అమ్మ, కోర్టు ఒక గజన్...
posted on Sep 27, 2014 @ 4:56PM
కోర్టు: ఏంటమ్మా...అరవై కోట్లు నొక్కేసింది చాలక పైగా అన్యాయం..అన్యాయం అనడం నీకేమయినా న్యాయంగా ఉందా?
అమ్మ: బాగుంది మీవరస! అదంతా మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులే!
కోర్టు: 28కేజీలు బంగారం, 880కేజీల వెండి, 10, 000 చీరలు, 700 చెప్పుల జతలు ఇవి కూడా మీ పూర్వీకులు ఇచ్చినవేనా తల్లీ?
అమ్మ: అలాగని నేనేపుడన్నాను? అవన్నీ నేను సినిమాలలో చేసినప్పుడు వేసుకొన్నవే. అయినా సినిమావాళ్లకు చీరలు, నగలు, చెప్పులు ఉండకపోతే రాజకీయ నాయకులకి ఉంటాయా?
కోర్టు: తమరిప్పుడు రాజకీయ నాయకులే కాదమ్మా?
అమ్మ: అందుకే కదా అవేవీ ఇప్పుడు వేసుకోకుండా జాగ్రత్తగా బీరువాల్లో పెట్టుకొంటే మీరొచ్చి పట్టేసుకొని నన్ను ‘దోషి...దోషి...’ అనగలుగుతున్నారు?
కోర్టు: అదేమిటమ్మా? తమరికి తమిళనాడులోనే కాక హైదరాబాదులో ఇంకా దేశంలో చాలా చోట్ల స్థిరాస్తులున్నాయన్నమాట వాస్తవమా కాదా?
అమ్మ: ఉంటే...? ఆ గజన్ రెడ్డికి లేవా గాలి రెడ్డికి లేవా? వారినెవరయినా మీరు అడగగాలిగారా? ఆడదాన్ని అందునా అనారోగ్యంతో ఉన్నదానిని పట్టుకొని చేతికొచ్చిన తీర్పులు గీకేయడం ఏమీ బాలేదు స్మీ!
కోర్టు: చట్టం ముందు అందరూ సమానమే తల్లీ! ఆయనకీ ఒక పదకొండు చార్జ్ షీట్లు వెనకేసుకొని తిరుగుతున్నారు..మీకు తెలుసు కదా?
గజన్: వీళ్ళేమిటీ మధ్యలో నాగురించి మాట్లాడుతున్నారు...అసలు కేసు గురించి మాట్లాడకుండా?
కోర్టు: అమ్మా! మీరు ఇన్ని కోట్లు పోగేసుకొన్నారు కదా...ముఖ్యమంత్రిగా నెలకి రూపాయే జీతం తీసుకొంటూ ఇంత ఎలా సాధ్యమయింది తల్లీ?
అమ్మ: ఏమిటండి ఈ అసందర్భపు ప్రశ్నలు?
గజన్: అవును! అసందర్భపు ప్రశ్నలే.. లేకపోతే ఏమిటి? మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అరవై కోట్లు మాత్రమే పోగేసారా? సిగ్గుపడాలి. పైగా అది కూడా తాత పెట్టాడు..ముత్తాత పెట్టాడు...సినిమాలలో సంపాదించుకొన్నానని చెప్పుకోవడం కూడాను..
కోర్టు: నువ్వు దోషివమ్మా!
అమ్మ: పదవిలో ఉన్నపుడు నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం నేరం, దోషం ఎలావుతుందో నాకయితే అర్ధం కావడం లేదు.. ఇది చాలా అన్యాయం.. చాలా చాలా అన్యాయం..
గజన్: అవును... అన్యాయమే...నేను రాజకీయాలలోకి రాకుండానే వేలకోట్లు సంపాదించాను. పాపం ఆమె పదవిలో ఉండి కూడా సంపాదించుకోలేకపోయింది..అయినా ఆమెను దోషి దోషి అనడం అన్యాయమే..అయినా పదవిలో ఉన్నామా లేదా అనేది పాయింటు కాదు... ఎప్పుడు వచ్చేమన్నది కూడా కాదు పాయింటు. ఎలా..ఎంత సంపాదించామన్నదే పాయింటు. పట్టుమని ఐదేళ్ళలో వేలకోట్లు సంపాదించడంలో నా తెలివి తేటలను చూసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫ్లాటయిపోయాడు. నా కేసును హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాట్యాంశంగా పెట్టాలని కూడా రికమండ్ చేసారంటేనే నా గొప్పదనం ఏమిటో అర్ధమవుతుంది.
కోర్టు: అమ్మా! నీకు జైలు శిక్ష ఖరారు చేస్తున్నాము. నీ అరవైకోట్ల ఆస్తిని కూడా జప్తు చేస్తునాము.
అమ్మ: అన్యాయం...అన్యాయం.. నామీద అక్రమంగా కేసులు పెట్టినవారు నా ఉసురు తగిలి నాశనమయిపోతారు...సర్వ నాశనమయిపోతారు...ఆడదాని కష్టార్జితాన్ని దోచుకొన్నవారెవరూ బాగుపడలేదు...అయినా ఈ కోర్టు కాకపోతే పై కోర్టు ఉండనే ఉంది కదా?
గజన్: అబ్బా ఏమిటా శాపనార్ధాలు? వినలేకపోతున్నాను... అయినా ముష్టి అరవై కోట్లకే అంత వలవల ఏడవాలా? ఎన్ఫోర్స్ మెంటు అధికారులు నావి ఎన్ని వందల కోట్లు జప్తు చేసారో కూడా నాకు తెలియదు..అయినా చీమ కుట్టినట్లయినా లేదు నాకు...అయినా కేంద్రంతో నాలాగ డీల్ మాట్లాడేసుకొంటే పోలా? ఎందుకు ఆ ఏడుపులు రాగాలు? సేకట్రీ...ఆ టీవీ కట్టేయి...చూడలేక చస్తున్నాను.