అదొక వేస్ట్ కార్యక్రమం...దానికి నేనెందుకు?
posted on Jun 7, 2014 @ 2:23PM
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డితో తనకున్న రాజకీయ విభేదాలను పక్కనబెట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. కారణం అతను ప్రధాన ప్రతిపక్షనాయకుడనే. అప్పుడు చంద్రబాబును అభినందించిన జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“చంద్రబాబు నాయుడు ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని చెపుతూనే దాదాపు ముప్పై కోట్లు ఖర్చు చేసి ఇంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం సబబా? అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉందని చెపుతున్నపుడు ఇంకా అనవసర వృధా ఖర్చులు ఎందుకు చేస్తున్నట్లు? తెదేపా నేతలు కొందరు ఈ కార్యక్రమం కోసం కూడా విరాళాలు సేకరిస్తున్నట్లు నేను విన్నాను. మరి అటువంటప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆర్భాటంగా ఎందుకు చేస్తున్నట్లు? ఇంత భారీగా ప్రజాధనం వృధా చేసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత వృధా చేయాలని నేను కోరుకోవడం లేదు,” అని అన్నారు.
“చంద్రబాబు రుణమాఫీ ఫైలుపై తోలి సంతకం చేసినా దానిని ఆయన ఖచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం నాకు లేదు. ఏవో కుంటి సాకులు చెప్పి తప్పుకోవడం ఖాయం. అదేజరిగితే ప్రజల తరపున వైకాపా ఆయనను తప్పకుండా నిలదీస్తుంది. ఎన్నికల సమయంలో ఆయన అనేక భూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచారు. అందువల్ల ఇప్పుడు ఆయన చేసిన హామీలన్నిటినీ నెరవేర్చేవరకు ఆయన ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉంటాము. ప్రజలు మమ్మల్ని ఆపని చేసేందుకే ప్రతిపక్ష హోదా కల్పించారు. మేము మా బాధ్యత విస్మరించకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము,” అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.