ప్రధాని కుర్చీకి ‘ఆమాద్మీ నిచ్చెన’ వేస్తున్న నితీష్
posted on May 2, 2014 @ 11:39AM
బీజేపీ నరేంద్ర మోడీని తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడం నచ్చక, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుండి బయటకి వచ్చేసారు. వెనుకబడిన బీహార్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాట పట్టిస్తున్నాడనే మంచి పేరు సంపాదించుకొన్న ఆయనను వలేసి పట్టేదామని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేసింది. ఆయనకు కూడా కాంగ్రెస్ తో చేతులు కలపాడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ, ప్రధానమంత్రి కావలని కోరుకొంటున్న నితీష్ కుమార్, కాంగ్రెస్ తో చేతులు కలిపితే, రాహుల్ గాంధీ ఉండగా జీవితంలో తనకి ఆ అవకాశం రాదనే సంగతి గ్రహించి, ప్రతీ ఎన్నికల ముందు పుట్టుకొచ్చే థర్డ్ ఫ్రంటులో జేరారు. అయితే అందులో కూడా తనలాగే ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నవారు కనీసం ఒక అరడజను మంది ఉండటంతో, నితీష్ కుమార్ చాల నిరాశ చెందారు.
సరిగ్గా ఇటువంటి సమయంలో ఆయన కంట్లో వారణాసి నుండి తన ప్రియ శత్రువు నరేంద్ర మోడీపై పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ పడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ కి ప్రజలలో ఎంతమంచి పేరున్నప్పటికీ సరయిన రాజకీయ అవగాహన, పరిణతి లేకపోవడంతో పదేపదే భంగపడుతున్నారు. అయినప్పటికీ చాలా దైర్యంగా నరేంద్ర మోడీ అంతటివాడిని డ్డీ కొనేందుకు సిద్దపడ్డారు. అయితే నామినేషన్ వేసినప్పటి నుండి నేటివరకు కూడా ఆయనకు ఎక్కడో అక్కడ మోడీని సమర్దిస్తున్న వారి చేతిలో అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కేజ్రీవాల్ ఏటికి ఎదురీదుతూనే ఉన్నారు.
ఇది చూసి నితీష్ కుమార్ ఆయనకు మద్దతుగా వారణాసిలో ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. కేజ్రీవాల్ తో చేతులు కలిపి వారణాసిలో మోడీ యొక్క విజయావకాశాలు దెబ్బతీయగలిగితే, దాని వలన ఆయనకు ప్రధానమంత్రి చెప్పట్టడానికి పార్టీలో అంతర్గతంగా ఇబ్బందికర పరిస్థితులు కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి మద్దతు ఈయడం ద్వారా, ఆయన మోడీని ఓడించినా ఓడించాకపోయినా, మున్ముందు అవసరమయితే ఆమాద్మీ పార్టీ మద్దతు ఆశించవచ్చును కూడా.
ఇక కాంగ్రెస్ పార్టీ తాను మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంలేన్నట్లయితే థర్డ్ ఫ్రంటుకి మద్దతు ఇస్తానని ప్రకటించింది. ములాయం సింగు తో పోలిస్తే నితీష్ కుమార్ కి మంచి ‘క్లీన్ ఇమేజ్’ ఉంది. మంచి పరిపాలనా దక్షుడు అనే మంచి పేరు కూడా ఉంది. గనుక, నితీష్ కుమార్ తన కల సాకారం చేసుకొనేందుకు, ఆమాద్మీని కూడా దువ్వేందుకే, అరవింద్ కేజ్రీవాల్ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఉండవచ్చును. ఈలోగా నితీష్ కుమార్ థర్డ్ ఫ్రంటులో ఇతర భాగస్వాములను కూడా మెల్లగా దువ్వి తనవైపు త్రిప్పుకొనగలిగితే, కాంగ్రెస్ మద్దతుతో ప్రధానమంత్రి కుర్చీలో సెటిల్ అయిపోవచ్చని పావులు కదుపుతున్నారు.
కానీ, రాహుల్ గాంధీ ‘జన్మహక్కు’ అయిన ప్రధానమంత్రి కుర్చీలో వేరేవారిని కాంగ్రెస్ అధిష్టానం కూర్చోనిస్తుందా? కూర్చోనిస్తే ఎంతకాలం కూర్చోనిస్తుంది? అనే ప్రశ్నలకు జవాబులు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే దొరుకుతాయి. నితీష్ కుమార్ మాత్రం చాప క్రింద నీరులా తన ప్రయత్నాలు తాను చేసుకుపోతున్నారు.