అది మన రాజకీయ నాయకులకే చెల్లు
posted on Jul 15, 2015 @ 3:44PM
గోదావరి మహాపుష్కరాల సందర్భంగా మొదటి రోజు అంటే నిన్న రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఒక పక్క ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలవాల్సిన రాజకీయ నేతలు అది చేయకుండా దీని అంతటికి కారణం సీఎం చంద్రబాబే అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనకు దొరికిందే ఛాన్స్ అనుకొని ప్రతిపక్షనేతలు తొక్కిసలాటకు కారణం ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఏ సాకు దొరుకుతుందా అని చూసే జగన్ అయితే ఏకంగా రెచ్చిపోయి బాబు స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకు పంపించేవారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రజల గురించి అంత పట్టించుకునే నాయకులైతే పుష్కర ఘాట్ ల దగ్గరకు వచ్చి ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చూసేవాళ్లు.. అది చేయడం చేతకాదు.. ఎవర్నైనా విమర్శించమంటే మాత్రం ముందుంటారు. అంత జాలే ఉన్నట్టయితే బాధితుల కుటుంబాలను పరామర్శించి సహాయం చేసేవాళ్లే. కనీసం అక్కడి పరిస్థితి ఎలా ఉందో కూడా వెళ్లి చూడని నాయకులు కూడా విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉంది. శవాలతో కూడా రాజకీయాలు చేయవచ్చని మన రాజకీయ నేతలను చూసి నేర్చుకోవచ్చనిపిస్తుంది... అది మన రాజకీయ నేతలకే చెల్లు.
అయితే ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కూడా ఘాటుగానే సమాధాన మిచ్చారు. ఈ విషయం పై టీడీపీ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ నిన్న రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు కారణం చంద్రబాబే అంటూ దుష్ప్రచారం చేయడంసరికాదని మండిపడ్డారు.
ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనను ఆధారంగా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదన్నారు. చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి నేతలు కూడా శవరాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు ప్రణాళికాబద్ధంగానే ఉన్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి పుష్కర ఘాట్ తొక్కిసలాటపై ప్రతిపక్షాలది అనసవర రాద్దాంతమని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని.. భక్తులకు బాసటగా నిలవాలని అన్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరైన రీతిలో స్పందించారని.. భక్తులకు సహాయ చర్యలు అందించాలని తన అభిమానులకు పిలుపునివ్వడం అభినందనీయమని సోమిరెడ్డి అన్నారు.
జూపుడి ప్రభాకర్ రావు కూడా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ప్రతిపక్షాలపై ఘాటుగానే మండిపడ్డారు. ప్రమాదం జరిగి ఓవైపు ప్రాణాలు కోల్పోయి ఉంటే బాధితులను ఓదార్చాల్సింది పోయి దాని కారణం సీఎం అంటు.. టీడీపీ అంటూ విమర్సలు చేయడం విడ్డూరమన్నారు. అంతేకాక మేం కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని.. పార్టీ తరుపున ఎవరినైనా వాలెంటీర్లను పంపించారా అని ప్రశ్నించారు. శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్ అని ధ్వజమెత్తారు.