అవును అందుకే ఢిల్లీకి వెళ్ళేది
జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా అడ్డుకోనేందుకే చంద్రబాబు డిల్లీ యాత్రకు బయలుదేరుతున్నారని ఇంతవరకు వైకాపా ఆరోపించడం, దానిని తెదేపా నేతలు ఖండించడం రోజువారి వార్తలుగా మారిపోయాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబు తన పార్టీ యంపీలను, సభ్యులను వెంటబెట్టుకొని సీబీఐ, ఈడీ తదితరులందరినీ కలిసి జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో పిర్యాదులు చేయబోతున్నట్లు వస్తున్నవార్తలు, ఇక ఈ ముసుగులో గుద్దులాటలు అవసరం లేకుండా చేసాయి. చంద్రబాబు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సమాజంపై ఆర్ధిక అత్యాచారం చేసిన నేరగాడని, అతని కేసు కూడా నిర్భయ అత్యాచార కేసు వంటిదేనని, అందువల్ల అతనికి ఉరి శిక్షవేసినా తక్కువేనని ఆయన అన్నారు. ఈ నేపద్యంలో చంద్రబాబు డిల్లీ వెళ్లి సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులను ఎందుకు కలవాలనుకొంటున్నారో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.
అయితే, తెదేపా మాత్రం తాము ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిన నాటి నుండి రాష్ట్రంలో ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో, సమైక్యాంధ్ర ఉద్యమాలు, హైదరాబాద్ వంటి పలు అంశాల గురించి వారికి వివరించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించామని కోరేందుకే డిల్లీ వెళుతున్నామని చెపుతున్నారు.