చంద్రబాబు మీడియా సలహాదారుగా డా. పరకాల
posted on Jul 3, 2014 @ 8:34PM
డా. పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సలహాదారుగా నియుక్తులవుతున్నారు. అందువల్ల ఆయనకు క్యాబినెట్ హోదా కూడా లభిస్తుంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలు సమూలంగా ప్రక్షాళన అవుతాయని భావించి ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ ఎన్నికల సమయానికే పార్టీ పూర్తిగా ఒక వ్యాపార సంస్థలాగా నడుస్తుండటంతో ఆయన పార్టీ నుండి బయటపడ్డారు. ఆ తరువాత చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయినపుడు ఆయన కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఏర్పాటయిన విశాలాంధ్ర సభకు కన్వీనర్ గా బాధ్యతలు చేప్పట్టి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అప్పటి నుండి మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ఆయనకు టికెట్ ఇవ్వజూపినప్పటికీ సున్నితంగా తిరస్కరించారు.
మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ఏకంగా క్యాబినెట్ హోదా గల మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, భవిష్యత్ గురించి స్పష్టమయిన అవగాహన కలిగిన డా.పరకాల వంటి మేధావిని చంద్రబాబు ఈవిధంగా గౌరవించడం హర్షణీయం. డా.పరకాల అర్ధాంగి శ్రీమతి నిర్మల సీతారామన్ ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె ఇటీవలే ఆంధ్రప్రదేశ్ నుండి తెదేపా మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె కూడా రాష్ట్రాభివృద్ధికి యదాశక్తిన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.