పవన్ కళ్యాణ్ తరువాత టార్గెట్ జగనా..!

 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను.. వారి తరపున నేను ప్రశ్నిస్తా అని అప్పుడెప్పుడో చెప్పారు. కానీ ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని చెప్పనైతే చెప్పారు కానీ చెప్పిన తరువాత దాదాపు కొంత కాలం అసలు ఆయన ఆ ఊసే ఎత్తలేదు. ఇదే విషయంపై అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద చాలా మంది చాలా విమర్శలే చేశారు. కానీ సడన్ గా పవన్ కళ్యాణ్ కు ఏమైందో తెలియదు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఏపీ మంత్రులందరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మొదట తెలుగుదేశం పార్టీ నేతలను ఆయన నిలదీశారు. వారి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దానికి టీడీపీ ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ కి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఓ సమయంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీగా మారిపోతుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ చంద్రబాబు జోక్యం చేసుకొని సర్ధిచెప్పడంతో పరిస్థితి నెమ్మదించింది.

 

ఆ తరువాత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ పై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి గాలికొదిలేసిందని.. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కల్పిస్తానని హామి చేసిందని ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ విషయంలో బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ బాగానే పోరాడింది.. కానీ ఏపీకీ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాడంలేదని ఎద్దేవ చేశారు. లలిత్ మోడీ పైన ఉన్న శ్రద్ధ ఐదు కోట్ల ఆంధ్రుల పైన లేదా అని ఆయన నిలదీశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుటివరకు టీడీపీ నేతలను.. కాంగ్రెస్ నేతలను ప్రశ్నించగా తరువాత ఎవరిని ప్రశ్నిస్తారు అని విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తరువాత టార్గెట్ మాత్రం వైకాపా అధ్యక్షుడు జగనే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో... రానున్న పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా గురించి మరింత ఘాటుగా మాట్లాడవచ్చునని భావిస్తున్నారు.

Teluguone gnews banner