పోలవరం వివాదం: తెలంగాణ బంద్

  పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో బంద్ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సీపీఎం) బంద్‌కు పిలుపు ఇచ్చింది. అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ బంద్‌కి మద్దతు ఇవ్వడం విశేషం. కాంగ్రెస్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఇతర ప్రజాసంఘాలు బంద్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా స్తంభించింది. పోలవరం ముంపు మండలాలున్న ఖమ్మం జిల్లాలో బంద్ ప్రభావం తీవ్ర స్థాయిలో వుంది.

తెలంగాణ రాజముద్ర రాంగ్: హై కోర్టులో కేసు!

  తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన రాజముద్ర తప్పుగా వుందని, తెలంగాణ రాజముద్ర రూపకల్పనలో స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలను పాటించలేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్‌ నగరానికి చెందిన టి.ధనగోపాల్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజముద్ర రూపకర్త లక్ష్మణ్‌ ఏలేలను పేర్కొన్నారు. సాధారణంగా మూడు సింహాల కింద దేవనాగరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అనే మాటలు వుంటాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన లోగోలో సత్యమేవ జయతే అనే మాటలు మూడు సింహాల కంటే చాలా దూరంగా లోగో కింది భాగంలో వున్నాయి. ఇది స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ తప్పును సరిదిద్దకుండానే తెలంగాణ ప్రభుత్వం రాజముద్రకు ఆమోదం తెలిపిందని, కోర్టు వెంటనే రాజముద్ర లోపాలను సరిదిద్దేలా ఆదేశాలు జారీ చేయాలని ధన గోపాల్ తన పిటిషన్‌లో హై కోర్టును కోరారు.

పోలవరంపై సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం!

పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్రప్రభుత్వం చట్టం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక ఈ ఇష్యూపై సుప్రీంకోర్టులొనే తెల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పోలవరం, నీటి పారుదల శాఖ అంశాలపై సీఎం కేసీఆర్‌ మంత్రి హరీశ్‌రావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితర ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇటు పోలవరం ఆర్డినెన్స్ ఆమోదాన్ని నిరసిస్తూ శనివారం ఖమ్మం జిల్లా బందుకు జేఏసీ పిలుపునిచ్చింది. మరోవైపు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో బిల్లును ఆమోదించడం పట్ల తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.

జగన్ అరుణ్ జైట్లీని కలిశారు.. ఎందుకంటే...

  వైసీపీ నేత జగన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని అరుణ్ జైట్లీని కలిశారు. ఈ సందర్భంగా జగన్ అఅరుణ్ జైట్లీకి చేసిన విజ్ఞప్తులు ఇలా వున్నాయి. 1. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ను పదిహేనేళ్ల పాటు ఇవ్వాలి. 2. ఆంద్రప్రదేశ్ ఆర్దికంగా లోటు బడ్జెట్ లో ఉన్నందున కేంద్రం సాయం చేయాలి. 3. విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా రాష్ట్రానికి నిట్, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ విపత్తుల నిర్వహణ విశ్వవిద్యాలయాన్ని తొందరగా ఏర్పాటు చేయాలి. 4. 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నట్లుగా కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రోలియం కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలి. 5. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలి. 6. విశాఖలో మెట్రో రైల్, విజయవాడ-తెనాలి-గుంటూరులలో మెట్రోపాలిటిన్ అర్బన్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలి.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు శాసనసభలో ఎలా మసలుకోవాలన్న అంశం మీద శిక్షణ ఇస్తూ వుంటారు. ముఖ్యంగా కొత్తగా శాసనసభ్యులు అయిన వారికి ఈ శిక్షణ చాలా అవసరం అందువల్ల జులై 18, 19 తేదీల్లో శాసనసభ్యులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. సభా వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడుతోపాటు నజ్మాహెప్తుల్లా, వినోద్‌ రాయ్, సుభాష్‌ కశ్యప్ వంటి ప్రముఖులు వస్తున్నారని స్పీకర్ కోడెల తెలిపారు.

పోలవరం బిల్ పాస్.. నాయకుల లబోదిబో!

  పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కి ఈ బిల్లును ఆమోదించడం ద్వారా లోక్ సభ తన సమ్మతిని తెలిపింది. నిరసనలు, నినాదాల మధ్యే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు శుక్రవారం లోక్ సభలో ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ఇలా పోలవరం బిల్లును ఆమోదించిందో లేదో అలా తెలంగాణ నాయకులు అలా మీడియా ముందుకు వచ్చి లబోదిబో అనడం మొదలుపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఇది అన్యాయం, అక్రమం, దారుణం అని మొత్తుకోవడం మొదలుపెట్టారు. బిల్లును ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో ఆమోదించిందని వాపోతున్నారు.

ఆరు వికెట్లు పడ్డాయి.. ఏడో వికెట్ నరసింహన్?

  తనను నాగాలాండ్ గవర్నర్గా బదిలీ చేసినందుకు తీవ్రంగా అసంతృప్తి చెందిన మిజొరాం గవర్నర్ పురుషోత్తమన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈయనతో కలిపి రాజీనామా చేసిన గవర్నర్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. వీళ్లంతా యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైనవాళ్లే. తనను ఏమాత్రం సంప్రదించకుండానే, తన అభిప్రాయం తెలుసుకోకుండానే తనను బదిలీ చేశారని ఆవేదన చెందిన పురుషోత్తమన్ రాజీనామా చేశారు. కేరళలలో ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన ఈ 86 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 2011లో గవర్నర్ అయ్యారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కారణాలు ఏవైనా ఇప్పటికి వరుసపెట్టి ఆరుగురు గవర్నర్లు రాజీనామా చేశారు. ఇప్పటికి ఆరు వికెట్లు పడ్డాయి.. ఏడో వికెట్ మన గవర్నర్ నరసింహన్‌దేనా అని రాష్ట్ర రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

మా దేశానికి రండి: మోడికి ఒబామా ఆహ్వానం

  మోడీకి వీసా ఇవ్వడానికే నిరాకరించిన అమెరికా ఇప్పుడు స్వయంగా మోడీకి అమెరికా రండి అంటూ అధికారికంగా ఆహ్వానం పంపింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నరేంద్ర మోడీకి అధికారికంగా అమెరికా సందర్శనకు ఆహ్వానం పంపారు. ఒబామా పంపిన ఆహ్వానపత్రాన్ని అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి విలియం బర్న్స్ శుక్రవారం మోడీకి కలసి అందజేశారు. ఒబామా పంపిన ఆహ్వానం ఎంతో వినమ్రపూర్వకంగా వుంది. ఇరు దేశాలకూ ఉపయోగపడేలా మోడీ అమెరికా పర్యటన వుంటుందని ఆశిస్తున్నామని ఒబామా ఆ ఆహ్వానంలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త శకం మొదలుకావాలని ఒబామా ఆకాంక్షించారు. సెప్టెంబర్ చివరి వారంలో మోడీ అమెరికాకి వెళ్ళే అవకాశముంది

దర్శకుడి కుమార్తెకు వేధింపులు.. బుద్ధి చెప్పిన పోలీసులు!

  తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ దర్శకుడి కుమార్తెని ఒక ఆకతాయి సెల్ ఫోన్‌లో వేధిస్తున్నాడు. ఆ విషయాన్ని సదరు దర్శకుడు జూబిలీహిల్స్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చాడు. పోలీసులు ఆ ఆకతాయిని పట్టుకుని వార్నింగ్ ఇచ్చి పంపించారు. వివరాల్లోకి వెళ్తే, తన కుమార్తెను సెల్ ఫోన్‌లో ఓ ఆకతాయి వేధిస్తున్నాడంటూ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ ఆకతాయి తన కుమార్తెకు ఎస్ఎంఎస్లు పంపిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నాడని ఆ దర్శకుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించేసరికి ఆ ఆకతాయి చెంపలేసుకుని ఇక తాను ఎవర్నీ వేధించనని లిఖితపూర్వకంగా తెలిపాడు. దాంతో ఆ దర్శకుడు తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. పోలీసులు ఆ ఆకతాయిని వదిలేశారు.

పోలవరం ప్రాజెక్టు కట్టి తీరుతాం: రాజ్‌నాథ్

  పోలవరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు అని, ఎవరు, ఎంతమంది వ్యతిరేకించినా తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును కట్టి తీరుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎందుకు కలపాలో సభ్యులకు వివరించారు. రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తున్న సందర్భంగా తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన కొందరు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలవరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం!

  పోలవరం బిల్లును లోక్‌సభ ఆమోదించింది. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కి ఈ బిల్లును ఆమోదించడం ద్వారా లోక్ సభ తన సమ్మతిని తెలిపింది. నిరసనలు, నినాదాల మధ్యే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు శుక్రవారం లోక్ సభలో ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. అనంతరం సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం రెండు గంటలవరకూ వాయిదా వేశారు.అయిదో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగించింది. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఎంపీలు గళం కలపడంతో లోక్‌సభ ఆందోళనలతో దద్దరిల్లింది.

బాలీవుడ్ బామ్మ జోహ్రా.. నీకు జోహార్!

  బాలీవుడ్ ప్రముఖ నటి జోహ్రా సెహగల్ (102) ఇకలేరు. జోహ్రా సెహగల్ గత కొంత కాలంగా హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే ఢిల్లీలోని మాక్స్ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ గురువారం సాయంత్రం జోహ్రా కన్నుమూశారు. జోహ్రాకి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా పలువురు జోహార్లంటూ నివాళులు అర్పించారు. జోహ్రా సెహగల్‌ 1912లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్ పూర్‌లో జన్మించారు. ఆమె 1946లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ప్రముఖ నటిగా పేరొందారు. 1998లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ, 2010లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో సత్కరించారు. జోహ్రాకి ఇంకా అమితాబ్ బచ్చన్, మాధుర్ బండార్కర్ తదితర సినీ ప్రముఖులు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తదితరులు జోహ్రా‌కు నివాళులు అర్పించారు. బాలీవుడ్లో వచ్చి భాజి ఆన్ ది బీచ్ (1992), హమ్ దిల్ దే చుక్కే సనమ్, బెడ్ ఇట్ లైక్ బెక్ హామ్ (2002), దిల్ సే (1998), చీని కమ్ (2007) చిత్రాల్లో జోహ్రా సెహగల్ నటించారు

జనసేన పార్టీ వార్నింగ్..!

  సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జనసేన పార్టీపైన వస్తున్న సెటైర్లుపైన ఆపార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైన సెటైర్లు వేస్తున్నారని, ఇక నుంచి ఇటువంటి సెటైర్లు వేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ గట్టిగా హెచ్చరించింది. అలాగే జనసేన పార్టీ తరపున ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియాలో జనసేన పార్టీ గురించి గానీ, పార్టీ తరపున ప్రకటనలు అంటు వస్తే అటువంటి వాటితో తమకు సంబంధం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అందులో స్పష్టంచేశారు. పార్టీ పేరుతో ఈ సోషల్‌ నెట్‌వర్క్‌లో గానీ ఇతర మార్గాల ద్వారా గాని విరాళాలు సేకరిస్తున్న వారితో ఎటువంటి సంబంధం లేదంటూ జనసేన క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి పూర్తిస్థాయి గుర్తింపు వచ్చిన తరువాత భవిష్యత్ ప్రణాళికలను ప్రకటిస్తారని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె... ముక్కులు మూసుకోవాలి..

  తమ వేతనాలు, సదుపాయాలు, రక్షణ చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)కార్మికులు బుధవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగారు. ఈసమ్మెలో మలేరియా, రవాణా, పార్కుల విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మికుల సమ్మెతో నగరంలోని పలు విభాగాల్లో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ముక్కులు మూసుకుని నడవాల్సి వస్తోంది. జీహెచ్ఎంసీ కార్మికులు తక్షణమే సమ్మెను విరమించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ హెచ్చరించారు.