పోలవరం, రైల్వేజోను ఈ సమావేశాలలోనే ఆమోదం

  కేంద్రపట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం. వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, జూలై 7 నుండి మొదలయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వేజోను మంజూరు, పోలవరం ప్రాజెక్టుకి తప్పకుండా ఆమోదిస్తామని తెలిపారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ప్రకటించి చాలా కాలమయినప్పటికీ, ఇంతవరకు ప్రత్యేకహోదా మంజూరు కాలేదు. దీనివలన రాష్ట్రానికి రావలసిన అనేక పరిశ్రమలు తెలంగాణా మరియు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే తెలంగాణకు తరలిపోయిన హీరో మోటార్ సైకిళ్ళు తయారీ సంస్థ బహుశః ఆంధ్రాకే మొగ్గు చూపి ఉండేదేమో! అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఇకనయినా ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి వీలయినంత త్వరగా సాధించవలసి ఉంది. పోలవరం, రైల్వే జోను మంజూరు మంచి విషయమే అయినా, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కూడా చాలా అవసరం. వెంకయ్య నాయుడు, ఆంధ్రాకు చెందిన కేంద్రమంత్రులు, యంపీలు అందరూ కూడా ఈ అంశంపై పూర్తి శ్రద్ధ పెట్టడం అత్యవసరం. ఇక ఆర్ధిక లోటును పూడ్చుకోనేందుకు బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు కూడా జరిగేలా జాగ్రత్తపడటం చాలా అవసరం.

చెన్నైలో గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి

  చెన్నైలో కొద్ది రోజుల క్రితం 11 అంతస్తుల భవనం కుప్పకూలి 61 మంది మృతి చెందిన సంఘటన మర్చిపోక ముందే మరో దుర్ఘటన సంభవించింది. శనివారం రాత్రి కురుసిన భారీ వర్షానికి తిరువళ్ళూరు జిల్లా ఉపరపలయం వద్ద గోడౌన్ గోడ కూలి 11 మంది తెలుగు వారు మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఒక శిశువు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 19 సంవత్సరాల నాగరాజ్ అనే యువకుడు శిథిలాల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. వీరంతా ఏపీలోని ఉత్తరాంధ్రకు చెందిన వారు. గోడ కూలిన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్

  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలిచి మళ్ళీ కేంద్రంలో అధికారం దక్కించుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం దక్కకపోగా కనీసం లోక్ సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. గత పదేళ్ళుగా ఇష్టారాజ్యంగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కూడా పోరాడవలసి రావడం దాని దీనస్థితికి అద్దం పడుతోంది. లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 50 ఎంపీ సీట్లు కలిగి ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 మాత్రమే ఉన్నాయి. అందువల్ల యూపీఏ మిత్ర పక్షాలను కూడా కలుపుకొని ఇప్పుడు తమకు 54 ఎంపీ సీట్లు ఉన్నాయి గనుక ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి స్వయంగా లోక్ సభలో తగిన సంఖ్యాబలం లేదు గనుక ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అధికార ఎన్డీయే ప్రభుత్వం అభ్యంతరం చెపుతోంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయంపై బీజేపీ తన అభిప్రాయం చెప్పకుండా దాటవేసింది.   ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ అవసరమయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. కానీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలుగజేసుకోక ముందే ఎన్డీయే ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించవచ్చును. తనను ఇంత కాలంగా ఘోరంగా అవమానిస్తూ, వేధిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాటం నేర్పేందుకే ఎన్డీయే బహుశః తన నిర్ణయం ప్రకటించకుండా కాలయాపన చేస్తుండవచ్చును. ఏమయినప్పట్టికీ రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రి చేద్దామనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం న్యాయపోరాటానికి సిద్దమని చెప్పుకోవడం చాలా నవ్వు కలిగిస్తోంది.

రుణమాఫీపై కేఈ కీలక ప్రకటన

రైతుల రుణమాఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయలేకపోయినా …వారు సంతృప్తి చెందేలా చేస్తామని అన్నారు. తొలి దశలో డెబ్బై ఐదు వేల రూపాయలు, రెండో దశలో మరో డెబ్బై ఐదు వేల చొప్పున రైతులకు రుణాలు మాఫీ అయ్యేలా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీలకు సంబంధించి ప్రభుత్వం మీద రూ.30 వేల కోట్ల వరకు భారం పడుతుంది. అసలే పదిహేను వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ మాత్రం చేయడం గొప్ప విషయమే. రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు దానిని చేసి తీరాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో టిడిపి దూకుడు

  ఆంధ్రప్రదేశ్ జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆపార్టీ 10జడ్పీ ఛైర్మన్లకు దక్కించుకుంది. కడప జడ్పీ ఛైర్మన్ వైఎస్ఆర్ సీపీ దక్కించుకుంది. అయితే చాలా చోట్లు వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ అభ్యర్థులు టీడీపీలోకి జంప్ కావడంతో టీడీపీ ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటోంది. ప్రకాశం జిల్లాలో మాత్రం ఉత్కంఠత కొనసాగుతోంది. ఇక్కడ ఇరు పార్టీలకు 28 అభ్యర్థుల బలం ఉంది. ఈ స్థానం పై ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. జడ్పీ ఛైర్మన్ అభ్యర్ధుల వివరాలు: * చిత్తూరు జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా గీర్వాణి ఎంపికయ్యారు. * అనంతపురం జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పరిటాల రవి అనుచరుడు చమన్‌ను టీడీపీ ఎంపిక చేసింది. * కర్నూలు జెడ్పీ టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్ పేరు ఖరారైంది. * కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా గద్దె అనురాధ ఎంపికయ్యారు. * విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా లాలం భవాని బరిలోకి దిగారు. * పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా ముళ్లపూడి బాపిరాజు పేరు ఖరారైంది. * విజయనగరం జెడ్పీ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా శోభా స్వాతి ఎంపికయ్యారు. * శ్రీకాకుళం జెడ్పీ చైర్ పర్సన్ టీ డీపీ అభ్యర్థిగా ధనలక్ష్మి పేరును ఎంపిక చేశారు. * తూర్పుగోదావరి జెడ్పీ చైర్మన్ నామల రాంబాబును టీడీపీ ఖరారు చేసింది. * ప్రకాశం జెడ్పీ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా మన్నె రవీంధ్ర ఎంపికయ్యారు. * గుంటూరు జెడ్పీ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా షేక్ జానిమూన్ ఎంపికయ్యారు. * కడప జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా గూడూరు రవిని వైసీపీ రంగంలోకి దింపింది.  

పరిటాల అనుచరుడు చమన్ జడ్పీ చైర్మన్ అయ్యారు

  గత పదేళ్లుగా అజ్ఞాతంలో జీవితం గడిపి రాజకీయాలలోకి వచ్చిన టిడిపి నేత చమన్ జిల్లా పరిషత్ ఛైర్మన్ అవుతున్నారు. పరిటాల రవికి ముఖ్య అనుచరుడిగా పేరుపడ్డ ఆయన ..పరిటాల హత్య తరువాత అజ్ఞాతంలోకి వెళ్లారు.ఇప్పుడు ఏకంగా జిల్లాపరిషత్ చైర్మన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒకటి రెండు స్థానాలు మినహా అన్ని జెడ్పీ చైర్మన్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరపున గెలిచిన 9 మంది జెడ్పీటీసీలు టీడీపీ మద్దతు ప్రకటించడంతో నెల్లూరు జెడ్పీ పీఠం కూడా టీడీపీ ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌గా గద్దె అనురాధ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. మచిలీపట్నం జెడ్పీ కార్యాలయంలో అనురాధ ఎన్నిక లాంఛనంగా జరుగనుంది. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనురాధను పలువురు నేతలు, జెడ్పీటీసీ సభ్యులు అభినందించారు.

భారత్ కు చేరుకున్న కేరళ నర్సులు

  ఇరాక్ లో ఉగ్రవాదుల చేతులో చిక్కుకున్న కేరళ నర్సులు సురక్షితంగా ఇండియా చేరుకున్నారు. కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి బయల్దేరిన 46 మంది కేరళ నర్సులు, 137 మంది భారతీయులు ఈ రోజు ఉదయం 9:30 నిమషాలకి ముంబై చేరుకున్నారు. ఇక్కడ నుంచి విమానం ఇంధనం నింపుకుని ఉదయం 11.55 గంటలకు కొచ్చి చేరుకోనుంది. అనంతరం 2.25 గంటలకు హైదరాబాద్, చివరిగా సాయంత్రం 5.50కి ఢిల్లీ చేరుకుంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇరాక్‌ నుండి భారత్ ‌చేరుకున్న నర్సులకు కొచ్చి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వయంగా స్వాగతం పలకనున్నారు. అయితే ఇరాక్ లో భారత విమానం ల్యాండ్ అయ్యేందుకు అధికారులు తొలత అంగీకరించలేదు. చర్చలు, వివరణల తర్వాతే విమానం ల్యాండ్ అయ్యేందుకు వారు అగీకరించారు. ఆఖరికి నర్సులందరూ క్షేమంగా తిరిగి వచ్చారు.

ఫిల్మ్ ఇండస్ట్రీకి కేసిఆర్ షాక్

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కె.చంద్రశేఖర్‌రావు వరుస సంచలన నిర్ణయాలతో రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏపీఎన్జీవోలకు సంబంధించిన 189 ఎకరాల 14 గుంటల భూమిని వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ( ఎపిఎఫ్ డిసి) కు షాక్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల భూమిని వెనుక్కి తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సీసీఎల్‌ఏ ఎస్‌కే సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. 1982లో ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగ అభివృద్ధి నిమిత్తం గతంలోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 40 ఎకరాల భూమిని ఎపిఎఫ్ డిసికి కేటాయించింది. ఇందులో పద్మాలయా స్టూడియో అభివృద్ధి కోసం 9 ఎకరాలు, రామానాయుడి స్టూడియోకు 5 ఎకరాలు, మరికొన్ని స్టూడియోలకు ఇంకొన్ని ఎకరాలను కేటాయించారు. ఇప్పుడు వాటిలో ఏది రద్దు అయిందో తెలియక అందరూ టెన్షన్ పడుతున్నారు.

కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్లు నిలిపివేత

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని గుంటూరు, విజయవాడల మధ్యన ఏర్పడబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలో రియల్టర్లు వాలిపోయారు. రెండు జిల్లాలలో పెద్ద ఎత్తున భూమి లావాదేవీలు నడుస్తున్నాయి. ఇటీవల రాజధాని కోసం వేసిన కమిటీ కూడా గుంటూరు,కృష్ణా మధ్యలో రాజధాని నిర్మాణానికి ఆసక్తి చూపుతుండడంతో రియల్టర్లు భూముల కొనుగోళ్లకోసం వాలిపోయారు. భారీ ఎత్తున భూ కొనుగోళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు కృష్ణా జిల్లాలలో రిజిస్ట్రేషన్లను నిలిపివేయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణానికి భూసేకరణ జరపడానికి ఈ కొనుగోళ్లు ఇబ్బందికరంగా మారుతుందని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ డిమాండ్ కు ..కొనుగోళ్లకు ఏ మాత్రం పొంతన లేకపోవడం కూడా మరో కారణం.

జమ్మలమడుగులో ఉద్రిక్తత..ఎంపి కళ్లలో కారం

  కడప జిల్లాలోని జమ్మలమడుగులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణ కారణంగా నిన్న వాయిదా పడిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఈరోజు  నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో మరోసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం వద్దకు దూసుకు వచ్చి ఎన్నికను ఆపేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులపై భాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ కౌన్సిలర్ జానీని అప్పగించాలి లేదా ఎన్నికను వాయిదా వేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు.  ఈ సంధర్బంగా ఎన్నికతీరును తెలుసుకునేందుకు వెళ్లిన అవినాశ్ రెడ్డిపై టిడిపి కార్యకర్తలు కొందరు ఆయన కళ్లలో కారం చల్లారని వార్తలు వస్తున్నాయి. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.  

అవునూ..కంచె వచ్చింది అప్పుడే.!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయల మధ్య ఏర్పాటు చేసిన ఇనుప కంచె వివాదస్పదమైన విషయం తెలిసిందే. కంచె ఏర్పాటుకు గవర్నర్ పరిపాలనలోనే అనుమతి ఇచ్చారని హరీష్ రావు చెప్పడం, దానిని రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లతో గవర్నర్ నరసింహన్ గారికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. దీనిపై మళ్ళీ హరీష్ రావు వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 26వ తేదీన జీవో 426ఇచ్చారని.. అప్పటికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే ఉందని గమనించాలని వివరించారు. దీనికి సంబంధించిన జి.ఓని హరీష్ రావు విడుదల చేశారు. ఆఖరికి సచివాలయంలో కంచె వేయాలన్న నిర్ణయం చివరికి గవర్నర్ పాలనలోనే జరిగినట్లు తేలింది. అయితే ఆ విషయం బహుశా గవర్నర్ నరసింహన్ దృష్టికి రాకుండానే ఆటోమాటిక్ గా జరిగిపోయి ఉండవచ్చు. ఆ జిఓలోని అంశం ప్రాతిపదికగా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసి ఉండవచ్చు.

సచివాలయంలో పరిస్థితులపై చంద్రబాబు ఆందోళన

  సచివాలయంలో జే బ్లాకులో మంత్రులు, అధికారుల ఛాంబర్లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల వసతి ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. పరిస్థితులు ఎప్పటిలోగా అదుపులోకి వస్తాయే అర్ధం కావట్లేదన్నారు. ఆర్డీవో స్థాయి అధికారికి ఒక బల్ల, నలుగురు ఉద్యోగులను కేటాయించారని తెలిపారు. చాలా ఛాంబర్లకు తాళాలు వేసి ఉండడం అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు చంద్రబాబు ట్యాంక్ బండ్ పైన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బ్రిటీష్ వారి అరాచక పాలనను వ్యతిరేకించి పోరాడిన గొప్ప స్వాతంత్ర్యోద్యమ వీరుడు అల్లూరి అని కొనియాడారు. విశాఖలో అల్లూరి పేరిట ఓ మెమోరియల్ (స్మారకం) ఏర్పాటు చేస్తామని... అందులో అల్లూరికి చెందిన ఫొటోలు, వివరాలు, విషయాలు అన్నీ ఉంటాయన్నారు. అల్లూరి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటామన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో అల్లూరి జయంతిని నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

హరీష్ రావుకి గవర్నర్ షాక్

సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్లాకుల మధ్య ఏర్పాటు చేసిన ఇనుప కంచె మంత్రి హరీశ్ రావు, గవర్నర్ ల మధ్య వివాదంలా మారింది. మొదట ఈ కంచె పై చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్ర, తెలంగాణ ఏమైనా ఇండియా, పాకిస్తాన్ లా? సచివాలయంలో కంచె ఎందుకు అని మండిపడ్డారు. దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ..ఇది తమ సర్కారు పని కాదని.. గవర్నర్ పాలనలోనే వచ్చిందని తెలుసుకోవాలని బాబుకి ఘాటుగా సమాధానమిచ్చారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. హరీష్ రావు వ్యాఖ్యలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లతో గవర్నర్ నరసింహన్ గారికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. రాజ్ భవన్ ప్రకటనపై మరోసారి హరీశ్ రావు స్పందించడంతో వివాదం మరింత ముదిరింది. ఇష్యూ గవర్నర్ వర్సెస్ హరీశ్ రావుగా మారింది. ఏప్రిల్ 26వ తేదీన జీవో 426ఇచ్చారని.. అప్పటికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే ఉందని గమనించాలని వివరించారు.

మునిసిపల్ పదవులతో అధికారం సంపూర్ణం

  రెండు నెలల క్రితం జరిగిన పంచాయితీ, మునిస్పాల్ ఎన్నికలలో విజయ డంకా మోగించిన తెలుగుదేశం పార్టీ, ఈరోజు 90 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ పదవులకు జరిగిన పరోక్ష ఎన్నికలలో ఏకంగా 74 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ పదవులను, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, చిత్తూరు మరియు అనంతపురం మేయర్ పదవులను కైవసం చేసుకొని రాష్ట్రా స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సంపూర్ణాధికారం చేజిక్కించుకొంది. తెదేపా-బీజేపీలు రాష్ట్రంలో, కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉండటం వలన రాష్ట్రానికి ఏవిధంగా పూర్తి ప్రయోజనాలు పొందగలుగుతుందో, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా అధికార పార్టీకే చెందినవారు అధికారంలో ఉండటం వలన కూడా జిల్లాలు పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచుకొన్న పధకాల అమలులో, అదేవిధంగా జిల్లాలకు అవసరమయిన నిధులు మంజూరులో ఎటువంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు సాఫీగా జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.

చంద్రబాబు మీడియా సలహాదారుగా డా. పరకాల

  డా. పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సలహాదారుగా నియుక్తులవుతున్నారు. అందువల్ల ఆయనకు క్యాబినెట్ హోదా కూడా లభిస్తుంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలు సమూలంగా ప్రక్షాళన అవుతాయని భావించి ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ ఎన్నికల సమయానికే పార్టీ పూర్తిగా ఒక వ్యాపార సంస్థలాగా నడుస్తుండటంతో ఆయన పార్టీ నుండి బయటపడ్డారు. ఆ తరువాత చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయినపుడు ఆయన కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఏర్పాటయిన విశాలాంధ్ర సభకు కన్వీనర్ గా బాధ్యతలు చేప్పట్టి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అప్పటి నుండి మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ఆయనకు టికెట్ ఇవ్వజూపినప్పటికీ సున్నితంగా తిరస్కరించారు.   మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ఏకంగా క్యాబినెట్ హోదా గల మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, భవిష్యత్ గురించి స్పష్టమయిన అవగాహన కలిగిన డా.పరకాల వంటి మేధావిని చంద్రబాబు ఈవిధంగా గౌరవించడం హర్షణీయం. డా.పరకాల అర్ధాంగి శ్రీమతి నిర్మల సీతారామన్ ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె ఇటీవలే ఆంధ్రప్రదేశ్ నుండి తెదేపా మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె కూడా రాష్ట్రాభివృద్ధికి యదాశక్తిన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

చంద్రబాబుకు నొప్పెందుకో అన్న హరీష్

  గురుకుల్ ట్రస్టు భూములలో అక్రమ భవనాలు కూల్చివేస్తుంటే చంద్రబాబు నాయుడుకు నొప్పేందుకు అని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అక్రమార్కులు, భూ కబ్జాదారులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కవ్వింపు గా మాట్లాడుతున్నారని, ఆ చర్యలు ఆపితే చంద్రబాబుతో చర్చలకు సిద్దమేనని హరీష్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణకు దక్కకుండా చంద్రబాబు కుట్ర చేశారన్నారు.తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలను తప్పుదోవ పట్టించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఒకవైపు చర్చలు జరుపుతామని చెబుతూనే మరోవైపు పిపిఎల రద్దుకు ఆదేశాలు జారీ చేసి తెలంగాణను చీకటిమయం చేయడానికి ప్రయత్నించలేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు షాక్: టీఆర్ఎస్ లోకి మరో ఎమ్మెల్సీ

  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్సీ టిఆర్ఎస్ లోకి జంప్ చేయడానికి సిద్దమయ్యాడు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని ఈరోజు ప్రకటించారు.నిజామాబాద్ మేయర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఓటు కూడా వేశారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందుతుందని ధీమాను వ్యక్తం చేశారు.టిఆర్ఎస్‌లో చేరి బంగారు తెలంగాణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్మన్ల లిస్ట్

  ఆంధ్రప్రదేశ్‌లో ఏడు నగరపాలక సంస్థలు, 96 మున్సిపాలిటీ సంఘాల పరోక్ష ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల వివరాలు:   నగరపాలక సంస్థల మేయర్లు... అనంతపురం : ఎం.స్వరూప. విజయవాడ : కోనేరు శ్రీధర్‌. రాజమండ్రి : రజనీ శేషసాయి కృష్ణా ... నందిగామ : పద్మావతి, టీడీపీ. తిరువూరు : ఎం.కృష్ణకుమారి,టీడీపీ గుంటూరు ... తెనాలి : కొత్తమాసు తులసీదాసు, టీడీపీ. బాపట్ల : తోట మల్లీశ్వరి, టీడీపీ, రేపల్లె : తాడివా శ్రీనివాసరావు,టీడీపీ. చిలకలూరిపేట : గంజి చెంచుకుమారి, టీడీపీ, పొన్నూరు : సజ్జా హేమలత, టీడీపీ. మంగళగిరి : గంజి చిరంజీవి,టీడీపీ. మాచర్ల : జి. శ్రీదేవి,టీడీపీ. సత్తెనపల్లి : ఎల్లినీడి రామస్వామి,టీడీపీ. పిడుగురాళ్ల : భవనాసి హైమావతి, టీడీపీ. తాడేపల్లి : కొయ్యగూర మహాలక్ష్మి, వైకాపా. ప్రకాశం జిల్లా... గిద్దలూరు : వెంకటసుబ్బమ్మ, వైకాపా. కనిగిరి -చిన్నమస్తాన్‌ -టీడీపీ చీరాలా : మోదుగుల రమేశ్‌ టీడీపీ. పశ్చిమగోదావరి.... నిడదవోలు : బొబ్బా కృష్ణమూర్తి,టీడీపీ. జంగారెడ్డిగూడెం : శివలక్ష్మి,టీడీపీ. నెల్లూరు ... కావాలి : పోటుగంటి అలేఖ్య, టీడీపీ, నాయుడుపేట : ఎం శోభారాణి, టీడీపీ శ్రీకాకుళం .... ఆముదాలవలస : గీత,టీడీపీ. పలాస : పూర్ణచందర్‌రావు,టీడీపీ. పాలకొండ : పల్లా విజయనిర్మల, టీడీపీ, ఇచ్ఛాపురం : రాజ్యలక్ష్మి, వైకాపా. విజయనగరం .... సాలూరు : విజయకుమారి,టీడీపీ. బొబ్బిలి : అచ్యుతపల్లి,టీడీపీ అనంతపురం.... హిందూపురం : లక్ష్మి, టీడీపీ. గుంతకల్‌ : అపర్ణ,టీడీపీ. తాడిపత్రి : వెంకటలక్ష్మి,టీడీపీ, ధర్మవరం : గోపాల్‌,టీడీపీ, గుత్తి : తులసమ్మ, టీడీపీ మడకశిర : ప్రకాశ్‌,టీడీపీ. కల్యాణదుర్గం : రమేశ్‌,టీడీపీ, పుట్టపర్తి : గంగన్న, టీడీపీ. రాయదుర్గం : రాజశేఖర్‌,టీడీపీ. పామిడి : గౌస్‌పీరా, టీడీపీ చిత్తూరు .... పుత్తూరు : కరుణాకర్‌,టీడీపీ. నగరి : శాంతి, వైకాపా. పుంగనూరు : షమీమ్‌, వైకాపా. పలమనేరు : శారద, వైకాపా. కడప .... బద్వేలు : సోమేశుల పార్థసారథి, టీడీపీ. ఎర్రగుంట్ల : ముసలయ్య, వైకాపా. కర్నూలు .... ఆత్మకూర్‌ : నూర్‌ అహ్మద్‌,టీడీపీ. ఎమ్మిగనూరు : సరస్వతి,టీడీపీ. డోన్‌ : గాయత్రి,టీడీపీ. గూడూరు : ఇందిర సుభాషిణి,టీడీపీ, ఆళ్లగడ్డ : ఉషారాణి , వైకాపా.