ఎంపీ వాగితే, వాళ్ళావిడ సారీ చెప్పింది!
బెంగాల్ సినీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తపస్ పాల్ సీపీఎం కార్యకర్తలు, వారికి సంబంధించిన మహిళల విషయంలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క కార్యకర్తపై అయినా సీపీఎం కార్యకర్తలు దాడి చేస్తే తాము సీపీఎం కార్యకర్తలను చంపుతామని, వారి ఇళ్లకు వెళ్ళి వారి ఇళ్ళలోని మహిళలపై అత్యాచారాలు చేయాలని తమ కార్యకర్తలకు పురికొల్పుతానని తపస్ పాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘‘ఒక్క తృణమూల్ కార్యకర్తపై దాడి జరిగినా మిమ్మల్ని కాల్చిచంపుతా. మీరు తృణమూల్ కార్యకర్తల తల్లి, కూతుర్లను అవమానిస్తే.. నేను ఊరుకోను. అవసరమైతే మా మనుషులను మీ ఇంటికి పంపి.. మీ మహిళలపై అత్యాచారం చేయాలని చెపుతా’’ అని సీపీఎం నాయకులు, కార్యకర్తలను హెచ్చరిస్తూ ఎంపీ తపస్ పాల్ చేసిన ప్రసంగం వీడియోను ఓ స్థానిక టీవీ చానల్ ప్రసారం చేసింది. తపస్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. మహిళా సంఘాలు కూడా తపస్‌ని కఠినంగా శిక్షించాలని, ఆయన్ని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంది. తపస్ 48 గంటలలోపు తన వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా వుంటే, తన భర్త వ్యాఖ్యల విషయంలో తపస్ పాల్ భార్య నందినీ పాల్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ఆయన అలా మాట్లాడకుండా వుంటే బాగుండేది. ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను’’ అన్నారు.