రాయపాటి ఇన్.. మోదుగుల ఔట్

  నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సోమవారం నాడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అదే ముహుర్తానికి మోదుగుల టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నరసరావుపేట ఎంపీగా ఉన్న మోదుగుల తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ స్థానం నుంచి పార్టీలోకి కొత్తగా వస్తున్న ఎంపీ రాయపాటి సాంబశివరావును బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. మోదుగులకు గుంటూరు పశ్చిమ, లేదా బాపట్ల అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది.   నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి బావ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బరిలో ఉండటంతో మోదుగులకు ఆ టిక్కెట్టు ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చారు. ఆ స్థానం నుంచి రాయపాటికి అవకాశం కల్పించారు. పోటీలో ఉన్నది బావే అయినా తాను వెనకాడేది లేదని, పార్టీ తరఫున గట్టిగా పోరాడతానని మోదుగుల చెప్పినా ఫలితం లేకపోయింది. దాంతో ఇక పార్టీని వీడాల్సిందేనని ఆయన నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా అదే స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

తెరాస చెవిలో వీ బ్రదర్స్ గులాబీ పువ్వు

  పెద్దపల్లి ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ మళ్ళీ తమ సొంత గూటికి చేరారు. కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ను వీడి తెరాసలో చేరిన ఈ "వీ" సోదరులు ..తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినప్పుడు వేరే పార్టీలో ఉండడం ఎందుకు దండగ అని సెలవిస్తున్నారు. అయితే మొదట్నించీ వివేక్, వినోద్ లను తెరాస నేతలు దూరంగానే ఉంచారని సమాచారం. ఎప్పటికైనా కాంగ్రెస్ గూటికి చేరే పక్షులే అని వీ బ్రదర్స్ ను అనుమానించిన గులాబీ బాస్ పార్టీలో వీరికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని తెలంగాణా భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు తెలంగాణా వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీయార్ .. ఇప్పుడు మాట మార్చి తెలంగాణా పునర్ నిర్మాణం తనతోనే సాద్యమంటున్నారు. ఇక తెరాసలో ఉంటే తమకు ఎటువంటి ముఖ్య పదవులు దక్కవని భావించిన వీ బ్రదర్స్ సొంత గూటికి చేరుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వివేక్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మరో ఎంపీ మందా జగన్నాధం కూడా కారు దిగి కాంగ్రెస్ అభయ హస్తం అందుకోనున్నాడని తెలుస్తోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు కూడా. ఎంపీ వివేక్ కాంగ్రెస్ లో చేరడంపై ఈటెల స్పందిస్తూ..వివేక్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లినా టీఆర్ఎస్ పై ప్రభావం ఉండన్నారు.

పొత్తు పెట్టుకుందాం.. ప్లీజ్

  ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది టీడీపీ - బీజేపీ పొత్తుల వ్యవహారం. టీడీపీతో తమకు పొత్తు ఉండబోదని బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టేసినా, ఇంకా ఆ వ్యవహారం ముగిసిపోలేదని, కొనసాగుతోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పొత్తుల విషయమై పైకి ఏమీ మాట్లాడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయనేతలతో తన మంతనాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి నాయకులు తమ బలమేంటో తెలుసుకోకుండా ఎక్కువ సీట్లు అడుగుతున్నారని, అయినా తాము కూడా పట్టు విడుపులకు సిద్ధమేనంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీలకు బాబు ఫోన్ చేశారు. ఒంటరి పోరాటంపై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ పొత్తుపై చర్చలు జరిపినట్లు సమాచారం.   సోమవారం ఢిల్లీలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో పొత్తుపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని రాజ్‌ నాథ్ బదులిచ్చినట్లు తెలిసింది. తర్వాత బీజేపీ అగ్రనేతలు ఇద్దరూ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు ఫోన్ చేసి.. టీడీపీతో పొత్తుపై పట్టు విడుపులు ఉండేలా చూడాలని సూచించినట్లు తెలిసింది. పొత్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ, సీమాంధ్ర బీజేపీ శాఖలు రెండూ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. పొత్తులో భాగంగా తెలంగాణలో 40 అసెంబ్లీ సీట్లు, హైదరాబాద్‌తో పాటు 8 పార్లమెంటు సీట్లు బీజేపీకి ఇవ్వటానికి అభ్యంతరం లేదని చివరిమాటగా చెప్పానని చంద్రబాబు వెల్లడించారని అంటున్నారు. ఇంతకు మించి వారికి సీట్లు ఇవ్వడం కుదరదని, ఆయా సీట్లలో టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని బాబు సూచించినట్లు సమాచారం. సీమాంధ్రలో 10 అసెంబ్లీ, మూడు లోక్‌సభ సీట్లతోనే సరిపుచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

తెరాస బీజేపీవైపు చూస్తోందా?

  తెదేపా-బీజేపీ, కాంగ్రెస్-తెరాసల మధ్య ఎన్నికల పొత్తుల విషయం ఇంకా నలుగుతూనే ఉంది. అయితే తెదేపా-బీజేపీలు సానుకూల వాతావరణంలో పొత్తులు కుదుర్చుకొనే దిశలో ముదుకు కదులుతుంటే, కాంగ్రెస్-తెరాసలు మాత్రం ఇంకా తమ టామ్ & జెర్రీ షో కొనసాగిస్తూ ప్రజలకు వినోదం కలిగిస్తూనే ఉన్నాయి. తెదేపా-బీజేపీ పొత్తుల సంగతి తేలిపోతే దానిని బట్టి ఏదోఒక నిర్ణయం తీసుకోవచ్చని తెరాస భావించడమే అందుకు ప్రధాన కారణమయి ఉండవచ్చును. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరకపోయినట్లయితే, అప్పుడు తామే బీజేపీతో పొత్తులు పెట్టుకోవచ్చునని తెరాస ఎదురుచూస్తోందేమో. లేదా ఒకవేళ ఆ రెండు పార్టీలు పొత్తులు కుదుర్చుకోలేకపోయినట్లయితే ఆ కారణంగా తెలంగాణాలో బలహీనంగా మారే ఆ రెండు పార్టీలను తేలికగా ఎదుర్కోవచ్చనే భ్రమలో ఉండి ఉండవచ్చును.   అదే తెరాస ఆలోచనయితే అది వాపును చూసి బలుపు అని భ్రమస్తున్నట్లే అవుతుంది. ఎందువలన అంటే తెరాసకు కేవలం నాలుగయిదు జిల్లాలపైనే మంచి పట్టు ఉంది. మిగిలిన జిల్లాలలో కొన్ని చోట్ల తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మరికొన్ని చోట్ల బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, ఇంకొన్ని చోట్ల వైకాపా బలంగా ఉన్నాయి. తెరాస ఇంతవరకు తెలంగాణా సెంటిమెంటుపైనే ఆధారపడి నడుస్తోంది తప్ప గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మించుకోలేదు. అందుకే గత ఏడాది జరిగిన సహకార, పంచాయితీ ఎన్నికలలో తెరాస చతికిలబడితే, గ్రామస్థాయి వరకు పార్టీని నిర్మిచుకొన్న కాంగ్రెస్,తెదేపాలు విజయకేతనం ఎగురవేసాయి.   అంతేగాక తెరాసలో యంపీ స్థానాలకు పోటీ చేయగల సత్తా, ఆర్ధిక, అంగ బలం గల నేతలు ఎక్కువమంది లేరు. అందువల్ల తెరాస దురాశాకుపోయి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోకపోతే రెండు పార్టీలు నష్టపోక తప్పదు. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తులు ఇష్టం లేకపోతే కనీసం బీజేపీతో అయినా పొత్తులు పెట్టుకోవడం ఆ పార్టీకి అన్ని విధాల శ్రేయస్కరం. లేకుంటే, కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, ఓయూ విద్యార్ధులు, స్వతంత్ర అభ్యర్ధులతో జరిగే ఈ పోటీలో సర్వేలు చెపుతున్నట్లుగా తెరాస తిరుగులేని మెజార్టీ సాధించడం అసంభవం అవుతుంది.   ఈసారి ఎన్నికలలో తెరాస పూర్తి విజయం సాధించలేక చతికిల పడినట్లయితే,దాని ప్రాభవం కోల్పోయి విధిలేని పరిస్థితుల్లో సిగ్గువిడిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో విలీనానికి సిద్దపడవలసి వస్తుంది. అందువల్ల తెరాస తనను తాను మరీ ఎక్కువగా ఊహించుకొని కాంగ్రెస్ ను దూరం చేసుకొంటే దానికే నష్టం.

అన్నాదమ్ముల సవాల్

  తమిళనాడులో కరుణానిధి తనయులు అళగిరి, స్టాలిన్ మధ్య విభేదాలు వచ్చి ఇద్దరూ కొట్టుకున్నంత పని చేస్తే, కర్ణాటకలో మరో మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఇదే బాట పట్టారు. అయితే తమ తండ్రి, కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప చనిపోయిన తర్వాతే ఆయన కొడుకులు మధు బంగారప్ప, కుమార బంగారప్ప కొట్టుకుంటున్నారు. బంగారప్ప కుమారుల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు ఆరోపణలకే పరిమితమైన మాటల యుద్ధం చివరకు రోడ్డున పడింది. మధు బంగారప్పకు వ్యతిరేకంగా కుమార బంగారప్ప ధర్నాకు దిగడంతో వీరి కలహాలు మరో మలుపు తిరిగాయి. ఈడిగ సమాజం ఆస్తులను మధు బంగారప్ప దుర్వినియోగం చేస్తున్నాడంటూ శివమొగ్గ ప్రాంతంలో ఉన్న గాడికొప్పలోని శరావతి డెంటల్ కళాశాల ఎదుట కుమార బంగారప్ప ధర్నా చేశారు. శరావతి డెంటల్ కాలేజీ ఉన్న స్థలం ఈడిగ సమాజానికి చెందినదని, సమాజ శ్రేయస్సు కోసం ఈ ఆస్తిని అప్పట్లో కేటాయించారని గుర్తు చేశారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణమున్న ఈ స్థలాన్ని 15 ఎకరాలు మాత్రమే ఉందంటూ మధు బంగారప్ప పేర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి సమాజం ఆస్తిని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బంగారప్ప కొడుకులిద్దరి మధ్య ఎప్పటినుంచో విభేదాలున్నాయి. పదవుల కోసం, అధికారం కోసం వీళ్లిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తూనే ఉంది. అయినా, బంగారప్ప ఉన్నన్నాళ్లు అది నివురుగప్పిన నిప్పులా ఉండిపోయిందే తప్ప బయటకు రాలేదు. ఇప్పుడు కాస్తా అది భగ్గుమంటూ కార్చిచ్చులా వ్యాపిస్తోంది.

బీజేపీలో సుష్మ లొల్లి!

      బీజేపీ నాయకురాలు, లోక్‌సభలో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రస్తుతం పార్టీలో కొరకరాని కొయ్యలా తయారయ్యారు. బీజేపీని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి తేవాలని అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు లాంటి నాయకులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటే సుష్మ మాత్రం వారికి ఎంతమాత్రం సహకరించకపోగా, లేనిపోని ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.   ప్రస్తుతం పార్టమెంటరీ పార్టీ నాయకురాలైన సుష్మ స్వరాజ్ సహజంగానే ప్రధాని పదవి మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత తానే దేశ ప్రధాని అని కలలు కన్నారు. అయితే నరేంద్రమోడీ తెరమీదకి రాగానే సుష్మ నిరాశకు గురయ్యారు. ప్రధాని పదవి విషయంలో అద్వానిని అడ్డుపెట్టి నరేంద్రమోడీ అభ్యర్థిత్వానికి అడ్డుపడే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దాంతో అలకవహించిన సుష్మ, పైకి సహకరిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం బోలెడంత కోపం పెట్టుకున్నారు. బీజేపీ నాయకత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ జనం దృష్టిలో బీజేపీ పలుచన అయ్యేలా చేస్తున్నారు. పార్టీ నాయకత్వం అనే సమీకరణాలను పరిశీలించిన అనంతరం బద్మేక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్‌కి టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో అలిగిన జస్వంత్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. అయితే ఈ విషయం మీద సుష్మ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. జస్వంత్ సింగ్‌కి టిక్కెట్ ఇవ్వకూడదన్న అంశాన్ని ఎన్నికల కమిటీలో చర్చించలేదని సుష్మ తెగ బాధపడిపోతూ మీడియాకి ఎక్కారు. ఇది బీజేపీలో వున్న క్రమశిక్షణకు భంగం కలిగించేలా వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్, ప్రకాష్ జవదేకర్, వెంకయ్య నాయుడు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నారు తప్ప సుష్మ అంత యాక్టివ్‌గా లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రాబోతున్న తరుణంలో సుష్మా స్వరాజ్ పార్టీ పరువు పోయే విధంగా వ్యవహరించడం మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

లిమిట్స్ దాటుతున్న కేసీఆర్!

      తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదని స్పష్టంగాతెలుస్తున్నప్పటికీ కేసీఆర్ తన దర్పాన్ని ఎంతమాత్రం వదిలిపెట్టడం లేదు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన మరుక్షణం సీమాంధ్రులను సోదరుల్లా భావిస్తాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులూ కలిగించమని చెప్పిన కేసీఆర్ ఈమధ్య కాలంలో మళ్ళీ వాయిస్ పెంచుతూ వస్తున్నాడు. ఎన్నికల వేడి పెరుగుతున్నకొద్దీ సీమాంధ్రుల గుండెలు మండిపోయే విధంగా స్టేట్ మెంట్లు ఇస్తున్న కేసీఆర్, తనను తాను కాబోయే ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నాడు.   తన ప్రభుత్వం రాగానే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ తెలంగాణ ప్రజల్ని మరిన్ని భ్రమల్లో ముంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తే ఒప్పుకోమంటూ కేసీఆర్ చేసిన ప్రకటన సీమాంధ్ర ఉద్యోగులలో ఆగ్రహావేశాలను రగిలిస్తోంది. తెలంగాణ తెచ్చిన బిల్లు మంచిదేగానీ, ఆ బిల్లులో వున్న ‘ఆప్షన్లు’ అనే పదం మాత్రం కేసీఆర్‌కి నచ్చకపోవడం దారుణమని వారు అంటున్నారు. ఇదిలా వుంటే, లిమిట్స్ దాటడంలో డాక్టరేట్ కేసీఆర్ తన స్థాయికి మించిన పనులు మొదలుపెట్టాడు. అత్యంత సున్నితమైన అంశాలలో కూడా ఎంటరైపోతున్నాడు. న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నాడు. అత్యంత పకడ్బందీగా, రాజ్యాంగబద్ధంగా జరిగే న్యాయమూర్తుల నియామకాల మీద కూడా కామెంట్లు చేస్తూ, లేఖలు రాసే సాహసం చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే జూన్ 2వ తేదీలోపు న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టకూడదంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ గుప్తాకి లేఖ రాశాడు. జూన్ 2 లోపు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం చేపడితే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆ లేఖలో గగ్గోలు పెట్టాడు. న్యాయ వ్యవస్థకి కూడా ప్రాంతీయ విభేదాల జాడ్యాన్ని అంటగట్టడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను న్యాయ నిపుణులు చిరాకుగా చూస్తున్నారు.

తెలంగాణా కోసం చంద్రబాబు సరికొత్త వ్యూహం

  రాష్ట్ర విభజన దెబ్బకి తెలంగాణాలో డీలాపడిపోయిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రయోగించిన బీసీ మంత్రంతో మళ్ళీ బలం పుంజుకొంది. ఇటీవల ఆయన వేసిన రెండు తెలంగాణా కమిటీలలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా బీసీ వ్యక్తినే తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన హామీతో ప్రధాన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెరాసలు రెండూ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు మరో సరికొత్త వ్యూహంతో పార్టీని మరింత బలోపేతం చేసి, అధికారం కైవసం చేసుకొనేందుకు సిద్దమవుతున్నారు.   తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణా పోరాటంలో తనకు అండగా నిలబడి పోరాడిన ఉద్యమకారులకు టికెట్స్ నిరాకరించడంతో వారు ఆయనపై ఆగ్రహంగా ఉన్న సంగతిని గమనించిన చంద్రబాబు, వారిలో యువకులు, ఉన్నత విద్యావంతులు, తెలంగాణా పునర్నిర్మాణం పట్ల నిబద్దత కలవారు ముఖ్యంగా బీసీ వ్యక్తులను గుర్తించి పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.   ఈ మధ్యనే హన్మకొండకు చెందిన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) వర్కింగ్ కమిటీ చైర్మన్ చిల్లా రమేష్‌తో పాటు మరికొంత మంది చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉన్నత విద్యావంతుడు, ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న యువకుడు అయిన రమేష్ ముదిరాజ్ కులానికి చెందినవారు. ఆయనను బీసీలు అధికంగా ఉన్న వరంగల్ జిల్లా తూర్పు అసెంబ్లీ స్థానం నుండి పోటీలో నిలిపేందుకు చంద్రబాబు సంసిద్దంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న బీసీ కులాలకు చెందిన మరికొందరు యువకులతో చంద్రబాబు తన అనుచరుల ద్వారా సంప్రదిస్తున్నట్లు తాజా సమాచారం.   తెలంగాణా ప్రజలకు సుపరిచితులయిన ఉద్యమకారులనే పార్టీ టికెట్స్ కేటాయించి ఎన్నికల బరిలో దింపినట్లయితే, కాంగ్రెస్, తెరాసలకు చెక్ పెట్టడమే కాకుండా, ప్రజలకు తెదేపా పట్ల నమ్మకం కలిగించవచ్చును. చంద్రబాబు ప్రయత్నాలు ఫలించినట్లయితే, ఇంతవరకు తెలంగాణాలో తమకు తిరుగేలేదని భావిస్తున్న తెరాస, కాంగ్రెస్ పార్టీలు తెదేపా అభ్యర్ధులను ఓడించేందుకు చెమటోడ్చవలసి రావచ్చును. నిన్న మొన్న వరకు తమతో కలిసి పనిచేసిన తెలంగాణా ఉద్యమకారులకు వ్యతిరేఖంగా ఆ రెండు పార్టీలు మాట్లాడటం కూడా కష్టమే అవుతుంది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వారిపై విమర్శలు గుప్పిస్తే అవి ప్రజలలో ఆ రెండు పార్టీల పట్ల వ్యతిరేఖతను పెంచే ప్రమాదం ఉంది. అందువల్ల చంద్రబాబు ప్రయోగిస్తున్న ఈ రెండో బ్రహ్మాస్త్రం మొదటి దానికంటే చాలా ప్రమాదకరమయినదని ఒప్పుకోక తప్పదు.

టీఆర్ఎస్ తో పొత్తుకే కాంగ్రెస్ యోచన

  ‘జుట్టు పట్టుకుని బయటకీడ్చినా చూరు పట్టుకుని వేలాడి’ అన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పొత్తూలేదు గిత్తూ లేదని కుండ బద్దలుకొట్టిన కేసీఆర్ ను మళ్లీ దేహీ అనేలా కనిపిస్తోంది. అవసరమైతే నేరుగా సోనియా గాంధీయే కేసీఆర్ తో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పూర్తిగా దిగజారిపోయింది. దీంతో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో గరిష్టస్థాయిలో ప్రయోజనం పొందాలని ఆ పార్టీ ఆశిస్తోంది. ఇక్కడ పార్టీ పూర్తిగా ప్రయోజనం పొందాలంటే టీఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనివల్ల ఓట్లలో చీలిక రాదని, పార్టీకి ఎదురే ఉండదని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో టీఆర్‌ఎస్ పొత్తుకోసం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   టీఆర్‌ఎస్ పొత్తుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న సంకేతాలపై ఇరు పార్టీల్లోనూ మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా సీట్లు ద క్కించుకుంటామనే నమ్మకం ఉన్న నాయకులంతా తమ విజయానికి ఇక తిరుగుండదనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పొత్తు కారణంగా అవకాశాలు కోల్పోతామని భావిస్తున్న నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని తాజా మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌తో పొత్తు ఖాయమైతే అధిష్టానం తమ నెత్తిన పాలుపోసినట్లే అవుతుందని సంతోషపడుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభావం అంతగా లేని దక్షిణ తెలంగాణలో మాత్రం పొత్తు వల్ల ఆ పార్టీకి సీట్లు కేటాయించక తప్పదని, ఇది తమకు తీవ్ర నష్టమని ఆందోళన చెందుతున్నారు.

టీఆర్ఎస్ సర్వేల కామెడీ!

  టీఆర్ఎస్ చేస్తుస్తున్న సర్వేల వ్యవహారం సినిమా హీరోయిన్ల వయసు మాదిరిగా తయారైంది. హీరోయిన్లు అసలు వయసు ఎప్పుడూ బయటపెట్టరు. పదేళ్ళ ముందట ఎంత వయసు చెప్పారో పదేళ్ళ తర్వాత కూడా మాట తప్పకుండా అదే వయసు చెబుతారు. అదే విధంగా మాట తప్పడం అంటే ఏమిటో ఎంతమాత్రం తెలియని కేసీఆర్ కూడా ఇదే రూట్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన తన వయసు చెప్పే విషయంలో ఎలాంటి కామెడీ చేయడం లేదుగానీ, టీఆర్ఎస్ పార్టీకే ఈ ఎన్నికలలో రాబోయే సీట్ల విషయంలో మాత్రం బోలెడంత కామెడీ క్రియేట్ చేస్తున్నాడు. హీరోయిన్ల మాదిరిగా ఎప్పుడు అడిగినా ఒకే అంకె చెబుతున్నారు. టీఆర్ఎస్‌కి ఈ ఎన్నికలలో 70 అసెంబ్లీ సీట్లు తప్పకుండా వస్తాయని కేసీఆర్ బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. తమ పార్టీ చేసిన సర్వేల సర్వేల ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నానని ఆయన అంటున్నాడు. ఇది ఇప్పుడు కాదు. తెలంగాణ రాకముందు నుంచీ ఇదేమాట చెబుతున్నాడు. సార్ ఎప్పుడు సర్వే చేయించినా 70 సీట్లు వస్తాయని రిజల్టు వస్తోందంటే ఈ సర్వే రిపోర్టుని అనుమానించాల్సిందే. ఆ సర్వే చేసే సంస్థకి దండేసి దణ్ణం పెట్టాల్సిందే.   నిజానికి కేసీఆర్ సర్వేలు చేయించి 70 అంకె చెబుతున్నట్టుగా లేదని, నోటికొచ్చినట్టుగా ఎప్పటినుంచో ఒకే అంకెని పట్టుకుని వేలాడుతున్నట్టుగా వుందని రాజకీయ పరిశీకులు అనుమానంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ప్రజలు టీఆర్ఎస్‌ని లైట్‌గా తీసుకుంటున్నారని, ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ 35 నుంచి 40 సీట్లు మాత్రమే సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంకా మాట్లాడితే ఈ మాత్రం సీట్లు కూడా వస్తాయో లేదోనన్న సందేహాలు కూడా వున్నాయని చెబుతున్నారు. ఈ వాస్తవం తెలుసుకున్న కేసీఆర్ తనకు తాను ఉత్సాహాన్ని ఇవ్వడానికో, పార్టీ నాయకులు నిరాశలో కూరుకుపోకుండా వుండటానికో తాను చేయించానని చెప్పుకునే సర్వే గురించి, 70 అంకె గురించి గుర్తు చేస్తూ వుంటాడని అంటున్నారు.  

కర్ణుడి చావుకి వెయ్యి శాపాలు.. చిరంజీవి ప్రచారానికి..

    గత వారం రోజులుగా చిరంజీవి & ట్రూప్ వారు ప్రదర్శిస్తున్న మెగా కాంగ్రెస్ షో ప్రేక్షకులు లేక ఘోరంగా ఫ్లాప్ అయి అర్ధాంతరంగా ముగుస్తుండటంతో ఆయన్నే నమ్ముకొని గోదారి దాటేద్దామని ఆశపడిన కాంగ్రెస్ అధిష్టానం ఏమి చేయాలో తెలియక తలపట్టుకోంది. కాంగ్రెస్ పట్ల ప్రజలలో నెలకొన్న తీవ్ర వ్యతిరేఖతకి తోడు రాష్ట్ర విభజన వ్యవహారంలో, ఆయన మూటగట్టుకొన్నఅపఖ్యాతి కూడా ఆయన ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చును. అందుకే ఆయన ప్రచారానికి జనాలు మొహాలు చాటేశారు.అయినా రాష్ట్ర విభజనతోనే కాంగ్రెస్ పార్టీకి సీమాంద్రాలో ప్రజలు అకౌంటు క్లోజ్ చేసేసారని తెలిసినప్పటికీ అదేమీ తెలియనట్లు నటిస్తూ వారు వచ్చినంత మాత్రాన్న ప్రజలు తమ అభిప్రాయాలు మార్చేసుకొంటారని చిరంజీవి & ట్రూప్ అనేసుకోవడం అత్యాసే.   ఇక చిరంజీవి తన ప్రచారంలో చేస్తున్న అర్ధం లేని అసందర్భ ప్రసంగాలతో ఉన్న జనాలు కూడా పారిపోతున్నారు. ఇక కాంగ్రెస్ నేతలందరూ కట్టకట్టుకొని ఏసీ బస్సు వీసుకొని ప్రచారానికి బయలుదేరినా వారిలో ఒక్కరికీ కూడా ప్రజలలో మంచి పేరు కానీ, గుర్తింపు గానీ లేకపోవడం, గుర్తింపు ఉన్న చిరంజీవికి నోటి శుద్ధి లేకపోవడంతో జనాలు కరువయ్యారు.  ఒకప్పుడు లక్షలాది ప్రజలు రోడ్ల మీదకు రెండున్నర నెలల పాటు ఉద్యామాలు చేసినప్పుడు వారి అభిప్రాయాలకు పూచికపుల్లెత్తు విలువీయని కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ప్రజలు బాజాభజంత్రీలతో ఘన స్వాగతం చెపుతారని అనుకోవడం కూడా అత్యాసే కదా! అయినా ప్రజలు ఇప్పటికీ తెదేపా, వైకాపా, కొత్తగా రంగంలోకి దిగుతున్న జనసేన పార్టీల మధ్యన ఎప్పుడో చీలిపోయారు. అందువలన ఇప్పుడు ఏ జీవి వచ్చినా కాంగ్రెస్ పార్టీని కాపాడటం అసాధ్యం అని అధిష్టానం గ్రహించగలిగితే, వేరే కొత్త ఆలోచన ఏదయినా చేసుకొనే వీలుతుంది.

పవన్ తెదేపా ఏజెంటా?

  పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తెలంగాణాలో కూడా పోటీ చేస్తుందనే సంకేతాలు ఈయకపోయి ఉంటే, బహుశః తెరాస నేతలు అసలు ఉపన్యాసం గురించి పట్టించుకొనేవారే కాదేమో. కానీ, ఆయన ఆంధ్ర తెలంగాణా రెండు ప్రాంతాలలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు, తమ రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీలతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం ఉన్నట్లు చూచాయగా చెప్పడంతో, తెరాస తప్పనిసరిగా స్పందించవలసి వచ్చింది. తాము భూస్థాపితం చేసేశామనుకొన్న తెలుగుదేశం పార్టీ ఇటీవల మెహబూబ్ నగర్ లో నిర్వహించిన ప్రజాగర్జన సభ విజయవంతం కావడం, దానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేందుకు సిద్దపడటం చూసిన తెరాస అప్రమత్తమయి వారిరువురినీ లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి ఆరంబించింది.   తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన తరువాత, తెరాస నేత హరీష్ రావు తెదేపా, జనసేనలపై తన అస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మేకప్ & ప్యాకప్ పార్టీ అని కవిత విమర్శిస్తే, హరీష్ రావు మాత్రం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఏజెంటుగా రాజకీయ రంగ ప్రవేశం చేసారని విమర్శిస్తూ, ఆ రెండు పార్టీలను ఒకే గాట కట్టి, ఆంద్ర పార్తీలనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు.   అయితే కేసీఆర్ తో సహా తెరాస నేతలందరూ కూడా తమ పార్టీకి ఎన్నికలలో ఎదురే ఉండదని, తమ పార్టీయే తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నపటికీ, కవిత, హరీష్ రావు తెదేపా, జనసేనలను ఇంత బలంగా ఎదుర్కోవడం చూస్తే, తెరాస తన ప్రత్యర్ధులను చూసి భయపడుతోందని అర్ధమవుతోంది.   అందుకు ప్రధాన కారణం నేటికీ తెరాసకు తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తిపట్టు లేకపోవడం, నేటికీ పార్టీ గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మాణం జరగక పోవడమే. నేటికీ తెరాస తెలంగాణా సెంటిమెంటు మీదే ప్రధానంగా ఆధారపడి ఎన్నికలకి వెళుతోంది తప్ప, పార్టీ క్యాడర్ మరియు తన నేతల బలం చూసుకొని మాత్రం కాదని నిర్ద్వందంగా చెప్పవచ్చును. అందుకే తన ప్రత్యర్ధులు ఏమాత్రం బలపడినట్లు కనబడినా వెంటనే వారిపై తెరాస నేతలు అందరూ కట్టకట్టుకొని విరుచుకు పడుతుంటారు. ఇప్పుడూ వారు అదే చేస్తున్నారు.

వలసలతో పార్టీలు సలసల

  సాధారణ ఎన్నికలకు ముందొచ్చిన వలసలు పాలమూరులో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అధికారికంగా అభ్యర్థిత్వాలు ఖరారయ్యే వరకు ఈ కలకలం తప్పదని నేతలు ఆవేదన చెందుతున్నారు. పలు నియోజకవర్గాల్లోని కేడర్‌లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. వలసల కారణంగా కాంగ్రెస్ పార్టీలో మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతుండగా....తెలంగాణ రాష్ట్ర సమితికి నాలుగు స్థానాల్లో తల నొప్పులు తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోకి అలంపూర్ మాజీ ఎమ్మేల్యే చల్లా వెంకట్రాంరెడ్డి చేరటంతోనే కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు తీవ్ర రూపం దాల్చాయి. ఏకంగా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం కాంగ్రెస్‌ను వదిలి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ప్రధాన కారణం చల్లా సూచించిన వ్యక్తికే అలంపూర్ టికేట్ ఇస్తారని ప్రచారం కావటమేనని తెలుస్తుంది. మరో పక్క చల్లా వెంకట్రాం రెడ్డి కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండటంతో...ఇక్కడి నుంచి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్న విష్ణువర్థన్‌రెడ్డి, మరికొందరు తీవ్ర అసంతృప్తితో తాడోపేడో తేల్చుకోడానికి సిద్దపడుతున్నారట.   మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి ఖరారు అవుతోందని ప్రచారం జరుగుతుండటంతో ఈ స్థానంపై కన్నేసిన మాజీ ఎంపి, కాంగ్రెస్ నేత విఠల్‌రావు కొడంగల్ అసెంబ్లీ సీటు కావాలంటున్నారు. దీంతో ఇక్కడినుంచి టికెట్‌ను ఆశిస్తున్న పలువురు నేతలు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అటో ఇటో అంటున్నారని సమాచారం. టీఆర్‌ఎస్ లో లొల్లి మరోలా ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు వై. ఎల్లారెడ్డి (నారాయణపేట), జైపాల్‌ యాదవ్ (కల్వకుర్తి) టీఆర్‌ఎస్‌ లో చేరగా, గద్వాలలో మాజీ మంత్రి అరుణ బంధువు కృష్ణమోహన్‌రెడ్డి కూడా కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.   టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ లో చేరారు. వీరందరికీ టికెట్లు ఇస్తామన్న కేసీఆర్, నియోజకవర్గాలు కూడా కేటాయించారు.ఎల్లారెడ్డికి మక్తల్, జైపాల్‌యాదవ్‌కు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కల్వకుర్తి, శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్, కృష్టమోహన్‌రెడ్డికి గద్వాల అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. దీంతో ఆ నాలుగు నియోజకవర్గాల్లో అసమ్మతి రాజుకుంది. పాలమూరు పార్టీ ఇన్‌చార్జి ఇబ్రహీం ఇక్కడ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించటంతోపాటు ఇతరులతో టచ్‌లో ఉంటున్నట్టు ప్రచారం సాగుతోంది. అవకాశాన్ని బట్టి కాంగ్రెస్ లేదా ఎంఐఎం లో ఇబ్రహీం చేరవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.   కల్వకుర్తిలో పార్టీ ఇన్‌చార్జి బాలాజీసింగ్, మక్తల్‌ లో ఆ పార్టీ నాయకుడు దేవర మల్లప్ప,గద్వాలలో పార్టీ ఇన్‌చార్జి గట్టు భీముడు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కల్వకుర్తిలోబాలాజీసింగ్ అనుచరులు ఒకడగు ముందుకేసి అందోళనకు దిగారు. ఇలా రెండు పార్టీల్లోనూ వలసల సెగలు భగభగమంటూనే ఉన్నాయి.

కమలం - సైకిల్ పొత్తు పొడిచేనా?

  తెలుగుదేశం పార్టీ, బీజేపీల పొత్తు పరిస్థితి అయోమయంలో పడింది. సాక్షాత్తు బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ దూతగా వచ్చిన ప్రకాష్ జవదేకర్ కూడా ఇక్కడి పొత్తుల విషయాన్ని ఏమీ తేల్చలేక చేతులెత్తేసి హస్తిన వెళ్లిపోయారు. జైట్లీయే స్వయంగా రంగప్రవేశం చేస్తారని ప్రచారం జరిగినా ఆయన కూడా ఇంతవరకు రాలేదు. ‘చంద్రబాబు వల్లే అధికారం కోల్పోయాం. పొత్తు వ్యవహారం కుదరకపోతే అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పొత్తుల కోసం మేమెవ్వరినీ బతిమాలడం లేదు’ అని బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తే, ఇక పొత్తు పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. రెండు ప్రాంతాల్లో కలిపి ఎనిమిది వరకూ ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సరేనంటోంది. ఇందులో తెలంగాణాలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్‌ నగర్, మెదక్, సీమాంధ్రలో నరసాపురం, తిరుపతి ఉన్నట్లు సమాచారం. దీనిపై కమలనాథులు మండిపడుతున్నారు.   హైదరాబాద్ స్థానం మజ్లిస్ కంచుకోట. అలాగే మెదక్ నుంచి ఈసారి కేసీఆర్ పోటీ చేయచ్చు. ఇలా, కచ్చితంగా ఓడిపోతారనుకునే స్థానాలను తమకిచ్చి ‘గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం’ అన్నట్లుగా వ్యవహరిస్తే పొత్తులపై ముందుకు ఎలా వెళ్తామని అంటున్నారు. కానీ.. తాము తమ సీట్ల జాబితాను ఊరికే ఆషామాషీగా ఇవ్వలేదని, ఏ సీటును బీజేపీ తీసుకుంటే లాభం ఎలా ఉంటుంది? అక్కడ రాజకీయ సమీకరణాలు, స్థానిక బలాబలాలు వివరిస్తూ శాస్త్రీయంగా ఇచ్చామని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారట.   ఇదంతా చూసి.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందన్న అంచనాతో బీజేపీలో చేరిన సీమాంధ్ర నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్ళు పరిగెడుతున్నాయి. సీమాంధ్రలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అక్కడ టీడీపీతో పొత్తు ఉంటేనే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఉంది. టీడీపీలో పోటీ అధికంగా ఉండటం వల్లో లేదా మరే ఇతర కారణాలతోనో వారు బీజేపీని ఎంచుకొన్నారు. ఆ పార్టీ కోటాలో సీటు సాధించగలిగితే ఖాయంగా గెలవవచ్చన్నది వారి అంచనా. కానీ పొత్తుల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం వారిలో ఆందోళన పెంచుతోంది.   ఇందులో వైసీపీని వదులుకొని వచ్చినవారు, కాంగ్రెస్‌లో పెద్ద స్థాయిలో ఉండి వచ్చినవారు, రిటైర్డ్ అధికారులు వంటి వారు ఉన్నారు. "సీమాంధ్రలో కేవలం బీజేపీ పేరుతో గెలిచే పరిస్థితి లేదు. అది అందరికీ తెలుసు. టీడీపీతో పొత్తు ఉంటుందనే మేం రంగంలోకి దిగాం. ఇప్పటికే కొంత ఖర్చు కూడా పెట్టాం. ఇప్పుడు తేడా వస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు'' అని వారు వాపోతున్నారు.

టీఆర్ఎస్ హార్ట్ లో స్టోన్!

  టీఆర్ఎస్ హార్ట్ లో స్టోన్ పడింది. ఆ స్టోన్ కూడా అంతా ఇంతా స్టోన్ కాదు.. చాలా భారీ స్టోన్. ఆ స్టోన్ పేరు ‘తెలుగుదేశం’. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ వుంటుందని భ్రమపడిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమ భ్రమలు తొలగించుకుని వాస్తవాన్ని దర్శిస్తున్నారు. అటు సీమాంధ్రతోపాటు ఇటు తెలంగాణలో కూడా తెలుగుదేశం చాలా స్ట్రాంగ్‌గా వుందన్న సత్యాన్ని తెలుసుకుంటున్నారు.   రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం వుండదని టీఆర్ఎస్ నాయకులు శక్తివంచన లేకుండా ప్రచారం చేశారు. తెలంగాణలో బలంగా వున్న తెలుగుదేశం నాయకులందరికీ టీఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వానాలు పంపారు. అయితే ఏదో కొద్దిమంది నాయకులు తప్ప ఎవరూ టీఆర్ఎస్ వైపు వెళ్ళలేదు. టీడీపీకి వున్న కార్యకర్తల కోటలో ఒక్క ఇటుకని కూడా టీఆర్ఎస్ కదల్చలేకపోయింది. దీనితోపాటు తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని, తెలంగాణ బీసీలకు తెలుగుదేశం పార్టీని కానుకగా ఇస్తున్నానని చంద్రబాబు ప్రకటించడం, బీసీలను గౌరవించే విధంగా కార్యవర్గాన్ని ప్రకటించడం తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మీద వున్న గౌరవం పెరిగేలాచేసింది.   తెలంగాణ రాకముందు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడని ప్రకటించి, తీరా తెలంగాణ వచ్చాక దళితుల నెత్తిన చెయ్యి పెట్టిన కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నతుడన్న అభిప్రాయం తెలంగాణ ప్రాంతంలో వ్యక్తమవుతోంది. మంగళవారం నాడు మహబూబ్‌నగర్‌లో చంద్రబాబు నిర్వహించిన పాలమూరు ప్రజా గర్జన కార్యక్రమాన్ని చూసి అటు టీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్ నాయకుల గుండెల్లోకూడా రాళ్ళు పడ్డాయి.   చంద్రబాబు సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరు కావడం, చంద్రబాబు ప్రసంగానికి విశేష స్పందన లభించడం రెండు పార్టీల నాయకులకు కంటి నిండా నిద్ర లేకుండా చేశాయి. ప్రస్తుత ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తెలుగుదేశం పార్టీలో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

టీ-ఉద్యోగుల గడుసుతనం

  తెలంగాణ ఉద్యోగులు మరీ గడుసుతనం ప్రదర్శిస్తున్నారు. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటూ ప్రస్తుతం రాష్ట్రాన్ని చుట్టుముట్టిన విభజన సమస్యను మరింత జటిలం చేసి సమస్యను తెగేదాకా లాగాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ఎలా వుందంటే, కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లులో తమకు అనుకూలంగా వున్న విషయాలను మాత్రం సూపర్ అంటున్నారు. తమకు వ్యతిరేకంగా వున్న విషయాలను మాత్రం ఒప్పుకోమని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు ఎలా పంచాలన్న విషయం మీద బిల్లులో కొన్ని మార్గదర్శకాలను చేర్చారు.   కమలనాథన్ అధ్యక్షతన ఏర్పడిన విభజన కమిటీ బిల్లులో సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఉద్యోగుల విభజన కార్యక్రమంలో ముమ్మరంగా పనిచేస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా టీ ఉద్యోగులు కొత్త రాగం ఆలపించడం ప్రారంభించారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వడానికి వీల్లేదని, దీనికి తాము ఎంతమాత్రం ఒప్పుకోమని గొంతు చించుకుని అరుస్తున్నారు. కేసీఆర్ ఏ మాట అంటే ఆ మాటను పట్టుకుని వేలాడుతూ తమకంటూ ప్రత్యేక వ్యక్తిత్వం లేనివాళ్ళుగా తెలంగాణ ఉద్యోగులు కనిపిస్తున్నారని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. టీ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఉద్యమ నాయకుల దగ్గర శక్తి లేదు కాబట్టి ఊరుకున్నారుగానీ, వాళ్ళకే శక్తి వుంటే సీమాంధ్ర ఉద్యోగులు అందర్నీ తెలంగాణ ప్రాంతం నుంచి సీమాంధ్రకు తరిమేసేవారని వారు అంటున్నారు. అయితే తెలంగాణ ఉద్యోగులు, కరడుగట్టిన విభజనవాదులు చేస్తున్న కుట్రలు భగ్నం చేయడానికి తాము సిద్ధంగా వున్నామని చెబుతున్నారు.

కిరణ్ మార్కు కంగాళీ!

  రాష్ట్ర విభజన విషయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సృష్టించిన కంగాళీ సీమాంధ్రుల కొంప ముంచింది. ముఖ్యమంత్రి సీట్లో కూర్చని ‘రాష్ట్ర విభజన జరగదు.. జరగదు..జరగదు’ అంటూ జనాన్ని, తన స్వంత పార్టీ నేతలనీ కూడా హిప్నటైజ్ చేసేసి ఎలాగో రోజులు దొర్లించేసారు. పాపం.. సీమాంధ్రులు కూడా ముఖ్యమంత్రి చెబుతున్నాడు కదా అని నమ్మేశారు. ఫలితం.. పిడుగులాంటి రాష్ట్ర విభజనను భరించాల్సి వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ తియ్యటి మాటలతో సీమాంధ్రులను మభ్యపెట్టి రాష్ట్ర విభజన సులువుగా జరిగిపోవడానికి సహకరించారన్న అభిప్రాయం సీమాంధ్రులలో బలంగా ఉంది. అయితే రాష్ట్ర విభజన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయించిన కిరణ్ బృందం ఇప్పటికీ రాష్ట్రం విడిపోదు అంటూ సీమాంధ్రులని మరింత అమాయకుల్ని చేసే ప్రయత్నం చేస్తోంది.   కానీ, ఇప్పుడు సీమాంధ్రుల ఉన్న పరిస్థితుల్లో సీమాంధ్రుల గొంతును ఢిల్లీలో వినిపించే సమర్థ నాయకత్వం కావాలి. కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనే నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వాన్ని సీమాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబు నాయుడిలో చూస్తున్నారు. ఒకపక్క తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క కిరణ్ కుమార్ రాష్ట్ర విభజన ఆగిపోయే అవకాశం వుందని సీమాంధ్రులను కన్ఫ్యూజ్ చేస్తూ, అంతా కంగాళీ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   కిరణ్ కుమార్ సీమాంధ్ర ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనడం మానుకుంటే మంచిదని అనుకుంటున్నారు. కిరణ్ కుమార్ అండ్ బృందానికి సీమాంధ్రుల మీద నిజంగా అభిమానం వుంటే, జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఎన్నికల్లోకి వెళ్ళి ఓట్లు చీల్చి లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కంటే తమ పార్టీ ఎన్నికలలో గెలిస్తే రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తుందో చెప్పుకొంటే మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

అజ్జూభాయ్ తిక్క కుదిరింది!

      క్రికెటర్‌గా గ్రౌండ్‌లో సిక్సర్స్ కొట్టి, గ్రౌండ్ బయట మ్యాచ్ ఫిక్సర్‌గా నిలిచిన మహ్మద్ అజారుద్దీన్ ఆ తర్వాత రాజకీయ రంగానికి షిఫ్టయ్యాడు. కళంకితులకు సీట్లు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌ని సాదరంగా ఆహ్వానించి యు.పి.లోని మురాదాబాద్ ఎంపీ సీటు ఇచ్చింది. టైం బాగుండి అజార్ అక్కడ గెలిచాడు.   ఎంపీగా అజారుద్దీన్ మురాదాబాద్ నియోజకవర్గాన్ని ఉద్ధరించిందేమీ లేదు. అజారుద్దీన్ పేరు చెబితేనే మురాదాబాద్ జనం ముఖాలు తిప్పుకుంటున్నారు. తన నియోజకవర్గానికి అజార్ చేసిన సేవ ఏమీ లేకపోయినా, సోనియమ్మ సేవలో మాత్రం తరించిపోయాడు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు మొన్నామధ్య పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలను చితకబాదే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు. సొంత రాష్ట్రం ఎంపీలని కూడా చూడకుండా రౌడీయిజం ప్రదర్శించిన అజారుద్దీన్‌కి ఇప్పుడు తగిన శాస్తి జరిగింది. ఈసారి ఎన్నికలలో అజార్‌కి కాంగ్రెస్ అధిష్ఠానం టిక్కెట్ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడంతో బాగా ముదిరిపోయిన ఆయన తిక్క కుదిరింది. పార్టీ కోసం పార్లమెంట్‌లో రౌడీయిజం చేశాడన్న అభిమానం కూడా లేకుండా అజార్‌కి టిక్కెట్ ఇవ్వనంది. మురాదాబాద్ టిక్కెట్‌ని నూర్‌భాన్ అనే ముస్లిం మహిళకు కేటాయించింది. దాంతో లబోదిబోమన్న అజారుద్దీన్ కాంగ్రెస్ అధిష్ఠానం కాళ్ళావేళ్ళా పడ్డా ఉపయోగం లేకుండా పోయింది. భవిష్యత్తులో మరో నియోజకవర్గం నుంచి అయినా టిక్కెట్ ఇస్తారో లేదో అన్న గ్యారంటీ లేక అజారుద్దీన్ అయోమయ పరిస్థితిలో వున్నాడు. అజారుద్దీన్‌కి సీమాంధ్రుల శాపనార్థాలే తగిలి వుంటాయి.

కారు ప్రయాణం పడలేదా!!

  జి.వెంకటస్వామి తనయులుగా రాజకీయాల్లోకి ప్రవేశించి, సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వి-బ్రదర్స్ వినోద్, వివేక్ మళ్లీ కారు దిగి, కాంగ్రెస్ గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తోందంటూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ బ్రదర్స్.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. వాస్తవానికి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినా, కిరణ్ కుమార్ రెడ్డితో పడకపోవడం వల్లే దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజా పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధినాయకత్వం ఎంపీ వివేక్‌కు సిటింగ్ స్థానమైన పెద్దపల్లిని కేటాయించటానికి సిద్ధమైంది. వినోద్‌కు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. అయితే బెల్లంపల్లి సీటును కాకుండా, అదే జిల్లా చెన్నూరు అసెంబ్లీ సీటును వినోద్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ టీఆర్ఎస్ నుంచి నల్లాల ఓదెలు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని చెన్నూరులో వినోద్‌కు టికెట్ ఇవ్వటం గులాబీ దళపతికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. బెల్లంపల్లిలో పోటీకి వినోద్ విముఖత చూపటానికి కారణం.. అక్కడ సీపీఐ సిటింగ్ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ తిరిగి పోటీ చేస్తుండటమేనని అంటున్నారు.   కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు ముగిసిన అధ్యాయమని కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతోపాటు కాంగ్రెస్, సీపీఐ జట్టు కట్టే సూచనలు కూడా బెల్లంపల్లి సీటును వినోద్ వద్దటానికి మరో కారణమని చెబుతున్నారు. బెల్లంపల్లి కాకపోతే కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ సీటును వినోద్‌కు కేటాయించటానికి టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఆయన చెన్నూరు కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇక, వివేక్ కూడా పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో తాను టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగితే.. మరో బలమైన అభ్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే ఎలా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఒక సర్వే చేయించుకోగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తే వచ్చే ఓట్ల కంటే, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయని తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌లో కొనసాగటంపై కాకా తనయులు పునరాలోచనలో పడ్డారు.