చైనాలో భూకంపం

      చైనాలోని నైరుతి తీరంలోని యువాన్ ప్రావిన్స్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ భూకంపధాటికి 43 మందికి గాయాలయ్యాయి. దీంతో యింగ్ జియాంగ్‌లోని 15 టౌన్‌షిప్‌ల్లో సుమారు సుమారు ఒక లక్షా యాభై వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని కమ్యూనిస్టుపార్టీ నేత వాంగ్ జుంకియాంగ్ తెలిపారు. 50మందితో కూడిన సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మురం చేసినట్లు వాంగ్ తెలిపారు. సిబ్బంది 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ఈ విపత్తు వల్ల సుమారు 3,390 భవనాలు, ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా.. 18 వేలకు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు.

చంద్రబాబు కోర్కెల చిట్టా

  నిన్న డిల్లీలో వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు నాయుడు, చివరిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించి, రాష్ట్రాన్ని ఆదుకొనే బాధ్యత కేంద్రానిదేనని మరోమారు గుర్తు చేసారు. మోడీతో సహా కేంద్రమంత్రులందరూ ఆయన అభ్యర్ధనకు సానుకూలంగానే స్పందించారు. వారితో సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం ముందు ఉంచిన తన జాబితా గురించి వివరించారు.   వాటిలో ప్రధానంగా రాష్ట్రా ఆర్ధిక లోటును కేంద్రమే భరించడం, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించడం, కొత్త రాజధాని నగరం కోసం ప్రత్యేకంగా 30 టీయంసీల నీరు కేటాయింపు, విద్యుత్ లోటును భర్తీ చేస్తూ రాష్ట్రానికి అదనపు విద్యుత్ మరియు నిధులు కేటాయింపు, వ్యవయంలో లోటును భర్తీ చేస్తూ కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక అధారిటీని ఏర్పాటు చేసి, నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం, కృష్ణ, గోదావరి నదీ జలాల పంపకానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయడం, రాష్ట్రానికి వెనువెంటనే ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, పెట్రోలియం విశ్వవిద్యాలయ ఏర్పాటు, పారిశ్రామిక సంస్థలకు పన్ను రాయితీలు, యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చియా ఐదేళ్ళ ప్రత్యేక హోదాను అవసరాన్ని బట్టి మరికొన్నేళ్ళు పొడిగింపు, విభజన బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడం, ఈ పనులన్నిటినీ నిరంతరంగా పర్యవేక్షించేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడంవంటివి తాను కోరానని చంద్రబాబు తెలిపారు.

కేసీఆర్ మంత్రివర్గంలో బాలకృష్ణ

    కేసీఆర్ మంత్రివర్గంలో , కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులు ఉంటారని ఇప్పటికే రూడీ అయ్యింది. ఇప్పుడు తాజాగా మరో ఇద్ద్దరి పేర్లు బయటపడ్డాయి. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే లక్ష్మి కూడా 15 మందితో కూడిన కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నట్లు తాజా సమాచారం. కేసీఆర్ తన మంత్రి వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు తగు ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటూనే, అదే సమయంలో తెలంగాణాలో పది జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కపిన్చినట్లు తెలుస్తోంది. ఎల్లుండి ఆయనతో బాటు ప్రమాణం స్వీకారం చేయబోయే మంత్రుల పేర్లను రేపు సాయంత్రం ఆయన గవర్నరుకు అందజేస్తారు. ఆ తరువాతనే వారందరి పేర్లు మీడియా చేతికి చిక్కే అవకాశం ఉంది. కేసీఆర్ మరియు ఆయన మంత్రివర్గ సభ్యులు జూన్ రెండున ఉదయం 8.45 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేరోజు ఉదయం ఆరు గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు గవర్నర్ గా నియమితులయిన నరసింహన్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఆయన కేసీఆర్ మంత్రి వర్గం చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ప్రభుత్వాలు మారితే పేర్లు కూడా మార్చాలా?

  శంషాబాద్ విమానశ్రయం పేరు మార్చేందుకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించారు. కానీ కాంగ్రెస్, తెరాస పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాయి. ప్రభుత్వాలు మారగానే విమానాశ్రయాలు, రోడ్లు, భవనాలు, బ్రిడ్జిల పేర్లు మార్చుకొంటూ వెళితే అదొక వికృత సాంప్రదాయానికి బీజం వేసినట్లవుతుంది. సంస్థలకు, జిల్లాలకు మహనీయుల పేర్లను పెట్టడం హర్షణీయమే, కానీ దానిని మరొకరు వచ్చి తొలగిస్తే అది చాలా అవమానకరంగా ఉంటుంది. అది వారి గౌరవానికి భంగం కలిగించడమే కాక వారిని అభిమానించే ప్రజల మనసులు కూడా నొచ్చుకొంటాయి. అందువలన స్వర్గీయ యన్టీఆర్ పుట్టిపెరిగిన కృష్ణా జిల్లాలోనే ఏర్పాటు చేయబోతున్న అంతర్జాతీయ విమానశ్రయానికి ఆయన పేరు పెడితే అందరూ హర్షిస్తారు కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులకు కూడా ఇటువంటి సూచనే చేసారు. గత ప్రభుత్వ హయంలో పెట్టిన పేర్లను మార్చే ప్రయత్నం చేయవద్దని, ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థలు, నిర్మించబోయే భవనాలకు ప్రజాభీష్టం మేరకు పేర్లు పెట్టడం మంచిదని సూచించారు. అందువల్ల శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్చే ఆలోచనను కూడా విరమించుకొంటే మంచిది.

పాపం చిదంబరాన్ని పట్టుకొని ఎంత మాటనేసారు...

  మాజీ ఆర్ధికమంత్రి పీ. చిదంబరం లెక్కలలో చాలా దిట్ట. ఆయన కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చాలా ముందుగానే చాలా ఖచ్చితంగా లెక్కగట్టారు. అందుకే ఈసారి ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ తన ముద్దుల కొడుకు కార్తిని తన స్థానంలో తమిళనాడులో శివగంగ పార్లమెంటు నియోజక వర్గం నుండి పోటీకి దింపారు. ఎందుకంటే ఓడిపోయినా కాసింత ఎన్నికల అనుభవమయినా వస్తుంది కదాని! ఆయన లెక్క తప్పలేదు. కొడుకు ఓడిపోయాడు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది.   కాంగ్రెస్ ఇప్పుడు ‘ఆత్మవిమర్శ మోడ్’ లో ఉంది. అంటే ‘ఓటమికి కారణాలు కనిపెట్టుకోవడం, వాటిని సరిదిద్దుకోవడం’ అని అందరూ పొరపడుతుంటారు. కానీ దానర్ధం ‘ఈ ఓటమికి మీదే బాధ్యత అంటే కాదు మీదే’ అని వాదించుకోవడం అన్నమాట.   ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోనియా, రాహుల్ గాంధీలు మీడియా వాళ్ళను పిలిచి ‘ఈ ఓటమికి మాదే బాధ్యత’ అని ప్రకటించినపటికీ, వీరవిధేయ కాంగ్రెస్ నేతలు మాత్రం ‘ఆ నేరం, భారం మా నెత్తినే వేసుకొంటాము, మీరే మమ్మల్ని ఏలండి ప్లీజ్!’ అని వేడుకొన్నారు. అలాగని ఏ ఒక్కరూ ఓటమికి బాధ్యత తమదేనని చెప్పుకొన్న దాఖలాలు లేవు. ప్రతీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి, ‘ఓటమికి మీదే బాధ్యత అంటే కాదు మీదే’ నని వాదించుకొంటూ ఎన్నికల కిక్కుని, వేడిని దించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.   ఇక మళ్ళీ కధలోకి వస్తే ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే పనిలో చాలా బిజీగా ఉన్నారు. “తమిళనాడులో కాంగ్రెస్ ఘోరపరాజయానికి ప్రధాన కారణం రాష్ట్ర పీసీసీ అసమర్దతే. ఎన్నికలలో పార్టీ నేతలందరిని ఏకత్రాటిపై నడిపించడంలో ఘోరంగా విఫలమయిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవి నుండి తప్పుకోవాలి,” అని చిదంబరం తనయుడు కార్తి, వారి అనుచరులు కొందరు కలిసి డిమాండ్ చేసారు.   అందుకు అటువైపు నుండి అంతే ధీటుగా, చాలా ఘాటుగా చిదంబరం బుర్ర తిరిపోయేలా సమాధానం వచ్చింది. “తమిళనాడు రాష్ట్రంలో పార్టీ ఓటమికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ కారణమని ఆరోపిస్తున్న వారందరూ, ఆయన (చిదంబరం) అవలంభించిన లోపభూయిష్టమయిన ఆర్ధిక విధానాల వల్లనే దేశమంతటా పార్టీ ఊడ్చిపెట్టుకొని పోయిందని గ్రహించాలి. ఆయన విధానాల వల్లనే దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ ఆయన వాటిని నియంత్రించాలని ఎన్నడూ గట్టిగా ప్రయత్నం చేయలేదు. తత్ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురయ్యి తుడిచిపెట్టుకుపోయింది."   "అంతే కాదు ఆయన నిర్వాకం వల్ల కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన కాంగ్రెస్ అధిష్టాన్ని తప్పు దారి పట్టించారు. అందుకే రెండు ప్రాంతాలలో పార్టీ ఘోరపరాజయం పాలయింది. ఈవిధంగా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగించిన ఆయన ఏవిధంగా తమిళనాడులో పార్టీ ఓటమికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ బాధ్యులని ఆరోపిస్తున్నారు?"   "కేంద్రమంత్రిననే అహంతో ఆయన ఏనాడు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కేవలం తన కొడుకు పోటీ చేస్తున్న శివగంగలో మాత్రమే ప్రచారం చేసుకొన్నారు. అయినప్పటికీ ఆయన తన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారు. అటువంటి వ్యక్తి ఏవిధంగా ఇతరులను నిందిస్తారు?” అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ అనుచరులు చిదంబరాన్ని ఎదురు ప్రశ్నించారు.   చిదంబరం అధికారంలో ఉన్నంత కాలం చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఒకవెలుగు వెలిగారు. దేశంలో పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలను తన చిటికన వ్రేలుతో ఆడించారు. స్టాక్ మార్కెట్లను తన కనుసైగతో కదిలించేవారు. అటువంటి పెద్దమనిషిని పట్టుకొని స్వంత రాష్ట్రం వాళ్ళే ఎంతమాట అనేశారు? పాపం... చిదంబరం.

సచివాలయం విభజన జీవోలు జారీ

      సచివాలయం భవనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయిస్తూ 196,197 జీవోలు జారీ అయ్యాయి. తెలంగాణకు ఏ,బీ,సీ,డీ బ్లాక్‌లు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు సౌత్ హెచ్, నార్త్‌హెచ్, ఎల్,కే, జే బ్లాక్‌లను కేటాయించారు. ఎల్ బ్లాక్ 8 వ అంతస్థులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాంబర్, ఏడవ అంతస్థులో ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఛాంబర్ ఉండనున్నాయి.   పాత అసెంబ్లీ భవనం, సమావేశం మందిరాన్ని ఏపీకి కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం, మంత్రుల గదులను తెలంగాణకు కేటాయించారు. అలాగే ప్రస్తుత శాసనమండలి భవనం ఏపీకి, తెలంగాణ శాసనమండలి కోసం జూబ్లీహల్ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ క్యాంప్ ఆఫీస్‌గా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, కుందన్‌బాగ్‌లో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా నిర్దారించారు. జూబ్లీహిల్‌సలోని మంత్రుల క్వాటర్స్‌లో 1 నుంచి 15 వరకు తెలంగాణ మంత్రులకు 16 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయించారు. ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ 11 నుంచి 19 బ్లాక్‌లు, 20 నుంచి 23 డీలక్స్ బ్లాక్‌లు, హైదర్‌గూడలోని ఎంఎస్-1 బ్లాక్‌లను ఏపీ ఎమ్మెల్యేలకు కేటాయించారు. ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ 1 నుంచి 10 బ్లాక్‌లు, 24వ బ్లాక్(మూడంతస్థుల డీలక్స్ బిల్డింగ్), డాక్టర్స్ క్వార్టర్స్(రెండస్థుల భవనం), హైదర్‌గూడలోని ఎంఎస్-2 బ్లాక్‌లను తెలంగాణ ఎమ్మెల్యేలకు కేటాయించారు.

టిడిపి డిప్యూటీ సీఎంగా నారాయణ..!

      ఎన్నికల సంధర్బంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే కాపులకు, బీసీలకు చెరోక ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాపుల కోటా కింద డిప్యూటీ సీఎంగా నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పి.నారాయణకు చంద్రబాబు అవకాశం ఇవ్వలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారాయణ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ టీడీపీ టికెట్ల కేటాయింపుల్లో నేతల మధ్య భేదాలు రాకుండా ఉత్తరాంధ్రలో తనవంతు పాత్ర పోషించాడని కొంతమంది టిడిపి తమ్ముళ్ళు చెబుతున్నారు. అయితే ఈ పదవి పార్టీలో చాలా కాలంగా కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నేతలకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్నవారు.. ఉన్నట్టుండి నారాయణ పేరు ఆ పదవి విషయంలో వినిపిస్తుండటంతో కొంత గందరగోళానికి గురవుతున్నారు. అందులోనూ కాపు కోటాలో ఇప్పుడు పదవి పై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకొన్నారు. నారాయణకు గనుక ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తే కొంతమంది నేతలు బాబుపై అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఢిల్లీలో బాబు బిజీ: జైట్లీతో ఏపీ రాయితీలపై చర్చ

      టిడిపి అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆప్రాంత అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యాచరణలో అప్పుడే నిమగ్నమయ్యారు. సీమాంధ్ర పునర్నిర్మాణం కోసం కావల్సిన నిధులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన రాయితీల చిట్టాలతో ఢిల్లీ వెళ్ళిన బాబు ముందుగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ జైట్లీతో భేటి అయ్యారు. ఈ సమావేశంలో బాబు జైట్లీని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రాయితీలపై స్పష్టత ఇవ్వలని కోరారు. సీమాంధ్రకు ఉత్తరాఖండ్ తరహా ప్యాకేజ్ కూడా ఇవ్వాలని కోరారు. సీమాంధ్రకు ఆర్థిక సాయానికి సంబంధించిన వ్యవహారాలపై ప్రణాళికా సంఘం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని జైట్లీ తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం సీమాంధ్రకు ఆర్థికంగా మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. సీమాంధ్రను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని కూడా జైట్లీ చెప్పారు. ఈ రోజంతా వరుస భేటీలతో ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా గడపబోతున్నారు.

బాబు ప్రమాణానికి మోడీ, పవన్..!

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూన్ 8న ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాబు మోడీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన పార్టీ నేతలకు కూడా చెప్పినట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున మోదీ రాగలుగుతారా అన్న సందేహాన్ని నేతలు వ్యక్తం చేయగా..స్వయంగా తానే మోదీని కలిసి ఆహ్వానిస్తానని బాబు తెలిపారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన సినీనటుడు పవన్ కల్యాణ్‌నూ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అలాగే నలుగురు ముఖ్యమంత్రులను కూడా బాబు ఆహ్వానించనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గోవా ముఖ్యమంత్రి పారికర్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

      తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడు పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడం నిరసిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామాన్ని, సెంటు భూమిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టంచేశారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ముంపు గ్రామాలను వదులుకోబోమన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వంపై రాజ్యాంగ ఉల్లంఘన కింద సుప్రీంకోర్టు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మానవ విధ్వంసం చేయడం ద్వారా ఏ రకమైన అభివద్ధిని టీడీపీ, బీజేపీలు కోరుకుంటున్నాయని ప్రశ్నించారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేసే వరకు పోలవరం ప్రస్తుత డిజైన్‌ను మార్పు చేసే వరకు సీపీఎం ప్రజాపోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

పోలవరం ముసుగులో దోపిడీకి కుట్ర: హరీష్

      పోలవరం ముసుగులో తెలంగాణలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు ఇద్దరు నాయుడులు కుట్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడు మండలాలు సీమాంధ్రలో కలపడంవల్ల తెలంగాణకు యేడాదికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఈ ప్రాంత టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన అర్డినెన్స్ విధానాన్నే బీజేపీ అమలు చేసిందని ఆ పార్టీ నేతలు పేర్కొనడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్ అయితే, బీజేపీ ఆపొచ్చు కదా..? అని ఆయన ప్రశ్నించారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆగమేఘాల మీద ఎందుకు అర్డినెన్స్ తీసుకువచ్చారో ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రధానికార్యాలయం నుండి గవర్నరుకు పిలుపు

  ప్రధానికార్యాలయం నుండి పిలుపు రావడంతో గవర్నరు నరసింహన్ ఈ రోజు ఉదయం డిల్లీ బయలు దేరి వెళ్ళారు. మరొక రెండు రోజుల్లో అధికారికంగా రాష్ట్రవిభజన జరుగుతున్నందున, అందుకు అవసరమయిన ఏర్పాట్లను పునఃసమీక్షించేందుకు గవర్నరును పిలిచినట్లు తెలుస్తోంది. ఆయన ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరెంద్రమోడిని కలుస్తారు. గవర్నరు కూడా మోడీ ప్రమాణస్వీకారం హాజరయ్యారు. కానీ ఇదే వారి మొట్ట మొదటి సమావేశం. ఈ సమావేశంలో వారు పోలవరం ముంపు ప్రాంతాలపై తెలంగాణాలో మొదలయిన నిరసనలు, ధర్నాలు, ఉద్యోగుల పంపకాలలో తలెత్తుతున్న సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం డిల్లీలోనే ఉన్నారు. ఆయన కూడా వివిధ మంత్రిత్వ శాఖల మంత్రులను, మోడీని కలవబోతున్నారు. బహుశః నరేంద్రమోడీ వారిరువురితో ఒకేసారి సమావేశమయ్యి ఉభయ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలను చర్చించే అవకాశం ఉంది.

చంద్రబాబు ప్రమాణ స్వీకార మూహూర్తం మార్పు

  చంద్రబాబు నాయుడు నిన్న కృష్ణా-గుంటూరు జిల్లాలో పార్టీ నేతలతో చర్చించిన తరువాత వారి సూచన మేరకు, తన ప్రమాణస్వీకార ముహూర్తాన్ని మార్చుకొన్నారు. జూన్ 8న ఉదయం 11.45 నిమిషాలకు బదులు, అదేరోజు సాయంత్రం 7.21నిమిషాలకు నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న మైదానంలో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని ముహూర్తంలో మార్పు చేసారు.   జూన్ 4న తిరుపతిలో తెదేపా శాసనసభాపక్షం సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. ఆ సమావేశంలో కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులు చంద్రబాబును తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొంటారు. చంద్రబాబు నాయుడు తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు డిల్లీ వెళ్ళి ఆయనను కలిసినప్పుడు ఆయనను ఆహ్వానించవచ్చును. అయితే కొత్తగా ప్రధానమంత్రి బాధ్యతలు చేప్పట్టిన మోడీ ప్రస్తుతం క్షణం తీరికలేకుండా ఉన్నందున, బహుశః చంద్రబాబు ఆహ్వానం మన్నించలేకపోవచ్చును. ఒకవేళ మన్నిస్తే, మరింత కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది కనుక కేంద్రం నుండి అధనంగా ప్రత్యేక భద్రతాదళాలు బయలుదేరవచ్చును. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ముహూర్తం సాయంత్రానికి మారింది గనుక బహుశః భారీగా జనాలు, కార్యకర్తలు తరలిరావచ్చును.

కేంద్రమంత్రులను కలిసేందుకు బాబు డిల్లీ ప్రయాణం

  ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు డిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు అవసరమయిన నిధులు, వివిధ అంశాల గురించి మాట్లాడబోతున్నారు. త్వరలో రెండు రాష్ట్రాలు విడిపోతునందున రెండు రాష్ట్రాల నడుమ వివాదం సృష్టిస్తున్న విద్యుత్, ఉద్యోగ, జలవనరుల పంపకాలు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం నిధులు విడుదల, రాష్ట్రంలో ఉన్నత విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు వంటి అనేక అంశాల గురించి వివిధ శాఖల మంత్రులతో చర్చించనున్నారు. ఆఖరుగా ప్రధానిమంత్రి నరేంద్ర మోడీని కలిసి తమ చర్చల సారాంశం ఆయనకు వివరించి, ఆయన సహాయ, సహకారాలు కోరనున్నారు. ఈరోజు చంద్రబాబు ఉదయం 10.30గంటలకు ఆర్ధికమంత్రి-అరుణ్ జైట్లీ, ఆ తరువాత వరుసగా జలవనరుల శాఖ మంత్రి-ఉమాభారతి, ప్రణాళికా సంఘం మంత్రి- జితేంద్ర ప్రసాద్, విద్యుత్ శాఖా మంత్రి- అనంత గీతే, పెట్రోలియం శాఖ మంత్రి-ధర్మేంద్ర ప్రాధాన్ తదితరులను కలవనున్నారు. చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు.

తెలంగాణా ప్రభుత్వ లోగోను ఆమోదించిన కేసీఆర్

  త్వరలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధతలు చెప్పట్టనున్న కేసీఆర్ ఈరోజు తెలంగాణా ప్రభుత్వ అధికారిక లోగోను ఆమోదించారు. చిలుక పచ్చని రంగులో కాకతీయ శిల్పతోరణం దాని మద్యలో చార్మినార్ ఉంటుంది. ఈరెండు బొమ్మలు ఒక వృత్తంలో ఉంచి దానికి పైభాగాన ఇంగ్లీషులో గవర్నమెంటు ఆఫ్ తెలంగాణా అని, ఆ వృత్తంలో క్రిందన ఎడమ వైపు తెలుగులో, కుడివైపు ఉర్దులో తెలంగాణా ప్రభుత్వం అని వ్రాయబడి ఉంటుంది. వృత్తం పైన భారత ప్రభుత్వ అధికార ముద్ర నాలుగు సింహాలు బొమ్మ ఉంటుంది. వృత్తం క్రింద హిందీలో సత్యమేవ జయతే అని వ్రాసి ఉంటుంది. ఈ లోగోను కేసీఆర్ జూన్ రెండున తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత విడుదల చేస్తారు.(గమనిక: పైన ఇవ్వబడిన చిత్రం కేవలం అంచనా కోసమే. అసలు చిత్రం కాదు. తెలంగాణా లోగోలో పైన పేర్కొనబడిన విధంగా మధ్యలో చార్మినార్ బొమ్మ ఉంటుంది.)

చదువు కాదు..నా పని తీరు చూడండి: స్మృతి ఇరానీ

      కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ, ఎన్నికల కమిషన్‌కి గతంలో సమర్పించిన అఫిడవిట్‌కీ, ఇటీవల ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌కీ తేడాలున్నాయనీ..2004 ఎన్నికల అఫిడవిట్లో బీఏ పూర్తి చేశానని, 2014 ఎన్నికల్లో బీకామ్ మొదటి సంవత్సరంతో ఆపేశానని ఆమె తెలిపారు. అయితే 12వ తరగతి చదివిన వ్యక్తికి కీలకమైన మానవ వనరుల శాఖను ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ విమర్శలపై స్పందించారు. తన విద్యార్హతలను లక్ష్యం చేసుకుని కాంగ్రెస్ సృష్టించిన వివాదం విధులపై దృష్టి పెట్టకుండా చేసేందుకెనని..చదువు ముఖ్యమే కానీ నా పని తీరును..నా సామర్థ్యాన్ని చూసి చివరకు ప్రజలే తీర్పు చెబుతారని ఆమె అన్నారు.

జూన్ 4 నుంచి 12 వరకు పార్లమెంట్ సమావేశాలు

      పదహారవ పార్లమెంటు సమావేశాలు జూన్ 4 నుంచి మొదలుకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలు ఇవి. జూన్ 4 నుంచి 12 తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని గురువారం ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. జూన్ 4, 5 తేదీల్లో పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. జూన్ 6న స్పీకర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎంపి కమల్‌నాథ్ వ్యవహరిస్తారని వెంకయ్య నాయుడు తెలిపారు. జూన్ 9న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారని చెప్పారు. మరోవైపు రాష్ట్రానికి చెందిన అంశాలపై కేబినెట్ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుల కేటాయింపుపై ఆర్డినెన్స్ అవసరం లేదని హోంశాఖ అధికారులు స్పష్టంచేశారు. అలాగే ఉద్యోగుల విభజనలో తలెత్తిన సమస్యలపై కూడా కేబినెట్‌లో చర్చించినట్లు సమాచారం.

పోలవరం ఆర్డినెన్స్ బాబు కుట్ర

      పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు అత్యధికంగా జీవిస్తున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేరుస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వటం దారుణమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, దీనికి ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా బాబు చేస్తున్న కుట్రలపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురవుతున్న ఏడు మండలాల రక్షించేందుకు న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

తెలంగాణవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

      పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా గురువారం బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఈ ఉదయం నుంచే టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.ఆర్టీసీ డిపోల ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన తెలిపారు. దీంతో ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్‌లో బస్సులు నిలిచిపోయాయి. బంద్‌కు టీఎన్‌జీవో, టీజీవో, ఆర్టీసీ టీఎంయూ, లాయర్ల జేఏసీ, టీజేఎఫ్ మద్దతు తెలిపాయి. కాగా బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు.