సోనియా అందుకే వైజాగ్ సభ రద్దు చేసుకోన్నారా?
posted on May 3, 2014 @ 10:06AM
“చంద్రబాబుకి ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే. తెదేపాకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే”, అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే, చంద్రబాబు కూడా “కేసీఆర్, జగన్, కిరణ్ లకు ఓటేస్తే అది కాంగ్రెస్ కి ఓటేసినట్లే. వారికి ఓటేస్తే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రజలు అంగీకరించినట్లే!” అని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
వీరురువురి వాదనలు కూడా నూటికి నూరు శాతం నిజమని ఒప్పుకోక తప్పదు. ఎందువలన అంటే తెదేపా-బీజేపీలు బహిరంగంగానే పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేస్తున్నాయి. మున్ముందు కూడా కలిసి పనిచేస్తామని వారే స్వయంగా చెప్పుకొంటున్నారు కూడా. కానీ కాంగ్రెస్ మాత్రం అటు కేసీఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డిలతో రహస్య ఒప్పందాలు చేసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీయే గాక వారు ముగ్గురూ కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తెదేపా-బీజేపీల స్నేహం ప్రజలందరికీ ప్రత్యక్షంగా కనబడుతున్నపుడు కాంగ్రెస్ చేస్తున్న వాదనకి అర్ధం లేదు. అది కేవలం మైనార్టీలను అభద్రతాభావానికి గురిచేసి వారి ఓట్లు దండుకోవడానికే తప్ప మరి దేనికీ కాదు. ఇక చంద్రబాబు కాంగ్రెస్-వైకాపా, తెరాసల మధ్య ఉన్న రహస్య అవగాహన గురించి చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించబడటానికి ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు వేచి చూడవలసి ఉంటుంది.
'కానీ అంతవరకు ఎందుకు? నిన్న సోనియాగాంధీ వైజాగ్ లో తన సభను రద్దు చేసుకొని గుంటూరులో నిర్వహించడమే వారి రహస్య అవగాహనకు నిదర్శనమని' చంద్రబాబు వాదిస్తున్నారు. వైజాగ్ నుండి వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లోక్ సభకు పోటీ చేస్తునందున, ఆమె విజయావకాశాలు దెబ్బ తీయడం ఇష్టం లేకనే సోనియా వైజాగ్ సభను రద్దు చేసుకొని గుంటూరులో సభ నిర్వహించారని, అదే వారి పార్టీల మధ్య ఉన్న రహస్య అవగాహనికి ఒక మంచి నిదర్శనమని చంద్రబాబు వాదన. అయితే తెలంగాణా కేసీఆర్ కోసం, సీమాంద్రాలో జగన్మోహన్ రెడ్డి కోసం తన స్వంత పార్టీ నేతలనే వదులుకొన్న సోనియాగాంధీకి, విజయమ్మ కోసం వైజాగ్ లో తన సభను రద్దు చేసుకోవడం, అక్కడ నుండి పోటీ చేస్తున్న తన పార్టీ అభ్యర్ధిని బలి చేయడం పెద్ద విశేషమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్లు నిన్న సోనియాగాంధీ గుంటూరులో నిర్వహించిన సభకు పట్టుమని మూడు వేలు మంది జనాలు కూడా రాలేదు. పాపం