భీమవరం టీడీపీ ఎమ్మెల్యేకి అస్వస్థత

      పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అసెంబ్లీ ఆవరణలో అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరైన ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. ఛాతీలో నొప్పిగా వుందని ఆయన చెప్పడంతో ఆయన్ని హుటాహుటిన బంజారాహిల్స్.లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. పులవర్తి రామాంజనేయులు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు స్వయానా వియ్యంకుడు. గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత, ఆంజనేయులు కుమారుడు వెంకట్‌రామ్ ప్రశాంత్‌ల వివాహం గత ఏడాది డిసెంబర్‌‌లో జరిగింది. ప్రస్తుతం పులవర్తి రామాంజనేయులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్టు తెలుస్తోంది.

ఎ.పి. అసెంబ్లీలో వసతులు లేవు: ఎమ్మెల్యే

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు రోజులపాటు అసెంబ్లీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన సమవేశమందిరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సమావేశమందిరం కేటాయించలేదని ఆయన అన్నారు. అలాగే ఎమ్మెల్యేలకు సరైన వసతులు కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో మంచి అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకుంటామని ఆయన చెప్పారు.

ఆంధ్ర, తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశాలు

      ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని  ప్రముఖ మాజీ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ‌ తెలిపారు. అమెరికాలోని డాలస్ లో  జరిగిన నాట్స్ నిర్వహించిన బిజినెస్ సెమీనార్ కు ముఖ్య అతిధిగా విచ్చేశారు.  నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ విజయ్ వెలమూరి  ఈ సెమీనార్ ను ప్రారంభించారు.. గోపాలకృష్ణ‌  నిర్వహించిన పదవులు.. సాధించిన విజయాలను విజయ్ వెలమూరి గుర్తు చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఏయే పరిశ్రమలు పెట్టవచ్చనే అంశాలపై గోపాలకృష్ణ‌ సెమీనార్ కు విచ్చేసిన వారికి స్పష్టమైన అవగాహన కల్పించారు.  ఒక్కో రాష్ట్రంలో ఏయే ప్రత్యేకతలు ఉన్నాయి..? ఏ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలకు ఢోకా ఉండదనే విషయాలను గోపాలకృష్ణ‌  వివరించారు.   తెలంగాణలో పుష్కలమైన అవకాశాలు పది జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయిన గోపాలకృష్ణ‌ వివరించారు. ముఖ్యంగా ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని సూచించారు. తెలంగాణ జిల్లాల్లో ఖనిజసంపద పుష్కలంగా ఉందని..ఖనిజాధారిత పరిశ్రమలు పెట్టుకుంటే కూడా మంచి లాభాలు వస్తాయన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని గోపాలకృష్ణ‌  చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యుత్ లోటును అధిగమించేందుకు ప్రయివేట్ విద్యుత్ కంపెనీలను  ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని.. వీటిలో ధర్మల్, సోలార్, విండ్ పవర్ లో  పెట్టుబడులు పెట్టవచ్చని గోపాలకృష్ణ‌  సూచించారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని.. కొత్త ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసే అవకాశముందని తెలిపారు. కాబట్టి  మౌలిక సదుపాయాల కల్పన రంగంలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చని గోపాలకృష్ణ‌ చెప్పారు..   ఆంధ్రప్రదేశ్ లో అరుదైన అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుడులు పెట్టేందుకు ఇదే అరుదైన అవకాశమని గోపాలకృష్ణ‌ చెప్పుకొచ్చారు..ఏపీకి ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి పన్నుల రాయితీ వస్తుందని..ఇది కొత్త కంపెనీలకు వరంలాంటిదన్నారు. కేంద్రం పన్నుల్లో ముఖ్యంగా ఎక్సైజ్ డ్యూటీ 16 శాతం మినహాయింపు వల్ల.. ఆ మేరకు కంపెనీలు లాభపడినట్టేనని గోపాలకృష్ణ‌ చెప్పుకొచ్చారు.ఇక కొత్త కంపెనీలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా ఉండే అవకాశముందని ఇది కూడా అరుదైన అవకాశంలాంటిదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహముంటుందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి ప్రత్యేక రాయితీలు ఇస్తుందన్నారు. ఏపీలో కూడా విద్యుత్ ప్రాజెక్ట్ల్ ల్లో పెట్టుబడులు పెరిగే అవకాశముంది. ఈ దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆలోచించవచ్చన్నారు. ఇక ఐటీతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయని తెలిపారు..గుజరాత్ తరహాలో ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్లపైగా ఉన్న కోస్తా తీరాన్ని ఉపయోగించుకుని..  పోర్టుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీని వల్ల ఏపీలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పరిశ్రమల్లో పెట్టుబుడులు పెట్టవచ్చన్నారు.

ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు మృతి

  నల్లమల అడవుల్లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మరొక మావోయిస్టు గాయాలతో పారిపోయాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్లకు సమీపంలోని అడవిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో జానా బాబూరావుతోపాటు మరో ఇద్దరు మహిళలు విమల, భారతి మరణించారు. విక్రమ్ అనే మావోయిస్టు గాయాలతో తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాల క్యాట్‌పార్టీ, ఏఎన్‌ఎస్ పోలీసు బృందాలు పాల్గొన్నాయి. అరగంట సేపు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో మావోయిస్టు సభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటనాస్థలంలో నాలుగుకిట్లుతోపాటు ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక ఏకే 47, విప్లవ సాహిత్యం దొరికాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన జానా బాబూరావు ప్రస్తుత కేంద్రకమిటీ అగ్రజుడైన ఆర్కేకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.

ఎన్.డి.ఎం.ఎ.: శశిధర్‌రెడ్డి ఇంటికి!

  జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తన పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్డీఎంఏ పదవుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో శశిధర్ రెడ్డితోపాటు పాటు ఆ సంస్థకు చెందిన ఐదుగురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. శశిధర్‌రెడ్డితో పాటు ఎన్డీఎంఏ సభ్యులుగా వ్యవహరిస్తున్న సీఐఎస్‌ఎఫ్ మాజీ డెరైక్టర్ జనరల్ కె.ఎం.సింగ్, పౌర విమానయూన శాఖ మాజీ కార్యదర్శి కె.ఎన్.శ్రీవాస్తవ, మేజర్ జనరల్ (రిటైర్డ్) జె.కె.బన్సల్, బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్) మాజీ డెరైక్టర్ బి.భట్టాచార్జీ, సీబీఐ మాజీ ప్రత్యేక డెరైక్టర్ కె.సలీం అలీ రాజీనామాలు చేశారు. 2005లో ఎన్డీఎంఏ సభ్యుడిగా నియమితులైన శశిధర్‌రెడ్డి, 2010 డిసెంబర్‌లో సంస్థ ఉపాధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. రాజీనామా అనంతరం శశిధర్ రెడ్డి స్పందిస్తూ తాను తన పదవికి మంగళవారం నాడే రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయానికి పంపానని, తనను రాజీనామా చేయాల్సిందిగా ఎవరూ ఆదేశించలేదని, తాను స్వచ్ఛందంగా రాజీనామా చేశానని వివరించారు. ఇదిలా వుండగా, గవర్నర్ల వంతు పూర్తయింది. ఎన్డీఎంఏ పని పూర్తయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సంస్థల మీద కూడా దృష్టి సారించింది. జాతీయ మహిళా కమిషన్, ఎస్టీ, ఎస్సీ కమిషన్, భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్)ల అధిపతులు, సభ్యులను సైతం తమ పదవులకు రాజీనామా చేయూల్సిందిగా కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు!

  మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్‌ను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా చర్చించింది. ఢిల్లీలో పరిస్థితులను చూస్తుంటే మహారాష్ట్రలో పృథ్విరాజ్ చౌహాన్ కొంప మునిగినట్టే కనిపిస్తోంది. మహారాష్ట్రలోని కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వానికి ప‌ృథ్విరాజ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈమధ్య జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. పృథ్విరాజ్‌ని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికలలో లో కూడా ఘోరంగా ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పదవినుంచి తొలగించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోడానికి ముగ్గురు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, రెండో వ్యక్తి మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్ తోరట్, మూడో వ్యక్తి మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విఖే పాటిల్. ఈ ముగ్గురిలో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు అయ్యేదీ శుక్రవారం నాడు క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

మొదటి హామీని అమలుచేసిన చంద్రబాబు ప్రభుత్వం

  ఎన్నికలలో తెదేపా గెలిచిన మరుక్షణం నుండి అది ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ముఖ్యంగా తెదేపా ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారిన వ్యవసాయ రుణాలను వెంటనే మాఫీ చేయాలని వైకాపా పట్టుబడుతోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారి కవ్వింపులకి లొంగిపోకుండా ఆచితూచి ముందుకు అడుగులు వేస్తోంది. ఆ ప్రయత్నంలోనే ముందుగా ఆచరణ సాధ్యమయ్యే హామీలను అమలుచేయడం మొదలుపెట్టింది. ఈరోజు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల హామీలలో రెండవదయిన వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువులకు పెన్షన్ల పెంపుని ఆమోదిస్తూ జీ.ఓ. పై చంద్రబాబు సంతకం చేసారు. పెంచిన ఈ పెన్షన్లు వచ్చే నెల నుండి అమలులోకి వస్తాయి. వృద్ధులు మరియు వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్ మంజూరు చేసారు. ఇక వ్యవసాయ రుణాల మాఫీ గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వ్ బ్యాంక్ గవర్నరు రఘురాం రాజన్ తో ఫోన్లో మాట్లాడారు. ఆయన చంద్రబాబు అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కానీ రాష్ట్రాలన్నీ ఆర్ధిక క్రమశిక్షణ పాటించవలసిన అవసరం గురించి పదేపదే నొక్కి చెపుతున్న రిజర్వ్ బ్యాంక్, చంద్రబాబు అభ్యర్ధనను మన్నించుతుందా అనే అనుమానాలున్నాయి. కానీ చంద్రబాబు సమర్ధత, కార్యదక్షత గురించి ఎరిగిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజన్, బహుశః ఆయనకు సహకరించేందుకు అంగీకరించి ఉండవచ్చును లేదా ప్రత్యామ్నాయ మార్గం సూచించి ఉండవచ్చును. అదే నిజమయితే చంద్రబాబు ప్రభుత్వం అతి పెద్ద సమస్యను అధిగమించినట్లే.

స్పీకర్‌గా కోడెల ఏకగ్రీవ ఎన్నిక

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్‌గా కోడెల శివప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ గడువు ముగిసేసరికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ప్రకటన లాంఛనమే. అంతకు ముందు స్పీకర్ పదవి కోసం కోడెల, కాల్వ శ్రీనివాసులు పేర్లను చంద్రబాబు పరిశీలించినట్లు తెలుస్తోంది. బీసీ అభ్యర్థిని స్పీకర్‌గా చేయాలని యోచనలో ఉన్న చంద్రబాబు మొదట కాల్వ శ్రీనివాసులు వైపు మొగ్గు చూపారు. అయితే కాల్వ స్పీకర్ పదవిపై ఆసక్తి చూపలేదని, కొంత ఆలస్యమైనా కేబినెట్‌లో అవకాశం కల్పించాలని చంద్రబాబునాయుడిని కోరడంతో స్పీకర్ పదవికి కోడెల పేరును ఖరారు చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, ఈసారి సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. ఆరుసార్లు గెలిచిన కోడెల ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లోను, చంద్రబాబు క్యాబినెట్ లోను మంత్రిగా పనిచేశారు.

మహారాష్ట్ర సీఎంగా షిండే..చవాన్ అవుట్!

      మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి నుంచి పృధ్విరాజ్ చవాన్ త్వరలో తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పదవిలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకి ఆ బాధ్యలు అప్పగిస్తారని సమాచారం. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రెండే స్థానాలు రావడం, మిగిలిన స్థానాలు బిజెపి,శివసేన కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పృధ్విరాజ్ చవాన్ పనితీరుపై అసంతృప్తిగా వుంది. ఇంకా కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి ని మార్చకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కూడా ఎన్నికల ముందు షిండే కి పగ్గాలు అప్పగించగా, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి కూడా అతనికే పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది.

అసెంబ్లీలో స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్య, రోజా

      సినీ నటులు బాలకృష్ణ, రోజా ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలలో స్పెషల్ అట్రాక్షన్ నిలిచారు. గురువారం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరికీ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిస్తే, చిత్తూరు జిల్లా నగిరి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రోజా పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ జగన్ మొదటిసారి శాసనసభకు విపక్ష హోదాలో హాజరయ్యారు.

శంషాబాద్‌లో 4 కిలోల బంగారం పట్టివేత

      హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నాలుగు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి నుంచిఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేవారు రకరకాల మార్గాల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. పాప్‌కార్న్ యంత్రం, లోదుస్తుల్లో, బ్యాగు హ్యాండిల్, బ్యాగుల డిజైనింగ్ తీగలు, సెల్‌ఫోన్ కవర్‌లు.. ఇలా రకరకాల మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కస్టమ్స్ అధికారుల డేగకళ్ళ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దుబాయి, మలేషియా, బ్యాంకాక్, థాయ్‌లాండ్, సింగపూర్, లండన్, అమెరికా దేశాల నుంచి భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది.

పోలీసు ఉద్యోగ పరుగులో ఐదుగురి మృతి

      పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించే పరుగు పందెం సందర్భంగా అనేకమంది యువకులు ప్రాణాలు కోల్పోతూ వుండటం బాధాకరమైన విషయం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు పరుగు పందెం సందర్భంగా ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బుధవారం నాడు మహారాష్ట్రలో జరిగిన పోలీసు ఉద్యోగాల పరుగు పందెంలో ఐదుగురు యువకులు మరణించడం సంచలనం సృష్టించింది. ముంబైలో జరిగిన పరుగు పందెంలో నలుగురు యువకులు మరణించగా, థానెలో జరిగిన పరుగుపందెంలో ఒకరు మరణించారు. ఈ ఐదుగురూ పరుగు పందంలో పాల్గొంటూ స్పృహ తప్పి పడిపోయి, ఆ తర్వాత ఆస్పత్రుల్లో మరణించారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా పరుగుపందె జరిగే ప్రదేశంలో చాలామంది డాక్టర్లను కూడా వుంచారు. అయినా మరణాలు సంభవించాయి.

హోమీ జె.బాబా ఇల్లు అమ్మేశారు!

      భారత అణు రంగ పితామహుడైన హోమీ జె.బాబాకు చెందిన ముంబయిలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో ఉన్న మూడంతస్థుల సువిశాలమైన బంగళా భారీ ధరకు అమ్ముడైంది. ఈ భవనానికి కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఏ)లో నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి 372 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. దక్షిణ ముంబయిలోని సంపన్నుల నివాసప్రాంతమైన మలబార్ హిల్స్‌లో సముద్రానికి ఎదురుగా ‘మెహరాన్‌గిర్’గా పిలిచే ఈ బంగళా వుంది. జంషెడ్ బాబా వీలునామా ప్రకారం కస్టోడియన్ ఈ బంగళాను విక్రయించింది. అయితే బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్)కు చెందిన కొంతమంది ఉద్యోగులు ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ, ఈ బంగళాను అణు మ్యూజియంగా మార్చాలని కోరుతూ ఇటీవల ముంబయి హైకోర్టుకు వెళ్లడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు పంపించారు. అయితే హైకోర్టు సోమవారం నాడు ఈ వేలంపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, అవసరమైతే వేలాన్ని రద్దు చేస్తామని పేర్కొంటూ కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

చంద్రబాబు, వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం

      నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ మొదటి ముహూర్తాన్ని అనుసరిస్తూ ఉదయం 11.52 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని పాత శాసన సభా భవన మందిరంలో సభ సమావేశం అయ్యింది. సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ పతివాడ నారాయణస్వామి నాయుడు సభా మర్యాదలు సభ్యులకు తెలిపారు.అనంతరం టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.

అటు చంద్రబాబు..ఇటు లోకేష్...

      తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఓకే రోజు తమ కార్యాలయాలో అధికారంగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో పూజలు నిర్వహించి అధికారంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విశాఖలో జరిగిన తొలి క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై బాబు తొలి సంతకం చేశారు. మరోవైపు ఆయన తనయుడు నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. కార్యకర్తల నిధికి రూ.14 కోట్ల విరాళం వచ్చిందని, పార్టీ నుంచి రూ.6 కోట్లు కేటాయించి రూ.20 కోట్ల నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. సంక్షేమ నిధి వరకే తన బాధ్యత అని మిగిలిన పార్టీ వ్యవహారాలు సీఎం చంద్రబాబే చూసుకుంటారని లోకేష్ చెప్పారు. ప్రతిరోజు ఓపెన్ హౌస్ పేరుతో ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యకర్తలను కలుసుకుంటామని ఆయన తెలియజేశారు.

మేం ఇరాక్‌లోనే వుంటాం: కేరళ నర్సులు

      ఇరాక్‌లోని టిక్రిట్ నగరంలోని ఓ ఆస్పత్రిలో 46 మంది భారతీయ నర్సులు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ నగరాన్ని తీవ్రవాదులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాంతో కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ నర్సులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే ఆ నర్సులందరూ అక్కడ క్షేమంగా వున్నారని ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇండియాకి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వ సాయం ఏమైనా కావాలంటే ఆ మాటను లిఖితిపూర్వకంగా తెలియజేయాలని నర్సులకు భారత ప్రభుత్వం సూచించింది. అయితే కేరళ నర్సులు మాత్రం మేం ఇరాక్ వదిలి రామని అంటున్నారు. ఇరాక్‌లోనే వుండి ఇక్కడ గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తామని వారి సేవాభావాన్ని చాటారు. అయితే ఇరాక్‌లో తిరుగుబాటు చేసిన తీవ్రవాదులు నర్సుల విషయంలో చాలా మానవతతో వ్యవహరించారని సమాచారం అందుతోంది. ఇరాక్‌లో వున్న నర్సులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వారికి తాము ఎలాంటి హానిని తలపెట్టబోమని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారంతా ఇరాక్‌లోనే వుండి గాయపడిన వారికి సేవలు చేయాలని సూచించారు. అవసరమైన పక్షంలో నర్సులకు తామే జీతాలు ఇస్తామని ప్రకటించారు.