కిరణ్ కు చివరకు మిగిలేది గోడ ముక్కేనా

  నల్లారి వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు స్పందించకుండా ఊరుకుని, ఇంకా చివరి బంతి పడలేదు, ఆట ముగిసిపోలేదు అంటూ వ్యాఖ్యానించిన కిరణ్ కుమార్ రెడ్డి.. పార్లమెంటు ఉభయ సభలలోను రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన వెంట పట్టుమని పదిమంది నాయకులు కూడా ఉన్న పాపాన కనిపించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తానంటూ గొంతుచించుకుని మైకు పట్టుకుని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు తాను స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో తానొక్కరే మిగిలేలా ఉన్నారు. ఆయనతో పాటు పలు సందర్భాల్లో ఆయన చూపిస్తున్న బెర్లిన్ గోడ ముక్క కూడా ఉండేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.   కిరణ్ కుమార్ రెడ్డి అనుంగు అనుచరులుగా భావిస్తున్నవాళ్లంతా ఒక్కొక్కరుగా ఆయన పెట్టిన పార్టీకి దూరం అయిపోతున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారం ఊపందుకోక ముందే జేఎస్పీకి నాయకులు దండం పెట్టేస్తున్నారు. మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ పక్కచూపులు చూస్తున్నారు. అందరికంటే ముందుగా మేల్కొన్న వ్యక్తి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్. టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమైపోయినట్లు సమాచారం.   మరో సీనియర్ నేత సాయిప్రతాప్ కూడా కిరణ్ పార్టీలో ఉంటే పరువు దక్కదని డిసైడైపోయారట. అందరికంటే ముందు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వెంట కుడిభుజంగా నిలిచిన పశ్చిమగోదావరి జిల్లా నేత పితాని సత్యనారాయణ కూడా.. ఇప్పుడు జేఎస్పీలో ఉంటే కష్టమని నిర్ణయించుకుని టాటా చెప్పేద్దామనుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా చూస్తుంటే చివరాఖరుకు పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరు, ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న బెర్లిన్ గోడముక్క మాత్రమే మిగిలినా ఆశ్యర్యపోనవసరం లేదని జేఎస్సీ వర్గాలే గుసగుస లాడుతున్నాయట.

ఆ అడుగులన్నీ టీడీపీ వైపే

  కాంగ్రెస్ నేతల అడుగులన్నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంవైపే పడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సాయి ప్రతాప్ టీడీపీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలతో వీరు ఇప్పటికే సంప్రదింపుల్లో ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో వీరిద్దరూ చంద్రబాబును కలిసి మాట్లాడనున్నారని చెబుతున్నారు. వీరిలో ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట ఈసారి నెల్లూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, అది ఇప్పటికే వేరొకరికి ఖాయం అయింది. ఆయన పేరును ఒంగోలుకు పరిశీలించడానికి టీడీపీ సుముఖంగా ఉంది. సాయిప్రతాప్ ఈసారి కూడా సుదీర్ఘకాలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట ఎంపీ సీటును కోరుకొంటున్నారు. అక్కడ ఆయనకు కొంత పోటీ ఉన్నా టీడీపీ నాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. పార్టీలో చేరడానికి తనకు ఆసక్తి ఉందన్న సంకేతాలను ఆయన పంపిస్తున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఆయన చంద్రబాబును కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.   అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా, కృష్ణా జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి మాట్లాడినట్లు సమాచారం. గుప్తా ఇప్పుడు కూడా గుంతకల్లు సీటును ఆశిస్తుండగా పద్మజ్యోతి ఎక్కడైనా ఎంపీ సీటును కోరుకొంటున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న మహారాజుల కుటుంబానికి చెందిన సోదరులు నరేశ్, దినేశ్ మంగళవారం చంద్రబాబును కలిశారు. వీరిలో నరేశ్ మాజీ మంత్రి మాణిక్‌రావు కుమారుడు. ఆయనకు ఈసారి తాండూరు టికెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.   హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ స్వప్నారెడ్డి కూడా మంగళవారం చంద్రబాబును కలిశారు. దివంగత టీడీపీ నేత ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుని కుటుంబానికి చెందిన స్వప్నారెడ్డి.. ఈసారి నల్లగొండ జిల్లా భువనగిరి లేదా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

బొత్స కూడా కాంగ్రెస్ నుండి జంపైపోతున్నారా?

  రాష్ట్ర విభజనకు ముందో తర్వాతో ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న బొత్స సత్యనారాయణకి ఉన్న పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఊడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవడంతో రవాణా శాఖ మంత్రి పదవి కూడా ఊడిపోయింది. ఇక రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన మూటగట్టుకొన్న అపకీర్తి మరేనేతకి దక్కలేదు. దానితో అటు స్వంత నియోజక వర్గంలో ప్రజల ఆదరణకి నోచుకోక, ఇటు పార్టీ ఆదరణకి నోచుకోక బొత్ససత్యనారాయణ చాలా దుర్భరమయిన పరిస్థితిలో ఉన్నారు. ఇది సరిపోదన్నట్లు ఇంతకాలం పీసీసీ అధ్యక్షుడిగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు చిరంజీవి, రఘువీరా రెడ్డి, పనబాక లక్ష్మి వారి క్రింద పనిచేయవలసి రావడం మరింత దుర్బరం. వారు తమ బస్సు యాత్రలో భాగంగా ఇటీవల విజయనగరం వచ్చినప్పుడు, బొత్స కూడా వారితో కలిసినప్పటికీ, జనాలు మొహం చాటేయడం చూస్తే బొత్స పరపతి ఎంతగా దిగజారిపోయిందో స్పష్టమవుతుంది.   అందుకే ఆయన పీసీసీ అధ్యక్ష పదవి ఊడిపోయినప్పటి నుండి ఉంగరం పోగొట్టుకొన్న చోటునే వెతుకోవాలన్నట్లు మళ్ళీ తన జిల్లా, తన చీపురుపల్లి నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించేదుకు గట్టిగా కృషి చేస్తున్నారు. అయితే మాజీ పీసీసీ అధ్యక్షుడయిన ఆయన, సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు బయలుదేరిన చిరంజీవి తదితరులతో కలవకుండా, తన నియోజక వర్గానికే పరిమితమవడం, పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో, ఆయన కూడా పార్టీ వీడేందుకు సిద్దం అవుతున్నారని ఒక ఆంగ్ల దిన పత్రికలో వార్త రావడంతో కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు.   అందరి కంటే మొట్ట మొదటగా స్పందించిన శాసనమండలి సభ్యుడు రుద్రరాజు పద్మరాజు ఆ వార్తను ఖండిస్తూ బొత్స ఒక కరడు గట్టిన కాంగ్రెస్ వాది అని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడరని గట్టిగా సర్టిఫై చేసేసారు. అయితే, బొత్స కంటే కరడుగట్టిన కాంగ్రెస్ వాదులని పేరుబడ్డ లగడపాటి, ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి, హర్ష కుమార్, రాయపాటి వంటివారు అనేకమంది పార్టీని వీడగా లేనిదీ బొత్స వీడితే ఆశ్చర్యం ఏముంటుంది? అని ఆలోచిస్తే అది సాధ్యమేనని అర్ధమవుతుంది.   ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వినవస్తున్నా, ఆయనను బీజేపీ అంగీకరించకపోవచ్చును. అందువలన ఆయన పార్టీని వీడాలంటే తనను భరించగలిగే పార్టీని కూడా చూసుకోవలసి ఉంటుంది. ఆయనకి తెదేపా, వైకాపాలలో వెళ్ళే అవకాశం లేదు కనుక ఇక మిగిలిన జై సమైక్యాంధ్ర పార్టీవైపే చూడక తప్పదు.   ఆయన ఆ జెండా పట్టుకొని బయలుదేరితే తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదమన్నట్లు తనపై పడిన సమైక్యద్రోహి ముద్రను చేరిపేసుకోవచ్చును, మళ్ళీ దైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడగవచ్చును. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అయితే స్థాపించారు గానీ బలమయిన నేతలు లేక ఉన్నవారిని నిలుపుకొనేందుకు చాలా ఆపసోపాలు పడుతున్నారు పాపం. అందువల్ల బొత్స వస్తానంటే నే వద్దంటానా...?అని ఆయనకు ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలుకవచ్చును. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎలాగు ఓడిపోయే అవకాశాలే ఎక్కువున్నాయి గనుక బొత్స కూడా దైర్యం చేసి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ కిరణ్ పార్టీలోకి లాంగ్ జంపైపోవడమే మేలేమో! ఆనక ఆ పార్టీ కూడా మళ్ళీ ఎలాగూ కాంగ్రెస్ పార్టీలోనే కలిసిపోతుంది గనుక పెద్దగా ఇబ్బందీ ఉండదు కూడా.   ఇక బొత్సకు పార్టీ మారే ఆలోచన కనుక లేకపోయినట్లయితే, ఆయన తనను పక్కనబెట్టిన కాంగ్రెస్ అధిష్టానానికి చిన్న జలక్ ఇచ్చేందుకే ఇటువంటి మీడియా లీక్ ఇచ్చేరేమోనని కూడా అనుమానించవలసి ఉంటుంది. ఈ వార్తపై బొత్స ఇంకా స్పందించకపోవడం చూస్తే నిప్పు లేనిదే పొగరాదని అనుకోవలసి ఉంటుంది.

ఈ గురుశిష్యుల గోలేంటో!

  జనాన్ని కన్ఫ్యూజ్ చేయడంలో గురువే పెద్ద మాస్టర్ అనుకుంటే, శిష్యుడు గురువుకంటే పెద్ద ముదురులా కనిపిస్తున్నారు. ఈ గురుశిష్యులిద్దరికీ ప్రస్తుతం ఒకరంటే ఒకరికి పడకపోయినప్పటికీ వెరైటీ స్టేట్‌మెంట్లు ఇవ్వడంలో మాత్రం ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఎవరా గురుశిష్యులనుకుంటున్నారా? ఇంకెవరూ ఘనతవహించిన అన్నా హజారే... అరవింద్ కేజ్రీవాల్. మొదట అన్నా హజారే విషయానికి వస్తే, కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయినప్పుడు అన్నా హజారే కేజ్రీవాల్‌కి తన మద్దతు వుండదని ప్రకటించాడు. అన్నా మద్దతు లేకపోయినా కేజ్రీవాల్ ఢిల్లీ మీద ప్రభావం చూపించాడు. నలభై రోజులపాటు ముఖ్యమంత్రి గిరీ వెలగబెట్టాడు. కేజ్రీ ముఖ్యమంత్రి కాగానే అన్నా చాలా మురిసిపోతూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తనకి సంతోషాన్ని కలిగిస్తోందని, తాను ఇది ముందే ఊహించానని చెప్పాడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే అన్నా ప్రేమని కురిపిస్తున్నాడని అప్పుడు జనం అనుకున్నారు. అలాగే మొన్నీమధ్య మమతా బెనర్జీ అన్నాని కలిసి ఆయన కాళ్ళమీద పడిపోయింది. దాంతో మురిసిపోయిన అన్నా ఈ ఎన్నికలలో తన మద్దతు మమతా బెనర్జీకే వుంటుందని ప్రకటించాడు. వారం తిరిగిందో లేదో మమతా బెనర్జీకి తన మద్దతు లేదని మళ్ళీ ప్రకటించాడు. మనసెందుకు మార్చుకున్నావు పెద్దాయనా అంటే మమత నచ్చిందిగానీ, ఆమె చుట్టూ వున్నవాళ్ళు మాత్రం తనకి నచ్చలేదని, అందుకే మమతకి మద్దతు ఉపసంహరించానని సెలవిచ్చారు. అన్నా చేసే కంగాళీ ఇలా వుంటే, కేజ్రీవాల్ చేసే క్రేజీ పనులు మరోలా వున్నాయి. ముఖ్యమంత్రిగా నలభై రోజులు వెలగబెట్టి పరువు మొత్తం పోగొట్టుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు ఇస్తున్న స్టేట్‌మెంట్లు చాలా విచిత్రంగా వుంటున్నాయి. మీడియా బీజేపీకి అమ్ముడు పోయిందని, మీడియా ప్రతినిధులని జైల్లో పెట్టిస్తానని కేజ్రీవాల్ అన్న మాటలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి. ఆ తర్వాత రాజకీయ నాయకులకు సహజమైన ‘నేనలా అనలేదు.. నా మాటల్ని వక్రీకరించారు’ అంటూ కేజ్రీవాల్ తప్పించుకున్నాడు. నిన్నగాక మొన్న వారణాసిలో నరేంద్రమోడీ మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, ఆ తర్వాత తనకి అంత సీన్ లేదని అర్థం చేసుకున్నాడు. రెండు చోట్ల పోటీ చేయడం మా పార్టీ సిద్ధాంతానికి విరుద్ధమని ఆ తర్వాత ప్రకటించాడు. మొత్తమ్మీద జనాన్ని అయోమయానికి గురిచేయడంలో గురుశిష్యులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

కారులో ఉద్యమకారులకు చోటు లేదట

  తెలంగాణలో టీఆర్ఎస్ తరఫు నుంచి అరిచేవాళ్ళే తప్ప ఎన్నికలలో గెలిచేవాళ్ళు లేనట్టు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు వారు కూడా ఎన్నికలలో నిలబడటానికి పనికిరార న్నట్టుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం ఉద్యమకారుల్ని, కవుల్ని, కళాకారుల్ని వాడుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళని దూరంగా పెడుతున్నాడు. ప్రజల్లో మంచి గుర్తింపు వున్న వారు కూడా కేసీఆర్‌ని టిక్కెట్ కోసం అభ్యర్థిస్తుంటే వాళ్ళని పట్టించుకోవడం లేదు. డబ్బు పెట్టి గెలిచే సత్తా వున్నవారికే టిక్కెట్లన్నట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   అమరవీరుల కుటుంబాలకు బోలెడన్ని టిక్కెట్లు పేలాలు పంచినట్టు పంచుతానని గతంలో ప్రకటించిన కేసీఆర్ తీరా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టిక్కెట్ అడిగితే కాదు పొమ్మన్నాడు. తీరా ఆమె తనకి టిక్కెట్ ఇవ్వకపోతే తన కొడుకులాగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మూడు రోజుల ‘డెడ్‌లైన్’ విధించేసింది. దాంతో దారికొచ్చిన కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని ఓ అసెంబ్లీ టిక్కెట్‌ని ఆమెకి కేటాయించినట్టు హామీ ఇచ్చి బుజ్జగించాడు. కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోతే శంకరమ్మకి తాము టిక్కెట్ ఇస్తామని అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం ప్రకటించడంతో కేసీఆర్‌కి ఇంతకంటే మరో దారి లేకపోయింది. అయితే శంకరమ్మ ఆవేశాన్ని చల్లార్చి, ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కడానికే కేసీఆర్ ఆమెకి టిక్కెట్ ఇచ్చాడని తెలంగాణవాదులు భావిస్తున్నారు. కొంతకాలం తర్వాత శంకరమ్మకి ఏదో ఒక కాకమ్మ కథ చెప్పి ఆమెని మెల్లగా పోటీ నుంచి తప్పించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.   కేసీఆర్ దగ్గరకి టిక్కెట్ కావాలని ఎవరు వచ్చినా, వాళ్ళకి టిక్కెట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఫ్యూచర్లో నిన్ను ఎమ్మెల్సీ చేస్తా’ అంటూ హామీలు ఇచ్చి పంపించేస్తున్నాడు. టీఆర్ఎస్‌కి ఇప్పటికీ తెలంగాణలో సగానికి పైగా సీట్లలో గెలిచే అభ్యర్థులే లేరు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలలో వున్న గెలుపు గుర్రాలకు పగ్గాలు వేయడానికి ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు మా పార్టీలో గెలుపు గుర్రాలకు కొదువలేదని చెబుతున్న కేసీఆర్ చాణక్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

జగన్ కు రాష్ట్రాన్ని పాలించే శక్తి లేదా?

  వైఎస్ జగన్ ను చిన్నతనం నుంచి చూసినవారిలో సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. అతనికి రాష్ట్రాన్ని పాలించే శక్తి లేదని జేసీ తేల్చిచెప్పేశారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, తాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన పాలనను పొగిడానని గుర్తుచేశారు. అదీ చంద్రబాబుకు.. జగన్ కు ఉన్న తేడా. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అపార అనుభం చంద్రబాబు సొంతం. రాష్ట్రంలో ఐటీ రంగానికి పునాదులు వేయడానికి ఫైళ్లు చేతపట్టుకుని ఎన్ని దేశాల్లో ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగారో ఆయనకే తెలుసు. అందుకే కొత్త రాజధాని నిర్మాణం అంటే ఎలా చేయాలన్న విషయమై తన విజన్ ను ఆయన తన మేనిఫెస్టోలో చూపిస్తున్నారు. సీమాంధ్రను సింగపూర్ లా చేస్తానంటే.. అక్కడ వ్యవసాయం లేదని, అంటే సీమాంధ్ర మొత్తమ్మీద వ్యవసాయమే లేకుండా చేస్తారా అని జగన్ అండ్ కో విమర్శలు చేయడం మనకు తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతంలో నానాటికీ వ్యతిరేకత తగ్గించుకుంటూ బలం పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీని చూసి భయాందోళనలతో ఇలాంటి విమర్శలు చేస్తున్నారే తప్ప చంద్రబాబు విజన్ వాళ్లకు తెలియక కాదన్నది టీడీపీ నాయకుల అభిప్రాయం.   క్రైసిస్ మేనేజ్ మెంట్ విషయంలో చంద్రబాబు చొరవను కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా కూడా శభాష్ అనకుండా ఉండలేని సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కోనసీమ ప్రాంతంలో 1996 నవంబరులో పెను తుఫాను వచ్చినప్పుడు అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడకు తరలించి, మినీ సెక్రటేరియట్ నే ఏర్పాటుచేసి అతి తక్కువ కాలంలో ఆ ప్రాంతం తుఫాను విలయం నుంచి కోలుకునేలా చేసింది చంద్రబాబేనని ఇప్పటికీ కోనసీమవాసులు చెప్పుకొంటారు. జీఎంసీ బాలయోగి లాంటి నాయకులు ఆ సమయంలో లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించి, ఈ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వేయించారని, దానివల్లే ఇప్పటికీ రవాణా సదుపాయాలు బాగున్నాయని, ఇదంతా చంద్రబాబు నాయకత్వ ప్రతిభేనని కోనసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికీ అంటున్నారు.   తండ్రి మరణించిన కొద్ది రోజులకే అధికార పీఠాన్ని అందుకోడానికి హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప, కొత్త రాష్ట్ర పునర్నిర్మాణం గురించి నిర్మాణాత్మకంగా ఒక్క ముక్క కూడా చెప్పని జగన్, ఆయన చుట్టూ ఉన్న భజన బృందం సీమాంధ్రలో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు సాగబోవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నాలుగు దశాబ్దాల బంధం.. తెగిపోయింది

  ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని కష్టకాలంలో కూడా ఏనాడూ పార్టీ గీత దాటని జేసీ కుటుంబం ఎట్టకేలకు ఆ పార్టీని వీడింది. మాజీ మంత్రి, అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్ గా ఇన్నాళ్లు నిలిచిన జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీతో తన సుదీర్ఘబంధాన్ని తెంచుకున్నారు. ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన సమయంలోనూ కాంగ్రెస్‌లోనే కొనసాగిన జేసీ కుటుంబం ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పేసింది. జేసీ దివాకరరెడ్డి తండ్రి నాగిరెడ్డి ఆ పార్టీ తరఫున చాలా కాలం క్రితం రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన దివాకరరెడ్డి 1972లో మొదటిసారి సమితి అధ్యక్షునిగా గెలుపొందారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టు రాకపోవడంతో తాడిపత్రి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేశారు. ఆయనకు రెండో స్ధానం వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి మూడో స్ధానం వచ్చింది. టీడీపీ ఆ ఒక్కసారే అక్కడ గెలిచింది. 1985లో కాంగ్రెస్ టికెట్టు పొందిన జేసీ అప్పటి నుంచి 2009 దాకా ప్రతి ఎన్నికలో గెలుస్తూ వచ్చారు.   కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాల్లో కొన్నిసార్లు అసంతృప్త నేతగా ఉన్నా దివాకరరెడ్డి గతంలో ఎప్పుడూ పార్టీని వీడే యోచన చేయలేదు. కోట్ల వర్గంలో ఉన్న ఆయన అప్పట్లో వైఎస్‌పై తీవ్ర స్ధాయిలో పోరాడారు.వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత రాజీపడ్డారు. కానీ వైఎస్ కుటుంబంతో దూరం కొనసాగుతూ వచ్చింది. ఆ కారణం వల్లే ఆయన వైసీపీ వైపు చూడకుండా కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌తో పూర్తిగా విభేదించి ఇప్పుడు బయటకు వచ్చేశారు.   జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం టీడీపీతో పోరాటం చేసిన ఆయన ఆ పార్టీలో చేరటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకించి టీడీపీలో కొందరు ఆయన రాకను వ్యతిరేకించారు. కానీ దివాకరరెడ్డి తన లౌక్యంతో వారిని సమాధానపర్చగలిగారు.'టీడీపీ నా వద్దకు రాలేదు. నేనే టీడీపీ వద్దకు వెళ్లాను' అని ఆయన చేసిన ప్రకటన జిల్లాలో టీడీపీ నాయకులను శాంతపర్చింది.

ఆయనొస్తున్నాడా? అయితే ఏంటంట?

      నిన్న మొన్నటి వరకు తెలుగు ఛానళ్ళలో ‘ఆయనొస్తున్నాడు’ అనే ప్రకటనలు హడావిడి సృష్టించాయి. ఈ ప్రకటనల సారాంశం ఏంటంటే, సామాన్య ప్రజలకు ఏదో సమస్య వస్తుంది. రాజకీయ నాయకులు ఆ సమస్యని పట్టించుకోరు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రాజకీయ నాయకులు నిర్లక్ష్యంగా మాట్లాడతారు. చివరికి ప్రజల్లో ఓ కేరెక్టర్ రాజకీయ నాయకులని నీచంగా చూస్తూ, చూపుడు వేలు గాల్లోకి తిప్పుతూ ‘ఆయనొస్తున్నాడు’ అంటుంది. ఎవరాయన? రాజకీయ నాయకుడు ప్రశ్నిస్తే ఆయన ఎవరో కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుత్రరత్నం జగన్ అనే విషయం రివీల్ అవుతుంది. వెంటనే ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ బొంగురు గొంతు ‘ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి.. దుమ్ము దులిపేయండి’ అని సందేశం ఇస్తుంది.   గత కొంతకాలంగా ఈ ప్రకటన చూసి రాష్ట్రంలో ప్రజలందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. ప్రకటనలో కేరెక్టర్ ఆయనొస్తున్నాడు అంటూ గాల్లోకి వేలు తిప్పడం చాలామందికి అర్థం కావడం లేదు. అలా వేలు తిప్పడం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి కారణమైన హెలికాప్టర్ని సూచిస్తోందా? ఇక మిగిలేది సున్నానే అనే అర్థమా అనేది అర్థం కాక జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ తర్వాతగాని అలా వేలు తిప్పడం ఫ్యాన్ గుర్తుకు సింబాలిక్ అని అర్థం చేసుకున్నారు. గత కొంతకాలంగా తెలుగు ప్రజలకు నవ్వుల్ని పంచుతున్న ఈ ప్రకటనలు సడెన్‌గా ఛానెళ్ళలోంచి మాయమైపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు.  తమ నవ్వులకు ఆటంకం కలిగించిన కారణాలేంటా అని పరిశోధిస్తే ఆస్తకికరమైన విషయాలు  తెలిశాయి. వైఎస్సార్సీపీ ఈ ప్రకటనలని అనేక  ఛానెళ్ళలో ప్రసారం చేసింది. తమ అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయకూడదని ఎన్నికల కమిషన్ అభ్యంతర పెట్టింది. దాంతో వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌కి ఈ ప్రకటనల ప్రసారం చేయడానికి అనుమతి కోరుతూ లేఖ రాసింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనల ప్రసారానికి అంగీకరింబోనని స్పష్టం చేసింది. ఆయనొస్తున్నాడా? అయితే ఏంటంట? అని చెప్పకనే చెప్పేసింది.

కాంగ్రెస్ ‘తుస్సు’ యాత్ర!

      సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యాత్రని ‘బస్సు’ యాత్ర అని పిలవడం కంటే ‘తుస్సు’ యాత్ర అని పిలిస్తే కరెక్ట్ గా సూటవుతుందని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడితో సహా సీమాంధ్ర కాంగ్రెస్‌లోవున్న ముఖాలన్నీ సీమాంధ్ర ప్రజలు చూడ్డానికి కూడా ఇష్టపడని ముఖాలే. వీళ్ళని చూడ్డానికి ఎవరూ రారు కాబట్టి సినీ గ్లామర్ వున్న చిరంజీవిని వెంట పెట్టుకుని బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఈ బస్సు యాత్ర చప్పచప్పగా సాగుతోంది. ఈమధ్యకాలంలో ఇంత చప్పగా జరుగుతున్న బస్సు యాత్ర మరొకటి లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.   రోజూ కొన్ని ఊళ్ళకి వెళ్ళడం, అక్కడ ఓ ప్రెస్ మీట్ లాంటిది పెట్టడం, రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ ఒక్కదానిదే కాదు, అన్ని పార్టీలూ ఓకే అన్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ విభజనకి ఒప్పుకుందని చెప్పిన పాయింటే అరిగిపోయిన రికార్డులాగా చెప్పడం.. ఇదే వరస! ఈ ప్రెస్ మీట్స్ లో చిరంజీవి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఆయనకు వున్న రాజకీయ అపరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ చిరంజీవి మాట్లాడుతున్న మాటలు చిరంజీవి మీద చిరాకు పెంచి, కిరణ్ కుమార్ మీద అభిమానం పెంచేలా వుంటున్నాయి. రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనం కూడా వుంటుందా అన్నట్టుగా చిరంజీవి ప్రసంగం సాగుతోందని విమర్శకులు అంటున్నారు. కాంగ్రెస్ గర్భంలో కలిసిపోయిన పిఆర్పీ పార్టీకి చెందిన ఓ కార్యకర్త అందరిముందు చిరంజీవిని ఛీకొడుతూ ‘పార్టీని అమ్ముకోవడానికి సిగ్గులేదా?’ అని అడిగేయడం, పిఆర్పీ ఐడెంటిటీ కార్డ్ ని ముక్కలు చేసేయడం బాబోయ్ దారుణం. ఇంత జరిగినా చిరంజీవి తుడిచేసుకుని బస్సు యాత్రలో పాల్గొనడం ఇంకా దారుణం.  ఇక రోడ్ షోల విషయానికి వస్తే, వాటికి ‘రోడ్ షో’ లాంటి భారీ మాటలను ఉపయోగించడం అనవసరమన్న అభిప్రాయం కలుగుతోంది. సాక్షాతూ చిరంజీవి వచ్చి రోడ్డు మధ్యలో నిలబడినా పట్టుమని వందమంది కూడా జనం రావడం లేదంటే కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న బస్సు యాత్ర ఎంత తుస్సుమందో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి కాకుండా యాత్రలో పాల్గొంటున్న మిగతా నాయకులను చూసిన సామన్య జనం ‘వీళ్ళెవరబ్బా.. ఎక్కడా చూసినట్టు లేదే’ అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సు యాత్రకి బ్రేకులేస్తే బెటరన్న అభిప్రాయాలని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  

కమ్యూనిస్టుల కితకితలు!

      ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు తెలుగు ప్రజలకు కితకితలు పెట్టి నవ్వించడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కాకపోతే, వాళ్ళు కితకితలు పెడుతుంటే నవ్వు రావడానికి బదులు ఏడుపు వస్తూ వుండటమే బ్యాడ్‌లక్. నిన్నటి వరకూ ఉప్పూ నిప్పుల్లా వున్న సీపీఎం, సీపీఐ పార్టీలు ఎన్నికలు రాగానే భుజాల మీద చేతులు వేసుకున్నాయి. నిన్నటి వరకూ ఒకరి మీద మరొకరు కారాలు మిరియాలు నూరుకున్న ఈ రెండు పార్టీల నాయకులు కలసి ప్రెస్ మీట్లు పెట్టి కిలకిలా నవ్వుకుంటూ మీడియాకి పోజులిస్తున్నారు. ఇదిలా వుంటే, సీపీఐ నాయకుడు నారాయణ చిన్నప్పుడు చదువుకున్న ‘తనకు మాలిన ధర్మం మొదలు చెడిన బేరం’ అనే సామెతని మరచిపోయినట్టున్నాడు. అందుకే తనకు సంబంధం లేని పనులని భుజాన వేసుకుని లాభం పొందే ప్రయత్నాలు చేస్తున్నాడు.   ఇంతకీ ఆ పనేంటయ్యా అంటూ, ప్రస్తుతం రాష్ట్రంలో తిట్టిన తిట్టు తిట్టుకోకుండా తెగ తిట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నానని నారాయణ ప్రకటించాడు. వాళ్ళకి లేని బాధ నీకెందుకయ్యా, మధ్యలో నిన్ను రాయబారి చేయమని ఎవరైనా అడిగారా అనే ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెబుతున్నాడు. ప్రజల సంక్షేమాన్ని కోరుకునే తాను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీని కలిపే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు. ఈ రెండు పార్టీలు కలవటం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరిగే అవకాశం వుందని అంటున్నాడు. నారాయణ గారి బుర్రలో వున్నది తెలంగాణ ప్రజల మేలు కాదని, ఈ రెండు పార్టీలకు సయోధ్య కుదిర్చి రాజకీయంగా లాభం పొందే ఆలోచనలో ఆయన ఉన్నారన్నది ఎంత అమాయకులకైనా అర్థమైపోయే విషయం. అంచేత నారాయణ ఇలాంటి సూపర్ తెలివితేటల ప్రదర్శన మానుకుని నిజంగా జనానికి ఉపయోగపడే విషయాల గురించి ఆలోచిస్తే మంచిదని విమర్శకులు సలహా ఇస్తున్నారు. ఇదిలా వుంటే, నిన్నటి వరకూ సమైక్యం అని గొంతు చించుకున్న సీపీఎం ఇప్పుడు విభజన కోరుకున్న పార్టీ టీఆర్ఎస్‌తో స్నేహం కుదుర్చుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ఈ స్నేహం కోసం ఈ పార్టీ ఎంత దిగజారిందంటే, చివరికి నిన్నగాక మొన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వాగిన చెత్త మొత్తం భేషుగ్గా వుందని కితాబు ఇచ్చింది.  ఇలాంటి రాజకీయాలు నడుపుతారు కాబట్టే కమ్యూనిస్టులు ప్రజలకి దూరమైపోతున్నారు.

సిరిసిల్లలో కేటీఆర్‌కి జెల్ల!

      సీమాంధ్రలను తిట్టిపోయడంలో తన తండ్రి కేసీఆర్‌ కంటే నాలుగు తిట్లు ఎక్కువే చదివిన ఘనాపాటి కేటీఆర్ ఈసారి ఎన్నికలలో కూడా సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేయాలని ఫిక్సయ్యాడు. నిన్నటి వరకూ తన గెలుపు చాలా ఈజీనే అనే ఫీలింగ్‌లో వున్నాడు. అయితే రెండ్రోజుల క్రితం పరిస్థితి మారిపోయింది. ఈసారి ఎన్నికలలో కేటీఆర్ గెలుస్తాడా, లేదా అనే సందేహాలు బయల్దేరాయి. దీనికి కారణం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సామాజిక ఉద్యమ కార్యకర్త విమలక్క పోటీ చేయాలని ఆలోచిస్తూ వుండటమే. ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే విమలక్కకి జనంలో మంచి ఫాలోయింగ్ వుంది. ఆషామాషీ వాళ్ళని ఈజీగా ఓడించే శక్తి కేటీఆర్‌కి వుందేమోగానీ, తన ప్రత్యర్థి విమలక్క అయితే మాత్రం ఆయనగారి బొచ్చెలో రాయిపడ్డట్టే.. నెత్తిన టెంకెజెల్ల పడ్డట్టే! విమలక్క గనుక సిరిసిల్ల నుంచి పోటీ చేయడం అంటూ జరిగితే అది కేటీఆర్‌కి గండంలా మారే ప్రమాదం వుంది. ఆమెకు ప్రజల్లో, కళాకారుల్లో, తెలంగాణ ఉద్యమ శక్తుల్లో వున్న బలం సామాన్యమైనది కాదు. మొదటి నుంచీ కేసీఆర్, టీఆర్ఎస్‌లను వ్యతిరేకిస్తున్న తెలంగాణ శక్తులు అన్నీ విమలక్కకు మద్దతు ఇచ్చే అవకాశం వుంది. వాళ్ళందరూ సిరిసిల్లో  మోహరించికి కాలికి గజ్జె కట్టారంటే ఆ శబ్దానికే కేటీఆర్ ఎగిరిపోయే అవకాశం వుంది. తమ యువరాజుకి ఊహించని విధంగా ముంచుకొచ్చిన ఈ ప్రమాదం టీఆర్ఎస్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. కేటీఆర్ నియోజకవర్గాన్ని మారిస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు కూడా ప్రారంభమయ్యాయి.

చిదంబరం తొక్కలో వేదాంతం!

      బోలెడన్ని జీవాలని పొట్టన పెట్టుకున్న ముసలిపులి శాంతిసూత్రాలు వల్లిస్తే ఎలా వుంటుందో, దేశం నాశనం కావడంలో భాగస్వామి, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావడంలో సూత్రధారి అయిన చిదంబరం ఇప్పుడు వేదంతం మాట్లాడుతూ వుండటం కూడా అలాగే వుంటుంది. జీవితంలో అన్నీ అనుభవించేసి, తన సొంత రాష్ట్రం తమిళనాడుకు పోటీగా వున్న ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేసే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చిన చిదంబరం లేటెస్ట్ గా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న తమిళనాడులోని శివగంగా లోక్‌సభ స్థానం నుంచి ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని చెప్పాడు. అంత గొప్ప డెసిషన్ తీసుకున్నావేంటి బాబయ్యా అని ప్రశ్నిస్తే చిదంబరం వేదాంత ధోరణిలో సమాధానాలు చెప్పాడు. జీవితంలో అన్నీ చూసేశాను. ఇప్పుడు నాకు 68 ఏళ్ళు వచ్చేశాయి. నేనిక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండదలుచుకోవడం లేదు. ఇక శాంతిమార్గంలో నడుస్తూ శేష జీవితాన్ని నెట్టేస్తానని చెప్పుకొచ్చాడు. తనకి పునర్జన్మల మీద నమ్మకం లేదని, ఈ జన్మలో ఏం సాధించామన్నదే తనకి ముఖ్యమని చెప్పుకొచ్చాడు. అయ్యగారిలో తొక్కలో వేదాంతానికేం తక్కువలేదు. తాను ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదన్న విషయాన్ని నొక్కి చెబుతూ, యువతరానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే శివగంగ స్థానం నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఇంతకీ వచ్చే ఎన్నికలలో శివగంగ స్థానం నుంచి పోటీ చేయబోతున్న యువతరంగం మరెవరో కాదు.. చిదంబరం గారి పుత్రరత్నం కార్తి. తన కొడుకు కోసం ఎన్నికల నుంచి తప్పుకుంటున్న చిదంబరం అదేదో తాను దేశాన్ని ఉద్ధరించడానికి చేసిన పనిలా బిల్డప్పు ఇచ్చుకుంటున్నాడు. ఇలాంటి తెలివితేటలనే తమిళ సాంబార్ తెలివితేటలు అంటారేమో!

రసవత్తరం.. పశ్చిమ జడ్పీ పీఠం

  పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ పీఠం కోసం తెలుగుదేశం పార్టీలో పోటీ రసవత్తరంగా మారింది. ఈ ప్రాంతంలో సైకిల్ జోరు బాగుండటంతో.. నాయకుల వలసలు కూడా ఎక్కువయ్యాయి. మొన్నటివరకు మూడు రంగుల కండువా కప్పుకొన్న తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో అక్కడి టికెట్ ఆశించిన గూడెం మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి బాపిరాజును జడ్పీ చైర్మన్ గా బరిలోకి దించుతారని ప్రచారం జరిగింది. దీంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు ఈ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ సీటు వేరేవారికి ఇస్తున్న నేపథ్యంలో తనకు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే, ఆయన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పార్టీ వెనుకడుగు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ కూడా ఈ పదవి తనకే కావాలని గట్టిగా పట్టుపడుతుండటం, డీసీసీబీ ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చిన అల్లూరి విక్రమాదిత్య కూడా కుర్చీ కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురూ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరిని కాదన్నా మిగిలిన ఇద్దరూ ఒప్పుకునే పరిస్థితి కనిపించటం లేదు. రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ ఏడుపు సీన్ ఏంటండీ బాబు!

      వయసొస్తే సరిపోదు.. వయసుకు తగ్గ పరిపక్వత కూడా వుండాలి. ప్రస్తుతం వున్న పొలిటికల్ సిట్యుయేషన్‌లో ఈ సలహా తీసుకోవడానికి నూటికి నూరుపాళ్ళు అర్హుల్లో ముందు వరసలో వుండేది ఎవరయ్యా అంటే, బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్. ఏనాడో ఏడుపదులు దాటిపోయిన జస్వంత్ సింగ్ ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి లాంటి పదవులని బోలెడన్నిసార్లు అనుభవించేశాడు. అయినా సరే మరోసారి ఎంపీ టిక్కెట్ రాలేదని భోరున ఏడ్చేశాడు. భారతీయ జనతాపార్టీ ప్రస్తుతం కొత్త రక్తం ఎక్కించుకునే పనిలో వుంది. అందులో భాగంగా జస్వంత్ సింగ్ లాంటి వృద్ధ జంబూకాలకి టిక్కెట్లు ఇవ్వకూడదని డిసైడ్ చేసింది. దాంతో జస్వంత్ సింగ్ చెలరేగిపోయాడు. ఠాఠ్ నాకు టిక్కెట్ ఇవ్వరా అంటూ ప్రెస్‌మీట్ పెట్టిమరీ పార్టీ ఎన్నికల కమిటీని ఎదిరిస్తూ మాట్లాడాడు. మాట్లాడ్డంతో ఆగితే బాగానే వుండేది, ఆ ప్రెస్‌మీట్‌లోనే భోరున ఏడవటం మొదలెట్టి కన్నీళ్ళు తుడుచుకున్నాడు. జస్వంగ్ సింగ్ లాంటి పెద్దమనిషి ఎన్నికల్లో టిక్కెట్ రాలేదని ఇలా ఏడవటం చూసి అక్కడున్నవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు. కాసేపు ఏడిచి కళ్ళు తుడుచుకున్న తర్వాత తేరుకున్న జస్వంత్ సింగ్ భాజపా టిక్కెట్ ఇవ్వకపోయినా పర్లేదని, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించాడు. ఈ ఏడుపేదో భోరున ఏడవకముందు ఏడిస్తే బాగుండేది కదా అని అక్కడున్న అందరూ అనుకున్నారు!

కేసీఆర్ తోడేలు కాదు.. నక్క!

      మొన్నటి వరకూ ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్న కొంగలాగా శాంతియుతంగా కనిపించిన కేసీఆర్ లేటెస్ట్ గా మళ్ళీ సీమాంధ్రుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద నోరు చేసుకోవడం మొదలెట్టారు. ఆప్షన్లుండవు.. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోవాల్సిందే లాంటి గుండెల్ని మండించే మాటల్ని అటుంచితే, మొన్నటి వరకూ కాంగ్రెస్ వాళ్ళని కీర్తించిన నోటితోనే ఇప్పుడు తెగ తిడుతున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తోడేళ్ళ లాంటి వాళ్ళని తేల్చేశాడు. నిజం నిష్టూరంగానే వుంటుంది కాబట్టి కేసీఆర్ అన్న మాట తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పించింది.   తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు మేం తోడేళ్ళం కాదు కేసీఆరే తెలంగాణ ప్రజల్ని మింగడానికి రెడీగా వున్న పెద్ద తోడేలు అని ఎదురుదాడి చేశారు. మొత్తమ్మీద ఒకరినొకరు తోడేళ్ళని తిట్టుకున్నారు. దాంతో ఇద్దరూ తోడేళ్ళే అని, తెలంగాణ ప్రజలే అమాయక గొర్రెలని వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు. ఒకర్నొకరు తిట్టుకున్నారు కాబట్టి ఇక్కడితో ఈ తోడేలు ఎపిసోడ్ ముగిసినట్టేనని రాజకీయ పరిశీలకులు అనుకున్నారు. అయితే మరికొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ ఇష్యూని మరికొంత సాగదీశారు. టోటల్ తెలంగాణలో సీమాంధ్రులకు నచ్చే ఇద్దరు నాయకులు జగ్గారెడ్డి, రేణుకా చౌదరి ఈ ఇష్యూలో మరింత ముందుకు వెళ్ళారు. ఎవరు తోడేళ్ళో తెలంగాణ ప్రజలు ఎన్నికల తర్వాత నిరూపిస్తారని, కేసీఆర్‌కి తమ గురించి మాట్లాడేంత సీన్ లేదని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తిట్టిపోయడంలో కేసీఆర్‌కి కరెక్ట్ మొగుడులా వుండే జగ్గారెడ్డి మాత్రం కేసీఆర్ తోడేలు కాదని అన్నారు. ఆయనగారు తోడేలు కాదు.. నిఖార్సయిన నక్క అని డిసైడ్ చేశారు. కేసీఆర్ రాజకీయాల్లో తన నక్కబుద్ధిని బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని, గోతికాడి నక్కలాగా లాభం పొందాలని చూస్తున్నాడని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ సీమాంధ్రుల మీద, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద మాటలతో దాడి చేస్తున్న కేసీఆర్ తన నక్కబుద్ధులు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.  

పొత్తులతో బలాబలాలు మార్పులు

  తెదేపా-బీజేపీ-జనసేన-లోక్ సత్తాల మధ్య ఎన్నికల పొత్తులు ఖరారయినట్లయితే, సీమాంద్రాలో ఆ నాలుగు పార్టీలు బలమయిన కూటమిగా ఏర్పడి, వేర్వేరుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, వైకాపా, జైసపాలను బలంగా డ్డీ కొనవచ్చును. ఇంతవరకు వైకాపా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కానీ మజ్లిస్, సీపీయం పార్టీలు దానితో పొత్తులు పెట్టుకోవాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నట్లయితే వారి కూటమికి కూడా కొంత బలపడుతుంది. అప్పుడు కాంగ్రెస్, జైసపాలు ఈ రెండు కూటములను ఎదుర్కొని నిలవలసి ఉంటుంది. అయితే జైసపా, వైకాపాలు రెండూ కూడా ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా ఆ పార్టీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున వాటిని కాంగ్రెస్ అనుబంధ పార్టీలుగానే పరిగణించవలసి ఉంటుంది.   తెదేపా కూటమికి చాలా ప్లస్ పాయింట్స్ కనబడుతుంటే, వైకాపా కూటమికి మాత్రం కొన్నే కనబడుతున్నాయి. తెదేపా కూటమిలో చంద్రబాబు, నరేంద్ర మోడీ, జయప్రకాశ్ నారాయణ్ వంటి అనుభవజ్ఞులయిన నేతలు, పవన్ కళ్యాణ్ వంటి మంచి ప్రజాధారణ ఉన్న నటుడు కనబడుతుంటే, వైకాపా కూటమిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ప్రత్యర్ధులతో పోల్చి చూస్తే చాలా విషయాలలో తేలిపోతారు.   ఒకవేళ వైకాపాకి మజ్లిస్ కూడా తోడయితే, ముస్లిం, క్రీస్టియన్ ఓట్లన్నీ వారికే పడవచ్చును. అయితే, బీసీ, యస్సీ, ఎస్టీలు, ఇతర కులస్తులు అందరూ తెదేపా లేదా కాంగ్రెస్ పార్టీల వైపు మొగ్గు చూపవచ్చును. కానీ రాష్ట్ర విభజన చేసినందుకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారందరూ కూడా విజయవకాశాలున్న బీజేపీతో పొత్తులు పెట్టుకొంటున్న తెదేపాకే ఓటేయవచ్చును. ఈసారి ఎన్నికలలో తెదేపా బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు గట్టిగా చేస్తోంది. ఇక కాంగ్రెస్ నుండి భారీగా తరలి వస్తున్న హేమాహేమీల వలన కూడా తెదేపా మరింత బలోపేతమవుతుంటే, అదే కారణంతో వైకాపా వారి ముందు బలహీనంగా కనబడుతోంది.   సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినప్పటికీ, ఇంకా ఆ పార్టీలో హేమహేమీలనదగ్గ నేతలు మిగిలే ఉన్నారు. వారందరూ పార్టీ విజయానికి భరోసా ఇవ్వలేకపోయినా వారు మాత్రం ఎన్నికలలో గెలవగల సత్తా ఉన్నవారే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల మిగిలిన పార్టీలకు గట్టిపోటీ ఇవ్వగలదు. అయితే పోటీ ప్రధానంగా తెదేపా కూటమికి వైకాపాకి మధ్యనే ఉండవచ్చును.

ఎన్నికలకు ముందే కిరణ్ పార్టీ ఖాళీ అయిపోనుందా

  గత ఎన్నికలలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపిస్తున్నపుడు అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయన పార్టీ కార్యాలయం ముందు బారులు తీరారు. కానీ ఎన్నికల ముగిసిలోగానే అందరూ మళ్ళీ తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయారు. అయితే ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరునెలలు మీనమేషాలు లెక్కించి మరీ పార్టీని స్థాపిస్తే ఒక్కరు కూడా వచ్చి చేరడం లేదు, పైగా ఉన్నవారే బయటకి వెళ్ళిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన వెనుకే తిరిగిన అనేక మంది మంత్రులు తెదేపాలో చేరిపోగా, పార్టీలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా కాదు పొమ్మని శైలజానాథ్ కూడా తెదేపాలో చేరేందుకు సిద్దమయిపోతున్నారు. ఇప్పడు కొత్తగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా తెదేపాలోకి మారిపోయేందుకురంగం సిద్దం చేసుకొంటున్నారు. తెలంగాణాకి ముఖ్యమంత్రి కావలనుకొంటున్న కేసీఆర్ తన అనుచరులచేత అందుకు అనుకూలంగా ఏవిధంగా డిమాండ్ చేయించుకొంటున్నారో, అదేవిధంగా పితాని కూడా తెదేపాలో చేరాలని తన అనుచరుల చేత డిమాండ్ చేయించుకొన్న తరువాత, మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలియజేసారు. అంటే, లాంచనంగా కిరణ్ కుమార్ రెడ్డికి గుడ్ బై చెప్పేసినట్లే అనుకోవచ్చును.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న రోడ్ షోలకి కూడా జనాలను పోగేయడం చాలా కష్టమవుతోందని సమాచారం. బహుశః ఆయన చెప్పే సమైక్యపాటాలు వినేందుకు ఇప్పుడు ఎవరికీ ఆసక్తి లేకపోవడమే అందుకు కారణం అయ్యుండవచ్చును. పరిస్థితి ఇలాగే కొనసాగితే కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలు జరుగక ముందే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయవలసి వస్తుందేమో..పాపం. కనీసం ఎన్నికలు పూర్తయ్యేవరకయినా ఆయన పార్టీని నడిపించుకోగలిగితే, ఆనక ఏ కాంగ్రెస్ గంగలో కలిపేసుకొన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు, ఆశ్చర్యపోరు కూడా. కానీ, ఆయన తొందరపడి ఎన్నికల ముందే ఆ పనిచేస్తే మాత్రం ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంది.

తెదేపా-బీజేపీ పొత్తులు ఖరారయ్యేనా

  బీజేపీ-తెదేపాలు ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ, తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి. కానీ, ఆ రెండు పార్టీలు కూడా తెరవెనుక ఆ విషయంపై చాలా కసరత్తు చేస్తున్నట్లు, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు తాజా ప్రకటనతో స్పష్టమయింది.   ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెదేపాతో పొత్తులకు ఆసక్తిగా ఉందని, అందువలన రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ సీమాంధ్రలో ఎనిమిది లోక్ సభ, ఇరవైఐదు శాసనసభ స్థానాలను తెదేపా నుండి ఆశిస్తోందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణాలో కూడా ఇరు పార్టీల బలాబలాలను బట్టి సీట్లు కేటాయించమని తెదేపాను కోరినట్లు తెలిపారు. అంతేగాక తెలంగాణాకి ముఖ్యమంత్రి అభ్యర్ధిని నిర్ణయించే అవకాశం కూడా తమ పార్టీకే ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.   ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి అన్ని సీట్లు కేటాయించడం తెదేపాలో కల్లోలం సృష్టించే ప్రమాదం ఉంది. చిరకాలంగా పార్టీలో ఉన్నవారు, కాంగ్రెస్ నుండి వరదలా వచ్చి చేరుతున్న నేతలకి టికెట్స్ కేటాయించకుండా, పొత్తుల కోసమని బీజేపీకి అన్ని సీట్లు కేటాయించడం తేదేపాకు చాలా కష్టమే. అయితే, బీజేపీ ప్రధాన లక్ష్యం కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడమే తప్ప రాష్ట్రంలో అధికారం సంపాదించడం కాదు గనుక, తేదేపాకు అనుకూలంగానే సీట్ల సర్దుబాట్లకు అంగీకరించవచ్చును.   ఇక తెలంగాణాలో బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకొన్నారు. అంతే గాక బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్, కృష్ణయ్యను తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రతిపాదిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కనుక, ఈవిషయంలో కూడా బీజేపీ తెదేపాతో రాజీ పడక తప్పదు.   ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణాలలో నెలకొన్న తీవ్రమయిన పోటీ వాతావరణంలో, తెదేపా-బీజేపీలు పొత్తులపై ఒక అంగీకారానికి రాలేకపోయినట్లయితే అవే తీవ్రంగా నష్టపోవడం తధ్యం. అందువలన ఆ రెండు పార్టీలు వీలయినంతమేర ఇచ్చి పుచ్చుకొనే ధోరణినే పాటిస్తూ పొత్తులు ఖరారు చేసుకోవడం తధ్యం. తెలంగాణా బీజేపీ నేతలు తెదేపాతో ఎన్నికల పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ వారు కూడా పార్టీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అయిష్టంగా అయినా తెదేపాతో పొత్తులకు అంగీకరించక తప్పదు.

పొత్తుపై ముందు.. వెనక

   టీడీపీతో పొత్తు విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. తెలంగాణలో ఆ పార్టీతో కలిసి సాగాలా.. వద్దా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ బలహీనపడిందని, పొత్తు లాభదాయకం కాదని ఓ వర్గం వాదిస్తుండగా.. టీడీపీ మద్దతుతో ఎక్కువ సీట్లు సాధించవచ్చునని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ వద్ద తెలంగాణ కమలనాథులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీ హైదరాబాద్ నగర శాఖ పొత్తుకు అనుకూల అభిప్రాయాన్ని చెప్పగా, జిల్లాల నుంచి వచ్చిన నేతల్లో ఎక్కువ మంది పొత్తు వద్దని స్పష్టం చేశారు.   జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ బీజేపీకి అనుకూలంగా ఉన్నందున దేశంతో పొత్తు అవసరం లేదని కొందరు యువనేతలు వ్యాఖ్యానించారు.మరికొందరు ఎలాంటి నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా నిర్ణయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికే వదిలిపెట్టారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవడంతో జవదేకర్ ఒకింత అసహనం ప్రదర్శించారు. తమిళనాడులో ఐదు పార్టీలతో కూటమిగా మారామని, ఇక్కడ మాత్రం ఇంత అయోమయం ఎందుకన్నట్టుగా వ్యాఖ్యానించారు. స్థానిక నేతలు స్పష్టమైన అభిప్రాయానికి రానిపక్షంలో జాతీయ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెండు రోజుల్లో పొత్తు విషయాన్ని తేల్చేస్తామని ప్రకటించారు.