బొత్స కూడా కాంగ్రెస్ నుండి జంపైపోతున్నారా?
రాష్ట్ర విభజనకు ముందో తర్వాతో ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న బొత్స సత్యనారాయణకి ఉన్న పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఊడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవడంతో రవాణా శాఖ మంత్రి పదవి కూడా ఊడిపోయింది. ఇక రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన మూటగట్టుకొన్న అపకీర్తి మరేనేతకి దక్కలేదు. దానితో అటు స్వంత నియోజక వర్గంలో ప్రజల ఆదరణకి నోచుకోక, ఇటు పార్టీ ఆదరణకి నోచుకోక బొత్ససత్యనారాయణ చాలా దుర్భరమయిన పరిస్థితిలో ఉన్నారు. ఇది సరిపోదన్నట్లు ఇంతకాలం పీసీసీ అధ్యక్షుడిగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు చిరంజీవి, రఘువీరా రెడ్డి, పనబాక లక్ష్మి వారి క్రింద పనిచేయవలసి రావడం మరింత దుర్బరం. వారు తమ బస్సు యాత్రలో భాగంగా ఇటీవల విజయనగరం వచ్చినప్పుడు, బొత్స కూడా వారితో కలిసినప్పటికీ, జనాలు మొహం చాటేయడం చూస్తే బొత్స పరపతి ఎంతగా దిగజారిపోయిందో స్పష్టమవుతుంది.
అందుకే ఆయన పీసీసీ అధ్యక్ష పదవి ఊడిపోయినప్పటి నుండి ఉంగరం పోగొట్టుకొన్న చోటునే వెతుకోవాలన్నట్లు మళ్ళీ తన జిల్లా, తన చీపురుపల్లి నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించేదుకు గట్టిగా కృషి చేస్తున్నారు. అయితే మాజీ పీసీసీ అధ్యక్షుడయిన ఆయన, సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు బయలుదేరిన చిరంజీవి తదితరులతో కలవకుండా, తన నియోజక వర్గానికే పరిమితమవడం, పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో, ఆయన కూడా పార్టీ వీడేందుకు సిద్దం అవుతున్నారని ఒక ఆంగ్ల దిన పత్రికలో వార్త రావడంతో కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు.
అందరి కంటే మొట్ట మొదటగా స్పందించిన శాసనమండలి సభ్యుడు రుద్రరాజు పద్మరాజు ఆ వార్తను ఖండిస్తూ బొత్స ఒక కరడు గట్టిన కాంగ్రెస్ వాది అని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడరని గట్టిగా సర్టిఫై చేసేసారు. అయితే, బొత్స కంటే కరడుగట్టిన కాంగ్రెస్ వాదులని పేరుబడ్డ లగడపాటి, ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి, హర్ష కుమార్, రాయపాటి వంటివారు అనేకమంది పార్టీని వీడగా లేనిదీ బొత్స వీడితే ఆశ్చర్యం ఏముంటుంది? అని ఆలోచిస్తే అది సాధ్యమేనని అర్ధమవుతుంది.
ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వినవస్తున్నా, ఆయనను బీజేపీ అంగీకరించకపోవచ్చును. అందువలన ఆయన పార్టీని వీడాలంటే తనను భరించగలిగే పార్టీని కూడా చూసుకోవలసి ఉంటుంది. ఆయనకి తెదేపా, వైకాపాలలో వెళ్ళే అవకాశం లేదు కనుక ఇక మిగిలిన జై సమైక్యాంధ్ర పార్టీవైపే చూడక తప్పదు.
ఆయన ఆ జెండా పట్టుకొని బయలుదేరితే తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదమన్నట్లు తనపై పడిన సమైక్యద్రోహి ముద్రను చేరిపేసుకోవచ్చును, మళ్ళీ దైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడగవచ్చును. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అయితే స్థాపించారు గానీ బలమయిన నేతలు లేక ఉన్నవారిని నిలుపుకొనేందుకు చాలా ఆపసోపాలు పడుతున్నారు పాపం. అందువల్ల బొత్స వస్తానంటే నే వద్దంటానా...?అని ఆయనకు ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలుకవచ్చును. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎలాగు ఓడిపోయే అవకాశాలే ఎక్కువున్నాయి గనుక బొత్స కూడా దైర్యం చేసి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ కిరణ్ పార్టీలోకి లాంగ్ జంపైపోవడమే మేలేమో! ఆనక ఆ పార్టీ కూడా మళ్ళీ ఎలాగూ కాంగ్రెస్ పార్టీలోనే కలిసిపోతుంది గనుక పెద్దగా ఇబ్బందీ ఉండదు కూడా.
ఇక బొత్సకు పార్టీ మారే ఆలోచన కనుక లేకపోయినట్లయితే, ఆయన తనను పక్కనబెట్టిన కాంగ్రెస్ అధిష్టానానికి చిన్న జలక్ ఇచ్చేందుకే ఇటువంటి మీడియా లీక్ ఇచ్చేరేమోనని కూడా అనుమానించవలసి ఉంటుంది. ఈ వార్తపై బొత్స ఇంకా స్పందించకపోవడం చూస్తే నిప్పు లేనిదే పొగరాదని అనుకోవలసి ఉంటుంది.