చంద్రబాబు పర్యవేక్షణలో రాజధాని నిర్మాణం?
ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే మూడు కమిటీలు వేయబడ్డాయి. కొత్తగా రాజధాని అభివృద్ధి మండలి ఒకటి ఏర్పాటు చేయబడింది. అయితే రాజధాని నిర్మాణం కోసం ఇన్ని కమిటీలు ఎందుకని ప్రతిపక్షాల ప్రశ్న.
దానికి సంబంధిత అధికారులు చెపుతున్న సమాధానం ఏమిటంటే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీ కేవలం రాజధాని ఏవిధంగా నిర్మింపబడితే బాగుంటుంది, అందులో సాధకబాధకాలను వివిధ నగరాలలో పర్యటించడం ద్వారా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడంతో దాని పని పూర్తవుతుంది.
అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు మంత్రులు, శాసనసభ్యులతో కూడిన కమిటీ కేవలం భూసేకరణకే పరిమితమవుతుంది. భూసేకరణ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఆ కమిటీ కృషి చేస్తుంది. భూసేకరణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికే ఆ కమిటీ పరిమితమవుతుంది. అన్నిటి కంటే అదే సంక్లిష్టమయిన వ్యవహారం కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక మంత్రులు, శాసనసభ్యులను ఆ కమిటీలో వేసారు.
ఇక ఆర్ధిక, మున్సిపల్ మరియు రవాణా శాఖల ప్రధాన కార్యదర్శులతో వేసిన మరో కమిటీ హైదరాబాదు నుండి ప్రధాన ప్రభుత్వ శాఖలను ఏవిధంగా, ఎంత కాలంలో విజయవాడకు తరలించాలి, అందుకు అవసరమయిన ఏర్పాట్లు, అందులో సాధకబాధకాలు, వివిధ శాఖలకు, అందులో పనిచేసే సిబ్బందికి, అధికారులకు విజయవాడలో ఎక్కడెక్కడ కార్యాలయాలు, ఇళ్ళు కేటాయించాలి? వాటి లభ్యత వంటి విషయాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వడానికే పరిమితమవుతుంది. కనుక ఈ త్రిసభ్య కమిటీ రాజధాని నిర్మాణంతో ఎటువంటి సంబంధమూ ఉండదు.
ఇప్పుడు కొత్తగా వేయబడిన రాజధాని అభివృద్ధి మండలి మాత్రమే రాజధాని నిర్మాణంలో పూర్తి బాధ్యత వహిస్తుంది. ముఖ్యమంత్రి లేదా ఒక ఐఏయస్. అధికారి నేతృత్వంలో అనిచేసే కమిటీ, రాజధాని నిర్మాణం కోసం టెండర్లు పిలవడం, వాటి పరిశీలన, ఆమోదం, నిధుల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మండలి కనుసన్నలలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పవచ్చును. అంతే కాదు రాజధాని నిర్మాణం కోసం కేంద్రం విడుదల చేయబోయే భారీ నిధులు కూడా ఈ మండలి ఆధీనంలోనే ఉంటాయి. వాటిని ఏవిధంగా, ఎప్పుడు ఎంత ఖర్చు చేయాలనే దానిపై ఈ మండలిదే తుది నిర్ణయం. ఇక అందులో ఇక వేరెవరి పాత్ర ఉండబోదు.
అయితే ఇటువంటి కీలకమయిన బాధ్యతలు నిర్వహించే మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబే అధ్యక్షుడుగా ఉండాలని కొందరు మంత్రులు అభిప్రాయపడుతుంటే, ఇంత భారీ నిధులను ఖర్చు చేస్తునప్పుడు, అందులో భారీ అవినీతి జరిగిపోతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది కనుక సమర్దుడు, నిజాయితీపరుడు అయిన ఒక ఐఏయస్. అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇంత భారీ నిర్మాణ కార్యక్రమానికి ఇంత అధ్యయనం, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనని ఎవరయినా అంగీకరిస్తారు.