కేసీఆర్ జీ... రైతుల ఆత్మహత్యలు ఆపండి!
posted on Jul 7, 2014 @ 11:45AM
ప్రస్తుతం తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక్కటే కోరుతున్నారు... అదే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆపండని! అసలే తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా యువకులు, రైతులు చాలా సున్నిత హృదయం కలవారు. మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి, ఇక రాష్ట్రంలో ఆత్మహత్యలనేవే వుండవని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ యువకులు.. ఇప్పుడు రైతులు. ఈ ఆత్మహత్యల పర్వం తెలంగాణ తల్లికి కడుపు కోతను మిగులుస్తోంది. ఎంతో ఆత్మ గౌరవంతో స్వపరిపాలనను సాధించుకున్న ఈ సమయంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వుండటం అత్యంత విచారకరమైన విషయం. ఎన్నికల సందర్భంగా రైతు రుణాలు మాఫీ చేస్తామని రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీ తెలంగాణ రైతుల్లో ఆనందాన్ని కలిగించింది. కేసీఆర్ మాటని నమ్మిన తెలంగాణ రైతులు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. కేసీఆర్ ప్రభుత్వం రుణాల మాఫీకి సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలిస్తున్న సమయంలోనే రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ వుంటడం తెలంగాణ రైతుల సున్నిత మనస్తత్వానికిమరోసారి అద్దం పడుతోంది. రైతు రుణాల మాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్న అపోహకి గురైన ఇద్దరు రైతులు కేసీఆర్ అధికారం చేపట్టిన తొలినాళ్ళలోనే ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అన్నదాతలు, నల్లగొండ జిల్లాలో ఒక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నలుగురు రైతులూ అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెబుతూ వున్నప్పటికీ రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విచారకరమైన అంశం. అయితే రుణ మాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పుతున్న దారిలో వెళ్తున్నందువల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రైతుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. రైతు రుణాల మాఫీ విషయంలో రైతులలో ఏర్పడిందని భావిస్తున్న అపనమ్మకాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే వుంది. రుణాల మాఫీకి సంబంధించి తెలంగాణ రైతుల్లో అపోహలు తొలగించేలా చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు వున్న తక్షణ కర్తవ్యం. ఇప్పటికే రైతు రుణ మాఫీ విషయంలో మనసులు కష్టపెట్టుకున్న ఆరుగురు తెలంగాణ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇకముందు మరొక్కరు ఆత్మహత్య చేసుకున్నా అది కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా కేసీఆర్ తగిన చర్యలు తీసుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.