జమ్మలమడుగులో ఉద్రిక్తత..ఎంపి కళ్లలో కారం
posted on Jul 4, 2014 @ 7:07PM
కడప జిల్లాలోని జమ్మలమడుగులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణ కారణంగా నిన్న వాయిదా పడిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఈరోజు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో మరోసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం వద్దకు దూసుకు వచ్చి ఎన్నికను ఆపేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులపై భాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ కౌన్సిలర్ జానీని అప్పగించాలి లేదా ఎన్నికను వాయిదా వేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా ఎన్నికతీరును తెలుసుకునేందుకు వెళ్లిన అవినాశ్ రెడ్డిపై టిడిపి కార్యకర్తలు కొందరు ఆయన కళ్లలో కారం చల్లారని వార్తలు వస్తున్నాయి. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.