండా వుంటే ఇలాంటి ఉపద్రవాలు సంభవించి వుండేవే కావు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వుండేది కాదు.. ఎన్నో స్కాములు జరగకుండా వుండేవి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోకుండా వుండేది. ఆ రకంగా ప్రజారాజ్యం పార్టీ తద్వారా చిరంజీవి తప్పు చేశారు. ఆ తప్పును ఇన్నేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సరిదిద్దారు. తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు సహకారాన్ని అందించారు. ఆ రకంగా అన్నయ్య చిరంజీవి ఐదేళ్ళక్రితం చేసిన తప్పుకు తమ్ముడు పవన్ కళ్యాణ్ పరిహారం చేసేశాడు.