ప్రధాని, రాష్ట్రపతిలను కలవనున్నకేసీఆర్
posted on Jun 7, 2014 7:12AM
తెలంగాణా ముఖ్యమత్రి హోదాలో కెసిఆర్ ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలవబోతున్నారు. మొదట ఆయన ప్రధాని మోడీని సాయంత్రం 4.15 గం.లకు కలిసి, తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వవలసినదిగా కోరనున్నారు. దానితో బాటు పోలవరం ముంపు గ్రామాల సమస్య, తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమయిన నిధులు, అనుమతులు, అదనపు విద్యుత్తు కేటాయింపు మరియు పెండింగులో ఉన్న అనేక ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించి, వాటి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరనున్నారు. కేసీఆర్ తన ప్రమాణ స్వీకారానికి కేంద్రమంత్రులెవరినీ ఆహ్వానించనందున, ఇప్పుడు తన ప్రభుత్వం నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. తరువాత సాయంత్రం 6.15 గం.లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. కేసీఆర్ ప్రధానిని కలిసే ముందు కొంతమంది కేంద్రమంత్రులను కలిసి వారితో కూడా తెలంగాణకు సంబంధిన వివిధ అంశాలను చర్చించి, వారి సహకారం కోరనున్నారు. కేసీఆర్ నిన్న సాయంత్రం డిల్లీ చేరుకొన్నారు. మళ్ళీ ఈరోజు రాత్రి హైదరాబాదుకు తిరిగివస్తారు.