పాడేరులో అక్రమ బాక్సైట్ మైనింగ్ వెనుక వైకాపా?
posted on Sep 25, 2014 @ 3:00PM
ఇంటి గుట్టు లంకకు చేటు అన్నారు పెద్దలు. అది రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు యంపీ కొత్తపల్లి గీత పాడేరు యం.యల్.ఏ. గిద్ది ఈశ్వరి మధ్య జరుగుతున్నా మాటల యుద్ధం వలన ఆ పార్టీ తెర వెనుక కధలు బయటపడుతున్నాయి.
ఈ మధ్యకాలంలో గీత వైకాపాకు దూరంగా ఉంటూ అధికార తెదేప, బీజేపీ సభ్యులతో కలిసి తిరుగుతున్నారు. ఒకానొక సమయంలో ఆమె పార్టీ వీడటం దాదాపు ఖాయం అనుకొన్నారు అందరూ కానీ ఆమె నేటికీ వైకాపాలోనే కొనసాగుతున్నారు. కానీ ఆ పార్టీపైనే ఆరోపణలు చేస్తుండటం విశేషం. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిలపై ఈగ వాలినా ఊరుకొని పార్టీ నేతలు, తన రాజకీయ ప్రత్యర్ధులు కొందరు సామాజిక వెబ్ సైట్లలో తనపై అభ్యంతకర వ్యాఖ్యలు పెడుతున్నప్పటికీ పార్టీ నేతలెవరూ తనకు అండగా నిలబడలేదని, వైకాపాలో మహిళలకు గౌరవం, సముచిత స్థానం రెండూ లేవని ఆమె ఆరోపించారు.
తను షెడ్యూల్ కాస్ట్ కు చెందినా వ్యక్తిని కాదని పాడేరు యం.యల్.ఏ. గిద్ది ఈశ్వరి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, “అదే నిజమయితే ఆ రోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాకు అరుకు లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు ఏవిధంగా బీ-ఫారం ఇచ్చారు? అంటే ఈశ్వరి నన్ను సవాలు చేస్తోందా లేక పార్టీ అధిష్టానాన్ని సవాలు చేస్తోందా?” అని ఆమె ఎదురు ప్రశ్నించారు.
ఈశ్వరి చేసిన మరో ఆరోపణలకు ఆమె ఇచ్చిన జవాబు పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితి కల్పించింది. తను బాక్సైట్ మైనింగ్ చేసే అనార్క్ ప్రమోటర్స్ తో కుమ్మకు అయినట్లు ఈశ్వరి చేసిన ఆరోపణలను ఆమె త్రిప్పి కొడుతూ “పాడేరులో అక్రమంగా మైనింగ్ జరుగుతోంది. అక్కడ అక్రమంగా తవ్వుకుపోతున్న ఖనిజం అంతా అనార్క్ సంస్థకే చేరుతోంది. అంటే ఎవరు ఎవరితో మ్మక్కు అయ్యేరో అందరికీ అర్ధమవుతోంది,” అని ఆమె ఘాటుగా జవాబిచ్చారు.
వారిరువురి గొడవ వలన పాడేరులో జరుగుతున్న అక్రమ బాక్సైట్ మైనింగ్ వ్యవహారంలో వైకాపా నేతల హస్తం ఉందని అర్ధమవుతోంది. కానీ వారి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గిరిజనుల తరపున బాక్సైట్ మైనింగ్ కు వ్యతిరేఖంగా ప్రభుత్వంతో పోరాడుతానని హామీలు గుప్పిస్తుండటమే విశేషం.