కేసీఆర్ కు మద్దతు, చంద్రబాబుతో యుద్ధం?
posted on Jun 7, 2014 @ 3:52PM
ఎన్నికలలో ఓడిపోయిన తరువాత చల్లబడిపోయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి క్రమంగా ఆ షాకు నుండి తేరుకొని పార్టీ సమీక్షా సమావేశాల పేరిట ఓదార్పు కార్యక్రమం నిర్వహించిన తరువాత, తమ ఓటమికి కారణం ఏమిటో ఆయనే ప్రకటించేశారు. చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని భూటకపు హామీలు ఇవ్వడం వలననే ప్రజలు ఆయనను నమ్మిఓటేసారని, కానీ తను మాత్రం ఆచరణ సాధ్యం కాని అటువంటి హామీలు ఇవ్వనందుకే ఓడిపోయానని తను కనుగొన్న గొప్ప సత్యాన్ని తన పార్టీ నేతలందరికీ తెలిజేసారు.
తను అధికారం కోసం రాజకీయాలలోకి రాలేదని ప్రజల కిచ్చిన మాట కోసమే వచ్చేనని, అందువల్ల తను అధికారం కంటే విస్వసనీయతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారం దక్కించుకోవడం కోసమే అనేక భూటకపు హామీలు ఇచ్చేరని, ఇప్పుడు తన మెడకు గుదిబండలా చుట్టుకొన్నవాటి నుండి ఏవిధంగా బయటపడాలా? అని ఆలోచిస్తున్నారని జగన్ ఎద్దేవా చేసారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున ఆయన ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తానని ప్రకటించారు.
జగన్మోహన్ రెడ్డి పార్టీ సమీక్షా సమావేశాలు పెట్టుకోవడం వెనుక ముఖ్యోదేశ్యం ఎన్నికలలో పార్టీ ఓటమికి గల కారణాలను కనుగొని, లోపాలను సవరించుకోవడం. అయితే ఆయన ఆ పనిచేయకపోగా తన ఓటమికి చంద్రబాబు భూటకపు హామీలు చేయడమే కారణమని వాపోవడం విడ్డూరం. చంద్రబాబు ప్రభుత్వం ఇంకా అధికారం చేప్పట్టనేలేదు. ఆయన హామీలను అమలు చేస్తారో లేదో? చేస్తే ఏవిధంగా అమలు చేస్తారో? ఎవరికీ తెలియదు. కానీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి అవన్నీ భూటకపు హామీలని తేల్చి చెప్పేస్తున్నారు.
అసలు చంద్రబాబు రైతుల, డ్వాక్రా సంఘాల రుణమాఫీలు చేయడంలో విఫలమవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుకొంటున్నారు? అని ఆలోచిస్తే ఆయన విఫలమయితే ప్రభుత్వంపై యుద్ధం చేసి, మళ్ళీ ప్రజలలో మంచిపేరు సంపాదించుకోవాలనే ఆరాటమేనని చెప్పవచ్చును.
గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పుయాత్రలు, షర్మిలమ్మ పాదయాత్రలు, ఒట్టొట్టి సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఐదురోజుల ఆమరణ నిరాహార దీక్షలు అన్నీ కూడా అధికారం కోసమేనని అందరికీ తెలుసు. చివరికి తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణంతో ప్రజలలో ఏర్పడిన సానుభూతిని, ఆయన చేపట్టిన సంక్షేమ పధకాలను కూడా తను అధికారం సంపాదించుకోనేందుకు పెట్టుబడిగానే వాడుకొన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. తండ్రి చనిపోయిన తరువాత ఆయనకు అంత్యక్రియలు జరుగకముందే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిపోదామని సంతకాల సేకరణ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే స్వంతం. ఇంత అధికార దాహం కల వ్యక్తి తాను కేవలం ప్రజలకు ఇచ్చిన మాట కోసమే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
చంద్రబాబు భూటకపు వాగ్దానాలు చేసారని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, తను కూడా అనేక ఆచరణ సాధ్యం కానీ వాగ్దానాలు చేసిన సంగతి మరిచిపోయారు. నిజానికి అన్ని సర్వేనివేదికలు వైకాపాయే పూర్తి మెజార్టీతో గెలుస్తుందని బల్ల గుద్ది చెప్పడం వలన, గెలుపుపై ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రుణాలమాఫీ చేస్తానని హామీ ఇవ్వలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి తన గెలుపుపై ఏమాత్రం అనుమానం ఉన్నా, పాత రుణాలే కాదు వచ్చే ఐదేళ్ళలో రైతులు తీసుకోబోయే అన్ని రుణాలను కూడా మాఫీ చేస్తానని ప్రకటించేవారేమో?
తెలంగాణలో అధికారం చేప్పట్టిన కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు వెనుకంజ వేస్తుంటే నోరుపెగలని, జగన్మోహన్ రెడ్డి, ఇంకా అధికారం చెప్పట్టని చంద్రబాబు ప్రభుత్వం రుణాలమాఫీపై యుద్దానికి సిద్దం అనడం మరో విశేషం. రాష్ట్ర విభజనకు కారణమయిన కేసీఆర్ నోరు తెరచి అడగకముందే ఆయన ప్రభుత్వానికి అంశాల వారిగా మద్దతు ఇస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వంపై మాత్రం అప్పుడే యుద్ధం ప్రకటించేయడం మరో విశేషం.
చంద్రబాబు భూటకపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని జగన్ అనడం చూస్తే, ప్రజలు గొర్రెలు వారికి ఆలోచించే జ్ఞానం లేదు అందుకే చంద్రబాబుని గుడ్డిగా నమ్మి ఓటేసేసారని అభిప్రాయపడుతున్నట్లు ఉంది. ఆయన ఆవిధంగా మాట్లాడటం ప్రజల పట్ల ఆయనకు ఎంతటి చులకన భావం ఉందో తెలియజేస్తోంది.
నిజానికి ప్రజలు చంద్రబాబు హామీల కంటే ఆయన పరిపాలనా సామర్ద్యం, అనుభవం, కార్యదక్షత, కేంద్రంతో ఆయనకున్న సత్సంబంధాలు వంటి అంశాల కారణంగానే ఎన్నుకొన్నారు. పరిపాలనానుభావం ఉన్న ఆయనయితేనే రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలరని నమ్మకంతోనే ఓటేసే గెలిపించారు. కానీ వైకాప ఓటమికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమని చెప్పవచ్చును. అక్రమ సంపాదన, సీబీఐ చార్జ్ షీట్లు, కోర్టులు, కేసులు, బెయిళ్ళు, జైలు జీవితం, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీతో, ఆంద్ర ప్రజలను ఘోరంగా అవమానిస్తున్నకేసీఆర్ తో రహస్య సంబందాలు, ఇంకా మున్ముందు కోర్టు కేసులు.. ఇటువంటి గొప్ప ట్రాక్ రికార్డ్ కలిగిన అతని వలననే వైకాపా ఓడిపోయిందని చెప్పక తప్పదు. కానీ ఆవిషయం మరుగునపరచి చంద్రబాబుని తప్పు పట్టడం అవివేకం. అధికార దాహంతో అలమటిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికయినా నిజాయితీగా వ్యవహరించగలిగితే, ప్రజలలో వచ్చే ఎన్నికల నాటికయినా ప్రజలలో ఆయన పట్ల ‘విశ్వసనీయత’ ఏర్పడే అవకాశం ఉంటుంది.