పంట రుణాల మాఫీకి రిజర్వ్ బ్యాంక్ సై?
posted on Jun 18, 2014 @ 12:00PM
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రుణాల మాఫీపై విదించుకొన్న 45రోజుల గడువులో అప్పుడే 10రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఈ గడ్డు సమస్యను అధిగమించేందుకు దారి దొరకలేదు. వేల కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని, అయినప్పటికీ మాఫీ చేయదలచుకొంటే ప్రభుత్వాలే బ్యాంకులలో నగదు చెల్లించి రుణాలు మాఫీ చేసుకోమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులకు విడివిడిగా లేఖలు వ్రాసారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, కొత్త రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇవ్వగలదేమో కానీ ఈ వ్యవసాయ రుణాల మాఫీకి ఎటువంటి సహాయం చేయలేకపోవచ్చును. కనుక చంద్రబాబే స్వయంగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రాజన్ కు ఫోన్ చేసి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని వివరించి వారిని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి రిజర్వ్ బ్యాంకు కూడా సహకారం అందించాలని కోరినట్లు, అందుకు రాజన్ కూడా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మొదటి నుండి కూడా రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వాలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని, ఈవిధంగా ఉదారంగా అప్పులు మాఫీలు చేసుకొంటూ పోతే ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలుతుందని హెచ్చరిస్తున్నపుడు, చంద్రబాబు అభ్యర్ధనకు సానుకూలంగా స్పందిస్తే నిజంగా అది విశేషమే.