అగస్టా కుంభకోణంలో నిందితులపై కేసులు నమోదు
posted on Jul 5, 2014 @ 10:21AM
గత పదేళ్ళ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాల గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీలేదు. కాంగ్రెస్ పాలనలో ఇటువంటివన్నీ చాలా సహజమని ప్రజలు కూడా భావించే స్థాయికి ఆ పార్టీ దిగజారింది. మాటలకు, చేతలకు పొంతనలేని పరిపాలన సాగించి, దేశాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించి చివరికి తనే బలయిపోయింది. అయితే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది గనుక ఆ పార్టీ హయాంలో జరిగిన లక్షల కోట్ల కుంబకోణాలను మాఫీ అయిపోవు. వాటి సూత్రధారులను విడిచిపెట్టేందుకు లేదు. కానీ దురదృష్టవశాత్తు మనదేశంలో అటువంటి అవినీతిపరులు, నేరస్తులు అందరూ చట్టసభలలో సభ్యులుగా ఉండటం, ఉన్నత పదవులలో కొనసాగుతుండటం చాలా కలవరం కలిగిస్తోంది.
రూ.3600 కోట్ల అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంలో భారత మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ యస్.పీ. త్యాగి, గోవా గవర్నర్ బీవీ.వాంచూ వంటివారు కూడా ఉన్నారు. అందువల్లే గత యూపీఏ హయంలో ఈకేసుపై విచారణ నత్త నడకన సాగించారు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఇటువంటి కుంభకోణాలన్నీ తుడిచిపెట్టుకోనిపోయేవి. కానీ కాంగ్రెస్ దురదృష్టమో లేక భారత దేశ ప్రజల అదృష్టమో కానీ సమర్దుడైన నరేంద్ర మోడీ ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టి, ఈ అవినీతి రాబందులపై చర్యలకు ఉపక్రమించారు. ఇంతకాలం కాంగ్రెస్ హస్తంలో పావులుగా మిగిలిపోయిన ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ మరియు సీబీఐలు, ఇప్పుడు అదే కాంగ్రెస్ అవినీతిని వెలికి తీసేపనిలో పడ్డాయి.
ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ అధికారులు అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంలో ప్రదాన నిందితులుగా అనుమానింపబడుతున్న భారత మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ యస్.పీ. త్యాగి, ఆయన బందువులు కొందరిపై, యురోప్ కు చెందిన కార్లో క్రీష్టియన్ మైఖేల్, గిడో హస్చ్ఇద్దరు వ్యక్తులపై విదేశీమారక చట్టాలు మరియు మనీ లాండరింగ్ చట్టాలను అతిక్రమించి నేరాలకు పాల్పడినట్లుగా రెండు వేర్వేరు కేసులు నమోదుచేసారు. వారితో బాటు చండీఘర్ కు చెందిన ఐ.డీ.యస్.ఇన్ఫోటెక్ మరియు ఏయిరో మాట్రిక్స్ అనే సంస్థలపై, ఇటలికీ చెందిన ఫైన్మెకానిక, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆగస్ట వెస్ట్ ల్యాండ్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేసారు. ఈ హెలికాఫ్టర్ కొనుగోలు వ్యవహారాలలో ప్రధాన సాక్షిగా ఉన్న బీ.వీ వాంచూను కూడా నిన్న సీబీఐ అధికారులు విచారణ చేసారు. ప్రస్తుతం గోవా గవర్నర్ గా చేస్తున్న ఆయన విచారణ అనంతరం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించేందుకు రూ. 3600 కోట్ల ఖరీదు చేసే 12 హెలికాఫ్టర్లను కొనేందుకు యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఆ కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ఇంగ్లాండ్ కు చెందిన ఆగస్ట హెలికాఫ్టర్ల సంస్థ భారతదేశంలో అనేకమంది ఉన్నతాధికారులు, వారి బంధువులు, రాజకీయ నాయకులకు ఏకంగా రూ.360కోట్లు లంచాలుగా చెల్లించినట్లు ఇటలీకి చెందిన ఒక ప్రభుత్వ విచారణ సంస్థ బయటపెట్టిన తరువాత కానీ దీని గురించి దేశంలో దర్యాప్తు సంస్థలకు సైతం తెలియలేదంటే ఈ అవినీతి వ్యవహారం ఎంతా ఎంత పకడ్బందీగా జరిగిందో అర్ధం చేసుకోవచ్చును. ఇప్పుడు ఈ.డీ. మరియు సీబీఐ అధికారులు ఈ అవినీతి వ్యవహారంపై విచారణ మొదలుపెట్టారు. మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం హయాంలోనయినా దోషులకు శిక్షలు పడి, వారి నుండి ఆ డబ్బు తిరిగి వసూలు చేయగలిగితే ప్రభుత్వ సమర్ధతపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అలాకాక ఇప్పుడు కూడా ఏళ్ల తరబడి కేసును సాగదీసి చివరికి చెత్తబుట్టలో పడేస్తే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుంది.