కేశినేని నానిపై జగన్ కన్ను!

      తెలంగాణలో వైసీపీ ఆల్రెడీ దుకాణం మూసేసింది. ఇప్పుడు సీమాంధ్రలో తన ఉనికిని కాపాడుకునే తంటాలు పడుతోంది. సీమాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద కన్నేసింది. ఆ పార్టీలో టిక్కెట్లు దొరకని, కోరుకున్న టిక్కెట్లు దొరకక అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నాయకులను ఆకర్షించి వైసీపీ తరఫున పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తోంది.   ఇప్పటికే ఆ తరహా నాయకులను కొంతమందిని ఆహ్వానించి సీట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ మీద విజయం సాధించేసినట్టు సంతోషిస్తోంది. ఇప్పుడు వైసీపీ దృష్టి విజయవాడ పార్లమెంటు స్థానం మీద పడింది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని పట్టుబడుతున్న కేశినేని నాని మీద వైసీపీ దృష్టిని కేంద్రీకరించింది. వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ పార్లమెంటు టిక్కెట్ ఇవ్వాలని  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించుకోవడంతో, ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న కేశినేని నాని నిరసన గళం వినిపిస్తున్నారు. దీనిని తనకు అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ భావిస్తోంది. కేశినేని నానిని వైసీపీ నుంచి పోటీ చేయించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంలో కేశినేని పార్టీని ఒప్పించడానికి ఒక రాయబార బృందం రంగంలోకి దిగినట్టు సమాచారం.

పొట్లూరి కోసం బాబుపై పవన్‌ ఒత్తిడి?

      విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పారిశ్రామికవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడానికి తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు ఫిక్సయ్యారు. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏనాడో డిసైడ్ చేసిన కేశినేని నానికి జెల్లకొట్టి మరీ పొట్లూరి ప్రసాద్‌వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీట్ తనకి కావాల్సిందేనని మొత్తుకుంటున్నా, నిరసన గళం  వినిపిస్తున్నా అవి చంద్రబాబు చెవికి చేరడం లేదు. చంద్రబాబు ఈ సీటు విషయంలో ఇంత  మొండి పట్టుదలతో ఎందుకున్నాడా అని పరిశీలించిన రాజకీయ పరిశీలకులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ, టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మోడీకి మద్దతు ఇవ్వాలనే కోణంలోనే ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రచారం మొత్తం బీజేపీకి డైరెక్ట్ గా  మద్దతు ఇచ్చేలా వుండొచ్చని తెలుస్తోంది. అయితే ఇలా బీజేపీ వైపే ప్రచారం మొత్తం వుండటం వల్ల బీజేపీకే లాభం జరుగుతుంది తప్ప తెలుగుదేశానికి ఒరిగేదేమీ వుండదని భావించిన చంద్రబాబు తెలుగుదేశానికి కూడా ప్రచారం చేయాలని చంద్రబాబుని కోరినట్టు, అలా చేయాలంటే తన మనుషులకు తెలుగుదేశం కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో  వినిపిస్తోంది. ముఖ్యంగా పొట్లూరి ప్రసాద్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చి తీరాల్సిందేనని పవన్ కళ్యాణ్ పట్టుపట్టినట్టు సమాచారం. పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీకి అటు సీమాంధ్రతోపాటు, ఇటు తెలంగాణలో కూడా ప్రత్యేకంగా ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇవ్వడంతో చంద్రబాబుకు టిక్కెట్ ఇవ్వక తప్పలేదని తెలుస్తోంది.

కేసీఆర్‌కి తిట్లు... సోనియాకి దీవెనలు!

      ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీ తరఫున సీమాంధ్రుల మీద నోరు పారేసుకున్న దాసోజు శ్రవణ్ ఇకముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున సీమాంధ్రుల మీద నోరు పారేసుకోబోతున్నాడు. ఇప్పుడాయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. టీఆర్ఎస్ తనకు ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో ఇస్తుందని ఆశగా ఎదురుచూసిన శ్రవణ్ తనకు అంత సీన్ లేకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు.   ఢిల్లీ నుంచి వచ్చిన జైరాం రమేష్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అడ్డంగా వాదించడంలో స్పెషలిస్టు కాబట్టి శ్రవణ్‌కి అధికార ప్రతినిధి హోదా కూడా ఇచ్చింది. టీవీలో, పేపర్లో కనిపించీ కనిపించీ బాగా అలవాటైపోయిన మనిషి కాబట్టి ఆ హోదా లేకపోతే బతకలేడని ఇచ్చినట్టున్నారు. సరే, సదరు శ్రవణ్ అలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో ఇలా మనిషి మారిపోయాడు. ఇంతకాలం తాను ఏ నోటితో అయితే కేసీఆర్‌ని తెగ పొగిడాడో అదే నోటితో కేసీఆర్ని తిట్టడం ప్రారంభించాడు. సినిమాల్లో  ముఖం మీద వున్న మాస్క్ ఎలా ఈజీగా తీసేస్తారో అంత ఈజీగా కేరెక్టర్ని మార్చేసుకుని కేసీఆర్ మీద తిట్ల వర్షం కురిపించాడు. టీఆర్ఎస్‌లో కుటుంబ పాలన కొనసాగుతోందట. తెలంగాణ ప్రజలకు తెరాస బారి నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం చాలా వుందట. అలాగే పనిగా సోనియా భజన చేశాడు. సోనియా ఎన్ని ఇబ్బందులొచ్చినా తెలంగాణ ఇచ్చిన యోధురాలంట. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేసి ఆమె రుణం తీర్చుకోవాలంట. ఈ శ్రవణ్‌ని కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బయటకి తరిమేయాలి. ఇది సీమాంధ్రుల శాపం.  

తెలుగుదేశం తప్పటడుగు!

      ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు ఆచి, తూచి చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఇది గతం. ఇప్పుడు పరిస్థితి మారినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు గతంలో మాదిరిగా పకడ్బందీగా వుండటం లేదనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా బీజేపీతో సీట్ల సర్దుబాటు విషయంలో వేసిన భారీ తప్పటడుగు గురించి చెబుతున్నారు. రెండు పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా వైజాగ్, తిరుపతి లోక్‌సభ స్థానాలకు బీజేపీకి అప్పగించారు. ఈ సీట్ల సర్దుబాటు జరిగిన సమయంలో చంద్రబాబును చుట్టూ వున్నవారు భలే నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. అయితే అదెంత పెద్ద తప్పటడుగో ఆ తర్వాత తెలిసొచ్చింది. ఆ తెలిసి రావడం కూడా చంద్రబాబుకి సొంతగా తెలిసిరావడం కాదు.   సీనియర్ నాయకుడొకరు చంద్రబాబు వేసిన తప్పటడుగును ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. సీమాంధ్రలో వున్న మూడు ప్రధాన నగరాలలో రెండు ప్రధాన నగరాలను బీజేపీకి ఇచ్చేశారు. ఈ రెండు సీట్లలో బీజేపీ గెలిచినా, మరో పార్టీ గెలిచినా ఈ రెండు నగరాలలో తెలుగుదేశానికి ఎలాంటి పట్టూ వుండదు.  ఒకవేళ విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి గెలవకపోతే సీమాంధ్రలోని మూడు ప్రధాన నగరాలలో తెలుగుదేశం పార్టీకి అడ్రసే వుండదు. ఆ సీనియర్ నాయకుడు ఈ పాయింట్‌ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగానే తాను వేసి తప్పటడుగును గ్రహించిన చంద్రబాబు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వైజాగ్ సీటును తెలుగుదేశానికి ఇచ్చేస్తే కాకినాడ సీటు ఇస్తామని బీజేపీతో రాయబారాలు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఒకవేళ బీజేపీ గనుక తెలుగుదేశం సవరణ ప్రతిపాదనకు అంగీకరించకపోతే ఆ తప్పటడుగు తెలుగుదేశం అధినేతను సుదీర్ఘకాలం బాధపెట్టే అవకాశం వుంది.  

అధిష్టాన దేవతలు తెలంగాణాలో పార్టీని గట్టెక్కించగలరా

  రాష్ట్ర విభజన వ్యవహారం సాగుతున్నంత కాలం రాష్ట్రం వైపు మొహం చూపించని కాంగ్రెస్ పెద్దలు అందరూ, మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒకరొకరుగా రాష్ట్రంపై వాలిపోతున్నారు. ఈనెల 30న తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్నందున ముందుగా అందరూ అక్కడే వాలిపోతున్నారు.   ప్రస్తుతం తెలంగాణాలో పార్టీకి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నపటికీ టీ-కాంగ్రెస్ నేతల మధ్య సరయిన సయోధ్య లేకపోవడం, తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తిపట్టు, ప్రజాదారణ ఉన్ననేత ఒక్కరూ లేకపోవడం, వారిలో ఏ ఒక్కరు కూడా కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా లేకపోవడం, కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలాంశాలుగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కూడా టీ-కాంగ్రెస్ నేతలందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి పార్టీ తరపున ప్రచారం చేయలేకపోవడం గమనిస్తే వారి సిగపట్లు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధమవుతుంది. ఇదే అదునుగా కేసీఆర్ తెలంగాణా జిల్లాలన్నిటిలో ప్రచారం చేసి మరింత పట్టు సాధించుకొనేందుకు సిద్దం అవుతున్నారు.   ఈ పరిస్థితిని చూసిన కాంగ్రెస్ అధిష్టానం ముందుగా చూసి రమ్మంటే కాల్చి వచ్చే జైరామ్ రమేష్ ను పంపింది. ఆయన తిరుగుబాటు అభ్యర్ధులను ఒక్కోకరితో మాట్లాడుతూ వారి చేత నామినేషన్లు ఉపసంహరింపజేస్తున్నారు. ఆయన పార్టీలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చి టీ-కాంగ్రెస్ నేతలందరినీ దారిలో పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.   ఆ పని పూర్తవగానే ఈనెల 16న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆ తరువాత యువరాజవారు కూడా ప్రచారానికి వేంచేస్తారు. అయితే కాంగ్రెస్ నేతలు తమను తాము తప్ప మరే ఇతర పార్టీలు ఓడించలేవని గర్వంగా చెప్పుకొనే మాటలను నిజమని నిరూపిస్తారో లేక అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి మరో మారు తమ సత్తా చూపించి తెరాస, తెదేపా-బీజేపీలను మట్టి కరిపించి అధికారం చేజిక్కించుకొంటారో మరి కొద్ది రోజులలోనే తేలిపోనుంది.

బాలకృష్ణకి చంద్రబాబు జ్ఞానోపదేశం!

      భారతంలో బావమరిది అర్జునుడు యుద్ధం చేయనని అస్త్ర సన్యాసం చేస్తే, బావగారైన శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి అర్జునుడిని యుద్ధ రంగంలో నిలిపాడు. ఈనాటి ఎన్నికల భారతంలో బావమరిది నందమూరి బాలకృష్ణ ఎన్నికల యుద్ధం చేస్తానని ఉత్సాహం చూపిస్తే, బావగారైన నారా చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణకి జ్ఞానోపదేశం చేసి యుద్ధరంగం నుంచి తప్పించాడు. అసలేం జరిగిందంటే, ‘లెజెండ్’ విజయం సాధించడంతో మాంఛి ఉత్సాహంలో వున్న బాలకృష్ణ ఆ సినిమా విజయయాత్రలో హిందూపురం నుంచి ఎన్నికల బరిలో నిలబడబోతున్నట్టు ప్రకటించేశాడు. ఆ తర్వాత నేరుగా చంద్రబాబు దగ్గరకి వెళ్ళి హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి తన పేరు అనౌన్స్ చేయమని ఉత్సాహంగా అడిగేశాడట.   బాలకృష్ణ ఉత్సాహాన్ని గమనించిన చంద్రబాబు ఇప్పుడు నువ్వు పోటీ చేయడం అవసరమా అని అడిగాడట. దానికి బాలకృష్ణ తాను పోటీ చేయడానికి ఇదే సరైన సమయం అని, ఇప్పుడు పోటీ చేస్తే తాను బంపర్ మెజారిటీతో గెలుస్తానని చెప్పారట. అప్పుడు చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు భారీ స్థాయిలో క్లాసు తీసుకుని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎంత టఫ్‌గా వుందో వివరించడంతోపాటు ఈ ఎన్నికలలో బాలకృష్ణ పోటీ చేయడం మంచిది కాదని చెప్పాడట. అయితే బాలకృష్ణ మాత్రం తన ఉత్సాహాన్ని విడిచిపెట్టకపోవడంతో చంద్రబాబు కాస్తంత సీరియస్ అయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు పోటీ స్తే ఖచ్చితంగా ఓడిపోతావ్. అప్పుడు ఇటు సినిమాలకి, అటు రాజకీయాలకి జాయింట్‌గా చెడిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చారట. దాంతో జ్ఞానోదయం కలిగిన బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాను కదా.. అక్కడివాళ్ళు, అభిమానులు నిరాశపడతారేమోనని ధర్మసందేహాన్ని వ్యక్తం చేశాడట. అప్పుడు చంద్రబాబు పరిస్థితి మొత్తాన్నీ నేను సెటిల్ చేస్తానుగానీ, ఇకముందు మాత్రం నోరుజారి స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని చెప్పాడట. ఈసారి ప్రచారంతో సరిపెట్టుకోమని సూచించాడట. బావగారి నుంచి జ్ఞానోపదేశం పొందిన బాలకృష్ణ బావమాట బంగారు బాట అనుకుంటూ తన డేట్స్ కోసం క్యూలో వున్న ఇద్దరు నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.  

కేసీఆర్ ఆరోగ్యంపై తెరాసలో ఆందోళన

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యం విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడబోయే తొలి ప్రభుత్వానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని తెరాస కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈమధ్యకాలంలో కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళలో ఆందోళన పెరిగింది. వాస్తవానికి కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రమే. ఆమధ్య నిరాహారదీక్ష చేసినప్పుడు ఆరోగ్యం మరింత దిగజారింది. ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా కేసీఆర్ తన ఆరోగ్యం గురించి చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగించే విధంగా వున్నాయని తెరాస కార్యకర్తలు చెబుతున్నారు.   కేసీఆర్ చాలా సందర్భాలలో తన ఆరోగ్యం బాగాలేదన్న విషయాన్ని చెబుతూ వస్తున్నారు. నిన్నగాక మొన్న  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వారి ఆందోళనను మరింత పెంచేలా వున్నాయి. ‘‘దేవుడి దయవల్ల నేను బతికుంటే, ఆరోగ్యం సహరిస్తే తెలంగాణలో అధికారం చేపట్టి సేవ చేస్తాను’’ అని కేసీఆర్ అన్న మాటలు తెరాస కార్యకర్తలకు బాధ కలిగించాయి. కేసీఆర్ నోటి నుంచి ‘బతికుంటే’ అనే మాట రావడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హుజూర్ నగర్‌లో నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి వెళ్ళాలని ఎప్పటినుంచో చెబుతున్న కేసీఆర్ ఆనారోగ్య కారణాల వల్ల ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే ఎన్నికల లోపు ఊపిరి సలపకుండా చేసే ప్రచారం కారణంగా తమ నాయకుడి ఆరోగ్యం ఏమవుతోందోనని వారు భయపడుతున్నారు. కేసీఆర్‌కి ఏమీ కాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.  

పవన్ కళ్యాణ్‌కి టీడీపీ గిఫ్ట్

      ఈ ఎన్నికలలో బీజేపీకి, టీడీపికి మద్దతు ప్రకటించిన సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్‌కి తెలుగుదేశం పార్టీ సీట్ల రూపంలో థాంక్స్ చెబుతోంది. అసెంబ్లీ టిక్కెట్లలో కొన్నింటికి పవన్ కళ్యాణ్ సూచించిన అభ్యర్థులకు కేటాయించేలా లోపాయికారీ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ టిక్కెట్లలో కొన్నింటిని ‘పవన్ కళ్యాణ్ కోటా’ కింద ప్రత్యేకంగా ఉంచినట్టు సమాచారం.   ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్సీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపికైన మేడిపల్లి సత్యం పవన్ కళ్యాణ్ అనుయాయుడు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పనిచేశాడు. ఏరకంగా చూసినా మేడిపల్లి సత్యానికి చొప్పదండి సీటు ఇవ్వడానికి అవకాశాలు లేవు. సత్యాన్ని మించిన నాయకులు ఆ నియోజకవర్గంలో చాలామంది వున్నారు. మేడిపల్లి సత్యం పవన్ కళ్యాణ్ ‘కోటా’లో వ్యక్తి కావడం వల్లే ఆయనకి సీటు వచ్చిందని తెలుస్తోంది. ఇదిలా వుంటే తెలంగాణ సీట్లలో తన కోటా మీద పెద్దగా ఆలోచించని పవన్ కళ్యాణ్ సీమాంధ్రలో మాత్రం తన మనుషులకు కనీసం ఐదు నుంచి పది సీట్లయినా ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. పవన్ కోరిక కూడా సమంజసంగానే వుండటంతో సీమాంధ్రలో పవన్ కోటాకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. త్వరలో ప్రకటించబోయే సీమాంధ్ర అసెంబ్లీ అభ్యర్థులలో పవన్ సూచించిన అభ్యర్థులకు ఛాన్స్ బాగా దొరికే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

సీఎం పదవిపై జగన్ పగటి కలలు!

      తెలంగాణ ప్రాంతలో తన పార్టీ తుడిచిపెట్టుకుపోయినా, సీమాంధ్రలో తన పార్టికి సౌండ్ లేకపోయినా వైసీపీ అధినేత జగన్ కంటున పగటి కలల జోరు ఎంతమాత్రం తగ్గలేదు. సీమాంధ్రకి కాబోయే ముఖ్యమంత్రి తానేని జగన్ చెబుతున్నారు. ఒఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్ తన పగటి కలలను పూసగుచ్చినట్టు వివరించారు. ఆయన కంటున్న పగటి కలలలో కొన్న పాయింట్లు ఇవి.... .....నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. సీమాంధ్ర ప్రజలంతా పూర్తిగా నావైపే వున్నారు.   .....కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలి? దానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను. .....కొత్త రాజధాని నిర్మాణం కోసం నేను అంతర్జాతీయ కన్సల్టెంట్‌తో మాట్లాడుతున్నా. కొత్త రాజధాని పేరు కోస్తా ఆంధ్ర, రాయలసీమ రెండూ ప్రాంతాలనూ ప్రతిబింబించేలా వుంటుంది. .....జపాన్‌లో పరిశ్రమలు నిర్మించడానికి స్థలం లేదు. వాళ్ళంతా సీమాంధ్రలో పెట్టుబడులు పెడతారని నేను అనుకుంటున్నాను.

వైజాగ్ సీటు వైకాపా ఖాతాలోనేనా?

  దగ్గుబాటి దంపతులతో చంద్రబాబు వైరం ఈనాటిది కాదు. బహుశః అది ఎన్నటికీ సమసిపోదని పార్లమెంటు ప్రాంగణంలో యన్టీఆర్ విగ్రహ స్థాపన విషయంలో రుజువయింది, మళ్ళీ ఇప్పుడు పురందేశ్వరికి వైజాగ్ లోక్ సభ టికెట్ విషయంలో మరోమారు రుజువవుతోంది. తెదేపా-బీజేపీ పొత్తులలో భాగంగా వైజాగ్ లోక్ సభ సీటు బీజేపీకి వెళ్ళడంతో, సహజంగానే అది సిటింగ్ యంపీ పురందేశ్వరికే దక్కుతుందని అందరూ భావించారు. కానీ, ఆమెకు ఆ సీటు ఇవ్వకూడదని చంద్రబాబు గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఒకవేళ వైజాగ్ కాకపోతే విజయవాడ లేదా ఒంగోలు నుండయినా ఆమె పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ, బీజేపీకి దక్కిన వైజాగ్ సీటు నుండే ఆమె పోటీకి అభ్యంతరం తెలుపుతున్న చంద్రబాబు, తెదేపా కోటాలో ఉన్న ఆ రెండు సీట్లను ఆమెకు ఇచ్చేందుకు అంగీకరిస్తారని భావించలేము. పైగా ఆ రెండు సీట్లకు ఇప్పటికే తెదేపా అభ్యర్ధులను ఖరారు చేసేసారు కూడా. అందువల్ల పురందేశ్వరి తను ఎక్కడి నుండి పోటీ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారిప్పుడు.   అక్కడ నుండి పోటీ చేసేందుకు సిద్దపడుతున్న సీమంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు అభ్యర్ధిత్వానికి చంద్రబాబు ఎటువంటి అభ్యంతరమూ చెప్పడం లేదని సమాచారం. అయితే పురందేశ్వరితో పోలిస్తే ఆయన చాలా బలహీనమయిన అభ్యర్ధి అని చెప్పవచ్చును.   ఒకవేళ ఆయనే పోటీలో నిలబడితే, జగన్ అక్కడ తమ పార్టీ తరపున తన తల్లి విజయమ్మను పోటీలో నిలబెట్టేందుకు, పురందేశ్వరే పోటీ చేస్తున్నట్లయితే అప్పుడు తన సోదరి షర్మిలను అక్కడ నుండి బరిలో దింపేందుకు సిద్దంగా ఉన్నారని తాజా సమాచారం. హరిబాబుని ఓడించేందుకు విజయమ్మ చాలని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందువల్ల తెదేపా, బీజేపీల సీమాంధ్ర అభ్యర్ధుల తుది జాబితాలు విడుదల కాగానే దానిని బట్టి వైకాపా అభ్యర్ధి ఎవరనేది తేలుతుంది.   కీలకమయిన ఈ ఎన్నికలలో చంద్రబాబు పంతాలకు పోయి, బలమయిన అభ్యర్ధి పురందేశ్వరికి అడ్డుపడి, ఆమె స్థానంలో హరిబాబుని పోటీ చేయిస్తే దానివలన ఆ పార్టీలకే నష్టం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వైజాగ్ నుండి బీజేపీ తరపున హరిబాబే పోటీలోకి దిగాలని వైకాపా కోరుకోవడం సహజమే. ఒకవేళ ఆయనే పోటీలో దిగితే విజయమ్మకు నామినేషన్ వేయక ముందే సగం విజయం ఖరారు అయిపోయినట్లేనని వైకాపా నేతలు దృడంగా నమ్ముతున్నారు. మరి చంద్రబాబు ఈ సంగతి గ్రహించి పురందేశ్వరికి సహకరిస్తారో లేక తన పంతానికే పోయి వైజాగ్ సీటుని వైకాపా ఖాతాలో జమా చేయిస్తారనే సంగతి నేడో రేపో ఆ పార్టీలు తుది జాబితాలు ప్రకటించగానే తెలిసిపోతుంది.

ఈ ఐడియా కాంగ్రెస్ కి వర్కవుట్ అవుతుందా

  కాంగ్రెస్ పార్టీలో మిగిలిన రఘువీరా రెడ్డి, చిరంజీవి వంటి నేతలందరూ కూడా పార్టీని వీడి బయటకు పోయినవారందరూ ద్రోహులేనని వారికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని ఇంతవరకు పదేపదే కోరారు. కానీ, తమ బస్సుయాత్రకి ప్రజల నుండి బొత్తిగా స్పందన లేకపోవడంతో, వారికి తమ అసలు పరిస్థితి అర్ధమయింది. ఆ తరువాత వారు చిరంజీవి అభిమానులను పోగేసి వారికి కూడా (కాంగ్రెస్) టోపీలు పెట్టేసి, వారంలోగా ఓ పది లక్షల మందిని అర్జెంటుగా పార్టీలో చేర్పించండని హుకుం జారీ చేసారు. కానీ అది కూడా సాధ్యం కాదని తేలిపోయింది. దానితో దిగాలుపడి కూర్చొన్న వారందరికీ కాంగ్రెస్ హైకమండ్ సరికొత్త ఐడియా ఇచ్చింది. అదే పార్టీ నుండి బయటకు వెళ్ళిన పోయిన వారిని మళ్ళీ సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం!   నిన్నటి వరకు తిట్టినా నోటితోనే మళ్ళీ వారిని ఆహ్వానించడం కొంచెం ఇబ్బందికరమే! అయినప్పటికీ, ఇటువంటి చిలిపి చేష్టలు కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే మరెవరు చేయలేరని నిరూపిస్తూ, సీమాంధ్రలో పార్టీని సమూలంగా తుడిచిపెట్టేసిన దిగ్విజయ్ సింఘే ఆ పని మొదలుపెట్టక తప్పలేదు. ఆ ప్రయత్నంలో ఇప్పటికే తమ యంపీ సాయి ప్రతాప్ ని వెనక్కి తెచ్చుకొని, “ఇక మీరు కూడా నాలాగే ప్రయత్నిస్తే తప్పకుండా మిగిలిన వారిని కూడా వెనక్కి రప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు” అని ఆయన తన సీమాంధ్ర కాంగ్రెస్ జీవులకు భరోసా ఇచ్చేరు.   ఆయన పాయింటు అందరి కంటే ముందు క్యాచ్ చేసేసిన కిల్లి రాణీ వారు, “కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్ళిన వారిలో 99శాతం మంది ఆ పార్టీలలో ఇమడలేక ‘కాంగ్రెస్ సిండ్రోం’ అనే సమస్యతో బాధపడుతున్నారని నాకు తెలుసు. నా శ్రీకాకుళం జిల్లాకు సంబందించిన కాంగ్రెస్ నేతలెవరయినా తిరిగి రాదలుచుకొంటే నేనే స్వయంగా వెళ్లి వారికి బొట్టుపెట్టి సాదరంగా పార్టీలోకి తీసుకువచ్చేందుకు సిద్దంగా ఉన్నాను” అని మీడియా ముందు ప్రకటించేశారు. పార్టీలో మిగిలిన కాంగ్రెస్ జీవులు కూడా ఇంచుమించు ఈవిధంగానే మాట్లాడుతున్నారిప్పుడు.   దాదాపు అన్ని నియోజక వర్గాలకు టికెట్స్ ఖరారయిపోయాయని ఇక ప్రకటన వేలువడటమే ఆలశ్యమని చెపుతూ, ఇంకా ఆలసిస్తే ఆశాభంగం తప్పదని అన్యాపదేశంగా తమ మాజీ కాంగ్రెస్ నేతలకు పదేపదే సందేశాలు పంపుతున్నారు. ఇది చూసి మాజీలు ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడకపోయినా ప్రజలు మాత్రం ‘ఔరా కాంగ్రెస్!’ అని ముక్కున వేలేసుకొంటున్నారు. ఒకవేళ వారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే ఇంతకాలం తిట్టిన పార్టీని, తిట్టుకొన్న సహచరులతో ఏవిధంగా కలిసి కాపురం చేస్తారో చూసి తరిద్దామని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరూ వేర్వేరు రంగుల కండువాలు కప్పుకొని వస్తుంటే గుర్తుపట్టలేక తికమక పడుతున్న ప్రజలు కూడా మళ్ళీ వారందరూ ఒక్క గూటికి చేరుకొంటే తమపని సులువయిపోతుందని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అలాగే వారివల్ల టికెట్స్ పోగొట్టుకొన్న ఇతర పార్టీల నేతలు కూడా వారు బయటకు దయచేస్తే కొబ్బరికాయలు కొట్టేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ ‘ఇదంతా జరిగేపనేనా!’ అని అందరూ అపనమ్మకంతోనే ఉన్నారు ఇంకా.

కోమటిరెడ్డి కొంప కొల్లేరవుతుందా?

      సీమాంధ్రులను నోటికొచ్చినట్టు తిట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంప కొల్లేరయ్యే పరిస్థితి ఇప్పుడొచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లగొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి తాను ఎన్నికల సంఘానికి సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో తాను హైదరాబాద్‌లో బీటెక్ చదివినట్టు రాశాడట.   అసలు విషయమేంటంటే హైదరాబాద్‌లో బీటెక్ చదవడానికి చేరిన అయ్యగారికి అంత సీన్ లేక మధ్యలోనే చదువు మానేసి ఎవరైనా రాణించగలిగే రాజకీయ రంగానికి షిష్టయ్యారట. చదువు పూర్తి చేయకుండానే బిల్డప్పు కోసం చదివేసినట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న విషయాన్ని అక్కడి టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు కనిపెట్టేశారు. వెంకట్‌రెడ్డికి అంత సీన్ లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఎన్నికల సంఘానికి చూపించారు. దాంతో కోమటిరెడ్డి ఇరకాటంలో పడ్డాడు. ఎన్నికల సంఘం తప్పుడు సమాచారం ఇచ్చావంటూ కోమటిరెడ్డి నామినేషన్ తిరస్కరిస్తే ఇక ఐదేళ్ళపాటు సారుగారు ఈగలు తోలుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిందే.

బాలయ్యకు కూడా బాబు హ్యాండ్?

  తెదేపాలో సీనియర్ నేత రేవంత్ రెడ్డి పరిస్థితి చూసిన తరువాత, ఇంకా టికెట్ దొరకని సీమాంధ్ర తెదేపా నేతల గుండెల్లో కూడా రైళ్ళు పరిగెడుతున్నాయి. చంద్రబాబుకి స్వయాన్న వియ్యంకుడయిన బాలకృష్ణ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనబడటం లేదు.   “బాలయ్య లోక్ సభకు పోటీ చేస్తారో లేకపోతే శాసనసభలే పోటీ చేస్తారో, ఎక్కడి నుండి పోటీ చేస్తారో అంతా ఆయనిష్టం. ఆయన ఎక్కడి నుండి దేనికి పోటీ చేయాలనుకొన్నా నాకెటువంటి అభ్యంతరమూ లేదు,” నిన్న మొన్నటి వరకు చెపుతూ వచ్చిన చంద్రబాబు, మొన్న విడుదల చేసిన మొదటి జాబితాలో బాలకృష్ణ పేరు లేకపోవడంతో మీడియా అదే ప్రశ్న లేవనెత్తినపుడు, “ఈవిషయమై బాలయ్యతో చర్చించవలసి ఉంది. ఆయనతో చర్చిన తరువాత నిర్ణయం తీసుకొంటాము” అని చెప్పడం గమనిస్తే, బాలయ్యకు కూడా చంద్రబాబు హ్యాండ్ ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కానీ, ఆయన పోటీ చేయాలనుకొంటున్న హిందూపురం నియోజక వర్గానికి వేరే ఏ అభ్యర్ధిని మొదటి జాబితాలో ప్రకటించకపోవడం చూస్తే ఇంకా బాలయ్యకు అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. కానీ ఈసారి కూడా ఆయనను ప్రచారానికే వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు నిజమనుకొంటే, బాలయ్యను ప్రచారానికి ఒప్పించగలిగితే ఆ సీటుని వేరొకరికి లేకుంటే ఆయనకే కేటాయించేందుకు ఆలోచిస్తున్నారేమో అనుకోవలసి ఉంటుంది!   సీమాంద్రాలో కూడా నామినేషన్లు వేయడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమె మిగిలి ఉంది గనుక ఈలోగా ఒకరి స్పందన మరొకరు చూసిన తరువాతనే ఈ విషయంపై మాట్లాడుకోవచ్చని భావిస్తున్నట్లున్నారు. అందుకే ఇద్దరూ బయటపడకుండా ఇంకా ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని చెపుతున్నారు. ఏమయినప్పటికీ, మరొక రెండు రోజుల్లో లిజండ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారో లేదో స్పష్టమయిపోతుంది. 

మోడీ పెళ్ళి కాంగ్రెస్‌ చావుకొచ్చింది!

      ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందంటారే.. అచ్చం అలాంటి సిట్యుయేషనే జాతీయ రాజకీయాల్లో వచ్చింది. బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీ వదోదరా పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేస్తూ తనకు 17 సంవత్సరాల వయసు వున్న సమయంలో యశోదాబెన్ అనే అమ్మాయితో పెళ్ళయిందని డిక్లేర్ చేయడం కాంగ్రెస్ పార్టీ చచ్చే చావు తెచ్చిపెట్టింది.   నరేంద్ర మోడీ పెళ్ళి విషయంలో ప్రజల్లో వున్న కన్ఫ్యూజన్ తొలగిపోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీ మోడీని విమర్శించడానికి ఒక ఆయుధంగా పెట్టుకున్న మోడీ పెళ్ళి వ్యవహారం కూడా ఇప్పుడు ఆ పార్టీ చేతుల్లోంచి జారిపోయింది. 17 సంవత్సరాల వయసులో పెళ్ళి అయిన మోడీ ఆ తర్వాత దేశసేవ కోసం సంసార బంధాలు వదిలించుకున్నారు. ప్రజాసేవలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు. మోడీ పెళ్ళి విషయంలో ఏదో రహస్యం దాచేస్తున్నట్టు కాంగ్రస్ పార్టీ లేనిపోని హడావిడి చేస్తూ ఈ అంశం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు మోడీ తనకు పెళ్ళి జరిగినట్టు తానే స్వయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదిలో వున్న ఒక ఆయుధం మాయమైపోయింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ చావుకి మార్గం మరింత సుగమమైంది.

వైఎస్సార్ కాంగ్రెస్ : సినిమావాళ్ళతో డ్రామా!

      ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో పాతాళంలో కూరుకుపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి ఇంకా వుందని చాటుకోవడానికి చేతనైన డ్రామాలన్నీ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. బుధవారం తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా నియోజకవర్గాలలో నామినేషన్లే పడలేదు. మిగతా స్థానాల్లో నామినేషన్లు వేసిన వాళ్లు కూడా ఆరు నూరైనా, భూమి తలకిందులైనా గెలవని వాళ్లే. దీన్ని చూసి తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ సమాధైపోయినట్టేనని జనంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డిసైడైపోయారు. కనీసం సీమాంధ్రలో అయినా ఉనికి చాటుకుందామనే ప్రయత్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న పనులు చిత్రంగా వున్నాయి. తన చిత్రమైన పనుల్లో భాగంగా సినిమా ఇండస్ట్రీలో పనిలేకుండా వున్నవాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ మా పార్టీకి ఎంత క్రేజుందో చూశారా అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. వంద సినిమాలు చేసేసి ప్రస్తుతం చేసే పనేమీ లేక విశ్రాంతి తీసుకుంటున్న దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని పార్టీలో చేర్చుకుంది. తెలుగు సినిమా రంగం, ప్రేక్షకులు ఏనాడో మర్చిపోయిన పూర్ణిమని గురువారం పార్టీలో చేర్చుకుని వైసీపీ నాయకులు మురిసిపోతున్నారు. ఈ ఎన్నికలలో దుంపనాశనం కాబోతున్న ఈ పార్టీకి చివరికి మిగిలేది ఈ ఆనందమేనేమో!

మెగా తమ్ముడు కనబడుట లేదు

  రాజకీయాలలోకి దూకుతా...దుమ్ము దులుపుతా...తాట తీస్తా..అంటూ రంకెలు వేసి జనసేనతో జనాల మధ్యకు ఊడిపడిన పవన్ కళ్యాణ్, తన రెండవ (వైజాగ్) సభతోనే పార్టీకి మంగళ హారతి పాడేసి మళ్ళీ కనబడకుండా మాయమయిపోయాడు. “ఆయన సోదరజీవి ప్రజారాజ్యాన్ని దాదాపు ఓ ఏడాది పాటు నెట్టుకొచ్చి చివరికి కాంగ్రెస్ గూటికి చేర్చగలిగాడు. కానీ, ఈ మెగా తమ్ముడు మాత్రం ముచ్చటగా మూడో మీటింగ్ కూడా అవసరం లేకుండానే బోర్డు తిప్పేసి చేజేతులా పరువు తీసుకొన్నాడు” అని జనాభిప్రాయం. “కనీసం ఎన్నికలలో ఓ పది మందిని నిలబెట్టి ఓడిపోయినా ఇంత ఇదిగా ఉండేది కాదు కదాని” అనుకొంటున్నారు. అయితే కాకుల వంటి లోకులు అప్పుడు మాత్రం నోరు పారేసుకోరని గ్యారంటీ ఏమీ లేదు గనుకనే ఇంకా టైము, డబ్బు, శ్రమ ఎందుకని పవన్ బాబు బ్రేకులేసుకొని జనసేన బండిని గ్యారేజీలో పార్క్ చేసేసాడు. అయితే దానిని లోపల పెట్టక ముందే మళ్ళీ వచ్చే ఎన్నికల సమయానికి మళ్ళీ దుమ్ము దులిపి, సర్వీసింగ్ చేయించి తప్పకుండా బయటకి తీస్తానని ఆయన హామీ కూడా ఇచ్చేరు.   ‘ఈ లోగా మరో ఐదో పదో సినిమాలు తీసుకొని పదో పరకో పోగేసుకొంటూ, ఏవయినా కొత్త రచనలు కూడా మొదలుపెడితే బెటర్ కదా’ అని శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. ‘రాజకీయాలలోకి వచ్చే దమ్ము, దైర్యం లేనప్పుడు అలా జగన్ గురించి కాంగ్రెస్ గురించి నోరు పారేసుకోవడం ఎందుకు, కొత్త శత్రువులను సృష్టించుకోవడం ఎందుకు? ఒకవేళ రేపు వారే అధికారంలోకి వస్తే తీరికగా బాధపడటం ఎందుకని’ కొందరు శ్రేయోభిలాషులు బాధ పడుతున్నారు.   ఆయన ఎన్నికల వేళా పనిగట్టుకొని పార్టీ పెట్టి, గుజరాత్ వెళ్లి మోడీకి దండం పెట్టి, అడగకుండానే తమ పార్టీలకే మద్దతు ప్రకటించినందుకు తెదేపా, బీజేపీలు చాలా సంతోషిస్తున్నపటికీ కనీసం తమ పార్టీలకి ఉచిత ఎన్నికల ప్రచారమయినా చేయకుండా ఎలా వచ్చాడో అలాగే మాయమయిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ‘ఇంత హడావుడి చేసిన తరువాత ఈ చిన్నసాయం చేసిపెట్టినా బాగుండేది కదా!’ అని సదరు పార్టీల నేతలు నిట్టూర్పులు విడుస్తున్నారు.   ‘చేతిలో కత్తిలాంటి ఛానలొకటి, న్యూస్ పేపర్ ఒకటీ ఉంది గాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే మెగా ఫ్యాన్ల ధాటికి తమ ఫ్యాన్ తిరగడం కూడా కనా కష్టమయిపోయేది కదా!’ అనుకొంటూ జగన్ పార్టీ వాళ్ళు మెటికలు విరిచారు.   మొత్తం మీద పవన్ కళ్యాణ్ మీకు నచ్చిన వాళ్ళకే ఓటేసుకోమని జనాలకి పర్మిషన్ కూడా ఇచ్చేసి వచ్చినంత వేగంగాను మాయమయిపోయారు. జనాలు మాత్రం “ఎవరో వస్తారని... ఏదో చేస్తారని...ఎదురు చూసి మోసపోకుమా..’ అనే పాత పాటనే మళ్ళీ పాడుకొంటూ ఎదురుగా కనబడుతున్న పాత పార్టీలలో కొత్తగా చేరిన పాత కాంగ్రెస్ నేతలకి ఓటేయాలా వద్దా... అని డైలేమాలో ఉన్నారు.

రేవంత్‌రెడ్డిని వాడుకుని వదిలేశారు!

      తెలుగుదేశం పార్టీలో సత్తావున్న నాయకులలో ఒకరైన రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న పరిస్థితులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో రేవంత్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అండగా నిలిచిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కూరలో ఏరిపారేసే కరివేపాకులా వాడుకుని వదిలేసిన వ్యక్తిలా అవమానాలు ఎదుర్కోవడం బాధాకరమని అంటున్నారు. ఈ అంశం పూర్వాపరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా వున్న రేవంత్‌రెడ్డి గత రెండు సంవత్సరాలుగా తనకు వచ్చే ఎన్నికలలో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి వుందని చెబుతూ వస్తున్నారు. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. మంచి వాగ్ధాటి, అన్ని అంశాల మీద సంపూర్ణమైన అవగాహన, విషయ పరిజ్ఞానం వున్న రేవంత్‌రెడ్డిని చంద్రబాబు రాజకీయంగా బాగా ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకున్నారని అనడం కంటే, అడ్డదిడ్డంగా వాడుకున్నారనడం బెటర్. అటు జగన్ మీదకి అయినా, కిరణ్ కుమార్‌రెడ్డి మీదకి అయినా, ఇటు కేసీఆర్ దగ్గర్నుంచి ఏ తెలంగాణ నాయకుడి మీదకి అయినా రేవంత్‌రెడ్డి అనే అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించేవారు. రేవంత్‌రెడ్డి అనేక సందర్భాలలో ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసి తెలుగుదేశానికి రాజకీయంగా మైలేజీ పెంచారు. అలా తెలుగుదేశం పార్టీకి అస్త్రంలా ఉపయోగపడిన రేవంత్‌రెడ్డి వస్త్రాలు ఒలిచే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టింది. ఈ ఎన్నికలలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని రేవంత్‌రెడ్డి చంద్రబాబు దగ్గర వ్యక్తం చేసినప్పుడు అటు వైపు నుంచి నో రెస్పాన్స్. ఆ తర్వాత రేవంత్‌రెడ్డికి చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా కట్టయింది. మల్కాజ్‌గిరి పార్లమెంటు టిక్కెట్ రేవంత్‌రెడ్డిని కాదని ఆర్థికంగా బలంగా వున్న ఒక వ్యాపారవేత్తకు ఇచ్చే ప్రయత్నం జరిగినప్పుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మల్కాజిగిరి టిక్కెట్ని సదరు వ్యాపారికి కేటాయించడానికి నలభై కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు కూడా వున్నాయి. తనకు టికెట్ కేటాయించాలని మరోసారి కోరేందుకు రేవంత్‌రెడ్డి మూడు రోజులుగా చంద్రబాబుని కలవటానికి ప్రయత్నిస్తున్నా బాబు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా మెలిగిన తనకు ఇప్పుడు అపాయింట్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి వచ్చేసరికి రేవంత్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. టిక్కెట్ ఇవ్వకపోయినా తాను మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచే నామినేషన్ వేస్తానని రేవంత్‌రెడ్డి బెదిరించేసరికి చంద్రబాబు దూతలుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ రంగంలోకి దిగి రేవంత్‌రెడ్డిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రేవంత్‌రెడ్డి  నామినేషన్ నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేశారు. దీనికితోడు బుధవారం నాడు కోడంగల్ అసెంబ్లీ స్థానానికి రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో నామినేషన్లకు బుధవారమే చివరి రోజు కావడంతో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాలా.. లేక పార్టీ చెప్పిన సీటులో నామినేషన్ వేయలా అన్న సందిగ్ధంలో రేవంత్‌రెడ్డి వున్నారు. ఇంతకాలం పార్టీకి సేవ చేసినా తనను చంద్రబాబు ఎంతమాత్రం పట్టించుకోకపోవడం, కనీసం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి అయినా మాట్లాడకుండా మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నడపటం పట్ల రేవంత్‌రెడ్డి ఎంతో బాధపడుతున్నట్టు సమాచారం. కనీసం తాను చంద్రబాబు స్వయంగా మాట్లాడ్డానికి కూడా పనికిరాకుండా పోయానా అని తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

సీట్లకి కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారా?

  రాజకీయ పార్టీలు సీట్లకు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ, ఆయా సీట్ల కోసం అభ్యర్థులు పోటీ పడేలా చేసి కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా డిమాండ్ సృష్టించడం ద్వారా పార్టీలకు ఆర్థికంగా బాగా గిట్టుబాటు అవుతున్నట్టు కనిపిస్తోందని పరిశీకులు అంటున్నారు. రాష్ట్రంలో చాలా సీట్ల విషయంలో అనేకమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చాలా సీట్లను పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆశిస్తున్నారు. వారిలో ఆయా టిక్కెట్ల మీద భారీగా ఆశలు పెంచిన తర్వాత, పార్టీలోని కొంతమంది సదరు టిక్కెట్లను ఆశిస్తున్నట్టు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఈ టిక్కెట్ మీకు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నామని సదరు సౌండ్ పార్టీలకు చెబుతున్నారు. దాంతో పారిశ్రామికవేత్తలు ఎంత ఖర్చయినా పర్లేదు నాకు టిక్కెట్ కావాల్సిందేనని పట్టుపట్టేట్టు చేస్తున్నారు. దాంతో పార్టీల అధ్యక్షులు భారీ స్థాయిలో ‘పార్టీఫండ్’ డిమాండ్ చేసి వారికి టిక్కెట్లు ఇస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చేతులు మారుతున్న డబ్బు 40 కోట్లు దాటిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీకులు చెబుతున్నారు. ఈ ధోరణి ఏ ఒక్క పార్టీలోనో కాకుండా.. అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోందని అంటున్నారు. పంచ్ లైన్ సీట్ ఫర్ సేల్

టీడీపీకి ‘కన్నా’లు పొడుస్తున్నారు!

      గుంటూరు-2 నియోజకవర్గంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను భారీ మెజారిటీతో గెలిపించడానికి తెలుగుదేశం నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ మాట చదివి మీకు కొన్ని సందేహాలు కలగొచ్చు. కాంగ్రెస్ నాయకుడైన కన్నా లక్ష్మీనారాయణని గెలిపించడానికి టీడీపీ నాయకులు కృషి చేయడమేంటబ్బా అని మీకు అనిపించడం న్యాయం. ఒకవేళ అలా జరుగుతోందంటే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌కి గుడ్ బై కొట్టేసి తెలుగుదేశంలో చేరబోతున్నారా అనే డౌట్ కూడా రావొచ్చు. కానీ, కన్నా అలా పార్టీ మారకుండానే కన్నా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే పరిస్థితులు కొంతమంది స్థానిక తెలుగుదేశం నాయకులు కల్పిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ వర్గాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఇష్యూ గురించి పూర్తి సమాచారం చిత్తగించండి...     సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాషౌట్ అయిపోయింది. మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ గెలుపు కూడా డౌట్‌గానే వుంది. తెలుగుదేశం పార్టీ అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థిని నిలబెడితే కన్నా లక్ష్మీనారాయణ గుండెజారి, డిపాజిట్ గల్లంతయ్యే ఛాన్సుంది. ఈ విషయాన్ని ఆలోచించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థి కోసం అన్వేషించారు. ఆ అన్వేషణలో ఆయనకి సరైన వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు... తులసీ సీడ్స్ అధినేత రామచంద్రప్రభు. సౌమ్యుడిగా, సమర్థుడిగా, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం మీద పూర్తి అవగాహన వున్న వ్యక్తిగా, వివాద రహితుడిగా, సేవాభావం వున్న వ్యక్తిగా  మంచి పేరు వున్న రామచంద్ర ప్రభును గుంటూరు-2 నియోజవర్గం నుంచి కన్నా మీద పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావించారు. ఈ మేరకు రామచంద్రప్రభును పిలిపించి మాట్లాడారు. కన్నా మీద పోటీ చేయాలని చంద్రబాబు కోరినప్పుడు రామచంద్రప్రభు తన అంగీకారాన్ని తెలిజేశారు. రామచంద్రప్రభు గుంటూరు-2 నుంచి పోటీ చేయబోతున్నారన్న విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం నాయకులు ఉత్సాహంతో ఉరకలు వేశారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని ఫిక్సయిపోయారు. అయితే ఇక్కడే స్థానిక తెలుగుదేశంలో వున్న కొంతమంది సైంధవులు రామచంద్రప్రభు మీద తమ చాణక్య నీతి ప్రయోగించడం ప్రారంభించారు. నర్సరావుపేట ఎంపీ సీటు దక్కని మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి అక్కడి తెలుగుదేశంలో ఒక వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా మోదుగులను రెచ్చగొడుతోంది. మోదుగుల గుంటూరు-2లో పోటీ చేస్తే కాపు సామాజికవర్గం ఓట్లు రాలవని, ఓడిపోవడం ఖాయమని తెలిసి కూడా గుంటూరు-2 నియోజకవర్గ తెలుగుదేశం బాధ్యుడైన ‘ఒక పెద్దమనిషి’ ఆ దిశగానే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. సదరు పెద్దమనిషికి రామచంద్రప్రభు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్టుగా, పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి టిక్కెట్ ఇస్తానని చెప్పినా, స్థానిక తెలుగుదేశం కీలక నాయకుడు దానికి మోకాలు అడ్డే ప్రయత్నం చేయడం, చివరకు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం రామచంద్రప్రభుకు మనస్తాపం కలిగించినట్టు సమాచారం. ఇలాంటి అవమానకర వాతావరణంలో ఆయన గుంటూరు-2 నుంచి పోటీ చేయకుండా వుండటమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు-2 గంజాయి వనంలో తులసిమొక్కకు గౌరవాన్ని ఆశించడం అత్యాశే అయింది. అయితే సరైన అభ్యర్థి అయిన రామచంద్రప్రభు విషయంలో ఇలా వ్యవహరించడం మంచిది కాదని, ఆయన్ని వదులుకుంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోవడం ఖాయమని స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే గెలవాలన్న ఉద్దేశంతో వున్న కన్నా ఇప్పటికే 20 కోట్లు ఖర్చుపెట్టారట. తనమీద తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని నిలపకుండా ఓడిపోయే అభ్యర్థిని నిలిపేలా చేయడం కోసం కన్నా జిల్లా తెలుగుదేశం ‘పెద్దలతో’ టచ్‌లో వున్నట్టు వినికిడి. ఈ విషయంలో డబ్బు భారీగా చేతులు మారినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు-2 నియోజకవర్గం విషయంలో జరుగుతున్న ఈ అంతర్గత రాజకీయం గురించి, తెలుగుదేశం పార్టీకి ‘కన్నా’లు పొడుస్తున్న నాయకుల గురించి పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.