తలసానికి పోటీగా పవన్ కళ్యాణ్ యోచన?

  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని చెప్పి ఎట్టకేలకూ రెండు రోజుల క్రితం మీడియా ముందు మాట్లాడారు. ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. వీహెచ్ తనను ఎప్పుడు ప్రశ్నిస్తాడు అని విమర్శించిన నేపథ్యంలో దానికి స్పందిస్తూ సరైన కోసం ఎదురుచూస్తున్నానని సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ కల్యాణ్ సనత్ నగర్ నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని వార్తులు జోరుగా సాగుతున్నాయి. అందులోనూ ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా ప్రస్తావించారు. దీంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా టీడీపీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన తలసాని రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. ఒకవేళ తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదించాక ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి తలసాని పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే సనత్ నగర్ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

రాజకీయ నేతల జంపింగ్ జపాంగ్స్

మాన్ సూన్ వచ్చేసింది.. చిన్నగా వర్షాలు కూడా పడుతుండటంతో కప్పలు కూడా ఇక్కడి నుండి అక్కడికి జంప్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ మాన్ సూన్.. కప్పల గొడవేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది ఇప్పుడు ఆ కప్పలనూ చూస్తుంటే మన రాజకీయనాయకులే గుర్తొస్తున్నారు. ఈ పార్టీలో నుండి ఆపార్టీలోకి అంటూ కప్పల కంటే ఫాస్ట్ గా తెగ జంపింగ్ల మీద జంపింగ్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ జంపింగ్ లు మరీ ఎక్కువైపోయాయి. పార్టీ మీద గౌరవం.. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని వెన్నంటి ఉండే నమ్మకమైన నాయకులను బూతద్దంలో వెతికినా ఎక్కడో ఒకరిద్దరు ఉంటారేమో కానీ అలాంటి వాళ్లు ఇప్పుడు దొరకడం కష్టమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి జంపిగ్ రాయుళ్లు ఎక్కువైపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో సమాధానం లేని ప్రశ్న.. అందుకే ఆపార్టీలోనే ఉంటూ గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం కంటే పార్టీ మారితే ఏదో ఒక పదవి కట్టబెడతారుకదా అన్న ఆలోచనతో నాయకులంతా పార్టీ ఫిరాయించే పనిలో పడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ, కేకే, డిఎస్ పార్టీ మారిపోయారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే కొంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. వారిలో గాదె వెంకటరెడ్డి, శైలజానాథ్, ఉండవల్లి అరుణకుమార్, దేవినేని నెహ్రూ, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉన్నట్టు సమాచారం.     గాదె వెకంటరెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేత. ఈయన రాజకీయ ప్రవేశం చేయకముందు న్యాయవాదిగా, వ్యాపారం రంగంలో పనిచేసేవారు. ఒకటి కాదు రెండు కాదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తి గాదె వెంకటరెడ్డి. అలాంటి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వెంకటరెడ్డి కూడా పార్టీ మారే యోచన చేస్తుండటం ఓ రకంగా కాంగ్రెస్ కు జీర్ణించుకోలేని విషయమే.     ప్రభుత్వ వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ శైలజనాథ్‌ 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శింగనమల నుంచి కాంగ్రెస్‌ టికెట్టును దక్కించుకుని విజయం సాధించారు. 2009లోనూ అతికష్టం మీద మూడు వేల మెజార్టీతో బయట పడ్డారు. రెండోసారి విజయం సాధించాక వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్‌ పదవిని దక్కించుకున్నారు. తరువాత వైఎస్ఆర్ చనిపోయిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు ప్రాథమిక విద్యాశాఖను కట్టబెట్టారు. మంత్రి పదవితో ఆయన జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్రనే పోషించారు. తరువాత కేంద్రం రాష్ట్ర విభజన చేసిన తరువాత కూడా కాంగ్రెస్ ఉనికి పోయిన ఇన్ని రోజులు ఆపార్టీలోనే ఉన్నారు. పాపం ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటామనుకున్నారేమో పార్టీ మారే యోచనలో ఉన్నారట.       మరో కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వైకాపాలోకి జంప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ మంచి మాటకారి. ఉండవల్లి 2004, 2009 లో రాజమండ్రి నియోజక వర్గం నుండి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్రాన్స్ లేటర్ గా కూడా పనిచేశారు. అలాంటి మంచి వక్త, వాదనా పటిమ కలిగిన అరుణ్ కుమార్ ను తమ పార్టీలోకి రావడానికి వైకాపా కూడా ఆకట్టుకుంటుందన్నది సమాచారం.   అంతేకాక దేవినేని నెహ్రూ కూడా కాంగ్రెస్ పార్టీను వీడి వైకాపాలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. దేవినేని నెహ్రూ కంకిపాడు నియోజక వర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన బలమైన రాజకీయ నాయకుడు. ఇప్పుడు వైకాపాలోకి నెహ్రూ చేరడం వల్ల కృష్ణా జిల్లాలో  పార్టీ నిర్వహణ సులభం అవుతుందని భావిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు నెహ్రూ రాకను గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మరో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వ్యతిరేకిస్తున్నారు. వీటిని పరిష్కరించుకుంటారా?లేదా? వీరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వస్తారా?లేదా అన్నది తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు.   డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా వైకాపాలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈయన 2004లో తాడికొండ నియాజక వర్గం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత పార్టీ తరపున ఎన్నో పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడ కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేకపోడంతో కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి మారనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమైన నేతలందరూ కట్టకట్టుకొని ఒకేసారి వేరే పార్టీలోకి చేరిపోతున్నారు. అసలే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు కోలుకోలేని దెబ్బగొట్టారు. ఇప్పుడు పార్టీలోని నేతలందరూ వేరే పార్టీలోకి చేరడం వల్ల ఇంకా పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో అసలు భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

వ్యాపంపై సీబీఐ విచారణకు ఓకె!

  మధ్యప్రదేశ్ లో గత 15 సం.లుగా వ్యాపం కుంభకోణంలో అనేకమంది అరెస్టులు, అనుమానస్పద మరణాలు సాగుతున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దానిపై సీబీఐ విచారణకు నిరాకరిస్తూ వచ్చింది. కానీ నానాటికీ ఈ అనుమానస్పద మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో సుప్రీంకోర్టు దీనిపై రేపు విచారణ చేప్పట్టబోతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో సహా ఉత్తరాదిన అనేక ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఎట్టకేలకు ఆయన ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ నిన్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాసారు. ఒకవేళ ఆయన వ్రాసి ఉండక పోతే రేపు సుప్రీంకోర్టే స్వయంగా కేంద్రాన్ని ఆదేశించేదేమో?

నేడు డీ.యస్. తెరాసలో చేరిక

  మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఈరోజు మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి తెరాసలో చేరబోతున్నారు. ఆయన జిల్లా (నిజామాబాద్) కి చెందిన పలువురు జడ్పీటీసీ, యంపీటీసిలు, కార్పొరేటర్లు తడిఅతరులు ఆయనతో కలిసి ఈరోజు మధ్యాహ్నం తెలంగాణా భవన్ లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు. పార్టీ అధిష్టానం తనకు రెండసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే బాధతో కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని త్రెంచుకొని డి.శ్రీనివాస్ తెరాసలోకి వెళుతున్నారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినందునే ఆయన తెరాసలో చేరేందుకు సిద్దపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తను ఎటువంటి పదవులు ఆశించి తెరాసలో చేరడం లేదని ఆయన చెపుతున్నారు.

జపాన్ ప్రధానితో బాబు..అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం

  జపాన్ ప్రధాని షింజో అబే తో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.ఎపి కొత్త రాజదాని అమరావతి నిర్మాణానికి జరిగే శంకుస్థాపన ఉత్సవంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రదానిని కోరారు. తిరుమల శ్రీవెంకటేశ్వరుని శేషవస్త్రం, ప్రసాదం, మెమెంటోని చంద్రబాబు ఆయనకు బహుకరించారు.రాజధాని నిర్మాణంలో , పరిశ్రమల స్థాపనలోను ఎపికి సహకరించాలని ఆయనకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాజధాని కి మౌలిక వసతుల ఏర్పాటులో, సాంకేతిక పరిజ్ఞానం అందించడం లో జపాన్ సహకరిస్తుందని ఆ దేశ ప్రధాని హామీ ఇచ్చారు.అమరవాతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని జపాన్‌ ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కూడా ఆహ్వాన లేఖ వస్తుందన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన షింజో అబే వీలు చూసుకుని వస్తానని చంద్రబాబుకు తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్‌లపై రాష్ట్రపతికి ఫిర్యాదు

  తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడడంపై ఏపీ మంత్రులు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఆంధ్ర్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో ఏపీ మంత్రులు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ప్రత్యేకించి పోన్ టాపింగ్,సెక్షన్ ఎనిమిది అమలు, తొమ్మిది, పది షెడ్యూల్ లలోని సంస్థల విభజన, తెలంగాణ ప్రభుత్వ వైఖరి మొదలైన వాటిపై రాష్ట్రపతికి మంత్రులు ఫిర్యాదు చేశారు. గరికపాటి రామ్మోహన్ రావు, సెబాస్టియన్‌ల ఫోన్లను ట్యాప్ చేశారని, దీనికి సంబంధించిన వివరాలను రాష్ర్టపతికి అందజేశామని తెలిపారు. తమ ఫిర్యాదులపై స్పందించిన రాష్ర్టపతి, కేంద్ర కేబినెట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. గవర్నర్ నరసింహన్ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఇరు రాష్ర్టాల సమస్యలను పరిష్కరిస్తామంటే తమకు ఎలాంటి అభ్యంతంర లేదన్నారు.

సండ్రకి రెండువారాలు రిమాండ్

  ఈరోజు ఉదయం నుండి తెదేపా ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్యకి ఎసిబి కోర్టు రిమాండ్ విదిస్తుందా లేదా? అనే అనుమానం ఎసిబి అధికారులలో సైతం నెలకొంది. ఎందుకంటే ఆయన తరపున వాదించిన లాయర్ ప్రజా ప్రతినిధి అయిన సండ్రను అరెస్ట్ చేసే ముందు స్పీకర్ నుండి ముందుగా అనుమతి తీసుకోలేదని వాదించడంతో కోర్టు కూడా కొంచెం సమయం తీసుకొన్న తరువాతనే తన నిర్ణయం ప్రకటించింది. ఆయనకీ రెండు వారల పాటు అంటే జూలై 21వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. కానీ లాయర్ ప్రజా ప్రతినిధి అయిన సండ్రను జైలు అధికారులు ప్రత్యేక ఖైదీగా చూడాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనని చర్లపల్లి జైలుకి తరలిస్తున్నారు. ఆయన తరపున వాదించిన లాయర్లు కోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్దమవుతుంటే, ఆయనను ప్రశ్నించేందుకు ఐదు రోజులపాటు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయబోతున్నారు.

మాజీ మంత్రి బాట్టం శ్రీరామమూర్తి మృతి

  మాజీ మంత్రి మరియు ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు బాట్టం శ్రీరామ్మూర్తి (89) ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. శ్రీరామ్మూర్తిగారు విజయనగరం జిల్లా ధర్మవరంలో 1926 సం.లో జన్మించారు. సుమారు 16సం.ల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పని చేసి సమర్దుడయిన నాయకుడిగా పేరు పొందారు. సమైక్య ఆంద్ర రాష్ట్రంలో ఆయన విద్యా, సాంస్కృతిక శాఖ, సోషల్ వెల్ఫేర్, సాంస్కృతిక శాఖల మంత్రిగా సేవలందించారు. అనంతరం స్వర్గీయ యన్టీఆర్ ప్రేరణతో ఆయన తెదేపాలో చేరి విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు.   ఆయన రాజకీయాలలోనే కాక మంచి రచయితగా కూడా సుప్రసిద్దులు. ఆయన జయ భారత్, ప్రజారధం, ఆంధ్రజ్యోతి పత్రికలకు సంపాదకులుగా పనిచేసారు. ఆయన జీవిత చరిత్ర స్వేచ్చా భారతం తో కలిపి మొత్తం నాలుగు గ్రంధాలను ఆయన స్వయంగా రచించారు. వృదాప్యం కారణంగా ఆయన చాలా ఏళ్ల క్రితమే రాజకీయాల నుండి నిష్క్రమించారు. ఆయనకీ భార్య, ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు.

తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర?

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి తెరాస కుట్రలు పన్నిందని రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కూడా తెదేపాపై సరిగ్గా అటువంటి ఆరోపణలే చేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు కనబడుతోంది. తెదేపా ఎమ్మేల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఇద్దరూ ఏకంగా 29 మంది తెరాస ఎమ్మేల్యేలతో టచ్చులో ఉన్నారని, వారిరువురూ తెలంగాణా ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, వారిరువురి కాల్ డాటా ఆధారంగా ఎసిబి అధికారులు ఈ సంగతి కనుగొన్నట్లు మీడియాలో లీకులు వస్తున్నాయి.కనుక నేడో రేపో వారి సంభాషణలని కూడా మీడియాకు రిలీజ్ చేస్తారేమో?

తెరాసలో చేరనందుకే ఈ కక్ష సాధింపు చర్యలు : సండ్ర

  నిన్న సాయంత్రం తెదేపా ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ అదుపులోకి తీసుకొన్న ఎసిబి అధికారులు ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత మళ్ళీ తమ కార్యాలయానికి తరలించారు. మరి కొద్ది సేపటిలో ఎసిబి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టి కస్టడీ కోరవచ్చును. ఆయన ఎసిబి విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అరెస్ట్ తరువాత తెరాస చెందిన కొందరు మధ్యవర్తులు వచ్చి తనను కలిసి తెరాసలో చేరమని కోరారని తెలిపారు. తెరాసలో చేరినట్లయితే ఎటువంటి కేసులు, సమస్యలు ఉండవని హామీ కూడా ఇచ్చేరని కానీ తను తెదేపాలో కొనసాగేందుకే మొగ్గు చూపడంతో ఆ మరునాడే ఎసిబి నుండి నోటీసులు వచ్చేయని తెలిపారు. కానీ తాను ఇటువంటి బెదిరింపులకి ఎంత మాత్రం భయపడబోనని, తను అరెస్టుకి సిద్ధమయ్యే వచ్చేనని తెలిపారు.   ఆయన విచారణకు హాజరయినప్పటికీ అరెస్ట్ చేయడాన్ని తెదేపా నేత జూపూడి ప్రభాకర రావు తీవ్రంగా ఖండించారు. ఆయనను అరెస్ట్ చేయడాన్ని దళితులపై జరుగుతున్న దాడిగానే చూస్తామని అన్నారు. తెరాసలో చేరనివారిపై ఈవిధంగా తెరాస ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెరాస ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎమ్మేల్యేలని నయాన్నో, భయాన్నో లొంగదీసుకోవాలని ప్రయత్నించడాన్ని ఆయన ఆక్షేపించారు. తమ పార్టీ తెరాసను రాజకీయంగా ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలి: పవన్ కళ్యాణ్

  ఓటుకి నోటు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది కనుక దాని గురించి తానేమీ మాట్లాడబోనని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ, “ఒక రాష్ట్ర ప్రభుత్వం మరొక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం చాలా తీవ్రమయిన నేరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండి ఉంటే దానిపై సీబీఐ చేత విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చవలసి ఉంది. అయినా రాజకీయాలను ఇంతగా దిగజార్చుకోవడం ఎవరికీ మంచిది కాదు. దాని వలన వారే కాదు ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. కనుక ఇప్పటికయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి రాజకీయ యుద్దాలను ఇంతటితో ఆపి పరిపాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. లేకుంటే ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య అంతర్యుద్దాలకి దారి తీసే ప్రమాదం ఉంది,” అని హెచ్చరించారు.

సెక్షన్:8 కి నేను వ్యతిరేకం: పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్మీడియాతో మాట్లాడుతూ ‘నేను సెక్షన్: 8 అమలుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అది కేవలం ప్రజల మధ్య అల్లర్లు చెలరేగినప్పుడు లేదా నగరంలో అశాంతి నెలకొన్నప్పుడే ఉపయోగిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. తెలంగాణా ఉద్యమాల కోసం అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగాయి. ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉన్న నగరంలో సెక్షన్: 8ని అమలుచేయాలని ప్రయత్నిస్తే మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. సెక్షన్: 8 అమలు ఏ వ్యక్తినో కాపాడటానికి ఏర్పాటు చేసింది కాదని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రహించాలి. అదే విధంగా నగరంలో ప్రజలకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దే. కానీ తెదేపాతోనో లేక చంద్రబాబు నాయుడినో తిట్టాలనే ఉద్దేశ్యంతో ‘ఆంధ్రోళ్లు’ ‘సెటిలర్స్’ వంటి పదాలను వాడుతున్నారు. దాని వలన రాష్ట్రప్రజలందరి హృదయాలను గాయపరుస్తున్నామనే విషయం మరిచి పోతున్నారు. ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తానని హామీ చేసిన ముఖ్యమంత్రి పక్షపాత వైఖరితో వ్యవహరించడం తగదు. ముందుగా ముఖ్యమంత్రులిరువురూ సక్యతగా వ్యవహరించ గలిగితే అప్పుడు ప్రజల మధ్య కూడా సక్యత ఏర్పడుతుంది,” అని అన్నారు.

ముఖ్యమంత్రులకి పవన్ కళ్యాణ్ హితబోధ

ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత సమస్యలు తప్పక వస్తాయని, అటువంటి సమయంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలని జనసేన రథసారథి పవన్‌ కల్యాణ్‌ హితవు చెప్పారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ ఇకనుంచైనా జాగ్రత్తగా వ్యవహరించకపోతే అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ పరస్పర విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.   హైదరాబాద్‌ రాజధాని కాబట్టే సీమాంధ్ర ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని చెబుతూ ఆంధ్రోళ్లు, సెటిలర్లు అనే మాటలు ఉపయోగించవద్దని ఆయన తెలంగాణ నాయకులకు హితవు చెప్పారు. చంద్రబాబును తిట్టాలంటే తిన్నగా తిట్టండి, తెలుగుదేశం పార్టీని తిట్టాలంటే తిన్నగా తిట్టండి, నన్ను తిట్టాలంటే తిన్నగా తిట్టండి అంతేగాని ఆంధ్రోళ్లు అని తిట్టవద్దని ఆయన కోరారు. ఆంధ్ర అంటే ఒక జాతి అని వివరిస్తూ వారిలో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు... ఇలా అందరూ ఉన్నారని, ఆంధ్రోళ్లు అంతా తెలుగుదేశం పార్టీలో లేరని ఆయన గుర్తు చేశారు. తనను ఎవరైనా విమర్శించవచ్చునన ఆయన అన్నారు.   యాదాద్రిలో విజయనగరానికి చెందిన వ్యక్తిని చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా నియమించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలుగుజాతి ఐక్యతకి అడుగు వేశారా అని ఈరోజు పత్రికలు చూస్తుంటే అనిపించిందని ఆయన కితాబు ఇచ్చారు. ఇది చాలా మంచి పరిణామం అని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర విభజనకు యుపిఏ, ఎన్డీయే రెండూ బాధ్యులే అంటూ తెలంగాణకు మంచి జరిగింది, మంచిదే, కాని ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ విభజన సమస్యలు పరిష్కరించకపోతే శ్రీలంక తరహా సమస్యలు తలెత్తుతాయని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.   విభజన సమయంలో తెలంగాణ ఎంపీలు పనిచేసినట్టు ఆంధ్ర ఎంపీలు పనిచేయలేదని ఆయన ఆక్షేపించారు. అందుకు కారణం వారు వ్యాపారవేత్తలు కావడమేనని ఆయన వివరించారు. మీ రాష్ట్రంకోసం మీరు పనిచేయవలసింది పోయి మీ వ్యాపారాలకోసమే పనిచేసుకుంటే ఆంధ్రకు ఎక్కువ అన్యాయం చేసేది మీరే అవుతారని కూడా ఆయన హెచ్చరించారు. మీకు పనిచేయడం చేతకాకపోతే రాజకీయాలలో ఉండకండి అని కూడా ఆయన హితవు చెప్పారు.

ఆంధ్రోళ్లు అని తిట్టవద్దు: పవన్

  పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రులిరువురూ బాధ్యతగా వ్యవహరించాలి. అదే విధంగా మాట్లాడేటప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావు తరచూ ‘ఆంధ్రోళ్లు’ ‘సెటిలర్స్’ అని చాలా అవమానకరంగా మాట్లాడుతుంటారు. ఒకవేళ వారు చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి తిట్టుకోదలిస్తే నేరుగా ఆయన పేరు పెట్టి తిట్టుకోవచ్చును. లేదా ఆయన కులాన్ని తిట్ట దలిస్తే నేరుగా వారినే తిట్టుకోవచ్చును. కావాలనుకొంటే నన్ను కూడా తిట్టుకోండి. మరేమీ పరువాలేదు. కానీ ఆంధ్రోళ్లు అంటే చంద్రబాబు నాయుడని కానీ తెదేపాకు చెందిన వారు కారని కాదని సంగతి గ్రహించాలి. ఆంధ్రాలో ఉండే అనేక కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలందరూ కలిస్తే ఆంధ్రావాళ్ళు అవుతారు తప్ప ఏదో ఒక కులానికో రాజకీయ పార్టీకి చెందినవాళ్ళు మాత్రమే ఆంధ్రావాళ్ళు కాదని గుర్తుంచుకోవాలి. వారు ఆవిధంగా నోటికి వచ్చినట్లు అదుపు లేకుండా మాట్లాడటం ఎవరికీ మంచిది కాదు. రాజకీయాలలో ఉన్నవాళ్ళకి నోటిపై, మాట్లాడే బాషాపై చాలా అదుపు అవసరం. కులాల గురించి మాట్లాడటం నాకసలు ఇష్టం లేదు. కానీ రాజకీయాలలోకి వచ్చిన తరువాత తప్పనిసరిగా మాట్లాడవలసి వస్తోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈవిధంగా వ్యవహరించడం వలన ప్రజల మధ్య ఇంకా చిచ్చుపెట్టినట్లవుతుంది. మొన్న నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం చూసిన తరువాత నాకు ఈ పరిస్థితులుఅంతర్యుద్ధాలకి దారి తీస్తాయేమోననే భయం కలుగుతోంది. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ విద్వేషాలను విడనాడి కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది.

ఆంధ్రాకు కేంద్రం న్యాయం చేయాలి: పవన్ కళ్యాణ్

   పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ హడావుడిగా రాష్ట్రాన్ని విడదీయడం వలన తెలంగాణకు లాభం కలిగి ఉండవచ్చును. అందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. కానీ అదే సమయంలో ఆంద్రప్రదేశ్ కి తీరని అన్యాయం జరిగినందుకు నేను చాలా బాధ పడుతున్నాను. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్ర విభజన చేసాయి కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యతా వాటిదే. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ఆ రెండు పార్టీలకు చెందిన నేతలతో ఒక కమిటీ వేయాలి.   ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యెక వ్యవస్థని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో చొరవ చూపమని నేను ప్రధాని నరేంద్ర మోడీని ఈ మీడియాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్యలు మొగ్గలోనే ఉన్నప్పుడే తుంచి వేయాలి లేకుంటే ఇంతకు ముందు ఆంధ్రా, తెలంగాణా పోలీసులు కొట్టుకొన్నారు. ఇక ముందు ప్రజలు కూడా రోడ్లమీద కొట్టుకొనే పరిస్థితి దాపురిస్తుంది. కనుక పరిస్థితులు అంతవరకు వెళ్ళకుండా తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను.