చంద్రబాబు, కిరణ్ ప్రసంగాల తీరు ఎట్టిదనినా..
ఈ రోజు (బుదవారం) వైజాగ్ లో తెదేపా ప్రజా గర్జన సభ, రాజమండ్రీలో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యంద్ర పార్టీ సభ జరిగాయి. కిరణ్ సభతో పోలిస్తే తెదేపా సభకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. కిరణ్ ఇంకా రాష్ట్రం పూర్తిగా విడిపోలేదని, సమైక్యంగా ఉంచే అవకాశం ఉందని చెపితే, చంద్రబాబు రాష్ట్ర విభజన జరిగిపోయింది గనుక ఇక అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవలసి ఉందని చెప్పడం విశేషం. ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరుని తీవ్రంగా విమర్శించారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పటికీ, కిరణ్ మాత్రం ఈసారి కూడా సోనియా, రాహుల్ జోలికి పోకుండా విభజన గురించే మాట్లాడి సరిపెట్టేసారు. అయితే కొంచెం దైర్యం చేసి సోనియమ్మ పెద్దమ్మ అని సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అని, వారిద్దరూ కలిసి రాష్ట్ర విభజన చేసారని అనగలిగారు.
చంద్రబాబు మాత్రం షరా మామూలుగా సోనియాను అవినీతి అనకొండ అని, రాహుల్ గాంధీ అసమర్దుడని, ప్రధాని డా.మన్మోహన్ సింగ్ సోనియా చేతిలో రోబోట్ వంటి వారని, ఆయన కంటే రజనీ కాంత్ రోబోట్ అయితే ఇంకా సమర్ధంగా పనిచేసేదని ఎద్దేవా చేసారు. ఆయన కాంగ్రెస్ పార్టీని పది తలల రావణాసురుడితో పోల్చి వాటిలో జగన్, కిరణ్, కేసీఆర్, బొత్స ఇతర కాంగ్రెస్ నేతలు అందరూ ఒక్కో తలవంటి వారని, ఒక తలనరికితే మరొక కొత్త తల పుట్టుకొస్తూనే ఉంటుందని అందువల్ల, దానిని ప్రజలు రానున్న ఎన్నికలలో పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప దానికి అంతం ఉండదని అన్నారు.
ఇక చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా తమ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వల్లెవేసారు. కిరణ్ తను పదవి చెప్పట్టేనాటికి రాష్ట్రం అప్పులలో కూరుకు పోయుందని, కానీ తాను కేవలం ఒకటి రెండేళ్ళలోనే తిరిగి గాడిన పెట్టగలిగానని చెప్పారు. అయితే తన సమర్ధతను గురించి చెప్పుకొనే ఆత్రంలో అంతకు ముందు కూడా తమ కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలించిందన్న సంగతి మరిచిపోయారు. అంటే వైయస్సార్ పాలన సరిగ్గా లేదని ఆయనే స్వయంగా ద్రువీకరించినట్లయింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి కిరణ్ మాట్లాడినా దాని గురించి లోతుగా వెళ్ళే దైర్యం చూపకపోవడంతో ప్రజల నుండి ఎటువంటి స్పందన రాలేదు. కానీ, అదేవిషయం గురించి ప్రజాగర్జన సభలో చంద్రబాబు మాట్లాడుతున్నపుడు ప్రజల నుండి మంచి స్పందన కనబడింది. కిరణ్, తనకు బాగా పట్టున్న గణాంకాలను తన ప్రసంగంలో వల్లే వేయడం వలన అది చాలా నిరాసక్తంగా మారింది. చంద్రబాబు పదేపదే తన గొప్పలు చెప్పుకోవడం కూడా కొంచెం అతిగా కనిపించింది.
చంద్రబాబు ఇద్దరూ కూడా తమకు పదవీ, అధికారాల మీద మమకారంలేదని కేవలం తెలుగు ప్రజల సంక్షేమం కోసమే ఈ భాద్యతను తమ భుజాల మీద వేసుకొన్నామని అన్నారు. కిరణ్ తాను ప్రజల కోసం తన అధిష్టానాన్నే ధిక్కరించి పదవిని తృణ ప్రాయంగా వదులుకొన్న త్యాగాశీలినని, మిగిలిన ముగ్గురూ-చంద్రబాబు, జగన్ మరియు కేసీఆర్ లు ముఖ్యమంత్రి పదవి కోసమే ఆరాటపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తనకు ఎటువంటి కుటుంబ బాధ్యతలు, అవసరాలు, కోర్కెలు, పదవీ కాంక్ష లేవని, తనను, తన పార్టీని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలు కష్టాలలో ఉన్నందునే ముందుకు వస్తున్నానని తెలుపుతూ, మిగిలిన ముగ్గురూ-కేసీఆర్, కిరణ్, జగన్ కాంగ్రెస్ తరపున పనిచేస్తున్న డమ్మీ నేతలని ఎద్దేవా చేసారు.
కిరణ్ తనపార్టీ తరపున యువకులను ఎన్నికలలో నిలబెడతానని చెపితే, చంద్రబాబు బీసీ, యస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. కిరణ్ తనకు 25 యంపీ సీట్లు ఇస్తే, కేంద్రంతో పోరాడి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని చెపితే, చంద్రబాబు ఆంధ్ర, తెలంగాణాలలో తన యంపీలందరినీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రెండు రాష్ట్రాల పునర్నిర్మాణానికి అవసరమయిన నిధులు తీసుకు వచ్చి రెండు రాష్ట్రాలని విదేశాలకు తీసిపోని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.
చంద్రబాబు హామీలు, ప్రసంగం నిర్మాణాత్మకంగా, ఆశాజనాకంగా ప్రజలకు భరోసా ఇస్తూ సాగగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగంలో అటువంటివేమీ కనబడలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్ర పునర్నిమాణం గురించి ఎక్కువగా మాట్లాడితే, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో తాను కనబరిచిన నిబద్దత, పోరాట పటిమ గురించే ఎక్కువ మాట్లాడారు. ఆయన నేటికీ సమైక్య కార్డుతో గేమ్ ఆడుతున్నారు గనుక తన పార్టీ ఎన్నికలలో గెలిస్తే రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేసుకొన్నారు. దాని గురించి మాట్లాడితే ఆయన చేస్తున్న సమైక్యవాదానికి అర్ధం లేకుండా పోతుంది.