స్వర్గీయ యన్టీఆర్ కి కుటుంబ సభ్యుల ఘన నివాళి
posted on May 28, 2014 @ 9:36AM
ఈరోజు స్వర్గీయ యన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఆయనకు నివాళి అర్పించేందుకు హైదరాబాద్ లో యన్టీఆర్ ఘాట్ కు తరలివస్తున్నారు. హరికృష్ణ, ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, జూ.యన్టీఆర్ లతో కలిసి వచ్చి స్వర్గీయ యన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ యన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం వారి సంక్షేమం కోసం పోరాడారని, అందువల్ల తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో కలిసి మెలిసి జీవించాలని, అభివృద్ధి సాధించాలని, అదే వారు స్వర్గీయ యన్టీఆర్ కి ఇచ్చే ఘన నివాళి అవుతుందని అన్నారు.
హరికృష్ణ కుమారుడు జూ.యన్టీఆర్ మాట్లాడుతూ, ఆ మహానుభావుడు స్వర్గీయ యన్టీఆర్ మళ్ళీ మరొకసారి తెలుగునేలపై పుట్టి, తెలుగునేలను పావనం చేయాలని కోరుకొంటున్నాని అన్నారు.
స్వర్గీయ యన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి, ఆయన కుమార్తె పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి తదితరులు యన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. మరికొద్ది సేపటిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు వచ్చి స్వర్గీయ యన్టీఆర్ కు నివాళులు అర్పించిన తరువాత అక్కడి నుండి నేరుగా గండిపేటలో జరుగుతున్న మహానాడు సమావేశానికి వెళతారు.