టీడీపీకి ‘కన్నా’లు పొడుస్తున్నారు!
posted on Apr 9, 2014 @ 1:20PM
గుంటూరు-2 నియోజకవర్గంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను భారీ మెజారిటీతో గెలిపించడానికి తెలుగుదేశం నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ మాట చదివి మీకు కొన్ని సందేహాలు కలగొచ్చు. కాంగ్రెస్ నాయకుడైన కన్నా లక్ష్మీనారాయణని గెలిపించడానికి టీడీపీ నాయకులు కృషి చేయడమేంటబ్బా అని మీకు అనిపించడం న్యాయం. ఒకవేళ అలా జరుగుతోందంటే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌కి గుడ్ బై కొట్టేసి తెలుగుదేశంలో చేరబోతున్నారా అనే డౌట్ కూడా రావొచ్చు. కానీ, కన్నా అలా పార్టీ మారకుండానే కన్నా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే పరిస్థితులు కొంతమంది స్థానిక తెలుగుదేశం నాయకులు కల్పిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ వర్గాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఇష్యూ గురించి పూర్తి సమాచారం చిత్తగించండి...
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాషౌట్ అయిపోయింది. మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ గెలుపు కూడా డౌట్‌గానే వుంది. తెలుగుదేశం పార్టీ అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థిని నిలబెడితే కన్నా లక్ష్మీనారాయణ గుండెజారి, డిపాజిట్ గల్లంతయ్యే ఛాన్సుంది. ఈ విషయాన్ని ఆలోచించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థి కోసం అన్వేషించారు. ఆ అన్వేషణలో ఆయనకి సరైన వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు... తులసీ సీడ్స్ అధినేత రామచంద్రప్రభు. సౌమ్యుడిగా, సమర్థుడిగా, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం మీద పూర్తి అవగాహన వున్న వ్యక్తిగా, వివాద రహితుడిగా, సేవాభావం వున్న వ్యక్తిగా మంచి పేరు వున్న రామచంద్ర ప్రభును గుంటూరు-2 నియోజవర్గం నుంచి కన్నా మీద పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావించారు. ఈ మేరకు రామచంద్రప్రభును పిలిపించి మాట్లాడారు. కన్నా మీద పోటీ చేయాలని చంద్రబాబు కోరినప్పుడు రామచంద్రప్రభు తన అంగీకారాన్ని తెలిజేశారు.
రామచంద్రప్రభు గుంటూరు-2 నుంచి పోటీ చేయబోతున్నారన్న విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం నాయకులు ఉత్సాహంతో ఉరకలు వేశారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని ఫిక్సయిపోయారు. అయితే ఇక్కడే స్థానిక తెలుగుదేశంలో వున్న కొంతమంది సైంధవులు రామచంద్రప్రభు మీద తమ చాణక్య నీతి ప్రయోగించడం ప్రారంభించారు. నర్సరావుపేట ఎంపీ సీటు దక్కని మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి అక్కడి తెలుగుదేశంలో ఒక వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా మోదుగులను రెచ్చగొడుతోంది. మోదుగుల గుంటూరు-2లో పోటీ చేస్తే కాపు సామాజికవర్గం ఓట్లు రాలవని, ఓడిపోవడం ఖాయమని తెలిసి కూడా గుంటూరు-2 నియోజకవర్గ తెలుగుదేశం బాధ్యుడైన ‘ఒక పెద్దమనిషి’ ఆ దిశగానే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. సదరు పెద్దమనిషికి రామచంద్రప్రభు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తోంది.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్టుగా, పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి టిక్కెట్ ఇస్తానని చెప్పినా, స్థానిక తెలుగుదేశం కీలక నాయకుడు దానికి మోకాలు అడ్డే ప్రయత్నం చేయడం, చివరకు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం రామచంద్రప్రభుకు మనస్తాపం కలిగించినట్టు సమాచారం. ఇలాంటి అవమానకర వాతావరణంలో ఆయన గుంటూరు-2 నుంచి పోటీ చేయకుండా వుండటమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు-2 గంజాయి వనంలో తులసిమొక్కకు గౌరవాన్ని ఆశించడం అత్యాశే అయింది. అయితే సరైన అభ్యర్థి అయిన రామచంద్రప్రభు విషయంలో ఇలా వ్యవహరించడం మంచిది కాదని, ఆయన్ని వదులుకుంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోవడం ఖాయమని స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే గెలవాలన్న ఉద్దేశంతో వున్న కన్నా ఇప్పటికే 20 కోట్లు ఖర్చుపెట్టారట. తనమీద తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని నిలపకుండా ఓడిపోయే అభ్యర్థిని నిలిపేలా చేయడం కోసం కన్నా జిల్లా తెలుగుదేశం ‘పెద్దలతో’ టచ్‌లో వున్నట్టు వినికిడి. ఈ విషయంలో డబ్బు భారీగా చేతులు మారినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు-2 నియోజకవర్గం విషయంలో జరుగుతున్న ఈ అంతర్గత రాజకీయం గురించి, తెలుగుదేశం పార్టీకి ‘కన్నా’లు పొడుస్తున్న నాయకుల గురించి పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.