Read more!

పీపీఏలు రద్దు: ఆంధ్రప్రదేశ్‌కి హరీష్ హెచ్చరిక

 

 

 

తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే పీపీఏలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న వార్తలు రాగానే తెలంగాణ ప్రభుత్వంలో కదలిక మొదలైంది. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ ఒకటి రద్దు చేస్తే తాము చాలా బంద్ చేయాల్సి వస్తుందంటూ స్పష్టంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీపీఏలను రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 600 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. పీపీఏ రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయం హాస్యాస్పదమని, తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ లోటు ఉన్న విషయం తెలిసీ కూడా నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని హరీష్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అమలు జరగనివ్వమని హెచ్చరించారు. ఒప్పందాలన్నీ కొనసాగించాలని పునర్విభజన చట్టంలో ఉందని హరీష్ చెప్పారు. చంద్రబాబు నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒక్క కరెంట్ బంద్ చేస్తే తాము చాలా బంద్ చేయాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.