జనసేన రాకతో రాజకీయ కలకలం
పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేన రాకతో రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ ఒక కుదుపు వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్న అసహ్యాన్ని ఏమాత్రం దాచుకొనే ప్రయత్నం చేయలేదు. దానిని తరిమికొట్టడమే తన లక్ష్యమని ప్రకటించేశారు గనుక ఇక నేటి నుండి కాంగ్రెస్ నేతలందరూ తమ విభేదాలను పక్కన బెట్టి మరీ ఆయనపై విమర్శల వర్షం కురిపించడం ఖాయం. ఇక, బీజేపీకి తాను దూరంగా ఉంటానని స్పష్టంగా చెప్పకపోయినా ఆయన మాటలని బట్టి ఆయన దూరంగానే ఉంటారని అర్ధమవుతోంది. కానీ ఆయన తెదేపాతో పొత్తులకు సిద్దమన్నట్లు సూచించారు గనుక, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆయన, తమను వ్యతిరేఖిస్తున్నట్లు విస్పష్టంగా ప్రకటన చేసే వరకు కూడా ఆయనను తమ మిత్రుడుగానే భావించవచ్చును. ఈ కారణంగా వైకాపా, జై సమైక్యాంధ్ర పార్టీలు కూడా ఆయనను తమ శత్రువులాగే భావిస్తాయి. అదేవిధంగా ఆయన తెలంగాణాలో కూడా తన పార్టీని నిర్మించి అక్కడ కూడా పోటీ చేసేందుకు సిద్దపడున్నందున తెరాస కూడా ఆయనపై యుద్ధం ప్రకటించడం ఖాయమే. బహుశః ఈ పాటికే తెరాస నేతలు యుద్ధం ప్రకటించి ఉండవచ్చును. అయితే, ఒకవేళ ఆయన బీజేపీకి ఏ మాత్రం సానుకూలంగా ప్రకటన చేసినా బీజేపీ ఆయన రాకను స్వాగతించే అవకాశం ఉంది. పవన్, చంద్రబాబు, నరేంద్ర మోడీ ముగ్గురు చేతులు కలిపినట్లయితే, సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో కూడా ఒక బలీయమయిన శక్తిగా అవతరించగలరు.
పవన్ కళ్యాణ్ కాపుల మద్దతు కోసం తాను తహతహ లాడటం లేదని చెప్పినప్పటికీ, ఒకవేళ ఆయన తెదేపాతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, ఆ పార్టీకే మద్దతు ఇస్తామని చెపుతున్న కాపు సామాజిక వర్గం నేతలు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకే మద్దతు ఈయవచ్చును. అయితే పవన్ కళ్యాణ్ జంపింగ్ జిలానీలను, రాజకీయ బఫూన్లను తాను వ్యతిరేఖిస్తున్నాని, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే రాజకీయాలలోకి వస్తున్నానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పినందున, అటువంటి వారితోనే పూర్తిగా నిండిపోయున్న తెలుగుదేశం పార్టీతో ఆయన ఏవిధంగా పొత్తులు పెట్టుకోగలరో వేచి చూడాలి.
రాష్ట్ర విభజనకు కారణమయిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కండువాలు, జెండాలు, టోపీలు మార్చేసి సరికొత్త వేషాలతో ప్రజల ముందుకు వస్తున్న సంగతి పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు. మరి అటువంటి వారిని ఓడించాలని భావిస్తున్న ఆయన తెదేపాతో సహా కిరణ్, జగన్ పార్టీలలో ఉన్న కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొంటే, అన్ని పార్టీలతో ఆయన ఒకేసారి యుద్ధం చేయవలసి ఉంటుంది. అయితే ఆయన తను పదవుల కోసమో అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని స్పష్టం చేస్తున్నందున, ఆయన అందుకు వెనుకాడకపోవచ్చును. అదే జరిగితే కాంగ్రెస్ నేతలు ఏ కండువా కప్పుకొని పోటీ చేసినా వారికి పవన గండం తప్పదని చెప్పవచ్చును.
అయితే పవన్ కళ్యాణ్ ఈ వేడిని ఎంతకాలం నిలుపుకోగలడనే దానిపైనే ఆయన పార్టీ భవిష్యత్త్ మరియు ఇతర పార్టీలపై ఆయన ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అతను ఎంత త్వరగా, ఎంత సమర్ధంగా, బలంగా తన పార్టీని నిర్మించుకోగలడనే దానిపైన పవన్ కళ్యాణ్, జనసేనల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.