సీమాంద్రులకు పోలవరం తాయిలం
posted on May 1, 2014 @ 9:02PM
పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో గానీ పోవన్నట్లు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనేక అవలక్షణాలు, దురలవాట్లు అంత త్వరగాపోవని ఈరోజు మరొకమారు నిరూపించుకొంది. ఈరోజు అత్యవసరంగా సమావేశమయిన కేంద్ర మంత్రి వర్గం పోలవరం ప్రాజెక్టుని పర్యవేక్షించేందుకు పోలవరం అధారిటీ నియామకానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజనను పర్యవేక్షించడానికి నియమింపబడిన కేంద్రమంత్రుల బృందం, పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దానికి అవసరమయిన నిధులు, అనుమతులు అన్నీ కేంద్రమే చూసుకొంటుందని ఆరు నెలల క్రితమే ప్రకటించింది. అయితే ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. కారణం పోలవరం ఊసు ఎత్తితే, అది కేసీఆర్ కి ఒక ఆయుధంగా మారుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టమే తప్ప ఎటువంటి లాభమూ లేదు. కానీ ఇప్పుడు తెలంగాణాలో ఎన్నికలు పూర్తయిపోయాయి గనుక ఇక పోలవరం గురించి నిర్భయంగా మాట్లాడుకోవచ్చును. మరొక ఆరు రోజులలో సీమాంధ్రలో ఎన్నికలు జరుగబోతున్నందున, కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలను ప్రసన్నం చేసుకోవాలంటే, ఇటువంటి తాయిలం ఏదో ఒకటి పట్టుకురాక తప్పదు. నేడో రేపో సీమాంద్రాలో ఎన్నికల ప్రచారానికి రానున్న సోనియా, రాహుల్ తదితరులు, ప్రజలను మంచి చేసుకోవడానికి ఇటువంటి మాయమాటలేవో చెప్పక తప్పదు.
ఇవి మాయమాటలని ఎందుకు అనవలసి వస్తోంది అంటే పోలవరం ప్రాజెక్టుపై అటు పైనున్న తెలంగాణాలో తెరాస నేతలు, క్రిందనున్న ఒరిస్సా ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం చెపుతున్నారు. తెలంగాణాలో ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన తేవడానికి కూడా భయపడిన కాంగ్రెస్ పార్టీ, రేపు ఎన్నికల తరువాత అదృష్టవశాత్తు కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా, అందరి మద్దతుతో ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టుని ఎంతవరకు పట్టించుకొంటుంది? అనే అనుమానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పోలవరంపై నిజంగా అంత శ్రద్ధ, ఆసక్తి ఉండి ఉంటే ఇన్నేళ్ళుగా దానిని నాన్చుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేసేదే కాదు. కానీ చేసింది అంటే కాంగ్రెస్ ఆలోచనలలో వీసమెత్తు నిబద్దత కానీ, చిత్తశుద్ది గానీ లేదని అర్ధమవుతోంది.
కాంగ్రెస్ అధిష్టానానికి తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. ఆ నమ్మకంతోనే నోటికి వచ్చిన హామీలు గుప్పిస్తోంది. లాభం లేనిదే కోమటి ఆమడ దూరం నడవడు అన్నట్లు, కాంగ్రెస్ పార్టీ కూడా తనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందనే నమ్మకంతోనే ఎన్నికల ముందు తెలంగాణా ఏర్పాటు చేసింది. ఇప్పుడు సీమాంద్రాలో గెలిచేందుకే ఇంత హడావుడిగా పోలవరం ప్రాజెక్టు అధారిటీకి అనుమతి మంజూరు చేసింది.