ఆ రెండు శాతం పన్నే ఆంధ్రాకు వరంగా మారనుందా?
posted on Jul 5, 2014 @ 11:27AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికపరిస్థితి గురించి పాలకులే కాక ప్రజలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అది చాలదన్నట్లుగా వేలకోట్ల రైతుల రుణాల మాఫీ కూడా ఒకటుంది. ఈ సమస్యలకు కనుచూపు మేర ఎటువంటి పరిష్కారం కనబడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యల నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ ఎటువంటి ఫలితము కనబడటం లేదు. కానీ ప్రభుత్వానికి చిన్న ఉపశమనం కలిగించే విషయం ఒకటి వినబడుతోంది.
రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర, తెలంగాణాలు ఇప్పుడు ప్రత్యేక రాష్టాలుగా విడిపోయాయి గనుక, దేశంలో మిగిలిన రాష్ట్రాల మధ్య ఏవిధంగా 2శాతం అంతర్ రాష్ట్ర సెంట్రల్ సర్వీస్ పన్ను (సెంట్రల్ సర్వీస్ టాక్స్ లేదా సీ.యస్.టీ) ఇప్పుడు ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలలో కూడా 2శాతం పన్ను వసూలు చేయబడుతుంది. ఇంతవరకు సమైక్య ఆంద్ర రాష్ట్రంలో మొత్తం 3లక్షల మంది వ్యాపారులు ఈ సీ.యస్.టీ టాక్స్ ను చెల్లిస్తున్నారు. వారిలో చాలా మంది హైదరాబాదు కేంద్రంగా చేసుకొని రాష్ట్రంలో, ప్రధానంగా ఆంధ్రప్రాంతంలో వివిధ జిల్లాలలో వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు రాష్ట్రం సమైక్యంగా ఉండటం వలన ఆ మూడు లక్షలమంది వ్యాపారులు చెల్లించే 2 శాతం పన్ను మొత్తం రాష్ట్రప్రభుత్వానికే జమా అయ్యేది. కానీ ఇప్పుడు ఆంద్ర, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినందున, హైదరాబాదు కేంద్రంగా చేసుకొని ఆంధ్రాతో వ్యాపారాలు చేస్తున్నవారు అదనంగా 2శాతం సీ.యస్.టీ. పన్ను చెల్లించవలసి వస్తుంది. అది కొన్ని లక్షల్లో ఉంటుంది గనుక, ఆ భారం తగ్గించుకొనేందుకు వారిలో చాలా మంది వ్యాపారులు ఆంధ్రాలో తమ రిటర్న్స్ సమర్పించినట్లు సమాచారం.
జూన్ రెండు (అపాయింటడ్ డే) మొదలుకొని జూన్ 30వరకు ఆంద్రతో జరిపిన వ్యాపార లావాదేవీల రిటర్న్స్ జూలై20లోగా రిటర్న్స్ సమర్పించవలసి ఉంటుంది. ఇంతవరకు దాదాపు ఒకటిన్నర లక్షల మంది వ్యాపారులు ఆంధ్రాలో తమ పేర్లను నమోదు చేయించుకొని రిటర్న్స్ సమర్పించినట్లు సంబందిత అధికారులు తెలుపుతున్నారు.
గతేడాది ఈ మూడు లక్షల మంది వ్యాపారుల వద్ద నుండి దాదాపు రూ.55,000 కోట్లు పన్ను వసూలు అయిందని, ఈసారి అది మరి కొంచెం పెరిగి దాదాపు రూ.60, 000కోట్లు వరకు చేరుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు. అంటే మూడు లక్షల మంది వ్యాపారులలో సగం మంది ఆంధ్రాలో పన్ను చెల్లించు తున్నారంటే ఆ ఆదాయంలో దాదాపు సగం అంటే దాదాపు రూ.30, 000 కోట్లు ఆంధ్రా ఖాతాలోనే జమా అవబోతోందని స్పష్టమవుతోంది.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర, తెలంగాణాల ఈ ఆదాయ శాతాలు ఇంచుమించు 18:82 నిష్పత్తిలో ఉండవచ్చనే అంచనాలకు విరుద్దంగా రెండు రాష్ట్రాలకు సరిసమానంగా అంటే 50:50 శాతం ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈనెల 20వ తేదీ సాయంత్రంతో వ్యాపారులు రిటర్న్స్ సమర్పించడం పూర్తవుతుంది గనుక అప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పన్ను ద్వారా ఎంత ఆదాయం సమకూరిందనే విషయంపై మరింత స్పష్టత వస్తుందని సంబంధిత అధికారులు చెపుతున్నారు. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చాలా మంచి కబురే కదా!