జగన్మోహన్ రెడ్డి మౌనమేల?
posted on Jul 4, 2014 @ 11:22AM
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆంధ్ర, తెలంగాణాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఇంకా నెలరోజులు కూడా పూర్తికాక మునుపే వాటిని నిలదీయలనుకోవడం సబబు కాదు. కానీ అవి తప్పుడు నిర్ణయాలు తీసుకొంటుంటే తప్పకుండా ఎవరయినా విమర్శించవచ్చును. తను రోజూ మీడియా ముందుకు వచ్చి ఏవో రాజకీయ వ్యాఖ్యలు లేదా విమర్శలు చేయబోనని ఆయన ముందే తెలిపారు. అంతేకాక ఆయన ఇంతవరకు కనీసం పార్టీ నిర్మాణం కూడా చేసుకోలేదు.
కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పటికీ కృష్ణా జలాల విడుదల, ఫీజు రీయింబర్సుమెంటు, ఇంకా అనేక ఇతర అంశాలపై తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత వైఖరిని ఎందుకు ఖండించడం లేదో ఎవరికీ తెలియదు. రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దమని భుజాలు చరుచుకొంటున్న వైకాపా, తెలంగాణా ప్రభుత్వం పట్ల ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో? అసలు ఇంతవరకు ఏ విషయంలో కూడా వారు ఎందుకు నోరు మెదపడం లేదో వైకాపా నేతలే చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యతా ఉందో, 67అసెంబ్లీ, 9యంపీ సీట్లు గెలుచుకొన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపాపై కూడా అంతే ఉంటుంది.
ఒకవేళ వైకాపాయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకొని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లయితే, అప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఇదేవిధంగా నాగార్జున్ సాగర్ నుండి నీళ్ళువిడుదల చేయకుండా పేచీలు పెడితే, జగన్ ఇలాగే మౌనంగా ఊరుకోనేవారా? లేక నీళ్ళు విడుదల చేయమని కేసీఆర్ ని నిలదీసేవారా? అనే ప్రశ్నకు వైకాపా నేతలు వారి అధ్యక్షుడు జగన్ జవాబు చెప్పగలిగితే, వారిప్పుడు ఏవిధంగా స్పందించాలో వారికే తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పని కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేయడం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితోనయినా పోరాడవలసి ఉంటుంది.
తెలంగాణాకు మద్దతు, రాష్ట్రవిభజన, సమైక్యాంధ్ర ఉద్యమం, కాంగ్రెస్, తెరాసలతో రహస్య అనుబందం వంటి విషయాలలో జగన్ ద్వంద వైఖరి అవలంబించినందునే, ప్రజలు వైకాపాను తిరస్కరించారు. కానీ ఆయన ఇంకా అదే వైఖరి కొనసాగిస్తే వైకాపా విశ్వసనీయతను పూర్తిగా కోల్పోవడం తధ్యం.