వైకాపా ఓటమికి జగనే కారణమా?
ఈరోజు ఇడుపులపాయలో సమావేశమయిన వైకాపా యం.యల్యే.లు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డినే శాసనసభ పక్షం అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఆ తరువాత ఆయన జిల్లాల వారిగా పార్టీ ఓటమికి కారణాలను సమీక్షించబోతున్నారు. అయితే ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దమేల?అన్నట్లు కంటికెదురుగా కనబడుతున్నకారణాల కోసం లోతుగా అధ్యయనం చేయవలసిన పనేమీ లేదు. ఈ ఎన్నికలలో వైకాపా పరాజయానికి ప్రధాన కారణాలు ఏమిటంటే:
1. ప్రజలు వద్దనుకొంటున్న కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగి ఉండటం. ఆయనకు ఓటేస్తే వారు వద్దనుకొంటున్న కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కనుకనే వైకాపా కూడా తిరస్కరణకు గురయింది. కాంగ్రెస్ పార్టీతో ఆయనకు రహస్య అవగాహన ఉందని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెపుతున్నప్పటికీ ఆయన దానిని ఖండించకపోగా, ఎన్నికల తరువాత సీమాంధ్రకు సహకరించే పార్టీకే మద్దతు ఇస్తానని ప్రగల్భాలు పలకడంతో, ప్రజలలో ఆయనపట్ల ఉన్న అనుమానాలు మరింత పెరిగాయి.
2. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసులు, అవినీతి ఆరోపణలు. అనుభవరాహిత్యం. దుందుడుకు స్వభావం.
3. గత ఐదేళ్ళ కాలంలో గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకొనే అవకాశం ఉన్నపటికీ, దానిని విస్మరించి, తండ్రి మరణం తాలూకు సానుభూతినే నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళడం. గత ఐదేళ్ళుగా ప్రజలలో ఆ సానుభూతిని నిలిపి ఉంచుకోనేందుకు ఓదార్పు యాత్రలు చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో ఆ సానుభూతిని ఓట్లుగా మారకపోవడం.
4. అన్ని విషయాలలో ఎప్పుడు చాలా చురుకుగా కదిలే జగన్మోహన్ రెడ్డి, విజయావకాశాలున్న బీజేపీని మతతత్వ పార్టీ అని, నరేంద్ర మోడీతో చేతులు కలిపితే మైనార్టీ ఓట్లు పోగొట్టుకోవలసి వస్తుందని వెనుకంజ వేయడం.
5. రాష్ట్ర విభజన జరుగుతున్నపుడు, సీమాంద్రాలో తన పార్టీని బలోపేతం చేసుకొంటూ, తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు భూటకపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడం.
6. నీతి, నిజాయితీ, విశ్వసనీయతలకు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే జగన్ మోహన్ రెడ్డిలో సరిగ్గా అవే లోపించడం కూడా ప్రజలు ఆయన మాటలను విశ్వసించనీయకుండా చేసాయి.
7. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ప్రభావం, చంద్రబాబు, మోడీల సమర్ధత వంటవనేకం వైకాపా ఓటమికి కారణమయ్యాయి.
అయితే వాటన్నిటికంటే జగన్ స్వయంకృతాపరాధాలే ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చును. అందువల్ల పార్టీని సంస్కరించే ముందు, జగన్మోహన్ రెడ్డి ముందు తనలో లోపాలను సవరించుకోగలిగితే పార్టీకి చాలా మేలు చేకూరే అవకాశం ఉంది. గత ఐదేళ్ళలో కేవలం ఓదార్పు యాత్రలు చేసుకొంటూ కాలక్షేపం చేసారు. ఈ ఎన్నికలలోనే ఆయన ఓదార్పు ఓట్లు రాల్చలేక పోయింది, అటువంటప్పుడు వచ్చే ఎన్నికలనాటికి ప్రజలలో ఈపాటి సానుభూతి కూడా మిగిలే అవకాశం ఉండదు కనుక ఇప్పుడయినా మేల్కొని పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేయడం మంచిది.