Read more!

బెయిల్‌పై బయటికొచ్చిన యశ్వంత్ సిన్హా

 

విద్యుత్ అధికారులపై దౌర్జన్యం చేసి నిర్బంధించిన కేసులో ప్రస్తుతం జైలులో వున్న బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హాకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ రెండో తేదీ నుంచి జైలు జీవితం గడుపుతున్న ఆయన ఎట్టకేలకు బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటపడ్డారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం వున్న హజారీబాగ్‌లోని కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. యశ్వంత్ సిన్హా తదితరులు తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం సిన్హాతో పాటు మరికొంతమందికి రిమాండ్ విధించింది. యశ్వంత్ సిన్హా జైలులో వున్నప్పటికీ బీజేపీ నాయకత్వం ఆయన మీద సంపూర్ణ నమ్మకాన్ని ప్రకటించింది. బీజేపీ నాయకులు జైలులో వున్న యశ్వంత్ సిన్హాని తరచూ పలకరిస్తూనే వున్నారు. తాజాగా ఆయన జైలు నుంచి బయటకి రాగానే భారతీయ జనతాపార్టీ జార్ఖండ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని కూడా ప్రకటించింది.