కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి తెలంగాణలో ఇద్దరు రైతుల బలి!
posted on Jun 7, 2014 6:38AM
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరు రైతులను బలి తీసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన ఒక రైతు పరిస్థితి విషమంగా వుంది. ఏ రైతుల అండతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో అదే రైతులను తన వైఖరి ద్వారా బలి తీసుకోవడం విషాదం. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. టీఆర్ఎస్ అధినేత పలు సందర్భాలలో ఈ విషయాన్ని ప్రకటించారు. రుణమాఫీ చేస్తే తమ కష్టాలు తీరిపోతాయని భావించిన రైతులు టీఆర్ఎస్‌కి ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మాట మార్చింది. రుణ మాఫీ విషయంలో రకరకాల మెలికలు పెట్టింది. దాంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఖిన్నులయ్యారు. తాము నమ్మిన టీఆర్ఎస్ తమను దారుణంగా మోసం చేస్తూ వుండటంతో తట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఆగ్రహంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ వుండగా, కొంతమంది సున్నిత మనస్కులు ప్రాణాలే కోల్పోయారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో ఒక రైతు కేసీఆర్ వైఖరి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కి చెందిన రైతుబిడ్డ దత్తాత్రేయ (55) తాను బ్యాంకులో చేసిన రుణం తీరే అవకాశాలు కనిపించకపోవడంతో దిగులు చెందాడు. టీవీలో రుణమాఫీ విషయంలో టీఆర్ఎస్ అభ్యంతరాలకు సంబంధించిన వార్త చూస్తూ గుండెపోటుతో మరణించారు. అలాగే కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నూనె స్వామిరెడ్డి (50) కూడా తన అప్పు తీరదేమో, తనకు రుణమాఫీ వర్తించదేమోనన్న బెంగతో గుండెపోటుతో కన్నుమూశారు. అలాగే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రైతు రుణమాఫీ అవదమోనన్న బెంగతో పురుగుల మందు తాగారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా వుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారం తిరగకుండానే ఇన్ని ఘోరాలకు కారణమైంది. ఇక భవిష్యత్తు ఎలా వుంటుందో ఊహించడానికే భయమేస్తోంది.