హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ డాటా సెంటరు?
భారతదేశంలో కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, వాటి కోసం రకరకాల అప్లికేషన్ల (సాఫ్ట్ వేర్) వినియోగం చాలా పెరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఇంతకాలం వరకు తమ విలువయిన డాటాను హార్డ్ డిస్కులలోనో లేకపోతే సీడీలు, పెన్ డ్రైవులలోనో భద్రం చేసుకొంటున్నారు. కానీ నానాటికి పెరిగిపోతున్న ఈ డాటాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాటా సెంటర్లలో భద్రపరిచి అవసరమయినప్పుడు ‘క్లౌడ్ కంప్యూటింగ్’ అనే సర్వీసుల ద్వారా తిరిగి పొందవచ్చును. ఇప్పటికే గూగుల్, బింగ్, ఎంఎస్‌ఎన్, ఆఫీస్ 365, ఎక్స్‌బాక్స్ లైవ్, స్కైప్, వన్‌డ్రైవ్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటివి ఈ సేవలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని ఉచితంగా, మరికొన్ని నామమాత్ర చార్జీలతో ఈ సేవలు అందిస్తున్నాయి. ఇటీవల భారత్ వచ్చిన మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సి.ఈ.ఓ.) సత్య నాదెళ్ళ డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశంలో క్లౌడ్ కంప్యూటర్ సర్వీసులు అందించేందుకు వచ్చే ఏడాది చివరిలోగా మూడు నగరాలలో మైక్రో సాఫ్ట్ డాటా సెంటర్లు నెలకొల్పుతామని ప్రకటించారు. దాదాపు 125కోట్ల జనాభా గల భారతదేశంలో క్లౌడ్ కంప్యూటర్ సర్వీసులకు చాలా భారీ మార్కెట్ ఉందని తను భావిస్తున్నట్లు తెలిపారు.
ఆ మూడు సెంటర్లను ఏ నగరాలలో ఏర్పాటు చేస్తారో ఇంకా ప్రకటించవలసి ఉంది. అయితే సత్య నాదెళ్ళ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అవడం గమనిస్తే, ఈ మూడింట్లో ఒకదానిని హైదరాబాదులోనే నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు భావించవచ్చును. ఇప్పటికే హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ చాలా కాలంగా పనిచేస్తోంది. ఇప్పుడు ఈ డాటా సెంటరు కూడా వచ్చినట్లయితే ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ పేరు మరింత మారుమ్రోగిపోవడం ఖాయం. అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. భారతదేశ భారీ జనాభాయే ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప అతిపెద్ద మార్కెట్టుగా ఊరిస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో మైక్రోసాఫ్ట్ ఒక్కోడాటా సెంటరు కోసం సుమారు రూ. 5,000కోట్లు పెట్టుబడి ఈ డాటా సెంటర్లు నెలకొల్పేందుకు సిద్దమవుతోంది.
కోట్లాది భారతీయులకు వివిధ సేవలు అందిస్తున్న అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సేకరించిన డాటాను నిక్షిప్తం చేసి తిరిగి వారికి అవసరమయినప్పుడు అందించే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసుల కోసం చాలా మంది సాఫ్ట్ వేర్ నిపుణులు, ఇంజనీర్లు అవసరం ఉంటారు. అంతేకాక ఈ డాటా సెంటర్లలో పనిచేసే ఉద్యోగులకు ఆహారం, రవాణా వంటి వివిధ సేవలవసరం ఉంటాయి కనుక దీనివలన పరోక్షంగా కూడా కొన్ని వేలమందికి ఉపాధి దొరుకుతుంది. కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా తెలంగాణా ప్రభుత్వం చాలా జాగ్రత్తపడవలసి ఉంది.