ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్
posted on Jul 6, 2014 @ 12:23PM
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలిచి మళ్ళీ కేంద్రంలో అధికారం దక్కించుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం దక్కకపోగా కనీసం లోక్ సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. గత పదేళ్ళుగా ఇష్టారాజ్యంగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కూడా పోరాడవలసి రావడం దాని దీనస్థితికి అద్దం పడుతోంది. లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 50 ఎంపీ సీట్లు కలిగి ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 మాత్రమే ఉన్నాయి. అందువల్ల యూపీఏ మిత్ర పక్షాలను కూడా కలుపుకొని ఇప్పుడు తమకు 54 ఎంపీ సీట్లు ఉన్నాయి గనుక ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి స్వయంగా లోక్ సభలో తగిన సంఖ్యాబలం లేదు గనుక ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అధికార ఎన్డీయే ప్రభుత్వం అభ్యంతరం చెపుతోంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయంపై బీజేపీ తన అభిప్రాయం చెప్పకుండా దాటవేసింది.
ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ అవసరమయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. కానీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలుగజేసుకోక ముందే ఎన్డీయే ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించవచ్చును. తనను ఇంత కాలంగా ఘోరంగా అవమానిస్తూ, వేధిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాటం నేర్పేందుకే ఎన్డీయే బహుశః తన నిర్ణయం ప్రకటించకుండా కాలయాపన చేస్తుండవచ్చును. ఏమయినప్పట్టికీ రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రి చేద్దామనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం న్యాయపోరాటానికి సిద్దమని చెప్పుకోవడం చాలా నవ్వు కలిగిస్తోంది.