తెలంగాణలో స్వార్థం గెలిచింది: గద్దర్

      తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు ఆ ఆనందాన్ని తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువకాలం ఉంచేట్టు లేరు. కేసీఆర్ని నీడలా వెంటాడి, తెలంగాణ ప్రజలకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, ఆయన చేసిన వాగ్దానాలలో 25 శాతమైనా నెరవేర్చాలని తాము కోరుకుంటున్నామని, అలా జరగకుంటే తెలంగాణ ప్రజలు ఉద్యమబాటలో పయనిస్తారని చెప్పారు.   తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మీద గద్దర్ స్పందిస్తూ, తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, అయితే ఈ ఎన్నికలలో త్యాగం గెలవలేదని, స్వార్థమే గెలిచిందని అన్నారు. ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికలలో ఓడిపోవడం, తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలు చేయని వాళ్ళు గెలవటం దీనికి ఉదాహరణ అని గద్దర్ అన్నారు. త్యాగానికి ప్రతీక అయిన శంకరమ్మ ఓడిపోవడానికి, ఎలాంటి త్యాగాలూ చేయనివాళ్ళు గెలవటానికి రాజకీయ గారడీలే కారణమని ఆయన చెప్పారు.

కొప్పుల ఈశ్వర్ తెలంగాణా అసెంబ్లీ స్పీకర్?

  కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తెరాస యం.యల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. ఈరోజు తనకూ పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉంటుందని ఆయన చాలా ఆశపడ్డారు. కానీ, కేసీఆర్ మొదటి జాబితాలో ఆయన పేరు కనబడలేదు. కొప్పుల ఈశ్వర్ దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వంలో తనకు కీలక మంత్రి శాఖ దొరుకుతుందని ఆశించారు. కేసీఆర్ ఈ నెల 15 తర్వాత మళ్ళీ తన కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. కనీసం అప్పుడయినా మంత్రి పదవి దక్కవచ్చని ఆశపడుతున్న ఈశ్వర్ కు కేసీఆర్ తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పదవిని ఖరారు చేసినట్లు తాజా సమాచారం. అందుకు ఆయన స్పీకర్ పదవి తీసుకొనేందుకు అంగీకరిస్తారా లేదా? చూడాలి.

సీఎం కేసీఆర్ మీద విమర్శలు షురూ!

      తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఇలా విమర్శల పర్వం మొదలైపోయింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కేబినెట్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కాదని, కేసీఆర్ కుటుంబ మంత్రివర్గం అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తండ్రీకొడుకులు, అల్లుడు కలసి సొంత ఆస్తిని పంచుకన్నట్టు మంత్రివర్గాన్ని పంచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. 12 మంది సభ్యులున్న తెలంగాణ మంత్రివర్గంలో కేసీఆర్‌తో కలిపి ముగ్గురు ఆయన కుటుంబానికే చెందినవారు వున్నారని విమర్శించారు. వెనుకబడిపోయిన మహబూబ్‌నగర్ జిల్లాకు కేసీఆర్ కేబినెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని, టీఆర్ఎస్‌కి అత్యధిక సీట్లు ఇచ్చిన జిల్లాకి కేసీఆర్ మొండిచెయ్యి చూపించారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రిపదవులకు అర్హులు కాని సన్నాసులు.. దద్దమ్మలా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట తప్పడమే కాకుండా మంత్రివర్గంలో కూడా దళితులకు స్థానం కల్పించలేదని విమర్శించారు.

కేసీఆర్ మంత్రివర్గం...శాఖల వివరాలు

      29వ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం ఉదయం కేసీఆర్‌తోపాటు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రులుగా మహమూద్ అలీ, రాజయ్య నియమితులయ్యారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు.. అలాగే తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. తెలంగాణ అధికారిక ముద్రకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.   మంత్రులకు కేటాయించిన శాఖలు : 1.  మహమూద్ అలీ - రెవన్యూ శాఖ 2.  రాజయ్య - వైద్య ఆరోగ్య శాఖ 3.  నాయిని నరసింహారెడ్డి - హోంమంత్రి 4.  ఈటెల రాజేందర్ - ఆర్థిక శాఖ 5.  పోచారం శ్రీనివాస్‌రెడ్డి - పపంచాయతీ రాజ్ శాఖ 6.  హరీష్‌రావు - విద్యుత్ నీటి పారుదల శాఖ 7.  పద్మారావు - ఎక్సైజ్ శాఖ 8.  మహేందర్‌రెడ్డి - క్రీడలు, యువజన వ్యవహరాల శాఖ 9.  కేటీఆర్ - ఐటీ, పరిశ్రమల శాఖ 10.  జోగురామన్న - సాంఘిక సంక్షేమ శాఖ 11. జగదీశ్‌రెడ్డి - రోడ్డు, భవనాల శాఖ

కేసీఆర్ కి శుభాకాంక్షలు: చంద్రబాబు

  తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నేతలయిన జానారెడ్డి, వీ.హనుమంత రావు వంటి వారినెవరినీ ఆహ్వానించకపోవడంతో వారెవరూ ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు. మరికొద్ది సేపటిలో కేసీఆర్ సచివాలయం చేరుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత చంద్రబాబు నాయుడు ఆయనకు అభినందనలు తెలియజేస్తారు. కేసీఆర్ తనను తన పార్టీ నేతలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనప్పటికీ, చంద్రబాబు మాత్రం కేసీఆర్ ను ఈనెల 8న నిర్వహించే తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించబోతున్నారు. కేసీఆర్ ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్ లో చేసిన తన ప్రసంగంలో ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటానని హామీ ఇచ్చారు. దానిని ఆయన మాటలలో కాక చేతలలో చూపితే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి తమ వాళ్ళని కూడా ఆహ్వానించి ఉండి ఉంటే బాగుండేది అని చంద్రబాబు వ్యాక్యానించారు.

ఆంధ్రప్రదేశ్ కి రాముడు, కృష్ణుడు, చంద్రుడు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాముడు, కృష్ణుడు, చంద్రుడు రక్షగా నిలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడు (చంద్రుడు), డీజీపీగా జేవీ రాముడు, (రాముడు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఐవై.ఆర్. కృష్ణా రావు (కృష్ణుడు) రక్షగా నిలబోతున్నారు. ముగ్గురూ కూడా మంచి కార్యదక్షులు, అనుభవజ్ఞులుగా పేరు తెచ్చుకొన్నవారే.   రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయినా ఐవై.ఆర్. కృష్ణారావు 1979 ఐఏయస్ బ్యాచ్ కు చెందినవారు. ఆయన పూర్తి పేరు ఇప్పగుంట యశోధరా రామకృష్ణారావు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలంలో గల చౌటపాలెం గ్రామం. ఇప్పటి వరకు ఆయన విజయవాడ, నెల్లూరు జిల్లాలకు జాయింటు కలెక్టరుగా, నల్గొండ జిల్లా కలక్టరుగా, రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉన్నతాధికారులలో ఆయనకు సౌమ్యుడు, కార్యదక్షుడనే మంచి పేరుంది. నిన్న ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలన్నిటినీ చక్కగా సమన్వయ పరుచుకొంటూ త్వరితగతిన సజావుగా రాష్ట్ర పునర్నిర్మాణం జరిగేందుకు కృషిచేస్తానని తెలిపారు.   రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జాస్తి వెంకట రాముడు 1981 బ్యాచ్ కు చెందిన ఐ.పీ.యస్ అధికారి. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లాలో తడ్డిమర్రి మండలంలో గల నర్సింపల్లి గ్రామం. ఆయన గుంటూరు, కరీం నగర్, వరంగల్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ లలో వివిధ శాఖలలో వివిధ హోదాలలో సేవలందించారు. ఆయన పోలీసు శాఖలో అన్ని విభాగాలలో కూడా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చెప్పట్టే ముందు వరకు ఆయన డీజీ ఆపరేషన్స్ గా సేవలందిస్తున్నారు. బాధ్యతలు చేప్పట్టిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర తొలి డీజీపీగా తనకు అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అన్ని విధాల కృషి చేస్తానని, అలాగే రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా చంద్రబాబు ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు.

తెలంగాణ తొలి సీఎంగా కేసిఆర్ ప్రమాణం

      తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలుపొందిన విషయం విదితమే. మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో కేసీఆర్ 1954, ఫిబ్రవరి 17న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు నుంచి పట్టా పొందారు. కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించారు. అనంతరం 1983లో టీడీపీలో చేరారు. టీఆర్‌ఎస్ పార్టీని 2001, ఏప్రిల్ 27 ప్రారంభించి తెలంగాణ కోసం ఆలు పెరగని పోరాటం చేశారు.

టీఆర్ఎస్‌లోకి తుమ్మల నాగేశ్వరరావు జంప్?

  ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి జంప్ అవబోతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సత్తుపల్లి తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వీరయ్య కూడా టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీరిద్దరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతోనే సండ్ర వీరయ్య తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టబోతున్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఒక్క ఎమ్మెల్యే స్థానం సండ్ర వీరయ్యదే. ఇప్పుడాయన టీఆర్ఎస్‌లో చేరితే ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడానికి ప్రధాన కారణం ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో తారస్థాయికి చేరిన విభేదాలే కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామా నాగేశ్వరరావు పోటీ చేయగా, ఖమ్మం అసెంబ్లీ స్థానానికి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య ఎప్పుడూ ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొని వుండేది. ఇలా ఇద్దరు నాగేశ్వరరావులూ ఒకరి మీద మరొకరు విభేదాలు పెంచుకున్నారు. ఫలితంగా ఇద్దరూ గత ఎన్నికలలో ఓడిపోయారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం భంగపడటానికి కారణం మీ నాయకుడంటే మీ నాయకుడంటూ తుమ్మల, నామాలకు చెందిన వర్గీయులు రోడ్డుమీద జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు కూడా! తన ఓటమికి నామా నాగేశ్వరరావు వర్గీయులు తనను వెన్నుపోటు పొడవటమే కారణమని తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచీ తన సన్నిహితుల దగ్గర వాపోతూ వస్తున్నారు. నామా మీద చర్యలు తీసుకోవాలని ఆయన భావించారు. అయితే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి నామా సన్నిహితుడు కావడం వల్ల తనకంటే నామాకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం తుమ్మలలో వుంది. దీనివల్లే ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగినా చురుగ్గా పనిచేసే తుమ్మల తాజాగా జరిగిన మహానాడుకు హాజరు కూడా కాలేదు. టీఆర్ఎస్‌లో బెర్త్ కన్ఫమ్ కావడం వల్లే ఆయన తెలుగుదేశం పార్టీ వేడుకకు దూరంగా వున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అపాయింటెడ్ డేపై స్టేకి హైకోర్టు నో!

  ఆదివారం సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి చివరి రోజు. ఆదివారం అర్ధరాత్రి దాటి సోమవారం ప్రవేశించగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోనుంది. తెలంగాణ బిల్లులో పొందుపరిచిన అపాయింటెడ్ డే అనుసరించి జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం రెండు ముక్కలు కాబోతోంది. అయితే రాష్ట్ర విభజనను ఆపడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్న కొందరు సమైక్యవాదులు పట్టువదలని విక్రమార్కుల్లా తమవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అయితే అవి ఫలితాన్ని ఇవ్వడంలేదు. రాష్ట్రాలను రెండుగా విభజించే అపాయింటెడ్ డేకి స్టే విధించాలని సంజీవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో దాఖలుచేసిన హౌస్ మోషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్డులో పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని, అపాయింటెడ్ డే పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను అయిదు వారాలకు వాయిదా వేసింది. దీంతో రాష్ట్ర విభజనకు ముందు రోజు కూడా సమైక్యవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారికి మరోసారి నిరాశే మిగిలింది.

హైదరాబాద్‌లో తల్లిపాల బ్యాంకు

  దేశంలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంక్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. దీనిని ‘మదర్ మిల్క్ బ్యాంక్’ అని వ్యవహరిస్తారు. పుట్టుకతోనే తల్లులను కోల్పోయిన పిల్లలకు అమ్మపాలు అందించడం కోసం బాలల హక్కుల సంఘం ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకులో సభ్యురాళ్ళుగా చేరే మహిళలు తల్లిలేని పిల్లలకు కొంతకాలం పాలు అందిస్తారు. తద్వారా తల్లిలేని పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి తమవంతు సహాయాన్ని అందిస్తారు. ఈ బ్యాంకులో సభ్యురాలుగా చేరి తల్లిలేని పిల్లలకు పాలు అందించడానికి ముందుకు వచ్చిన మొట్టమొదటి మహిళ పేరు లక్ష్మి. ఈమెలాగా ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి తల్లిలేని పిల్లలకు పాలు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ శ్రమ ఫలించినట్టు భావిస్తామని మదర్ మిల్క్ బ్యాంక్ నిర్వాహకులు అంటున్నారు.

యు.పి.ఎస్.సి. అభ్యర్థులకు శుభవార్త

  సివిల్ సర్వీసెస్‌లో ప్రవేశించడానికి, ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లు అవడానికి పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించే అభ్యర్థులకు ఒక శుభవార్త. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు యు.పి.ఎస్.సి. ఒక వెసులుబాటు కల్పించింది. గతంలో ఒక అభ్యర్థి నాలుగుసార్లు మాత్రమే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే అవకాశం వుండేది. అయితే దానిని ఆరుసార్లకు పొడిగిస్తూ యు.పి.ఎస్.సి. నిర్ణయం తీసుకుంది. అలాగే 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు వున్న అభ్యర్థులు పరీక్షలు రాసుకోవచ్చని వయసు సడలింపును కూడా ప్రకటించింది. ఎస్.సి., ఎస్టీ అభ్యర్థులు మాత్రం గతంలో తరహాలోనే ఎన్నిసార్లయినా సివిల్స్ పరీక్షకు హాజరు కావొచ్చు. ఈసారి ఆగస్టు 24వ తేదీన సివిల్స్ పరీక్ష జరగబోతోంది. ఈ ఏడాది 1291 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో 26 స్థానాలను వికలాంగులకు కేటాయించారు.

పొగాకు వాడొద్దు.. బాధ పడొద్దు: మోడీ సందేశం

  ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని నిర్వీర్యం చేసే అంశాల్లో పొగాకు కూడా ఒకటి. పొగాకు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది మరణిస్తున్నారు. ఏ రూపంలో వాడినా పొగాకు మనిషి జీవితాన్ని కబళిస్తూనే వుంది. అయితే పొగాకును పూర్తిగా నిషేధించే పరిస్థితులు లేవు. పొగాకు వాడకం మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తప్ప మరో మార్గం లేదు. మన భారతదేశంలో పొగాకు కారణంగా జనం ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో క్యాన్సర్ మహమ్మారి విస్తరించడానికి పొగాకు ప్రధాన కారణంగా వుంటోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ పొగాకు వినియోగాన్ని మానుకోవాలని జాతికి పిలుపు ఇచ్చారు. శనివారం నాడు పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆయన దేశ ప్రజల్ని పొగాకు విషయంలో చైతన్యవంతులను చేయాలని భావించారు. అందుకే ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘పొగాకు వాడకం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల విషయంలో ప్రజలకు అవగాహన పెంచుదామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని ట్విట్ పోస్ట్ చేశారు. మోడీ చెప్పినట్టు విందాం. ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని కాపాడుకుందాం.

పులిని చూసి వాతలు పెట్టుకొన్నట్లు...టీ-కాంగ్రెస్ నేతలు

  సీమాంధ్రాలో కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో గెలవలేకపోయింది. అందుకు ప్రధాన కారణం టీ-కాంగ్రెస్ నేతలు ఎవరికీ వారు తమ స్వార్ధం చూసుకొన్నారే తప్ప, ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలని గట్టిగా ప్రయత్నించక పోవడమే. అందుకు మరో బలమయిన కారణం కూడా ఉంది. తమను నట్టేటముంచిన కేసీఆర్ ను టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసి కట్టుగా గట్టిగా ఎదుర్కొనే బదులు, ఆయన వ్యూహాలనే గుడ్డిగా అనుసరించే ప్రయత్నం చేసారు. హైదరాబాదులో సెటిలర్లు, సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులకు మొదట అండగా నిలబడిన టీ-కాంగ్రెస్ నేతలు, ఆ తరువాత కేసీఆర్ వారిపై దాడి తీవ్రతరం చేసిన్నపుడు, వారికి అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు. వారికి అండగా నిలబడినట్లయితే తెలంగాణా ప్రజల ఓట్లు కోల్పోతామనే భయంతో వారిని విడిచి పెట్టేసారు. మునుపటిలా వారి భద్రతకు భరోసా ఇస్తూ గట్టిగా మాట్లాడలేదు. అందుకే వారి పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయి, చివరికి ఘోర పరాజయం పొందారు.   కనీసం తమ ఓటమి నుండి అయినా పాటాలు నేర్చుకొని, తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అదీ లేదు. మళ్ళీ అవే తప్పులు చేసేందుకు సిద్దపడుతున్నారు. పోలవరం ముంపు గ్రామాల విషయంలో కేసీఆర్ తెలంగాణా బంద్ కు పిలుపునిస్తే దానిపై ఏవిధంగా ప్రతిస్పందించాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయారు టీ-కాంగ్రెస్ నేతలు.   అయితే కేసీఆర్ మరియు తెరాస నేతలు ఈ అంశంపై కూడా తమకంటే ముందుకు దూసుకుపోతుండటం చూసి, టీ-కాంగ్రెస్ నేతలు తాము కూడా పోలవరం ముంపు గ్రామాలపై ఉద్యమించాలని నిశ్చయించుకొన్నారు. టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో నిన్న సమావేశమయిన టీ-కాంగ్రెస్ నేతలందరూ, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడాన్ని వ్యతిరేఖించాలని నిర్ణయం తీసుకొన్నారు. త్వరలో వారిలో కొందరు నేతలు ముంపు గ్రామాలను స్వయంగా సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి తరపున తాము పోరాడుతామని దైర్యం చెప్పాలని కూడా నిర్ణయించుకొన్నారు.   అయితే ఈ ఆత్రుతలో టీ-కాంగ్రెస్ నేతలు ఒక ముఖ్యమయిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఆగ్రహంతో ఉన్నసీమాంధ్రులను శాంతింపజేసేందుకే, కాంగ్రెస్ అధిష్టానం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కు బదలాయించేందుకు ఆర్డినెన్స్ సిద్దం చేసింది. కానీ సమయాభావం వల్ల ఆ ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేయించలేకపోయింది. అటువంటప్పుడు, టీ-కాంగ్రెస్ నేతలు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు పోలవరం అంశంపై తెరాస నేతల వ్యూహాలను గుడ్డిగా అనుకరిస్తే వారే నవ్వులపాలవడం ఖాయం.

మేకపాటికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నాయకత్వం

  వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నెల్లూరు ఎంపి, జగన్‌కి మొదటి నుంచీ అండగా వున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ‘ఎంపి’కయ్యారు. పార్లమెంట్‌లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అరకు ఎంపి కొత్తపల్లి గీత, కార్యదర్శిగా ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా కర్నూలు ఎంపి బుట్టారేణుక, విప్‌గా ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. వీరి పేర్లను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శనివారం పార్టీ సమావేశం జరిగిన అనంతరం పార్లమెంటులో వైసీపీని ముందుకు నడిపించే నాయకుల పేర్లతోపాటు తెలంగాణ అసెంబ్లీలో వైసీపీ వాణి వినిపించే నాయకుల పేర్లను కూడా ప్రకటించారు. అలాగే మరికొన్ని బాధ్యతలు ఎవరెవరికి అప్పగించిందీ ప్రకటించారు. పార్టీ అధికార జాతీయ ప్రతినిధులుగా తిరుపతి ఎంపి వి వరప్రసాదరావు, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపి పివి మిథున్ రెడ్డిని నియమించారు. తెలంగాణ అసెంబ్లీ వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష నేతగా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఉప నేతగా పాయం వెంకటేశ్వర్లు, విప్‌గా మదనలాల్ నాయక్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అంశాల వారీగా తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శించడం తమ పనికాదని, ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తే ఆహ్వానిస్తామన్నారు. ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు.

హైకోర్టు పేరు మార్పు

  జూన్ రెండవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడుతున్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో హైకోర్టు ఏర్పాటు అయ్యేవరకు, రెండు రాష్ట్రాలకు ప్రస్తుత హైకోర్టే ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుంది. అయితే ఈ మార్పుకు అనుగుణంగా ‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు’ అనే పేరును మార్చి హైకోర్టు ఆఫ్ జూడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణా అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంద్రప్రదేశ్’ గా మారుస్తూ హైకోర్టు రిజిస్త్రార్ జనరల్ నిన్న సాయంత్రం ఆదేశాలు జారీ చేసారు. ఇకపై హైకోర్టు పేరు క్లుప్తంగా ‘హైకోర్టు ఆఫ్ హైదరాబాద్’ అని చెప్పుకోవచ్చును. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్య నాయుడు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే వైజాగ్ లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బహుశః దానినే ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్విత హైకోర్టుగా మార్చే అవకాశం ఉంది. అంటే రాజధాని గుంటూరు విజయవాడ మధ్య ఏర్పడితే, హైకోర్టు వైజాగ్ లో ఏర్పడబోతోందన్నమాట.

జూన్ 2నే సీఎంగా కేసిఆర్, గవర్నర్‌గా నరసింహన్

      జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తానని నరసింహన్ తెలిపారు. అదే రోజు ఉదయం 8.15 గంటలకు తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. జూన్ 2న తెలంగాణలో రాష్ట్రపతి పాలన ముగుస్తుందని పేర్కొన్నారు. ఏపీలో జూన్ 8 వరకు రాష్ట్రపతి పాలన ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సీఎంలు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ర్టాలు సమానంగా అభివద్ధి చెందుతాయని ఆశిస్తున్నానని చెప్పారు. విద్యుత్ పంపిణీపై ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరగాలన్నారు. తెలంగాణకు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తగిన జలవనరులు ఉన్నందున అక్కడ వినియోగం తక్కువగా ఉంటుందని చెప్పారు. వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయింపు ఉంటుందన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్రమోడీకి అన్ని వివరించాను.. అన్నీ సావధానంగా విన్నారని తెలిపారు. నాలుగేళ్ల పాటు ఎలాంటి బుల్లెట్ వాడకుండా శాంతిభద్రతలు కాపాడామని పేర్కొన్నారు.

ఏపి కొత్త రాజధానిగా విజయవాడ-గుంటూరే..!

      ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తమ పార్టీ నేతలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంగా విజయవాడ-గుంటూరు మధ్యన ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎంపిక చేసుకున్నారు. రాజధాని ఏర్పాటు పనులను ఇక్కడ్నుంచే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెంకయ్య నాయుడు కూడా హైదరాబాద్-సికింద్రాబాద్ లగా విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు కూడా. దేశంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ కన్నా విజయవాడ- గుంటూరు- తెనాలి- మంగళగిరి విస్తీర్ణం అతి పెద్దది. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ విస్తీర్ణం 6300 చదరపు కిలోమీటర్లు కాగా, విజిటిఎం విస్తీర్ణం 7068 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో అనుకున్న మాదిరిగా నగరాల్లో కాకుండా పట్టణాల్లోనే రాజధాని నిర్మించాలని భావిస్తే విజిటిఎం పరిధిలో ఉన్న నాలుగు మున్సిపాల్టీల్లో మంగళగిరి లేదా నూజివీడు మున్సిపాల్టీలను ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. చంద్రబాబు ఈ ప్రాంతాల్లోని రైలు, రోడ్డు, విమాన మార్గాలకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తున్నారట. మరోవైపు గుంటూరు...విజయవాడల్లోనే రాజధాని అనే ప్రచారం నేపథ్యంలో భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి.