రాష్ట్ర యంపీలతో చంద్రబాబు సమావేశం
మళ్ళీ 18ఏళ్ల తరువాత అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల యంపీలతో నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి, అందరినీ ఆహ్వానించింది. పార్లమెంటు సమావేశాలకు ముందు పార్టీలకు అతీతంగా రాష్ట్ర యంపీలు అందరూ ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరయ్యి, పార్లమెంటులో ప్రస్తావించవలసిన రాష్ట్ర సమస్యల గురించి, కేంద్రం నుండి రాబట్టవలసిన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పధకాల గురించి చర్చించేవారు. నిన్న హైదరాబాద్ సీయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన యంపీల సమావేశంలో కూడా ఇంచుమించు అదేవిధమయిన చర్చ జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న యంపీలు వివిధ అంశాలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారికి అనేక సూచనలు చేసారు. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన ఆర్ధిక సహాయం, రాజధాని నిర్మాణం కోసం నిధుల విడుదల, రాష్ట్ర లోటు బడ్జెటుని పూడ్చేందుకు అదనపు నిధులు, పెండింగులో ఉన్న వివిధ ప్రాజెక్టులు, వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో ఉన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడం వంటి మొత్తం 35అంశాలను ఈ సమావేశంలో గుర్తించారు. వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, వాటి సాధన కోసం యంపీలు అందరూ కృషిచేయాలని నిర్ణయించుకొన్నారు. వైకాపాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలపైనే ఆసక్తి కనబరుస్తోందని అందుకే ఈ సమావేశానికి హాజరు కాకుండా తప్పించుకొందని, రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.