త్వరలో పార్లమెంటు సమావేశాలు
posted on May 29, 2014 7:20AM
నిన్న జరుగవలసిన కేంద్రమంత్రి వర్గం సమావేశం ఈరోజు జరుగబోతోంది. మొదటి సమావేశంలోనే నల్లదనం వెలికి తీతకు సుప్రీంకోర్టు రిటర్డ్ జడ్జ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకొన్న మోడీ క్యాబినెట్, ఈరోజు సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు జరిగే సమావేశంలో లోక్ సభకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లు ఎంపిక, పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
స్పీకర్ పదవికి మాజీ కేంద్రమంత్రి సుమిత్రా మహాజన్ పేరు బీజేపీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించే అవకాశం ఉంది. మొదటి విడతలో జూన్ 4 నుండి మూడు రోజులు సమావేశాలు నిర్వహించ వచ్చును. తరువాత మళ్ళీ కొన్ని రోజుల వ్యవధి తరువాత రెండో విడతలో వారం-పది రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. మొదటి రెండు రోజుల సమావేశాలలో కొత్తగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారం, మూడో రోజు ఉభయసభలను ఉద్దేశ్యించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. రెండో విడత సమావేశాలలో సాధారణ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చును. పార్లమెంటు సమావేశ తేదీలు ఈరోజు జరిగే మోడీ మంత్రివర్గ సమావేశంలో ఖరారు కావచ్చును.