రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ స్వంతం, అవినీతి మాత్రం జగన్ పద్దులోనేనట!
posted on May 2, 2014 @ 8:18PM
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నిన్న మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమయిన విషయాలు మాట్లాడారు. మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆఖరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగానే వ్యవహరించారని మెచ్చుకొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పధకాలు అన్నీ కాంగ్రెస్ పార్టీకే చెందుతాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజశేఖర్ రెడ్డి ఫోటోను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను వైకాపాకు చెందిన జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా ఉపయోగించుకొంటున్నారని జైరామ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీయే తనను జైలులో పెట్టించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. జగన్ అవినీతికి పాల్పడినందుకే జైలు పాలయ్యారని, ఈ విషయంలో కాంగ్రెస్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. అనేక అవినీతి కేసుల్లో ఇరుకొని బెయిలుపై బయటకు వచ్చిన అటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాని అన్నారు. జగన్ నేడు కాకపోతే రేపయినా జైలుకి వెళ్ళక తప్పదని అన్నారు. దిగ్విజయ్ సింగ్ చెపుతున్నట్లు అతనిది తమ కాంగ్రెస్ పార్టీ డీ.యన్.ఏ.కానేకాదని అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేతలెవరూ జైలులో గడిపివచ్చిన దాఖలాలు లేవని అన్నారు.
జైరామ్ రమేష్ మాటలలో గమనించాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను స్వంతం చేసుకొన్నారు. కానీ ఆయన హయంలోనే జరిగిన అవినీతి, అక్రమాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి పద్దులో వ్రాసేసారు. వైయస్సార్ తమ పార్టీ వాడని చెప్పుకొంటున్నపుడు, ఆయన హయంలో జరిగిన అవినీతి కూడా కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని ఆయన అంగీకరించి ఉండి ఉంటే చాలా బాగుండేది.
ఆయన హయంలో జరిగిన అవినీతికి, ఆ తరువాత కాలంలో సబితా, ధర్మాన, మోపిదేవి తదితరులు తమ పదవులు పోగొట్టుకోవడం, అనేకమంది ఐఎయస్ అధికారులు, పారిశ్రామిక వేత్తలు కూడా జైలు పాలవడం జైరామ్ కి గుర్తుకు రాకపోవడం విశేషమే. ఆ పాపం అంతా ఏ పార్టీ పద్దులో వ్రాయాలో ఆయనే చెపితే బాగుండేది.
జగన్మోహన్ రెడ్డి కేసులు, జైలు, బెయిలు విషయంలో కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోలేదని జైరామ్ బుకాయించడం మరో విచిత్రం. మాజీ కాంగ్రెస్ మంత్రి శంకర్ రావు ద్వారా కోర్టులో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేఖంగా పిటిషను వేయించింది ఎవరు? సీబీఐ కేసులు వేగవంతం చేయించేందుకు, ఎవరికీ వెరవని ముక్కుసూటిగా పోయే నిజాయితీ పరుడని పేరుగల సీబీఐ డైరెక్టరు లక్ష్మినారయణను హడావుడిగా మహారాష్ట్ర నుండి హైదరాబాద్ రప్పించి జగన్ కేసులు ఎందుకు అప్పగించినట్లు? ఆయన దర్యాప్తు పూర్తిచేసి చార్జ్ షీట్లు దాఖలు చేస్తుంటే మళ్ళీ అంతే హడావుడిగా ఆయనను మహారాష్ట్రకు ఎందుకు బదిలీ చేసినట్లు? ఆ వెంటనే జగన్ తో సహా అందరికీ జైలు ద్వారాలు ఏవిధంగా ఎందుకు తెరుచుకొన్నాయి?వంటి విషయాలు కూడా ఆయన వివరించి ఉండి ఉంటే బాగుండేది.
కరడుగట్టిన కాంగ్రెస్ వాదులని పేరుపడ్డ లగడపాటి, రాయపాటి, హర్షకుమార్, ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి తదితరులు, తమ అధిష్టానం స్వంత కొడుకుల వంటి తమను కాదని దత్తపుత్రుడు వంటి జగన్మోహన్ రెడ్డిని చేరదీస్తోందని చేసిన ఆరోపణలు అబద్దమా? జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం రహస్య ఒప్పందం చేసుకోందని వారు చేస్తున్న ఆరోపణలు అబద్దమా? అనే విషయాలు కూడా జైరామ్ రమేష్ కాస్త వివరించి ఉండి ఉంటే బాగుండేది.
కిరణ్, జగన్, కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని వీడిన అనేకమంది నేతలు అందరూ తమని మోసం చేసారని జైరామ్ రమేష్ ఆరోపిస్తున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు తమ అధిష్టానంతో చివరివరకు సహకరించారని చెపుతున్న చిరంజీవి, రఘువీరా రెడ్డిలకు జైరామ్ రమేష్ ఏమని సమాధానం చెపుతారు? కాంగ్రెస్ అధిష్టానం వారితో రహస్య ఒప్పందాలు చేసుకొని తెరవెనుక గ్రంధం నడిపిస్తూనే, ఈవిధంగా మాట్లాడుతున్న ఆయనే ప్రజలను మోసం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని మాటలు చెపుతున్న జైరామ్ రమేష్ రేపు అదే జగన్, కేసీఆర్ లతో చేతులు కలపమని, వారి మద్దతు తీసుకోమని హామీ ఇవ్వగలరా?