పోలవరం, రైల్వేజోను ఈ సమావేశాలలోనే ఆమోదం
posted on Jul 6, 2014 @ 3:34PM
కేంద్రపట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం. వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, జూలై 7 నుండి మొదలయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వేజోను మంజూరు, పోలవరం ప్రాజెక్టుకి తప్పకుండా ఆమోదిస్తామని తెలిపారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ప్రకటించి చాలా కాలమయినప్పటికీ, ఇంతవరకు ప్రత్యేకహోదా మంజూరు కాలేదు. దీనివలన రాష్ట్రానికి రావలసిన అనేక పరిశ్రమలు తెలంగాణా మరియు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే తెలంగాణకు తరలిపోయిన హీరో మోటార్ సైకిళ్ళు తయారీ సంస్థ బహుశః ఆంధ్రాకే మొగ్గు చూపి ఉండేదేమో! అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఇకనయినా ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి వీలయినంత త్వరగా సాధించవలసి ఉంది. పోలవరం, రైల్వే జోను మంజూరు మంచి విషయమే అయినా, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కూడా చాలా అవసరం. వెంకయ్య నాయుడు, ఆంధ్రాకు చెందిన కేంద్రమంత్రులు, యంపీలు అందరూ కూడా ఈ అంశంపై పూర్తి శ్రద్ధ పెట్టడం అత్యవసరం. ఇక ఆర్ధిక లోటును పూడ్చుకోనేందుకు బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు కూడా జరిగేలా జాగ్రత్తపడటం చాలా అవసరం.