ఆ స్టాంపు ఖరీదు అక్షరాలా 57 కోట్లు!

      బ్రిటీష్ గయానాకి చెందిన అత్యంత అరుదైన స్టాంపు వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయి రికార్డు సృష్టించింది. అక్షరాలా 57 కోట్లకు ఆ స్టాంపు అమ్ముడైంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆ స్టాంపు ఇటీవల జరిగిన వేలంపాటలో ఈ ఘనతను సొంతం చేసుకుంది. మంగళవారం అమెరికాలోని సౌత్ బేలో ఈ వేలం నిర్వహించారు. ఈ స్టాంపు తన అసలు విలువకు కొన్ని కోట్లు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడైంది. ఒక అజ్ఞాత వ్యక్తి ఈ స్టాంపును ఫోన్‌లో వేలంపాట పాడి 57 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఈ స్టాంపు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపుగా గుర్తింపు పొందింది. ఈ స్టాంపు బరువు, ఆకారం కూడా వైవిధ్యంగా వుంటాయి. ఈ స్టాంపును 1956లో జారీ చేశారు.

రోడ్డుప్రమాదం: మాజీమంత్రి బాలరాజుకు గాయాలు

      రోడ్డు ప్రమాదంలో మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఒక వివాహ వేడుకలకు తన సన్నిహితులతో కలసి హాజరైన బాలరాజు తిరిగి వస్తుండగా విశాఖ జిల్లా నాతవరం మండలం ములగపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలరాజు గాయపడ్డారు. మంత్రి బాలరాజుతోపాటు విశాఖ డీసీసీ అధ్యక్షుడు పి.సతీష్ వర్మ, బాలరాజు సహాయకుడు ఒకరు కూడా గాయపడ్డట్టు సమాచారం. గాయపడిన ముగ్గురినీ నర్సీపట్నంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాలరాజుకు ముఖం మీద స్వల్ప గాయాలయ్యాయని, సహాయకుడి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గురువారం తెల్లవారుఝామున కారులో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా కారు అదుపు తప్పి ఒక చెట్టుకు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు... ప్రోటెం స్పీకర్ గా పతివాడ ప్రమాణం

      ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రోటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్ భవన్ లో పతివాడ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఈ మధ్యాహ్నం 11.52 గంటలకు ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణ స్వామి నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపి సభ వాయిదా పడనుంది. 20వ తేదీన స్పీకర్ ఎన్నిక, 21న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. సభ తిరిగి 23న ప్రారంభమవుతుంది. ఆరోజుగవర్నర్ ప్రసంగానికి సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తారు. చివరి రోజైన 24వ తేదీన సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. 21 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

జగన్ కేసుల నుండి రత్నప్రభకు విముక్తి

  జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా చేర్చబడ్డ ఐఏయస్ అధికారి రత్నప్రభను ఆ కేసుల నుండి హైకోర్టు విముక్తి ప్రసాదించింది. ఆమె స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐటీ మరియు రెవెన్యూ శాఖల ప్రధాన కార్యదర్శిగా చేసినప్పుడు, రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందు టెక్ ప్రాజెక్టు అనే సంస్థకు శంషాబాద్ వద్ద 250ఎకరాల స్థలం ధారాదత్తం చేసారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత అందరి మీద సీబీఐ కేసులు నమోదయినప్పుడు రత్నప్రభ పేరును కూడా చార్జ్ షీట్లో ఏడవ ముద్దాయిగా చేర్చారు. కానీ ఆమె తను ప్రభుత్వాధికారిగా ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాను తప్ప, స్వయంగా ఆ నిర్ణయం తీసుకోలేదని, ఆ వ్యవహారంలో తను ఎటువంటి ప్రయోజనమూ పొందలేదని, అందువల్ల తనను ఆ కేసుల నుండి విముక్తి కలిగించాలని ఆమె హైకోర్టులో పిటిషను వేశారు. ఆమె వాదనలో ఎకీభవించిన హైకోర్టు ఆమెను కేసుల నుండి తప్పించవలసిందిగా సీబీఐ కోర్టును ఆదేశించడంతో ఆమె కధ సుఖాంతం అయింది.   జగన్ అక్రమాస్తుల కేసులో ఆమెలాగే చాలా మంది నిజాయితీపరులయిన ఐ.ఏ.యస్.అధికారులు నిందితులుగా పేర్కొనబడ్డారు. బహుశః వారు కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చును. ఈ కేసులలో చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, అన్ని కేసులలో A-1 ముద్దాయిగా పేర్కొనబడ్డ జగన్మోహన్ రెడ్డి, తన విలాసవంతమయిన లోటస్ పాండ్ భవనంలో కూర్చొని రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతూ, ఎన్నికలలో పోటీచేసి శాసనసభకు వెళుతుంటే, రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేసిన అధికారులు ఈవిధంగా కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు.

వియత్నాం వ్యాపారి చెవిలో గుంటూరు మిర్చి

  వియత్నాం దేశానికి చెందిన ఒక వ్యాపారి గుంటూరుకు చెందిన మధు అనే ఒక మిర్చి వ్యాపారిని నమ్మాడు. మంచి మిరపకాయలు పంపించు బ్రదర్ అంటూ ఆన్‌లైన్‌లో 30 లక్షల డబ్బు ట్రాన్స్ ఫర్ చేశాడు. మన గుంటూరు మిర్చి వ్యాపారి అయిన మధు పేరులోనే మధు వున్నవాడు.. మనిషి మాత్రం మిర్చిలాగా మహా ఘాటు. మిర్చిలాంటి కుర్రాడైన మధు ఎంచక్కా వియత్నాం వ్యాపారి చెవిలో మంచి ఘాటైన మిరపకాయ పెట్టాడు. వియత్నాంకి మిర్చి రవాణా చేయకుండా తప్పించుకుని తిరగడం మొదలెట్టాడు. జరిగిన మోసం తెలుసుకున్న వియత్నాం వ్యాపారి మిర్చి నమిలినట్టుగా లబోదిబో అంటూ గుంటూరుకు వచ్చి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాడు. సదరు మధు అనే వ్యాపారి ప్రస్తుతం పరారీలో వున్నాడు. ఈ వ్యాపారి గతంలో చైనా వ్యాపారులకు చెవిలో కూడా మిరపకాయ పెట్టినట్టు సమాచారం.

షర్మిలపై దుష్ప్రచారం చేస్తే ఖబడ్డార్: కేటీఆర్

      వైసీపీ నాయకురాలు షర్మిలపై కొన్ని వెబ్ సైట్లు చెడు ప్రచారం చేసిన విషయం, ఆ ప్రచారాన్ని షర్మిలతోపాటు నటుడు ప్రభాస్ కూడా ఖండించిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడీ అంశం మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిని హెచ్చరించారు. షర్మిల గురించి అసత్య కథనాలు ప్రసారం చేసినా, దుష్ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. షర్మిల షర్మిల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామన్నారు. షర్మిల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే సీపీతో మాట్లాడి స్పందించాలని కోరామన్నారు. సోషల్ మీడియాలో ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తే వారిని శిక్షిస్తామని కేటీఆర్ తెలిపారు.

సుజలాం.. 2 రూపాయలకి 20 లీటర్లు

      తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంతకాలు చేసిన ఐదు ఫైళ్ళలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కూడా ఒకటి. ప్రతి గ్రామానికీ చాలా తక్కువ ధరకి పరిశుభ్రమైన మంచినీటిని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ప్రతి గ్రామంలో రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత తాగునీటి పథకాన్ని చేపట్టిందని, ఈ పథకం ద్వారా ప్రతి పల్లెలో సమృద్ధిగా తాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

పీపీఏలు రద్దు: ఆంధ్రప్రదేశ్‌కి హరీష్ హెచ్చరిక

      తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే పీపీఏలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న వార్తలు రాగానే తెలంగాణ ప్రభుత్వంలో కదలిక మొదలైంది. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ ఒకటి రద్దు చేస్తే తాము చాలా బంద్ చేయాల్సి వస్తుందంటూ స్పష్టంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీపీఏలను రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 600 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. పీపీఏ రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయం హాస్యాస్పదమని, తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ లోటు ఉన్న విషయం తెలిసీ కూడా నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని హరీష్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అమలు జరగనివ్వమని హెచ్చరించారు. ఒప్పందాలన్నీ కొనసాగించాలని పునర్విభజన చట్టంలో ఉందని హరీష్ చెప్పారు. చంద్రబాబు నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒక్క కరెంట్ బంద్ చేస్తే తాము చాలా బంద్ చేయాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.

ఇరాక్‌లో 40 మంది భారతీయుల కిడ్నాప్

      ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధ ప్రభావం అందరూ భయపడుతున్నట్టుగానే ఇండియా మీద కూడాపడింది. ఇరాక్‌లో భారతదేశానికి చెందిన 40 మంది కిడ్నాప్ అయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ బుధవారం నాడు ప్రకటించింది. ఇరాక్‌లోని మెసూల్‌లో వున్న ఉర్ అల్ హూద్ కంపెనీలో పనిచేస్తున్న 40 మంది భవన నిర్మాణ కార్మికులు కిడ్నాప్ అయ్యారని, కిడ్నాప్ అయినవారు ఉత్తర భారతదేశానికి చెందినవారని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. భవన నిర్మాణ కార్మికులను ఎవరు అపహరించారన్న విషయంలో ఇంకా ఎలాంటి సంకేతాలు అందలేదు. అయితే అపహరణకు గురైనవారిని కాపాడటానికి చర్యలు చేపట్టామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే ఇరాక్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన 46 మంది నర్సులు ఇండియాకు వచ్చేయాలని కుంటున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

మసాజ్ కోసమెళ్తే ఎయిడ్స్ వచ్చింది!

  బెంగుళూరులో ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే ఓ యువకుడు ఓరోజు ఇంటర్నెట్‌లో బెంగుళూరులోని ఓ మసాజ్ సెంటర్‌కి చెందిన ప్రకటన చూశాడు. అందమైన యువతులతో ‘సరసమైన’ ధరలకు మసాజ్ చేస్తామనేది ఆ ప్రకటన సారాంశం. సదరు ప్రకటన చూడగానే ఆ కుర్రాడికి ఉత్సాహం వచ్చేసింది. ముందూ వెనుక ఆలోచించకుండా రయ్యిమంటూ మసాజ్ సెంటర్‌కి వెళ్ళాడు. అక్కడ కొంతమంది అమ్మాయిలు అతనికి మసాజ్ చేయడం ప్రారంభించారు. అసలే కుర్రాడు. మసాజ్ చేసేది అందమైన అమ్మాయిలు. దాంతో అతగాడు రెచ్చిపోయాడు. ఆ తర్వాత మసాజ్ సెంటర్ నుంచి సంతోషంగా బయటకి వచ్చాడు. రెండు మూడు నెలల తర్వాత పదేపదే జ్వరం వస్తూ వుండటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో ఆ యువకుడు డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు. డాక్టర్ ‘అన్నిరకాల’ పరీక్షలుచేసి, ఆ యువకుడికి ఎయిడ్స్ వచ్చిందని చెప్పేశాడు. దాంతో గుండె పగిలినంత పని అయిన ఆ యువకుడు తల బాదుకుని ఏడ్చాడు. ఆరోజు మసాజ్ సెంటర్‌లో తాను రెచ్చిపోయి అడ్వాన్స్ అవడం వల్లే తనకి ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చిందని అర్థం చేసుకున్నాడు. తనకు పట్టిన గతి మరెవరికీ పట్టకూడదన్న ఉద్దేశంతో బెంగుళూరు పోలీసు కమిషనర్‌కి అసలు విషయమంతా మెయిల్ చేశాడు. మసాజ్ కేంద్రం వివరాలన్నీ ఇచ్చాడు. దాంతో పోలీసులు సదరు మసాజ్ సెంటర్‌ మీద ఆకస్మిక దాడులు చేసి అక్కడ మసాజ్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న యువతులని, ఆ సెంటర్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఇది బెంగుళూరు నగరంలో తాజాగా జరిగిన విషయం. ఇలాంటి మసాజ్ సెంటర్లు హైదరాబాద్‌లో కూడా బోలెడన్ని వున్నాయి. యువతరం జాగ్రత్తగా వుండాలిమరి..

బెయిల్‌పై బయటికొచ్చిన యశ్వంత్ సిన్హా

  విద్యుత్ అధికారులపై దౌర్జన్యం చేసి నిర్బంధించిన కేసులో ప్రస్తుతం జైలులో వున్న బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హాకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ రెండో తేదీ నుంచి జైలు జీవితం గడుపుతున్న ఆయన ఎట్టకేలకు బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటపడ్డారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం వున్న హజారీబాగ్‌లోని కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. యశ్వంత్ సిన్హా తదితరులు తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం సిన్హాతో పాటు మరికొంతమందికి రిమాండ్ విధించింది. యశ్వంత్ సిన్హా జైలులో వున్నప్పటికీ బీజేపీ నాయకత్వం ఆయన మీద సంపూర్ణ నమ్మకాన్ని ప్రకటించింది. బీజేపీ నాయకులు జైలులో వున్న యశ్వంత్ సిన్హాని తరచూ పలకరిస్తూనే వున్నారు. తాజాగా ఆయన జైలు నుంచి బయటకి రాగానే భారతీయ జనతాపార్టీ జార్ఖండ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని కూడా ప్రకటించింది.

ఉన్మాది కాదు.. చైన్ స్నాచర్!

  తిరుమల నడకదారిలో తంజావూరుకు చెందిన త్యాగరాజన్, లత అనే భార్యాభర్తల మీద దాడి చేసి గొంతులు కోసిన వ్యక్తి ఉన్మాది కాదని.. చెయిన్ స్నాచర్ అని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి మెడలో ఉన్న బంగారు ఆభరణాల కోసమే కోసమే ఆ దాడి జరిగి వుండవచ్చని తాము భావిస్తున్నామని తెలిపారు. దాడి ఎవరు చేసి వుంటారనే పరిశోధనలో భాగంగా తాము పాత నేరస్థుల వివరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా, దాడిలో గాయపడిన భార్యాభర్తలు ప్రస్తుతం తిరుపతిలోని రూయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 72 గంటల పాటు ఇద్దరినీ డాక్టర్లు పరిశీలనలో వుంచిన తర్వాతే వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని వైద్యులు వెల్లడించారు.

పంట రుణాల మాఫీకి రిజర్వ్ బ్యాంక్ సై?

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రుణాల మాఫీపై విదించుకొన్న 45రోజుల గడువులో అప్పుడే 10రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఈ గడ్డు సమస్యను అధిగమించేందుకు దారి దొరకలేదు. వేల కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని, అయినప్పటికీ మాఫీ చేయదలచుకొంటే ప్రభుత్వాలే బ్యాంకులలో నగదు చెల్లించి రుణాలు మాఫీ చేసుకోమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులకు విడివిడిగా లేఖలు వ్రాసారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, కొత్త రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇవ్వగలదేమో కానీ ఈ వ్యవసాయ రుణాల మాఫీకి ఎటువంటి సహాయం చేయలేకపోవచ్చును. కనుక చంద్రబాబే స్వయంగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రాజన్ కు ఫోన్ చేసి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని వివరించి వారిని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి రిజర్వ్ బ్యాంకు కూడా సహకారం అందించాలని కోరినట్లు, అందుకు రాజన్ కూడా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మొదటి నుండి కూడా రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వాలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని, ఈవిధంగా ఉదారంగా అప్పులు మాఫీలు చేసుకొంటూ పోతే ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలుతుందని హెచ్చరిస్తున్నపుడు, చంద్రబాబు అభ్యర్ధనకు సానుకూలంగా స్పందిస్తే నిజంగా అది విశేషమే.

కాంగ్రెస్ ద్రోహి కిరణ్‌కుమార్ ‌రెడ్డి

  ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆ నేరమంతా మోపడానికి ఒక బకరాని వెతికారు. ఆ బకరా పేరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరికివారు కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని చెబుతూ పార్టీ హైకమాండ్ దృష్టిలో తమను తాము ఉత్తములుగా ప్రొజెక్ట్ చేసుకునే పనిలో వున్నారు. తాజాగా ఈ లిస్టులో మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కూడా చేరారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలైన ద్రోహి మాజీ కిరణ్ కుమార్ రెడ్డి. పార్టీలో ఉంటూ కీలక పదవులు అనుభవించిన తర్వాత ఎన్నికల సమయంలో పార్టీని వీడిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచారు’’ అని రామచంద్రయ్య విరుచుకుపడుతున్నారు.

ఉన్మాది దాడిలో దంపతులకు గాయాలు

  తిరుమలలో శ్రీవారి దర్శనానికి నడకదారిలో వెళ్తున్న భక్తుల మీద అక్కగార్ల గుడి సమీపంలో ఓ ఉన్మాది దాడి చేశారు. భక్తులను గాయపరచడానికి ఉన్మాది ప్రయత్నించడంతో భక్తులందరూ చెల్లాచెదురైపోయారు. అయితే తమిళనాడులోని తంజావూరుకు చెందిన త్యాగరాజన్, లత అనే భార్యాభర్తలను పట్టుకున్న ఆ ఉన్మాది తన దగ్గర వున్న కత్తితో వారిద్దరి గొంతులు కోశాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న అశ్విన్ ఆసుపత్రికి తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ ఉన్మాది కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి హఠాన్మరణం

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ పెండ్యాల సంతోష్‌కుమార్ (57) గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు. ఆయన ఒక వారం రోజుల క్రితమే కేసీఆర్ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని నాగోలు ప్రాంతంలో గల అలకాపురి కాలనీలోని ఆయన నివాసంలో గుండెపోటు కారణంగా మంగళవారం అర్ధరాత్రి ఆయన మరణించారు. సంతోష్ కుమార్ స్వస్థలం కరీంనగర్. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు.  కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందిన ఆయన అనేక ప్రభుత్వ సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా వుండే మంచి అవకాశాన్ని పొందిన ఆనందం వారం రోజులు కూడా మిగల్లేదు. సంతోష్ కుమార్ భౌతిక కాయాన్ని పలువురు టీఆర్ఎస్ నాయకులు సందర్శించి సంతాపం, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

యువరాజుకి పెళ్ళే కాలేదు..కానీ ముసలోళ్ళు రెండేసి పెళ్ళిళ్ళా..అవ్వ!

  నిన్న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్త్రుత స్థాయి సమావేశాలలో పార్టీ ఓటమికి కారణాలు కనుగొనడం సంగతి ఎలా ఉన్నప్పటికీ మంచి పసందయిన కబుర్లు సాగాయి. వాటిలో కొన్ని:   ఆనం వివేకానంద రెడ్డి: వయసులో ఉన్న కుర్రోడు (రాహుల్ గాంధీ) పెళ్లి చేసుకోకుండా పార్టీ కష్టపడుతుంటే ముసలోళ్ళకి (దిగ్విజయ్ సింగ్) రెండేసి మూడేసి పెళ్ళిళ్ళా..అవ్వ!   రాష్ట్ర విభజన చేస్తే చేయనీయమని సీమాంధ్ర ప్రజలు అనుకొన్నారు. కానీ మన పార్టీ విభజన చేసిన తీరే చాలా అన్యాయంగా ఉంది. అందుకే ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని చాలా కసితో పగబట్టినట్లుగా ఓడించారు.   డిల్లీ నుండి డక్కీ రాజాలు డక్కా రాజాలు ఇక్కడకు వచ్చి వాలిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వారికి మన బాష తెలియదు. మన సంస్క్ర్తుతి గురించి తెలియదు. మన భావోద్వేగాల గురించి తెలియదు. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడేయడంతో ఇక్కడ ప్రజలలో టెంపరేచర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారి కారణంగానే మనకి ఒక్క సీటు కూడా రాకుండా పోయింది.

బ్లూమింగ్‌టన్‌లో తెలుగుదేశం-పసుపుదళం సంబరాలు

      నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని సెంట్రల్ ఇల్లినాయిస్‌లోని బ్లూమింగ్‌టన్ పట్టణంలో బ్లూమింగ్‌టన్ తెలుగుదేశం శాఖ - పసుపుదళం ఆధ్వర్యంలో తెలుగుదేశం విజయోత్సవాలను కన్నుల పండువగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా సుమారు నలభై కార్లతో 15 మైళ్ళ దూరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమ కుటుబం సభ్యులతో కలసి విజయోత్సవ సంబరాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకున్నారు. ఆయన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. మహిళలు పసుపు పచ్చని సంప్రదాయ వస్త్రాలంకరణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది కళాహృదయులు ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాల్లో చెప్పిన డైలాగ్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పెద్దలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎలా అభివృద్ధిలోకి తెచ్చారనే అంశం మీద ప్రసంగించారు. ఈ కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్ యార్లగడ్డ, శ్రీనివాస్ కొసరాజు, కన్నెగంటి కృష్ణ, వెంకట్ లెల్ల, చంద్ర చిట్టిబొమ్మ, వేణు దండ, రాజా వెలగపూడి, శ్రీ గోగినేని, క్రిష్ కిలారు, శివ బూసా, నరసింహారావు అబ్బిన, శ్రీనివాస్ మానం, వెంకట్ లెక్కల, వెంకట్ గోగినేని, సుధీర్ చౌదరి, వంశీకృష్ణ పేపల్ల, రాకేష్ కిలారు, కిరణ్ గుడిపూడి, చైతన్య సోమినేని, నాగరాజు కూరపాటి, శరత్‌బాబు గోడి, రవి వట్టికూటి, హేమంత్ మువ్వ, ఇమ్రాన్ ఖాన్, శ్వేత శింగరి, చక్రవర్తి కొటారు, రామ్ తాళ్ళూరి తదితరులు పాల్గొన్నారు.

హిమాచల్‌ నుంచి తిరిగొచ్చిన నాయిని

      హిమాచల్ ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థులు గల్లంతైన మర్నాటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే వుండి విద్యార్థుల గాలింపు కార్యక్రమాలను పర్యవేక్షించిన తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌‌కి తిరిగి వచ్చేశారు. తాము ఎంత ప్రయత్నించినా విద్యార్థుల జాడ కనుక్కోలేకపోయినందుకు ఆయన తన బాధను వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా విద్యార్థుల జాడ తెలియకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. దాదాపు వారం పాటు నాయిని అక్కడే వుండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నాయినితోపాటు గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తిరిగి హైదరాబాద్‌కి వచ్చారు.