పదవి పోయిన వెంటనే పార్టీ మారడం ఖాయం.. జేసీ
posted on Jul 16, 2015 @ 5:05PM
అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో దురదృష్టమశాత్తు జరిగిన ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పార్టీ అధ్యక్ష పదవి ఉన్నంతకాలమే రఘువీరా రెడ్డి పార్టీలో ఉంటారని.. ఆ పదవి పోయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారడం ఖాయమని ఎద్దేవ చేశారు. రాష్ట్ర విభజన వల్లనే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ వల్ల తాము చాలా లాభపడ్డామని అన్నారు. అంతేకాక హైదరాబాద్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ కు వెళ్లినప్పుడల్లా బాధ కలుగుతుందని.. హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు వస్తుందో తెలియదని, అటువంటి రాజధాని వస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. తన నియోజక వర్గం అభివృద్ధికి అవసరమైతే దౌర్జన్యానికైనా దిగుతానని వ్యాఖ్యానించారు.