ఆంద్రప్రదేశ్ లో పర్యాటక విశ్వవిద్యాలయం
ఈరోజు పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూజిలాండ్ తరహాలో రాష్ట్రంలో కూడా ఒక పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయమని కోరారు. దీనిలో రాష్ట్రంలో గల పర్యాటక ప్రాంతాలు, వాటి చరిత్ర, ప్రత్యేకతలు, రవాణా, ఆరోగ్యం, అతిధి మర్యాదలు, ఆధునిక, సాంప్రదాయ వంటలలో శిక్షణ వంటివి పాట్యాంశాలుగా పెట్టవచ్చని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రసిద్ద పర్యాట కేంద్రాలు ఉన్నందున పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినట్లయితే యువతకు ఉపాధికి అవసరమయిన శిక్షణ కల్పించడమే కాకుండా, రాష్ట్రంలో పర్యాటక రంగం త్వరగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
ఈ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇంతవరకు ప్రభుత్వాలు పర్యాటక రంగానికి పెద్దగా ప్రాధాన్యతనీయకపోవడం, యువతకు సరయిన శిక్షణ లేకపోవడంతో పెద్దగా అభివృద్ధి చెందలేదు. యువత కూడా దానిపట్ల ఆసక్తి చూపలేదు. కానీ న్యూజిలాండ్ దేశంలో మాత్రం పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందడానికి పర్యాటక విశ్వవిద్యాలయం చాలా దోహదపడింది. ఈ సంగతి గమనించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిస్తేజంగా పడిఉన్న పర్యాటక రంగానికి ఒక కొత్త ఒఊపు నీయాలని భావిస్తూ ఈ ప్రతిపాదన చేసారు. హైదరాబాదుకి ఐటీ రంగాన్ని తీసుకువచ్చి అక్షయపాత్ర వంటి ఒక శాశ్విత ఆదాయ వనరును సృష్టించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పర్యాటక రంగం ద్వారా ఒక శాశ్విత ఆర్ధిక వనరును అందించవచ్చని భావించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని చెప్పవచ్చును.
ఇది కాక ఆయన ఇంకా మరికొన్ని సూచనలు, ప్రతిపాదనలు కూడా చేసారు. అవేమిటంటే,
1. వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో అంతర్జాతీయ స్థాయి సమావేశ మందిరాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయమని అధికారులను ఆదేశించారు.
2. దాదాపు 10, 000 మందికి సరిపోయే విధంగా 100 ఎకరాలలో ఈ సమావేశ మందిరాలు నిర్మింపబడాలి. ఇందులో కేవలం సమావేశాలే కాక పెళ్ళిళ్ళు, విందులు, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వగైరా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకొనే విధంగా అన్నిఆధునిక హంగులతో నిర్మించాలి.
3. ఈ సమావేశ మందిరాలు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో నిర్మించి నిర్వహించవలసి ఉంటుంది.
4. ఈ ప్రతిపాదనలపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి వారిని దేశవిదేశాలలో గల పర్యాటక కేంద్రాలకు పంపాలని చంద్రబాబు నిశ్చయించుకొన్నారు. మళ్ళీ ఆ టాస్క్ ఫోర్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటయ్యే ఒక ఉన్నత కమిటీ పర్యవేక్షిస్తుంటుంది.