మాకూ సగం ఇవ్వండి.. టీ సర్కార్
posted on Jul 16, 2015 @ 10:56AM
తెలంగాణ ప్రభుత్వానికి.. ఏపీ ప్రభుత్వానికి ఏదో విషయంలో పేచీలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే అనేక వివాదాలతో రెండు ప్రభుత్వాలు ఎప్పుడూ గొడవపడుతూనే ఉన్నాయి. ఒక పక్క ఆంధ్రా, తెలంగాణ విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపుల్లో కొంచెం వివాదస్పద సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై ఇప్పటికే ఇరు రాష్టాల ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఏపీకిచ్చిన బొగ్గు గనుల్లో మాకూ సగం ఇవ్వండంటూ తెలంగాణ ఇంధన శాఖ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో నిర్మించే 6,000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుకు బొగ్గు అవసరముందంటూ... ఒడిసా లోని సర్పాల్-నౌపార్ గనుల్లోని బొగ్గును సగం తమకు కేటాయించాలని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి అరవింద కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. అయితే గతంలో రాష్ట్ర విభజన ముందు ఒడిసాలోని సర్పాల్-నౌపార్ గనుల ను ఏపీకి కేటాయిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 25ను జారీ చేసింది. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత సర్పాల్-నౌపార్ బొగ్గు గనులను ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు కేటాయిస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ రెండు నెలల క్రితమే ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం విభజన ముందు బొగ్గు గనులను ఏపీకీ కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది... ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి అవే గనుల్లో మాకూ 50 శాతం కేటాయించాలని పట్టుబడుతోంది. మరి దీనికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో.. ఒకవేళ ఒప్పుకోకపోతే మళ్లీ దీనిపై వివాదం మొదలవుతుంది.